జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Thursday, November 26, 2015

చాలా మెచ్యూరిటీ అవసరం..! ( ‘కుమారి 21ఎఫ్’ మూవీ రివ్యూ)

కొత్త సినిమాలు గురూ!
 చాలా మెచ్యూరిటీ అవసరం..!

చిత్రం: కుమారి 21ఎఫ్; తారాగణం: రాజ్ తరుణ్, హేబా పటేల్, హేమ; 
మాటలు: పొట్లూరి వెంకటేశ్వరరావు; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; 
కెమేరా: ఆర్. రత్నవేలు; యాక్షన్: డ్రాగన్ ప్రకాశ్;
 కథ, స్క్రీన్‌ప్లే, సమర్పణ: సుకుమార్; 
నిర్మాతలు: విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి; 
 దర్శకత్వం: పల్నాటి సూర్యప్రతాప్; నిడివి: 133 నిమిషాలు


ఒకమ్మాయి, ఒకబ్బాయిని చూసి ‘ఎంతకొస్తావ’ని అడగడం చిత్రమే! 
చూసీచూడగానే ప్రేమలో పడ్డ అబ్బాయికి ఫస్ట్ కిస్ ఇవ్వడం... అతను
 తనను చూడాలనుకుంటున్న రీతిలో చూపడం... కచ్చితంగా విచిత్రమే!
 ‘‘ఫీల్ మై లవ్’’ అంటూ... వన్‌సైడ్ లవ్ (‘ఆర్య’ గుర్తుందిగా) లాంటి విభిన్న
 తరహా న్యూ ఏజ్ లవ్‌స్టోరీలు అల్లే దర్శక- రచయిత బి. సుకుమార్
 ఆలోచనలు ఎప్పుడూ ఇలానే ఉంటాయి. అలా ఆయన రాసుకొని, 
నిర్మాతగా వెండితెరకు అందించిన కథ - ‘కుమారి 21ఎఫ్’.

టచ్ ఫోన్‌లో టైటిల్స్ వేయడం దగ్గర నుంచే రొటీన్ కథలకు విభిన్నమైన
 సినిమాగా ‘కుమారి 21ఎఫ్’ మొదలవుతుంది. కాలనీలో ఫ్రెండ్స్‌తో 
సరదాగా తిరిగే కుర్రాడు సిద్ధు (రాజ్‌తరుణ్). తల్లి నర్సు (హేమ). 
తండ్రి విడిపోయి, వేరొక చోట ఉంటాడు. చదివిన క్యాటరింగ్ చదువుతో 
సింగపూర్‌లో స్టార్ క్రూయిజ్‌లో షెఫ్‌గా చేరాలని హీరో లక్ష్యం. అతనికి 
శంకర్ (నోయెల్), సెల్‌ఫోన్ ఫోటో సురేశ్ (నవీన్), సొల్లు శీను (సుదర్శన్)లు
 ముగ్గురూ క్లోజ్ ఫ్రెండ్స్. ఏ.టి.ఎం.లలో దొంగతనాల లాంటివి చేస్తూ 
ఆ ముగ్గురూ బతికేస్తుంటారు. చిన్నా చితకా సినిమాల్లో చేసే
 మోడల్ కుమారి (హేబా పటేల్) ముంబయ్ నుంచి వాళ్ళ కాలనీలోకి
 ఎంటరవుతుంది. బోల్డ్‌గా మాట్లాడుతూ, బోళాగా ఉండే ఆ అమ్మాయి 
తొలిచూపులో హీరోను ప్రేమిస్తుంది. తొలిముద్దు తొలిప్రేమ అతనితోనే 
పంచుకున్నానంటుంది.

కానీ, మోడళ్ళ జీవితం, హీరోయిన్ ప్రవర్తన గురించి నెగటివ్ కామెంట్స్‌తో
 హీరో మనసులో ఫ్రెండ్స్ అనుమాన బీజం నాటతారు. దాంతో, తీరా హీరో
 తన లవ్ చెప్పే టైమ్‌కి అతనికి మెచ్యూరిటీ లేదు పొమ్మంటుంది హీరోయిన్.
 అక్కడ నుంచి హీరోలో మానసిక ఘర్షణ. ఇక, ఈజీమనీకి అలవాటుపడ్డ
 హీరో ఫ్రెండ్స్ ఏ.టి.ఎం. లూఠీకి తెగబడతారు. అప్పుడేమైంది? హీరో ప్రేమ 
మాటేమిటన్నది మిగతా కథ.

 ‘సినిమా చూపిస్త మావ’ ఫేవ్‌ు రాజ్‌తరుణ్ అచ్చంగా సిద్ధూ పాత్రే 
అనిపిస్తారు. బ్యాక్‌గ్రౌండ్, బయోడేటా బదులు హైట్, వెయిట్, బాడీ కొలతలు 
చెప్పే మీనాకుమారి అలియాస్ కుమారిగా హేబా పటేల్ పొట్టి లాగూలు, 
స్కర్టులతో హుషారుగా కనిపిస్తారు. ఆమెకు తెలుగు డబ్బింగ్ (లిప్సిక)
 బాగా కుదిరింది. హీరో ఫ్రెండ్స్ పాత్రలు నవ్వించడానికి, అడల్ట్ కామెడీకి
 కథలో పనికొచ్చాయి. మ్యూజిక్ (దేవిశ్రీప్రసాద్), కెమేరా (రత్నవేలు) 
బాగున్నాయి. ఇక, సినిమాలోని బ్యాంకాక్ పాట, అలాగే
 ‘లవ్ చేయాలా... వద్దా’ పాటలోని సాహిత్యం నిజజీవితానికి 
అద్దం పట్టిన సమకాలీన భావవ్యక్తీకరణలు.

ఈ ‘ఏ’ సర్టిఫికెట్ సినిమా పెద్దలు చూడాల్సినదే. పెద్దలు కావడానికి 
సిద్ధమవుతున్న టీనేజ్ ప్రేమికులూ చూసి, అర్థం చేసుకొని, 
ఆలోచించాల్సిన అంశాలూ దీనిలో ఉన్నాయి. ‘నేనెలాగైనా తిరగచ్చు
 కానీ, నేను జీవితం పంచుకొనేవాళ్ళు ఎన్నడూ, ఎవరితో తిరగని 
వాళ్ళయ్యుండాలి’ అనే పురుషస్వామ్య ఆలోచనకు ప్రతిబింబం హీరో 
పాత్ర. మరోపక్క, ఏ బంధానికైనా అమిత శత్రువు అనుమానం. 
దీన్ని తల్లి పాత్రలో ప్రస్తావిస్తారు.

ఒక విధంగా చూస్తే - ఇలాంటి అంశాలను ధైర్యంగా తెరపై చర్చించడం 
సాహసమే. ఆ సాహసానికి ఒడికట్టి, నవతరం మాట్లాడుకొనే యాస, భాష 
వాడడంతో అనివార్యంగా సినిమాలో దాదాపు పాతిక దాకా కత్తెరలు
 పడ్డట్లున్నాయి. ఒక డైలాగ్ రైటర్, మరో ముగ్గురు అదనపు రచయితలు 
పనిచేసిన ఈ సినిమాలో మాటలు ‘మ్యూట్’ అయ్యాయి. బొమ్మలు ‘బ్లర్’ 
అయ్యాయి. లవ్ ఏజ్‌లో ఉండే టీనేజర్ల అంతరంగంలోని గందరగోళాల్ని
 పచ్చిగానే అయినా, బోరనిపించకుండా బోల్డ్‌గా చెప్పడం ఫస్టాఫ్‌లో 
కనిపిస్తుంది. సెకండాఫ్‌లో పాత్రలతో పాటు కథ కూడా గుంజాటనలో 
పడుతుంది. క్లైమాక్స్ ముందు నుంచి వేరొక రూపం తీసుకుంటుంది. 
లవ్‌స్టోరీ ఫీల్‌తో సాగే ఫిల్మ్ చివరకొచ్చేసరికి క్రైమ్‌కథగా ముగుస్తుంది.
 విడాకులతో హీరో తల్లీ తండ్రి 20 ఏళ్ళ క్రితం విడిపోయారన్న సంఘటన, 
తండ్రి ప్రవర్తన, ముగింపు లాంటివన్నీ సినిమాటిక్ స్క్రీన్‌ప్లే కన్వీనియన్సే.
 లోటుపాట్లెలా ఉన్నా, ఆలోచించాల్సినవీ, యూత్‌ను ఆకర్షించేవీ ఉన్న
 సినిమాగా ‘కుమారి 21ఎఫ్’ నిలుస్తుంది. ఆకర్షణ సరే కానీ, ఆలోచించే
 మెచ్యూరిటీ ప్రేమించే వాళ్ళతో పాటు, సినిమా తీసేవాళ్ళు, చూసేవాళ్ళకూ
 అవసరమే. అది ఎందరికుందన్నది ప్రశ్న. అంత మెచ్యూర్డ్ కుమారి
 పాత్రల్ని బాహా టంగా ఎవరు, ఏ మేరకు స్వాగతిస్తారన్నది 
వేచిచూడాల్సిన జవాబు.

....................................
- హైదరాబాద్‌లో మలక్‌పేట ఆర్ అండ్ బి క్వార్టర్‌‌సలో 60 శాతం ఫిల్మ్ తీశారు. 
- ఒక్క పాట కోసం బ్యాంకాక్ వెళ్ళారు. 
- 70 వర్కింగ్ డేస్. బడ్జెట్ 6 కోట్లు.  
-దేవిశ్రీప్రసాద్, రత్నవేలు డబ్బు తీసుకో లేదు. సుకుమార్ పార్‌‌టనర్‌‌సగా చేశారు. 
- ‘ఆర్య’ నుంచి సుకుమార్‌తో పని చేస్తూ ‘కరెంట్’తో డెరైక్టరైన సూర్య ప్రతాప్‌కి ఇది రెండో సినిమా.
........................................

 - రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 21st Nov 2015, Saturday, Family Page)
..................................

0 వ్యాఖ్యలు: