జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Thursday, September 19, 2013

వందేళ్ల భారతీయ సినిమాకు వందనాలు



సమాజాన్ని ఎన్నో విధాలుగా ప్రభావితం చేసిన, చేస్తున్న ఓ మాధ్యమం నూరేళ్ళు పూర్తి చేసుకుందంటే, అది అవిస్మరణీయమైన అంశం. భారతీయ సినిమా శత జయంతిని ఇవాళ ఓ పండుగగా జరుపుకొంటున్నది అందుకే! అందులోనూ సినిమాలే శ్వాసగా, ధ్యాసగా గడిపే మన తెలుగు వాళ్ళకైతే ఇది ఓ మరపురాని మధుర ఘట్టం. దక్షిణ భారత సినీ పరిశ్రమకు పుట్టినిల్లు, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషా చిత్రసీమలకు ఎన్నో దశాబ్దాల పాటు కేంద్ర స్థానం అయిన మద్రాసు (ఇవాళ్టి చెన్నై)లో ఈ నెల 21 నుంచి 24 దాకా నాలుగు రోజుల పాటు భారతీయ సినిమా శత జయంతి ఉత్సవాలు పెద్దయెత్తున జరగనున్నాయి. ఆ సందర్భంగా ఈ ప్రత్యేక కథనం...

ఇరవయ్యో శతాబ్దంలో అత్యంత ప్రభావశీలమైన సాంకేతిక అద్భుతం ఏదీ అంటే - నిస్సందేహంగా సినిమానే! భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఆవిర్భావం దాదాసాహెబ్‌ ఫాల్కే చేసిన తొలి 'స్వదేశీ' ప్రయత్నం 'రాజా హరిశ్చంద్ర'తో జరిగింది. ఇప్పటికి నూరేళ్ళ క్రితం 1913 మే 3న ఆ చిత్రం విడుదలైంది. 
నిజానికి, అంత కన్నా కొన్నేళ్ళ ముందు నుంచే లఘుచిత్రాలు, న్యూస్‌ రీళ్ళు, రంగస్థల నాటకాలను చిత్రీకరించడం లాంటి ప్రయత్నాలెన్నో మన దేశంలో జరిగాయి. అలాగే, విదేశీయుల సాంకేతిక సహకారంతో, ఒకటీ, అరా కథా కథనాత్మక చిత్రాల (ఫీచర్‌ ఫిల్ముల) నిర్మాణ ప్రయత్నాలూ సాగాయి.
 కానీ, పూర్తిస్థాయిలో మన దేశంలో, మన దేశీయ ప్రయత్నంతో తీసిన తొలి ఫీచర్‌ ఫిల్ముగా 'రాజా హరిశ్చంద్ర' ఘనత దక్కించుకుంది. ఆ చిత్ర దర్శక - నిర్మాతగా దాదాసాహెబ్‌ ఫాల్కే 'భారతీయ సినీ పితామహుడు' అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటికి ఈ వందేళ్ళలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. 
కేవలం మూగ చిత్రాలుగా మొదలైన భారతీయ సినిమా తరువాత 1931 నాటి నుంచి మాటలు, పాటలు, నృత్యాలతో జన సామాన్యానికి ఎంతో చేరువైంది. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్‌ సినిమాలకు సైతం 'కంప్యూటర్‌ జనరేటెడ్‌ ఇమేజెస్‌' (గ్రాఫిక్స్‌ లేదా విజువల్‌ ఎఫెక్ట్స్‌గా సుపరిచితమైన సి.జి.ఐ) లాంటి సాంకేతిక ఫలాలను అందించే దశకు వచ్చింది.
వెండితెర త్రివిక్రమ రూపం
ఫిల్మ్‌... మూవీ... మోషన్‌ పిక్చర్‌... సినిమా... చలనచిత్రం - ఇలా పేరు ఏదైతేనేం, ఎన్నో కష్టనష్టాలను తట్టుకొని కొందరు ఔత్సాహికుల మేధాశ్రమగా తెరపైకి వచ్చిన 'సినిమా' అనే సరికొత్త సాంకేతిక విజ్ఞానం ఇవాళ మన దేశంలో ఓ భారీ పరిశ్రమగా రూపుదాల్చింది. తెర మీది బొమ్మలు మాటలు నేర్వని మూగ సినిమాల రోజుల్లో దేశమంతటికీ ఒకటే అయిన భారతీయ సినిమా టాకీలు వచ్చాక, విభిన్న ప్రాంతాల భాషలు, సంస్కృతుల ఆధారంగా వివిధ ప్రాంతీయ భాషా పరిశ్రమలుగా శాఖోపశాఖలైంది. 
మూకీల రోజుల్లో ఓ సినిమా తీయాలంటే రూ. 15 వేల దాకా అయ్యేది. తొలి టాకీలకు అది లక్షా పాతికవేల దాకా పెరిగింది. ఇప్పుడు కనీసం రెండు మూడు కోట్లు లేనిదే ఓ సగటు సినిమా కూడా తీయలేని పరిస్థితి. పెద్ద చిత్రాల బడ్జెట్లు పదుల కోట్లలోకి పాకిపోయాయి. 
అయితే, బాక్సాఫీస్‌ వసూళ్ళు కూడా పెరిగాయి. వందేళ్ళ క్రితం 1913లో దాదాపు రూ. 2 లక్షలున్న మన సినిమా వసూళ్ళు, టాకీలు మొదలైన 1931 నాటికల్లా కోటి రూపాయలకు చేరుకున్నాయి. ఇక ఇప్పుడు తెలుగు, తమిళ సినిమాలు గరిష్ఠంగా వంద కోట్ల వసూళ్ళ స్థాయి వద్ద తచ్చాడుతున్నాయి. దేశదేశాలకు విస్తరించిన హిందీ చిత్రాలు రెండొందల కోట్ల మార్కు దాటేసి, పోదాం... పోదాం పై పైకి... అంటున్నాయి.
పౌరాణికాలు, జానపదాలు, ఫ్యాంటసీలు, సాంఘికాలు, క్రైమ్‌ - యాక్షన్‌ థ్రిల్లర్లు, కామెడీలు - ఇలా వేర్వేరు కోవల చిత్రాలు సమయానుకూలంగా వస్తూనే ఉన్నాయి. 
ఆ యా కాలమాన పరిస్థితులకు తగ్గట్లుగా ప్రతి భాషా సినీరంగం ఓ ప్రాంతీయ కథానాయకుణ్ణి సృష్టించుకుంటూనే ఉంది. తెలుగులో - నాగయ్య, నారాయణరావుల నుంచి ఎన్టీయార్‌, ఏయన్నార్‌, చిరంజీవి, మహేశ్‌బాబు, పవన్‌ కల్యాణ్‌ల దాకా, తమిళంలో ఎమ్జీయార్‌ నుంచి రజనీకాంత్‌ దాకా, కన్నడంలో రాజ్‌కుమార్‌ నుంచి సుదీప్‌ దాకా, మలయాళంలో ప్రేమ్‌ నజీర్‌ నుంచి మోహన్‌లాల్‌ దాకా, హిందీలో రాజ్‌కపూర్‌ నుంచి రాజేశ్‌ఖన్నా, అమితాబ్‌ల మీదుగా సల్మాన్‌ ఖాన్‌ దాకా ఆ ప్రయాణం నిరంతరం సాగుతూనే ఉంది. 
తెరపై బొమ్మలకు కళ్ళప్పగించి, పంచ్‌ డైలాగులు, పాటలు, పోరాటాలతో రెండు గంటలైనా కష్టాలను మర్చిపోవాలని చూస్తున్న సామాన్య సినీ ప్రేక్షకులు ఎప్పటికప్పుడు కష్టాలను తీర్చే కొత్త వెండితెర వేల్పు కోసం నిరీక్షిస్తూనే ఉన్నారు. రాజకీయ అధికారాన్ని సైతం అప్పగించేందుకు సిద్ధపడుతూ వస్తున్నారు.
ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానం
మరోపక్క, ఇరవయ్యొకటో శతాబ్దం వచ్చేసరికి భారతీయ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనాదరణను సంపాదించుకుంది. ఆధునిక సాంకేతికత రీత్యా ప్రపంచం ఓ కుగ్రామంగా మారిపోయిన నేపథ్యంలో, మన సినిమాలు మునుపటి కన్నా వేగంగా, సులభంగా మరింతమంది అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరుతున్నాయి. ఇవాళ ముఖ్యమైన అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో భారతీయ సినిమాలు క్రమం తప్పకుండా ప్రదర్శనలు జరుపుకొంటున్నాయి.
 హిందీతో పాటు తెలుగు, తమిళ తదితర భాషా చిత్రాల బాక్సాఫీస్‌ వసూళ్ళలో విదేశీ మార్కెట్‌ ఓ గణనీయమైన భాగమైంది. 'ట్వంటీయత్‌ సెంచరీ ఫాక్స్‌', సోనీ పిక్చర్స్‌, వార్నర్‌ బ్రదర్స్‌ లాంటి అగ్రశ్రేణి ప్రపంచ చిత్ర నిర్మాణ సంస్థలు సైతం ఇప్పుడు తరచూ మన సినీ నిర్మాణాల్లో భాగం పంచుకుంటున్నాయి. పెరుగుతున్న ఈ విదేశీ పెట్టుబడుల విపరిణామం మాట ఎలా ఉన్నా, భారతీయ సినిమా కూడా ఇప్పుడు ప్రపంచ కక్ష్యలో పరిభ్రమిస్తోందనడానికి ఇది ప్రబల తార్కాణం.
వందేళ్ళ ఈ ప్రస్థానంలో భారతీయ సినీ పరిశ్రమ ఊహించనంత భారీ పరిమాణానికి చేరుకుంది. ఇవాళ ప్రపంచంలోకెల్లా అతి ఎక్కువ సినిమాలు తయారవుతున్నది మన దేశంలోనే! వివిధ భాషలన్నీ కలిపి, ఏటా వెయ్యి నుంచి 1300 దాకా చలనచిత్రాలు మన దేశంలో నిర్మాణమవుతున్నాయి. హాలీవుడ్‌ చిత్ర నిర్మాణ సంఖ్య అందులో దాదాపు సగం మాత్రమే! ఫ్రాన్స్‌ విషయానికి వస్తే, వాళ్ళ సంఖ్య అందులో నాలుగో వంతే! ఇక, జర్మన్లు, ఇటాలియన్ల సంగతికొస్తే, వారి చిత్రాల సంఖ్య సగటు భారతీయ సినిమాల సంఖ్యలో సుమారు పది శాతం మాత్రమే!
అంతటా హాలీవుడ్‌దే పెత్తనంగా తయారైన ఈ రోజుల్లోనూ, అందుకు భిన్నమైన ఉదాహరణగా నిలుస్తూ, ప్రపంచంలో అతి బలమైన సినిమాగా భారతీయ సినిమా సాగుతోంది. ప్రపంచ సినీ మార్కెట్‌ లెక్కలను బట్టి చూస్తే, ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 
ప్రపంచవ్యాప్తంగా ఆ యా దేశాల జాతీయ సినీ మార్కెట్లను హాలీవుడ్‌ ఆక్రమించేసుకుంది. దాని దెబ్బకు ఫ్రెంచ్‌ సినిమా తన దేశీయ మార్కెట్‌లో 40 నుంచి 45 శాతానికే పరిమితమైంది. ఇటాలియన్‌, జర్మన్‌ సినిమాలైతే తమ జాతీయ సినీ మార్కెట్‌లో కేవలం 10 నుంచి 15 శాతానికే మిగిలాయి. ఫ్రాన్స్‌, చైనా, దక్షిణ కొరియా, ఇరాన్‌ లాంటి పలు దేశాలైతే హాలీవుడ్‌ బారి నుంచి తమ జాతీయ సినిమాలను రక్షించుకోవడానికి ఏకంగా సంరక్షణవాద విధానాలను అనుసరించాల్సి వస్తోంది. 
కానీ, ఒక్క మన భారతదేశం మాత్రం అలాంటి సంరక్షణలేమీ లేకుండానే, సినీ విపణిలో హాలీవుడ్‌ను దీటుగా ఎదుర్కొంటోంది.
నేడే కాదు... రేపూ మనదేలే!
మన దేశంలో ఏకంగా 39 ప్రాంతీయ భాషల్లో, మాండలికాల్లో సినిమాలు తయారవుతున్నాయి. ప్రపంచంలో ఇంతటి భాషా వైవిధ్యంతో చలనచిత్రాలను రూపొందిస్తున్న ఏకైక దేశం మనదేనంటే అతిశయోక్తి కాదు. అందుకే, భారతీయ సినీసీమలో ఒక్కో ప్రాంతీయ భాషా సినిమాకు ఒక్కో మార్కెట్‌ చొప్పున బోలెడన్ని చిన్న చిన్న మార్కెట్లున్నాయి. 
అయితే, మన దేశంలోని కొన్ని ప్రాంతీయ భాషా సినీ మార్కెట్లు అనేక ఇతర దేశాల మొత్తం జాతీయ సినీ మార్కెట్ల కన్నా పరిమాణంలో పెద్దవన్నది ఆశ్చర్యం కలిగించే వాస్తవం. సంఖ్యాపరంగా చూస్తే, ఒక్క మన మరాఠీ భాషా సినీ పరిశ్రమలో తీసే చిత్రాలు ఏటా మొత్తం ఇటాలియన్‌ సినిమా నిర్మించేటన్ని చిత్రాలకు సమానం. అలాగే, భోజ్‌పురీ భాషా సినీ పరిశ్రమ - మెక్సికన్‌, అర్జెంటీనా సినీసీమలతో సమానస్థాయిలో చిత్రాలు తీస్తోంది.
విదేశాల్లోని మూలమూలలకూ ఇంకా మరింతగా వ్యాపారపరంగా చొచ్చుకుపోకపోయినప్పటికీ, అమెరికా లాగానే అతి పెద్ద దేశవాళీ మార్కెట్‌ ఉన్నందు వల్ల భారతీయ సినిమా ఆరోగ్యకరమైన రీతిలో దేశీయ సినీ పరిశ్రమకు అండగా నిలవగలుగుతోంది. అయితే, ప్రేక్షక జన సంఖ్య రీత్యా అతి పెద్ద విపణులైన భారత, చైనా సినీసీమల్లో వాటా కోసం హాలీవుడ్‌ చిత్ర నిర్మాణ సంస్థలన్నీ దూసుకు వస్తున్నాయి. ఇటు మన ప్రాంతీయ భాషా సినిమాల్లోనూ, అటు చైనా సినీ పరిశ్రమలోనూ సహ నిర్మాతలుగా క్రమంగా చోటు సంపాదిస్తున్నాయి.
దాంతో, ఇప్పుడు భారతీయ సినిమా కూడా కళ్ళు తెరిచి, సార్వజనీనమైన భావోద్వేగాలు, చటుక్కున ఎవరైనా సరే గుర్తుపట్టగలిగే పాత్రలు, స్పెషల్‌ ఎఫెక్ట్‌లతో చిత్రాలు రూపొందించడం మొదలుపెడుతోంది. ప్రాంతీయ భాషా చిత్రాన్ని సైతం అనువదించి, అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన ఇంగ్లీష్‌ సబ్‌-టైటిల్స్‌తో మన దేశంలోని ఇతర భాషా ప్రేక్షకులతో పాటు, విదేశీ ప్రేక్షకవర్గాన్ని కూడా ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. 
తెలుగు దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి 'ఈగ', తమిళ దర్శకుడు శంకర్‌ 'యంతిరన్‌' (రోబో) లాంటివి ఆ మార్గంలో పయనించి, విజయం సాధించాయి. భవిష్యత్తుకు మార్గదర్శనం చేశాయి. రాగల కాలంలో భారతీయ సినిమా ఆదరణలో ఆసియా వ్యాప్తమవడానికి ఉన్న సత్తాను సూచించాయి. అలాంటి సరికొత్త ప్రయత్నాలతోనే మన వందేళ్ళ భారతీయ సినిమా మరికొన్ని వందల ఏళ్ళు అప్రతిహతంగా ముందుకు సాగిపోతుంది.
అలాంటి ఉజ్జ్వల భవిష్యత్తును ఆశిస్తూ, సినిమాకు వందనాలు! నూరేళ్ళ భారతీయ సినిమాకు నూట ఇరవై కోట్ల ప్రజల పక్షాన అభినందన చందనాలు!!
- రెంటాల జయదేవ

(ఎన్టీఆర్‌, ఎమ్జీఆర్‌ల రేఖాచిత్రాలు: పబ్లిసిటీ డిజైనర్‌ ఈశ్వర్‌,  
ఫోటో కర్టెసీ: కొమ్మినేని వెంకటేశ్వరరావు)

.............................................

0 వ్యాఖ్యలు: