జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, September 7, 2013

జీవం లేని రీమేకులు - రామ్ చరణ్ ‘తుఫాన్‌’, ‘జంజీర్‌’(సినిమా సమీక్ష) - పార్ట్ 2


(రామ్ చరణ్ ‘తుఫాన్‌’, ‘జంజీర్‌’ (సినిమా సమీక్ష) పార్ట్ 1కు ఇది కంటిన్యూషన్)

రామ్‌చరణ్‌ హిందీ సినీ రంగ ప్రవేశానికి పాత ‘జంజీర్‌’ కథ మంచి వేదికే. కానీ, మార్పులు చేర్పులతో దానిలోని ఆత్మ, చాలా వరకు ఆకర్షణ కూడా ఈ కొత్త రీమేక్‌లోకి బట్వాడా కాలేదు. దాంతో, రామ్‌చరణ్‌ నటన బాగానే ఉన్నా, అది  ఈ కొత్త సినిమాలోని లోపాలను అధిగమించ లేకపోయింది. ఇక, అప్పట్లో హిందీలో జయభాదురి, తెలుగు, తమిళ రీమేక్‌లలో లత నటించిన మాల పాత్రలో ఈసారి ‘మిస్‌ వరల్డ్‌’ ప్రియాంకా చోప్రా కనిపించింది. నిజానికి, మొదట కాసేపు అల్లరిగా కనిపించే ఈ పాత్ర ఆ తరువాత హీరో ఇంట్లో స్థిరపడ్డాక పాటలు, ఫైట్ల కోసమే ఉపయోగపడింది. బబ్లీ గా ఉండే  కాసేపే ప్రియాంక ఆకట్టుకుంటారు.

హిందీ వెర్షన్‌ ‘జంజీర్‌’లో, తెలుగు వెర్షన్‌ ‘తుఫాన్‌’లో శ్రీహరి పోషించిన షేర్‌ ఖాన్‌ పాత్ర ఈ కథకు ఎంతో కీలకం. సినిమా షూటింగ్‌ దశలో ఉండగానే సంజయ్‌ దత్‌ జైలుకు వెళ్ళాల్సిరావడంతో సహా కారణాలు ఏమైనప్పటికీ, ఈ పాత్రను స్క్రిప్టులో సంపూర్ణంగా మలచలేకపోయారు. దాంతో, ఒకప్పుడు ప్రాణ్‌ లాంటి మహా నటుడు పోషించగా, అప్పటి ‘జంజీర్‌’కు ఆయువుపట్టయిన పాత్ర కాస్తా, ఇప్పుడు ఫస్టాఫ్‌లో కాసేపు, సెకండాఫ్‌ చివరలో కాసేపు అలా అలా వచ్చిపోయే అతిథి తరహాగా మిగిలింది.


విలన్‌ తేజ పాత్రలో ప్రకాశ్‌రాజ్‌ కనిపిస్తారు. ఇలాంటి ప్రతినాయక ఛాయల్ని తెరపై పండించడం తనకు మంచినీళ్ళ ప్రాయమని మరోసారి నిరూపించారు. కానీ, దర్శకుడు ఆ పాత్రను హీరోకు ధీటుగా బలంగా తీర్చిదిద్దలేకపోయారు. అదే సమయంలో అతను, సహచరి మోనాగా మాహీ గిల్‌లు అసభ్యత హద్దులను తాకే రీతిలో 'మ్యావ్‌... మ్యావ్‌...' లాంటి అశ్లీల సంకేతార్థాలతో పామర జనాన్ని మెప్పిస్తారు.

ఆ మధ్య ఉత్తరాదిన సంచలనం రేపిన ప్రముఖ క్రైమ్ రిపోర్టర్ జ్యోతిర్మయీ డే హత్యా ఉదంతం ప్రేరణగా ఓ జర్నలిస్టు పాత్రను ఈ చిత్రంలో ఉంచారు. ఆ జర్నలిస్టు జయదేవ్‌ పాత్రను హిందీలో అతుల్‌ కులకర్ణి పోషిస్తే, తెలుగులో తనికెళ్ళ భరణి అభినయించారు. వాళ్ళ తాలూకు దృశ్యాలను కూడా తెలుగు, హిందీ వెర్షన్లలో మార్చారు. 
ఏకకాలంలోనే తయారైనప్పటికీ తాజా హిందీ 'జంజీర్‌'కూ, తెలుగు 'తుఫాన్‌'కూ మధ్య కూడా - సినిమా ఆరంభ ఘట్టం, టైటిల్స్‌ దగ్గర నుంచి చెప్పుకోదగిన తేడాలే ఉన్నాయి. తెలుగు వెర్షన్‌లో హీరో 22 సార్లు బదిలీ అయితే, హిందీ వెర్షన్‌లో హీరో 17 సార్లు బదిలీ అవుతాడు. ఇలాంటి పిచ్చి మార్పులే కాదు, హిందీ డైలాగులను తెలుగు వెర్షన్‌లో మాత్రం యథేచ్ఛగా మార్చడమూ ఉంది. వీటిలో ఒకటీ, అర మినహా మిగిలినవన్నీ కథానుగుణంగా లేని, పానకంలో పుడకలే!


జర్నలిస్టుతో హీరో తొలిసారిగా వాదనకు దిగే ఘట్టం, హీరోను ఆసుపత్రిలో చేర్చినప్పుడు డాక్టర్‌తో షేర్‌ఖాన్‌ డైలాగుల లాంటివి అందుకు ప్రధాన ఉదాహరణలు. జర్నలిస్టుతో వాదన సందర్భంగా రామ్‌చరణ్‌ నోట ఇటీవల జూబ్లీహిల్స్‌లో రోడ్డు మీద జరిగిన శారీరక దాడి ఉదంతం గురించి అన్యాపదేశంగా ప్రస్తావించడం లాంటివి అచ్చంగా అలాంటివే. 
 అలాగే, 'మగధీర'ను అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ, 'నాలుగేళ్ళ క్రితమే వంద మందిని ఎదుర్కొన్నా. ఇప్పుడు ఎంతమంది వచ్చినా అంతు చూస్తా' అన్నట్లుగా విలన్‌తో హీరో చెప్పే డైలాగు కూడా తెలుగు వెర్షన్‌ చూసే అభిమానులను ఉద్దేశించి, ఇక్కడ కలిపినదే! తెలుగు వెర్షన్‌ కోసం 'స్టన్‌' శివతో అదనంగా యాక్షన్‌ సన్నివేశాలూ తీశారు.
చిత్రం ఏమిటంటే, పాత 'జంజీర్‌'లో స్నేహం విలువను చెబుతూ ప్రాణ్‌, అమితాబ్‌లపై వచ్చే 'యారీ హై ఇమాన్‌ మేరా...' పాట ఎంతో పాపులర్‌. (అప్పటి తెలుగు రీమేక్‌ 'నిప్పు లాంటి మనిషి'లో 'స్నేహమే నా జీవితం..' అన్న సినారె రచన తెలిసిందే!). తాజా 'జంజీర్‌'లో ఆ స్థాయిది కాకపోయినా, కనీసం ఆ ఛాయల్లోని ఓ ఖవ్వాలీ గీతం సంజరు దత్‌, రామ్‌చరణ్‌లపై వస్తుంది. తీరా తెలుగు 'తుఫాన్‌'లో మాత్రం శ్రీహరితో ఆ పాట ఊసే లేదు. కానీ, ఆ పాట ముందు వచ్చే లీడ్‌ సన్నివేశం మాత్రం యథాతథంగా ఉంచేశారు. ఇలాంటి ఎడిటింగ్‌ లోపాలూ తెరపై కనిపించేస్తుంటాయి. హిందీలో సినిమా చివర రోలింగ్‌ టైటిల్స్‌ వేళ వచ్చే 'ముంబయి..' పాట తెలుగులో మటుకు కథ మధ్యలో సమయ సందర్భాలు లేకుండా వచ్చేస్తుంది.
చిత్ర ప్రథమార్ధంలో టైటిల్‌ పాట దగ్గర నుంచి ఏకంగా నాలుగు పాటలు ఐటమ్‌ సాంగ్‌ల ఫక్కీలో సాగేవే! దాంతో, తీపి మరీ ఎక్కువైన ఫీలింగ్‌ మాస్‌ ప్రేక్షకులకు కూడా కలిగితే ఆశ్చర్యం లేదు. ఉన్న పాటల్లో కూడా మాహీ గిల్‌ నర్తించే క్లబ్‌ సాంగ్‌ 'వెచ్చనైన రాతిరీ...' (హిందీ వెర్షన్‌లో 'కాతిలానా రాత్‌ హై...') మాత్రం సుపరిచిత శైలిలో ఆకట్టుకుంటుంది.

ఈ సినిమా దర్శక, రచయితలు తగినంత శ్రద్ధ చూపకపోవడంతో, చిన్న చిన్న అంశాలు కూడా పెను లోపాలుగా మారాయి. తెలుగు వెర్షన్ లో హీరో తాను తల్లితండ్రుల్ని కోల్పోయి ఎన్నేళ్ళయిందన్న దానికి ఒకసారి 18 ఏళ్ళనీ, మరోసారి మరో సంఖ్య చెబుతాడు. అలాగే, పాత్రల్ని తీర్చిదిద్దేటప్పుడు వాటి బాడీ లాంగ్వేజ్ ను సరిచూసుకోవడం చాలా ముఖ్యం. అది చేయకపోవడంతో, ఈ సినిమాలో పోలీసు కమిషనర్ కానీ, జర్నలిస్టు జయదేవ్ కానీ హీరోకు వ్యతిరేకంగా పనిచేసే నెగటివ్ పాత్రలనే తప్పుడు భావనే ప్రేక్షకులకు కలుగుతుంది. నిజానికి, మాత్రం ఆ రెండూ పాజిటివ్ పాత్రలే.

అలాగే, హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ పుట్టిన క్రమం కూడా తెరపై చూపలేకపోయారు. హీరో, హీరోయిన్ కు కొత్త దుస్తులు కొనుక్కోవడానికని డబ్బిచ్చే దృశ్యం లాంటివి ఒకటీ, అరా హిందీ వెర్షన్ లో ఉన్నా, తెలుగు వెర్షన్ లో తీసేశారు.

క్లైమాక్సుకు వచ్చేసరికి, హీరో, విలన్ల కొట్లాట ఓ సొరంగంలో మొదలవుతుంది. తరుముకొస్తున్న నీళ్ళు, నిప్పు మధ్య వారిద్దరు దానిలో నుంచి బయటపడతారు. మొహరం ఊరేగింపులో ఛేజింగ్ జరుగుతుంది. తీరా చూస్తే, ఆ వెను వెంటనే మళ్ళీ సొరంగంలోనే వాళ్ళిద్దరూ కొట్టుకున్నట్లు చూపిస్తారు. ఈ రకమైన లోపాల గురించి ప్రేక్షకులు స్పష్టంగా వ్యక్తం చేయలేకపోయినా, సినిమా పట్ల ఓ కఠినమైన అభిప్రాయానికి వచ్చేయడానికి దోహదం చేస్తాయి.

భావోద్వేగాలు పండించ లేకపోయిన దర్శకుడి వైఫల్యంతో పాటు ఇలా సినిమాలో లోపాలు సవాలక్ష ఉండడంతో, మిగతా విభాగాల పని తీరూ పరిగణనలోకి రాదు. ఏతావతా, కథకు కాపీరైట్‌ వివాదం దగ్గర నుంచి రిలీజ్‌ దాకా సవాలక్ష వివాదాల 'తుఫాను'లో ఇరుక్కున్న ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మాత్రం తుఫాను సృష్టించదు! పాత 'జంజీర్‌' చూసి ప్రేమను పెంచుకున్నవాళ్ళకు ఎలాగూ నచ్చని ఈ సినిమా, అది చూడని కొత్త తరానికి అసలే నచ్చదు!

కొసమెరుపు: సినిమా ముగిస్తూ, డ్రగ్స్‌ మాఫియాపై పోరాటమే హీరో తదుపరి కర్తవ్యమంటూ, సీక్వెల్‌ గురించి సూచన ప్రాయంగా చెప్పారు. మొదటిదే తట్టుకోలేక పోతుంటే, మళ్ళీ రెండోదా! బాబోయ్!!

 - రెంటాల జయదేవ 

(ప్రజాశక్తి దినపత్రిక, 7 సెప్టెంబర్ 2013, శనివారం, పేజీ నం. 8లో ప్రచురితమైన సమీక్షకు ఇది పూర్తి పాఠం)
.................................

0 వ్యాఖ్యలు: