జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Monday, November 16, 2015

ఇది ప్రేమ్.. లీల ( ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ (తెలుగులో ‘ప్రేమ లీల’) మూవీ రివ్యూ)

ఇది  ప్రేమ్.. లీల

చిత్రం: ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ (తెలుగులో ‘ప్రేమ లీల’),  
సంగీతం: హిమేశ్ రేషమియా, ప్రొడక్షన్ డిజైనర్: 
నితిన్ చంద్రకాంత్ దేశాయ్, కెమేరా: వి. మణికంఠన్, 
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సూరజ్ ఆర్. బర్జాత్యా, 
నిడివి:  174 నిమిషాలు

భారతీయ సినీ రంగంలో ‘రాజశ్రీ ప్రొడక్షన్స్’కు ప్రత్యేకత ఉంది. 
సకుటుంబంగా చూడదగ్గ సినిమాలకు ఆ సంస్థ తిరుగులేని 
చిరునామా. సల్మాన్‌ఖాన్‌తో కూడా ప్రత్యేక బంధం ఆ సంస్థది. 
‘మైనే ప్యార్ కియా’ (1989) మొదలు ‘హమ్ ఆప్‌కే హై కౌన్’ (1994), 
‘హమ్ సాథ్ సాథ్ హై’ (1999) వాళ్ళ కాంబినేషన్‌లో,
 సూరజ్ బర్జాత్యా దర్శకత్వంలో వచ్చినవే. నాలుగో సినిమా 
ఈ ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’. పోస్టర్‌తో సహా ఈ సినిమా
 ఆ పాత హిట్ల వాతావరణాన్నీ, విలువల్నీ గుర్తు చేస్తుంటుంది.

కథేమిటంటే... ప్రేమ్ (సల్మాన్‌ఖాన్) పురాణ కథల్ని రంగస్థలంపై 
ప్రదర్శించే రామ్‌లీలా కళాకారుడు. సంపాదనలో చాలా భాగాన్ని
 సామాజిక సేవాసంస్థ ‘ఉపహార్’ ఫౌండేషన్‌కు ఇచ్చేస్తుంటాడు.
 ఆ ఫౌండేషన్‌ను దేవ్‌గఢ్ రాజకుమారి మైథిలి (సోనమ్ కపూర్)
 నడుపుతుంటుంది. ఆమెను ప్రత్యక్షంగా కలసి, మాట్లాడాలని 
అనుకుంటాడు. ప్రీతమ్‌పూర్ రాకుమారుడు విజయ్ సింగ్ 
(సల్మాన్‌ఖాన్)తో రాజకుమారి పెళ్ళి కుదిరిందనీ, అతనికి
 రాజతిలకం దిద్దే ఉత్సవానికి ఆమె వస్తోందనీ తెలుసుకుంటాడు. 
నేరుగా వెళ్ళి, ఆమెను కలిసి, డబ్బు ఆమె చేతికే ఇవ్వాలనుకుంటాడు. 
మరోపక్క సవతి చెల్లెళ్ళు చంద్రిక (స్వరభాస్కర్), రాధికలను 
నచ్చజెప్పడానికి వెళ్ళిన రాకుమారుడు శత్రువుల పన్నాగంతో 
పెను ప్రమాదానికి గురవుతాడు. లేవలేని స్థితిలో ఉన్న 
రాకుమారుణ్ణి రహస్య ప్రదేశంలో ఉంచి, దివాన్ (అనుపమ్‌ఖేర్),
 రాజాస్థాన సెక్యూరిటీ చీఫ్ వైద్య చికిత్స చేయిస్తుంటారు. 
నాలుగు రోజుల్లో ఉన్న ఉత్సవానికి ఏం చేయాలో వాళ్ళకు
 పాలుపోదు. ఇంతలో సరిగ్గా రాకుమారుడి పోలికలతో ఉన్న
 సామాన్యుడు ప్రేమ్ ఎదురవుతాడు. ఈ సామాన్యుణ్ణి 
రాకుమారుడి స్థానంలో పెట్టి, కథ ముందుకు నడిపిస్తారు.

రాకుమారుడిలా నటిస్తున్న ప్రేమ్ తన ప్రవర్తన, ఆప్యాయత, 
అనురాగాలతో అందరి మనసూ చూరగొంటాడు. రాకుమారుడి
 పట్ల ముభావంగా ఉన్న రాజకుమారిలో ప్రేమ పొంగేలా 
చేస్తాడు. మరోపక్క రాకుమారుడి మీద హత్యాయత్నం 
చేసింది సవతి తమ్ముడు (నీల్ నితిన్ ముఖేశ్), అతని
 అనుచరగణమేనని తెలుస్తుంది. వాళ్ళకీ రాకుమారుడి
 వేషంలో ఉన్నది సామాన్యుడని అర్థమవుతుంది. అప్పుడు
 ప్రేమ్ ఏం చేశాడు? బంధాల్ని కాలదన్నుకుంటున్న 
వాళ్ళనెలా మార్చాడు? రాజకుమారి ప్రేమ కథ ఏమైంది? 
లాంటివన్నీ మిగతా కథ.

ఫ్యాన్‌‌సకు డబుల్ ధమాకా - సల్మాన్ ద్విపాత్రాభినయం. 
రాకుమారుడిగా గాంభీర్యం పలికిస్తూనే, సామాన్యుడైన 
ప్రేమ్ దిల్‌వాలేగా  సల్మాన్ ఇరవై ఏడేళ్ళ వెనక్కి వెళ్ళి,
 ‘మైనే ప్యార్ కియా’ నాటి అమాయకత్వాన్ని పలికించారు. 
‘రాన్‌ఝానా’, ‘ఖూబ్‌సూరత్’ ఫేమ్ సోనమ్ కపూర్‌కు ఇది
 మరో మంచి పాత్ర. రకరకాల కోణాలున్న ఆ పాత్రను చేతనైనంత 
మెప్పించారు. దివాన్‌గా అనుపమ్ ఖేర్ చూపించే ప్రభుభక్తి, 
కర్తవ్యదీక్ష ఆ పాత్ర మీద ప్రేమను పెంచుతాయి. సవతి చెల్లెలు 
చంద్రికగా స్వరభాస్కర్‌ది మరో కీలక పాత్ర. కోపం, ద్వేషం నుంచి
 ప్రేమానుబంధం వైపు ఆ పాత్ర మారే తీరు బాగుంది. దాన్ని
 ఇంకొంత ఎఫెక్టివ్‌గా చెప్పేందుకు మరికొన్ని సీన్లు అవసరం.
 విలన్లుగా నీల్ నితిన్ ముఖేశ్, అర్మాన్ కోహ్లీ నిండుగా కనిపిస్తారు.

పెళ్ళిళ్ళు, ఉత్సవాలు, కుటుంబ బంధాలనే ‘రాజశ్రీ’ వారి 
చట్రంలోనే ఈ సినిమా తయారైంది. అయితేనేం, కెమేరా, 
ఆర్ట్ విభాగాల పనితనం మెచ్చుకోకుండా ఉండలేం. ‘రాజశ్రీ’ 
వారి మ్యూజికల్ డ్రామాలన్నిటి లానే ఈ సినిమాలో 40 
నిమిషాలు పాటలే. కనీసం మూడు, నాలుగు పాటలు బాగున్నాయి.

మొదలైన 20 నిమిషాల చిల్లరకే ఒక మంచి మలుపుతో
 కథపై ఆసక్తి పెరుగుతుంది. కాసేపటికే మార్క్‌టై్వన్
 ‘ప్రిన్స్ అండ్ పాపర్’ (రాజు - పేద) కథ ఫక్కీలో ఒకరి స్థానంలోకి
 మరొకరు వెళ్ళడమనే కమర్షియల్ ఫార్ములా కథ ఇదని 
అర్థమైపోతుంది. ఇక అక్కడ నుంచి కథనెలా ముందుకు 
నడిపిస్తారన్న దాని మీదే ఆసక్తి. అయితే, దర్శకుడు 
అలవాటైన విలువల మార్గాన్నే తాపీగా అనుసరించారు 
తప్ప, వేగం కోసం ఎక్కడా తొందరపడలేదు. దాంతో,
 ఫస్టాఫ్ కాలక్షేపంగా గడిచిపోయినా, సెకండాఫ్ 
మలుపులు లేకుండా స్ట్రయిట్‌గా సాగుతుంది.     

 డబ్బు, అధికారం కోసం సొంత తమ్ముడే - యువరాజైన 
హీరోను చంపాలనుకోవడం ఓకె. కానీ, తీరా హీరోను 
ఎత్తుకొచ్చి, తమ దగ్గరే బంధించాక ఏమీ చేయడేమిటో 
అర్థం కాదు. అలాగే, చివరికొచ్చేసరికి యుద్ధం సీన్‌లో 
తమ్ముడిలో హఠాత్తుగా మార్పొస్తుంది. యువరాజు మీద
 పన్నాగం పన్నినవాళ్ళు ఇంటి దొంగలే అన్న సంగతి
 తెలుసుకోవడానికీ దివాన్ బృందం పెద్దగా కష్టపడదు. 

మొత్తం మీద చెడు కన్నా మంచే ఎక్కువ చెప్పాలనుకోవడం,
 చూపాలనుకోవడం ‘రాజశ్రీ’ వారి ధోరణి. తరాలు మారినా
 ఆ దోవలోనే వెళ్ళడం వల్ల కావచ్చు... ఈ సినిమాలో విలన్ల
 కుట్రలు కూహకాల మీద సీన్లు అల్లుకోలేదు. ద్వేషం
 మనుషుల్ని దూరం చేసేవైతే, ప్రేమ ఎవరినైనా దగ్గర 
చేస్తుందని చెప్పారు. ఆ మేరకు వారు పడ్డ శ్రమ, కథను 
తెరకెక్కించడంలోని నిర్మాణ విలువలు తెరపై కనిపిస్తుంటాయి. 
మంచి విలువల్ని మరోసారి గుర్తుచేసే మనసున్న కుటుంబ
 కథల్ని మ్యూజికల్ డ్రామాలుగా చూపే కథన పద్ధతి 
నచ్చేవారికి ఈ సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. 
బరువంతా భుజాన మోస్తూ సల్మాన్ విసిరిన 
సమ్మోహనాస్త్రం. మరి, క్షణమైనా చూపు ఒకేచోట
 నిలవకుండా చేతిలో రిమోట్ తిప్పే, ఇవాళ్టి 
స్మార్ట్‌ఫోన్ తరం మాటేమిటన్నదే ప్రశ్న.
 ...................................................

- ‘ప్రేమ్’ అనే పేరున్న పాత్రని సల్మాన్ పోషించడం 

ఇది 16వ సారి అట!

-  కొన్ని యాక్షన్ సీన్ల కోసం ‘స్కై ఫాల్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్,
 హ్యారీ పోటర్’ ఫేవ్‌ు స్టంట్‌డెరైక్టర్ గ్రెగ్ పోవెల్‌ను తెచ్చారు. 

-  ‘మొఘల్ -ఏ-ఆజమ్’లో చర్చనీయాంశమైన శీష్‌మహల్ సెట్ 
లాంటి దాన్నే కళా దర్శకుడు నితిన్ పునఃసృష్టించారు. 

-  ఈ సినిమా బడ్జెట్ 80 నుంచి 90 కోట్లట. 258 రోజుల పైగా షూటింగ్. 
లైటింగ్‌కే 13 -15 కోట్లు ఖర్చయిందట!  

- ఈ చిత్ర తెలుగు డబ్బింగ్ ప్రేమ లీలలో సల్మాన్‌కు రామ్‌చరణ్ గొంతిచ్చారు.
..............................................................

- రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 13th Nov 2015, Friday, Family Page)
.......................................

0 వ్యాఖ్యలు: