జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, September 28, 2013

ఆద్యంతం 'అమ్మ' రాజకీయ వాసనలే!


  • పత్రికల వారికి 'పాసు' కష్టాలు 
  • మైకందుకుంటే 'అమ్మ' నామ స్మరణే!
  • సాంస్కృతిక కార్యక్రమాలు, స్కిట్లలోనే అదే భజన!!
(చెన్నై నుంచి రెంటాల జయదేవ)   
నూరేళ్ళ భారతీయ సినిమా వేడుకలంటూ శనివారం చెన్నైలో మొదలైన కార్యక్రమాలు, వాటికి చేసిన ఏర్పాట్లు, చుట్టుపక్కలి వాతావరణం చూస్తే, అది అచ్చమైన తమిళ రాజకీయ సభల లాగా ఉండడం గమనించదగ్గ విషయం. ఈ ఉత్సవాల కోసం రూ. 10 కోట్ల మేర విరాళమిచ్చి, అంత కన్నా ఎక్కువ మొత్తంలో పత్రికల్లో వాణిజ్య ప్రకటనల ద్వారా ఈ ఉత్సవాలకు భారీ ప్రచారం కల్పించిన తమిళనాడు ప్రభుత్వం సహజంగానే ఈ మొత్తం కార్యక్రమాన్ని తమ చేతుల్లోకి తీసేసుకున్నట్లు కనిపించింది. పాసుల జారీ మొదలు కార్యక్రమ నిర్వహణ దాకా ఈ ఉత్సవాలు పూర్తిగా తమిళనాడులోని అధికార పక్షమైన అన్నా డి.ఎం.కె. పార్టీ వ్యవహారం లాగా మారాయి. వేదిక మీద జరిగిన ప్రసంగాలు, సినిమాల కార్యక్రమాలు సైతం ఆద్యంతం 'పురట్చి తలైవి' (విప్లవ నాయకి), 'అమ్మ' అంటూ జయలలిత భజన స్తోత్రాలతోనే సాగిపోయాయి. 
ఈ నాలుగు రోజులూ సభా వేదిక అయిన పట్టే నెహ్రూ ఇండోర్‌ స్టేడియమ్‌లో గరిష్ఠంగా 4,500 మంది దాకా పడతారు. అయితే, తొలి రోజున ఆ ప్రాంగణం దాదాపు మూడొంతులు ప్రభుత్వ అధికారులు, అధికార పక్ష కార్యకర్తలు, నేతలతోనే నిండిపోయింది. ఆఖరికి సమాచార సాధనాల వారికి సైతం పాసులు లేవు. ఎంపిక చేసిన కొద్దిమంది స్థానిక పత్రికా రచయితలకే అవి పరిమితమయ్యాయి. ఇక, తెలుగు మీడియా పరిస్థితి మరీ కనాకష్టమైంది. తెలిసిన దర్శక, నిర్మాతల ద్వారా దక్కిన ఒకటి, అరా పాసులతో లోపలకు వచ్చిన అతి కొద్దిమంది కూడా సామాన్య ప్రేక్షకుల గ్యాలరీల్లో సర్దుకోవాల్సి వచ్చింది. వేదిక మీద జరుగుతున్నదేమిటో తెలియని స్థితిలో ఉండిపోవాల్సి వచ్చింది. 
కార్యక్రమంలో చివరి దాకా రాజకీయాలదే ప్రధాన పాత్ర అయింది. ''నేను సినిమాకు మద్దతుగా నిలిచే మనిషిని'' అని తన ప్రారంభ ప్రసంగంలోనే ప్రకటించుకున్న జయలలిత పనిలో పనిగా సొంత గొప్పలు కూడా చెప్పుకున్నారు. బద్ధశత్రువు, డి.ఎం.కె. అధినేత, మాజీ ముఖ్యమంత్రి అయిన ఎం. కరుణానిధిని అన్యాపదేశంగా విమర్శించారు. వాళ్ళ పేర్లేవీ ప్రస్తావించకుండానే, మునుపటి (డి.ఎం.కె) ప్రభుత్వంలో సినీ పరిశ్రమ కొందరి కబంధ హస్తాల్లో చిక్కుకొని, ఇబ్బందుల పాలైందనీ, రెండేళ్ళుగా తమ ప్రభుత్వంలో తమిళ సినిమాలు హాయిగా, స్వేచ్ఛను అనుభవిస్తున్నాయనీ గొప్పలు చెప్పుకున్నారు. సభకు హాజరైన వారు, సత్కారాలు అందుకున్నవారిలో చాలామంది వేదిక మీదే 'అమ్మ'తో కష్టాలు చెప్పుకోవడం, పాదాభివందనాలు చేయడం కనిపించింది. సౌతిండియన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ గౌరవ కార్యదర్శి ఎల్‌. సురేశ్‌ అయితే, ఏకంగా ఈ నూరేళ్ళ సినిమా పండుగ అనే తమ క్షీరసాగర మథనంలో ముందుగా దక్కిన 'లక్ష్మీదేవి' జయలలిత అనీ, అమృతాన్ని అందరికీ గొడవలు లేకుండా పంచడంలోనూ, హాలాహలాన్ని ధైర్యంగా మింగడానికీ 'అమ్మ' ఉందని తమ భరోసా అని సభాముఖంగా మైకులో ప్రకటించారు. 
సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పిల్లల చేత జయలలితకు స్వాగత గీతాలు పాడించడం, వేదికపై ప్రదర్శించే వీడియో క్లిప్పింగుల్లో ఎమ్జీయార్‌, జయలలితల ప్రభుత్వ పథకాలను పదే పదే చూపడం చూస్తే, వచ్చింది సినిమా ఫంక్షన్‌కో, రాజకీయ పార్టీ మీటింగ్‌కో అర్థం కాక, సినీ ప్రియులు తలలు పట్టుకున్నారు. స్టంట్‌మ్యాన్లు చేసిన ప్రదర్శనలతో సహా చాలా వాటిలో తమిళంలో 'అమ్మకు జిందాబాద్‌' లాంటివి దృశ్యరూపంలో కనిపించాయి. ఇక, సభా వేదికకు దారి తీసే దారుల నిండా జరుగుతున్నది సినిమా పుట్టిన రోజు కాదు, జయలలిత పుట్టినరోజేమో అని భ్రమపడేలా అన్నీ జయలలిత బ్యానర్లు, బారులు తీరిన పార్టీ శ్రేణులు దర్శనమిచ్చాయి. వెరసి, ఈ వేడుకల్లో తెలుగు సినిమా పరిశ్రమ భాగస్వామ్యం విషయంలో సినిమాలో రాజకీయాలు చోటుచేసుకుంటే, తమిళ వేడుకల్లో రాజకీయాలే సినిమాగా పరిణమించడం యాదృచ్ఛికమైనా, విస్మరించలేని విచిత్రం!
........................................................

0 వ్యాఖ్యలు: