జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Friday, September 13, 2013

అందం,అభినయాల కలబోత... అలనాటి హీరో సిహెచ్. నారాయణరావు


(తొలితరం తెలుగు హీరో సిహెచ్. నారాయణరావు శతజయంతి ఇవాళ)



తారల చుట్టూ తిరిగే సినీ ప్రపంచంలో బాక్సాఫీస్‌ వద్ద ప్రతి శుక్రవారం ఓ కొత్త స్టార్‌ పుట్టుకొస్తుంటాడు. మరో తార ప్రకాశం కోల్పోతూ ఉంటుంది. తెలుగు సినిమాకు స్టార్‌ హీరోలు అనగానే ఇవాళ మనం తరచూ వినే పేర్లు - ఎన్టీయార్‌, ఏయన్నార్‌, ఇటీవలి కాలానికి వస్తే చిరంజీవి, కొత్త తరానికైతే మహేశ్‌బాబు, పవన్‌ కల్యాణ్‌, వగైరా. కానీ, వీళ్ళందరి కన్నా ముందే మాటలు నేర్చిన తెలుగు సినిమాలో కొందరు విశేష ప్రేక్షకాదరణ సాధించారు. అలాంటి తొలి తరం తెలుగు హీరోలనగానే అప్పటి తరం గుర్తు చేసుకొనే పేర్లు - చిత్తూరు నాగయ్య, సిహెచ్‌. నారాయణరావు. సహజ మైన అందం, అభినయం, దానికి హుందాతనంతో కూడిన ప్రవర్తన ఉన్న నటుడిగా అప్పట్లో సిహెచ్‌. నారాయణరావుది ఓ ప్రత్యేక స్థానం. అందుకే, ఎన్టీయార్‌, ఏయన్నార్‌లు హీరోలుగా స్థిరపడడానికి ముందు పారితోషికంలో, ప్రేక్షకాదరణలో స్టార్‌ అనిపించుకున్నారు.



1940 నుంచి '50 దాకా ఓ దశాబ్ద కాలం పాటు తెలుగు సినీ రంగంలో ఓ వెలుగు వెలిగిన సిహెచ్‌. నారాయణ రావు ఇవాళ్టికి సరిగ్గా నూరేళ్ళ క్రితం 1913 సెప్టెంబర్‌ 13న కర్నాటకలో బెంగుళూరు - హుబ్లీ మార్గంలో ఉన్న మధుగిరిలో జన్మించారు. నారాయణరావు తల్లి వైపు తాత, ముత్తాతలు, మేనమామలు అప్పట్లో మైసూరు దివాణంలో పనిచేసేవారు. కృష్ణరాయ డ్యామ్‌ నిర్మాణంలో కూడా చురుగ్గా పాలుపంచుకున్నారు. అందుకే, నారాయణరావు తల్లి వజ్రలక్ష్మి అక్కడ పుట్టింట్లో పురుడు పోసుకున్నారని కుటుంబ సభ్యులు చెప్పారు. 
నారాయణరావు తండ్రి చదలవాడ లక్ష్మీ నరసింహారావు రెవెన్యూ అధికారిగా ఉద్యోగం చేసేవారు. అనంత పద్మనాభ వ్రతం రోజున పుట్టిన బిడ్డ కావడంతో, ఆ దంపతులు పెట్టుకున్న పూర్తి పేరు - చదలవాడ అనంత పద్మనాభ దత్తాత్రేయ సత్యనారాయణరావు. ఆ పేరే వెండితెరపై సంక్షిప్తంగా సిహెచ్‌. నారాయణరావు అయింది.
నారాయణరావు చిన్ననాటి చదువంతా ఏలూరులో సాగింది. ఆ తరువాత చాలాకాలం గుంటూరులో ఉన్నారు. సోషలిస్టు భావాలున్న ఆ తరువాత కాలంలో ట్రేడ్‌ యూనియనిస్ట్‌గా పని చేశారు. రైల్వే వర్కర్స్‌ యూనియన్‌కు కార్యదర్శిగా, రైల్వే వర్కర్స్‌ బెనిఫిట్‌ ఫండ్‌కు కార్యదర్శిగా వ్యవహరించారు. ''తిరగడమంటే సరదా'' కావడంతో, అప్పట్లోనే రైల్వే సమ్మెకు నాయకుడై, రాజకీయ నాయకుడు వి.వి. గిరి తదితరులతో కలసి ఉత్తర భారతమంతటా తిరిగారు. 
అలాగే, సినీ రంగంలోకి రాక ముందు ఏలూరులోని ప్రసిద్ధ 'వెంకట్రామా అండ్‌ కో'లో పనిచేశారు. పుస్తకాలు ప్రచురించడం, ఇంజనీరింగ్‌ వర్క్‌షాపులో పనిచేయడం లాంటివన్నీ చేశాక, తలవని తలంపుగా సినిమా అవకాశం ఆయన తలుపు తట్టింది.
అసలు సినిమాల్లోకి వస్తానని కానీ, రావాలని కానీ ఆయన అనుకోలేదు. ఆయన సినీ రంగప్రవేశం చాలా తమాషాగా జరిగింది. ఓ రోజు రైలు ప్రయాణం చేస్తున్న సినీ దర్శకుడు ద్రోణంరాజు చిన కామేశ్వరరావు, నారాయణరావును చూశారు. అందం, మాటతీరు చూసి ముగ్ధుడైన కామేశ్వరరావు ఆయనను ఏకంగా హీరో పాత్రకు ఎంపిక చేశారు. అనుభవం లేదంటున్నా ఫరవాలేదంటూ సినీ నటుణ్ణి చేశారు. 
అలా మీర్జాపురం రాజావారు జయా ఫిలిమ్స్‌ పతాకంపై తీస్తున్న 'జీవనజ్యోతి' (1940)లో హీరోయిన్‌ కృష్ణవేణి సరసన కథానాయకుడిగా సిహెచ్‌. నారాయణరావు సినీ రంగ ప్రవేశం జరిగింది. తొలి సినిమాతోనే మంచి నటుడిగా పేరు వచ్చింది.
నాటకాల్లో అనుభవం, పేరు ఉన్నవాళ్ళు సినిమాల్లోకి వచ్చే ఆ రోజుల్లో పెద్దగా ఆ అనుభవమే లేకుండా హీరో అయిన వ్యక్తి - నారాయణరావు. సినీ రంగ ప్రవేశమయ్యాక, పాత తరం సీనియర్‌ రచయిత మల్లాది వెంకట కృష్ణశర్మ రాసిన 'మిస్‌ ప్రేమ బి.ఏ' నాటకాన్ని రావి కామేశ్వరరావు (ఆర్‌.కె.రావు), సినీ నటులు పేకేటి శివరామ్‌, జి.ఎన్‌. స్వామి తదితరులతో కలసి ప్రదర్శిం చారు. హరీంద్రనాథ్‌ ఛటోపాధ్యాయతో సాన్నిహిత్యమున్న ఆయన తరువాతి రోజుల్లో పి.వి. రాజమన్నార్ రచించిన 'పట్నవాసం' లాంటి రేడియో నాటికల్లోనూ పాల్గొన్నారు.


'DEVATA' (1941) poster
తెలుగు, తమిళం, కన్నడం, ఇంగ్లీషుతో పాటు మలయాళం, హిందీ భాషలు కూడా ఆయన ధారాళంగా మాట్లాడేవారు. కెరీర్‌ తొలి రోజుల్లోనే 'దీనబంధు' (1942) చిత్రంలో వకీలుగా కోర్టు సీనులో ఆయన అనర్గళంగా చెప్పిన ఇంగ్లీషు డైలాగులు పరిశ్రమ వర్గీయులనూ, ప్రేక్షకులనూ ఆశ్చర్యపరిచాయి. మంచి గాత్రమున్న నారాయణరావు ఆ సినిమాలో సొంత గొంతుకలోనే పాట పాడారు. ఇక, ఘంటసాల పాడిన తొలి సినీ గీతం 'స్వర్గసీమ' (1946)లో నారాయణరావు, భానుమతులపై చిత్రీకరించినదే!




in 'CHENCHU LAKSHMI' (1944)
'దేవత' (1941)లో భావకవిగా చిన్న పాత్ర పోషించారు. అందాల నటుడిగా పేరు తెచ్చుకొని, 'చెంచులక్ష్మి' (1944)లో సవతుల పోట్లాటలో చిక్కిన కథానాయకుడిగా, 'తాసిల్దార్‌' (1944)లో పాశ్చాత్య జీవనశైలీ వ్యామోహంలో పడే తాసిల్దార్‌గా, 'స్వర్గసీమ' (1946)లో నెగటివ్‌ ఛాయలున్న పాత్రలో - అందరినీ ఆకట్టుకున్నారు. ఓ పక్క హీరోగా చేస్తూనే మరో పక్క కీలకమైన పాత్ర అయితే, చిన్నదైనా సరే నటించడానికి ఆయన వెనుకాడకపోవడం విశేషం. 
'ఆడజన్మ'లోని తాగుబోతు పాత్ర చూసి, ఆయననూ, భానుమతిని పెట్టి 'దేవదాసు' తీయాలని నిర్మాత డి.ఎల్‌. నారాయణ అనుకున్నారట! కానీ, చివరకు అది ఏయన్నార్‌, సావిత్రులను వరించింది. అలాగే, రాజ్యం పిక్చర్స్‌ వారు ఎస్వీ రంగారావుతో తీసిన 'హరిశ్చంద్ర' సినిమాకు కూడా ముందు హీరోగా అనుకున్నది సిహెచ్‌. నారాయణరావునే!
కృష్ణవేణి, కమలా కోట్నీస్‌, ఋష్యేంద్రమణి, భానుమతి, రుక్మిణి, జి. వరలక్ష్మి, శాంతకుమారి, 'షావుకారు' జానకి, కృష్ణకుమారి లాంటి అప్పటి తరం నాయికల సరసన ఈ అందాల నటుడు అభినయించారు. అప్పట్లో నారాయణరావుకు బోలెడంతమంది అభిమానులు ఉండేవారు. తెలుగులో సినిమా హీరోలకు అభిమాన సంఘాలు ఏర్పడడం ఆయనతోనే మొదలైందని చెబుతారు. 


with Krishnaveni in 'MANA DESAM' (1949)
అలాంటి పాపులారిటీ వల్ల 1949లో విజయ వాడలో ఆకాశవాణి కేంద్రం ప్రారంభోత్సవానికి కూడా ఆయన ప్రత్యేక ఆహ్వానితులయ్యారు. ఇక, 1951 ప్రాంతంలో ఆంధ్రా విశ్వవిద్యాలయం ఆయనను సత్కరించడం విశేషం. వి.వి. గిరి, ప్రకాశం పంతులు, పి.వి. రాజమన్నార్‌, బెజవాడ గోపాలరెడ్డి, మాడభూషి వెంకటాచారి లాంటి అప్పటి రాజకీయ నాయకులతో ఆయనకు అనుబంధలూ ఎక్కువే!
అయిదుగురు సంతానంలో రెండోవాడైన సిహెచ్‌. నారాయణ రావుకు ఒక అక్కయ్య, ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు! మూడు పదుల వయస్సు కల్లా సినీ హీరోగా ఎంతో పేరు తెచ్చుకున్న నారాయణ రావు తోబుట్టువులందరినీ తానే పోషించారు. ఇంట్లోని కార్లు కూడా బంధుమిత్రుల సేవల్లోనే ఉండేవి. అలాగే, ఆయన చేసిన గుప్త దానాలూ ఎక్కువే. సినీ రంగంలో స్థానం కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి, దారీతెన్నూ తెలియని దుర్భాగ్యోపజీవులకు ఆయన ఆశ్రయ మిచ్చి, అన్నం పెట్టేవారు. 
''మద్రాసులోని ఆళ్వార్‌ పేటలో దేశికాచారి రోడ్డులోని 4వ నంబర్‌ ఇల్లు (ఇప్పుడు శ్రీరంగం ఆండవన్‌ ఆశ్రమ మైంది) ఆయన నివాసం. అప్పట్లో అది నిత్యం ఓ ధర్మసత్రంలా బంధుమిత్రులు, వచ్చేపోయే వాళ్ళతో నిండుగా ఉండేది. సాధు సన్న్యాసులకు ఆతిథ్యమివ్వడం ఆయనకు అలవాటు. రోజూ ఆ ఇంట ముప్ఫై, నలభై విస్తళ్ళు లేవాల్సిందే!'' అని 1940ల నుంచి నారాయణరావుకు సన్నిహిత మిత్రుడైన 94 ఏళ్ళ సీనియర్‌ పత్రికా రచయిత మద్దాలి సత్యనారాయణ శర్మ గుర్తు చేసుకున్నారు.
సినీ రంగంలో ఉన్నా, ఒక్క ధూమపానం తప్ప ఇతర దుర్వ్యసనాలేవీ అంటని నారాయణరావు వ్యవహారం ముక్కుసూటిగా ఉండేది. నాగయ్య నటించిన 'భక్త పోతన' (1943)లో శ్రీరాముడిగా పారితోషికం లేకుండా నటించి, ఔదార్యం చూపిన ఈ అందాల నటుడు అదే సమయంలో కావాలని పారితోషికం తగ్గించి, నటింపజేయాలనుకొన్న వారికి మాత్రం నిర్మొహమాటంగా 'నో' చెప్పేసేవారు. లౌక్యం లేని ఈ వ్యవహార శైలి, అవకాశాలు కానీ, ఆర్థిక సహాయం కానీ చేయి చాచి అర్థించడం తెలియనితనం - వెరసి నారాయణరావు పాత వైభవం ఒక దశ దాటాక మంచులా కరిగి పోయింది. 'కొండలైన కరిగిపోవు కూర్చొని తింటే...' అన్న మాట నిజమైంది. 
డబ్బు పెట్టి, వై.వి. రావు దర్శకత్వంలో నిర్మించిన 'మంజరి' (1953) చిత్రం ఆర్థికంగా బాగా కుంగదీసింది. మరో పక్క కొత్త నీరు వచ్చి, హీరోలుగా స్థిరపడడంతో అవకాశాలూ తగ్గాయి. ఆఖరుకు బంగారం, వెండితో పాటు, స్థిరాస్తులు సైతం క్రమంగా అమ్ముకొని, కుటుంబాన్ని పోషించాల్సి వచ్చింది.

with wife Sarada Devi
 రైల్వే గార్డు అయిన మేనమామ నందిరాజు శ్రీరాములు కుమార్తె శారదాదేవినే నారాయణ రావు పెళ్ళి చేసుకున్నారు. ఆ దంపతులకు ఏడుగురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. వారెవరినీ ఆయన సినిమా వైపు ప్రోత్సహించ లేదు.
వ్యక్తిగతంగా నారాయణరావు హాస్యప్రియులు. చమత్కారంగా మాట్లాడడం ఆయన సంభాషణ శైలి. పుస్తకాలు, ఎక్కువగా రాజకీయ పుస్తకాలు చదివేవారు. షేక్స్‌పియర్‌, బెర్నార్డ్‌ షా లాంటి ప్రసిద్ధుల నాటకాలు, మిల్టన్‌ కవిత్వం - ఇలా ఆంగ్ల సాహిత్య మంటే బాగా ఇష్టపడేవారు. 
''మా నాన్న గారు చాలా సరదా మనిషి. మాతో ఎప్పుడూ సినిమాల గురించి చెప్పేవారు కాదు. క్రికెట్‌ అంటే ఆయనకు తగని ఇష్టం. మాతో కూడా ఆడేవారు. ఆంగ్ల సాహిత్యం లాంటి విషయాలు మాకు చెబుతుండేవారు'' అని చెన్నైలో ఉంటున్న నారాయణరావు రెండో కుమారుడు అరుణ్‌ కుమార్‌ (బాబా) చెప్పుకొచ్చారు. 
మద్రాసులో ఉత్తరాది, దక్షిణాది తారల మధ్య జరిగిన క్రికెట్‌ పోటీలో వసుంధరా దేవి (నటి వైజయంతి మాల తల్లి) కెప్టెన్‌గా సాగిన దక్షిణాది టీమ్‌లో బౌలర్‌గా, బ్యాట్స్‌మన్‌గా రాణించి, ఆరేడు వికెట్లు తీసిన మంచి ఆటగాడు నారాయణరావు.
చివరి రోజుల్లో ప్రోస్టేట్‌ గ్రంథి సమస్యతో, మూత్రపిండాల వ్యాధితో బాధపడిన ఆనాటి రొమాంటిక్‌ హీరో చివరకు తన 71వ ఏట 1984 ఫిబ్రవరి 14న మద్రాసులోని రాయపేటలో న్యూ కాలేజ్ కు ఎదురుగా ఉన్న ఓ ప్రైవేటు నర్సింగ్‌హౌమ్‌లో కన్నుమూశారు. 

Stills from Sobhanachala - MRA's hit film 'LAKSHMAMMA' (1950)
కనుమరుగై మూడు దశాబ్దాల కాలమవుతున్నా, ఇవాళ్టికీ సిహెచ్‌. నారాయణరావు పేరు చెప్పగానే పాతతరం వాళ్ళకు 'మనదేశం' (1949), కృష్ణవేణితో కలసి నటించిన శోభనాచల వారి 'లక్ష్మమ్మ' (1950), ఏ.వి.ఎం. వారి 'జీవితం' (1950), సేలంలోని మోడరన్‌ థియేటర్స్‌ వారి 'ఆడజన్మ' (1951) లాంటి చిత్రాలే గుర్తుకు వస్తాయి. హీరో నుంచి క్యారెక్టర్‌ యాక్టర్‌గా పూర్తిగా మారిపోయాక ఆయన నటించిన 'బాల భారతం', 'కలెక్టర్‌ జానకి', 'శ్రీకృష్ణ తులా భారం', 'రహస్యం', 'దేశోద్ధారకుడు', 'రాణీ కాసుల రంగమ్మ', 'పులిబిడ్డ' లాంటి చిత్రాలను చూసినప్పుడు పాత జ్ఞాపకాలు మెలిపెడతాయి.
- రెంటాల జయదేవ

....................................................................

0 వ్యాఖ్యలు: