భారతీయ సినిమాకు నూరు వసంతాలు నిండిన సందర్భమిది. ఈ సినిమా పండుగ వేళను పురస్కరించుకొని, తెలుగు సినిమాకు సంబంధించి కూడా వరుసగా పుస్తకాలు వెలువడుతున్నాయి. మన సినీ రంగంలోని ప్రముఖులనూ, విశేష ఘట్టాలనూ స్మరిస్తున్నాయి. ఆ క్రమంలో వచ్చిన తాజా పుస్తకం - 'గ్రేట్ డైరెక్టర్స్'. నాటక రచయితగా, సినీ గ్రంథకర్తగా ప్రసిద్ధులైన ఎస్.వి. రామారావు దీన్ని వెలువరించారు.
..........................................................
గ్రేట్ డైరెక్టర్స్,
రచన: ఎస్.వి. రామారావు,
వెల: రూ. 500, పేజీలు: 240,
ప్రతులకు: రచయిత, ప్లాట్ నం. 500, ఇంటి నంబర్ 2-4-681/3, వీధి నం. 10/ఏ, న్యూ నాగోల్ కాలనీ, హైదరాబాద్-500 035.
...........................................................
తొలి పూర్తి తెలుగు టాకీ 'భక్త ప్రహ్లాద' వచ్చింది - 1932 ఫిబ్రవరి 6న. అప్పటి నుంచి 2012 వరకు గడచిన 80 ఏళ్ళ కాలంలో సుమారు 1075 మంది దర్శకులు ఉన్నారని రచయిత లెక్క. కాగా, 2001 నుంచి 2012 వరకు కేవలం ఈ పుష్కర కాలంలోనే 450 మంది కొత్త దర్శకులు వచ్చారని ఆయన మాట. వీరిలో ఓ వంద మంది ప్రముఖ దర్శకుల గురించి వివరంగా, మరో 210 మంది గురించి సంక్షిప్తంగా ఆయన ఈ పుస్తకంలో ప్రస్తావించారు.
నిజానికి, దర్శకుల గురించి సమాచార సేకరణ, సినీ ప్రియులకు నివేదన ఎస్.వి. రామారావుకు కొత్త ఏమీ కాదు. 2000-2001 కాలంలో ఆయన 'సితార' సినీ వారపత్రికలో 'ప్రొఫైల్' శీర్షికలో పలువురు దర్శకుల గురించి రాశారు. అలాగే, 2008లో దూరదర్శన్‌లో వచ్చిన 'గ్రేట్ డైరెక్టర్స్' కార్యక్రమాలకు రూపకర్తగా వ్యవహరించారు. అలాగే, 'వనిత' టి.వి. ఛానల్‌లో 'గోల్డెన్ క్లాసిక్స్' కార్యక్రమం కోసం ''ఆ యా చిత్రాల ప్రతిభా విశేషాలను గురించి పరిశోధనాత్మకంగా విశ్లేషించా''రు. దానికి తోడు 1965 నుంచి పలువురు ప్రముఖ దర్శకులతో పరిచయం, వారితో సినిమా కథ, కథనాల గురించి చర్చలు జరిపిన అనుభవం ఉంది.
ఆ అనుభవమంతా సహజంగానే ఈ రచన కోసం ఆయనకు ఉపయోగపడి ఉండాలి. అది ఈ పుస్తకంలో కొన్ని చోట్ల కనిపిస్తుంది. తొలి తమిళ - తెలుగు టాకీ 'కాళిదాస్' (విడుదల: 1931 అక్టోబర్ 31), ఆ తరువాత వచ్చిన 'భక్త ప్రహ్లాద'లకు దర్శకుడైన హెచ్.ఎం. రెడ్డి దగ్గర నుంచి తాజా 'మిథునం' దర్శకుడు తనికెళ్ళ భరణి దాకా పలువురి వివరాలు ఇందులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పురస్కారాలు, రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలు పొందిన తెలుగు చిత్రాల జాబితా, కొందరు దర్శకుల చిత్రాల ఫోటోలు కూడా ఈ పుస్తకంలో ఇచ్చారు.
అయితే, అక్షర దోషాలతో పాటు మనుషుల పేర్లతో సహా అనేక చోట్ల విషయ సేకరణలో తప్పులు కూడా ఉన్నాయీ పుస్తకంలో. మచ్చుకు... 'శంకరాభరణం' (1979లో సెన్సారై, 1980లో విడుదలైంది) చిత్రానికి స్వర్ణకమలం వచ్చిందని పేర్కొన్నారు. నిజానికి, అవార్డుల కోసం 'శంకరాభరణం' పోటీపడిన 1979వ సంవత్సరానికి గాను జాతీయ స్థాయిలో 'ఉత్తమ చలనచిత్రం'గా స్వర్ణ కమలం వచ్చింది - 'శోధ్' అనే హిందీ సినిమాకు! 'కళాత్మక విలువలతో, సకుటుంబ చిత్రంగా నిలిచి, జనాదరణ పొందిన చిత్రం' గానే 'శంకరాభరణం' అవార్డుకు ఎంపికైంది. అంతెందుకు... ఒక్క 'శంకరాభరణా'నికే కాదు, ఏ ఇతర తెలుగు చిత్రమూ ఇప్పటి వరకు 'ఉత్తమ చలనచిత్రం'గా ఎన్నడూ స్వర్ణకమలం అందుకోలేదు.
తొలి తెలుగు మహిళా దర్శకురాలైన భానుమతి బొమ్మ ముఖచిత్రం మీద లేకపోవడం, వివరాలు కూడా మరీ సంక్షిప్తంగా ఇవ్వడం సమర్థనీయంగా తోచదు. అలాగే, 'హరిశ్చంద్ర'కు దర్శకుడు పి. పుల్లయ్య అనీ (వాస్తవానికి, టి.ఏ. రామన్), 'అపూర్వ సహౌదరులు' (1950) తమిళ, తెలుగు చిత్రాల దర్శకుడు సి. పుల్లయ్య అనీ (వాస్తవానికి, ఆచార్య అనే తమిళుడు) పొరపాట్లు రాశారు.
ఇలాంటివి చూశాక, 'గ్రేట్ డైరెక్టర్స్' పేరిట నెత్తికెత్తుకున్న పెద్ద బాధ్యతను ఈ సీనియర్ రచయిత మరింత శ్రద్ధతో చేసి ఉండాల్సింది అనిపిస్తుంది. అలా చేయకపోవడం సినీ, పుస్తక ప్రియులకు కొంత నిరాశ కలిగిస్తుంది. ఇక, 'ఈ పుస్తకంలో పేర్కొన్నవాళ్ళందరూ గ్రేట్ డైరెక్టర్లేనా?' అని ఎవరైనా ప్రశ్నించడానికీ వీలుంది.
ఏమైనా, ఉన్న లోటుపాట్లతోనే ఇంత మంది తెలుగు సినీ దర్శకుల గురించి ఒకచోట తలస్పర్శిగానైనా తిరగేసేందుకు ఈ పుస్తకం పనికొస్తుంది. పట్టుదలతో, 'తానా' వారి సహాయ సహకారాలతో ఎస్.వి. రామారావు నిజం చేసుకున్న ఈ ఖరీదైన కల - ముద్రణలో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
- రెంటాల జయదేవ
..................................................................
1 వ్యాఖ్యలు:
గ్రేట్ డైరెక్టర్స్ గూర్చి రచించాలంటే అతను గ్రేట్ జర్నలిస్ట్ అయి వుండాలి! కాని s.v.రామారావు గారికి అంత సీన్ లేదు!ఉబలాటం మాత్రం ఉండి తగిన ఉపజ్న లేకపోతే మీరు పేర్కొన్నట్లు సమాచారదోషాలతో,అవకతవకలతో అల్లాటప్పాగా వెలువడుతుందని మరొక్కసారి నిరూపితం అయింది!ఈ ప్రాజెక్ట్ ను పులగం చిన్నారాయణ గారికి అప్పగించి వుంటే న్యాయం జరిగేదని నిక్కచ్చిగా నిష్కర్ష గా చెబుతున్నాను!
Post a Comment