జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Sunday, August 14, 2016

నాగరి 'కథ'..... ‘మొహెంజొ దారో’ సినిమా చరిత్ర -

మొహెంజొ-దారో... వేల ఏళ్ళ క్రితం విలసిల్లిన ప్రాచీన భారతీయ పట్టణం.  క్రీ.పూ. 2600 ఏళ్ళ క్రితం నాటి అఖండ భారతదేశానికి అగ్రపీఠం... ప్రపంచానికి మన సంస్కృతీ మూలాల్ని సగర్వంగా చాటే ‘సింధులోయ నాగరికత’కు కేంద్రం.  ఇప్పటి పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంతంలో ఉన్న ఈ నగరంలో అన్ని వేల సంవత్సరాల క్రితమే భారీ స్నానఘట్టాలు, విశాలమైన వీధులు, పద్ధతి ప్రకారం సాగిన నగర నిర్మాణం, అన్ని వేల ఏళ్ళ క్రితమే అద్భుతమైన మురుగునీటి పారుదల వసతులు....  అన్నీ ఉండేవట! 1920లలో తవ్వకాల్లో బయటపడిన ఆధారాలే అందుకు సాక్ష్యం. 

మరి అంత నాగరికత వెలసిన ఆ నగరమెందుకు భూస్థాపితమైపోయింది? ఉన్నట్టుండి అంత సంస్కృతి అదృశ్యమై, అస్తిపంజరాల గుట్టలే మిగిలాయంటే ఏమై ఉంటుంది? అద్భుతమైన ప్రాచీన నాగరికత విలసిల్లిన ఆ నగరం నేపథ్యంలో అందమైన కల్పిత ప్రేమకథను బ్రహ్మాండస్థాయిలో వెండితెరపై చూపిస్తే? ‘లగాన్’, ‘జోధా అక్బర్’ చిత్రాల ఫేవ్‌ు దర్శకుడు ఆశుతోష్ గోవారీకర్ ఇప్పుడు ఆ పనే చేశారు. హృతిక్ రోషన్, పూజా హెగ్డేలతో ‘మొహెంజొదారో’ పేరిట 115 కోట్లతో ‘‘ఎపిక్ ఎడ్వంచర్ -రొమాన్స్ ఫిల్మ్’’ తీశారు.
 
చరిత్రలో...  ‘మొహెంజొ దారో’ 

 ప్రపంచంలో ప్రాచీన నాగరికతల్లో ఒకటైన మన సింధులోయ నాగరికతలోవే హరప్పా, మొహంజొ దారో నగరాలు.  ఈ నగరాల్ని క్రీ.పూ. 2500 ప్రాంతంలో కట్టారని లెక్క. నిజానికి, ఈ చారిత్రక నగరం అసలు పేరు ‘మొహెంజొ దారో’ కాదు. అప్పటి హరప్పా లిపి ఇప్పటికీ సరిగ్గా చదివి, అర్థం చెప్పి, గుట్టు విప్పలేకపోవడంతో అసలు పేరేమిటో ఎవరికీ తెలియదు.  ‘మొహెంజొ దారో’ అనే పదానికి ముక్కకు ముక్కగా అర్థం - ‘మృతుల దిబ్బ’ అని!  1922లో తవ్వకాల్లో బయటపడ్డ ఈ నగర నిర్మాణ ప్రణాళిక, రహదారులు అబ్బురం.   ‘పశుపతి ముద్ర’ని బట్టి ‘పశుపతి’ని దైవంగా పూజించేవారని అర్థమవుతోంది.  ఇంత వైభవోపేతంగా వెలిగిన నాగరికత ఎలా విధ్వంసమైందో కారణం తెలియదు. ఆర్యుల దాడి, కరవు, జలప్రళయం- ఇలా ఎన్నో ఊహించినా, కారణం ఇంకా పజిలే.
 
కల్పిత ప్రేమపురాణం
క్రీ.పూ. 2016లో జరిగినట్లుగా తెరకెక్కిస్తున్న కాల్పనికకథ ఇది. శర్మన్ (హృతిక్ రోషన్) అనే యువ నీలిమందు రైతు మొహెంజొదారో వెళతాడు. సరికొత్త సమాజానికి మూల మవుతుందని జోస్యులు చెప్పిన చాని (పూజా హెగ్డే)తో ప్రేమలో పడతాడు. అప్పటికే ఆమెకి మరొకరితో పెళ్ళి నిశ్చయమైంది. నగరిపై పెత్తనం చేసే దుష్టుడితో పోరులో హీరో త్యాగం తెరపై చూడాలి.

వెండితెర హిస్టారియన్
సమకాలీన హిందీసీమలో ఏళ్ళ తరబడి ఒక అంశాన్ని శోధించి, నెలల తరబడి శ్రమించి, కోట్ల ఖర్చుతో భారీ కలల్ని వెండితెరపై వడ్డించే దర్శకుడంటే గుర్తొచ్చేపేరు - ఆశుతోష్ గోవారీకర్. ఇరవయ్యేళ్ళకే నటుడైన ఆయన మూడు పదులు రాక ముందే దర్శకుడిగా మారారు. గత 23 ఏళ్ళలో తీసిన సినిమాలు ఎనిమిదే!
 
‘లగాన్’కు వెళ్ళినప్పుడే...
బ్రిటీష్ పాలనా కాలంలో సామాన్య గ్రామీణులకూ, వారికీ మధ్య క్రికెట్ నేపథ్యంలోని పోరాటంగా ఆశుతోష్ తీసిన చిత్రం ‘లగాన్’ (2001). ఆ చిత్ర షూటింగ్‌కి లొకేషన్లు వెతుకుతూ, గుజరాత్‌లోని భుజ్ ప్రాంతానికి వెళ్ళినప్పుడే ఆశుతోష్‌లో ఈ ‘మొహెంజొదారో’ ఆలోచనకి బీజం పడింది. పదహారేళ్ళ తరువాత ఆ కల నెరవేర్చుకుంటున్నారు. 3 ఏళ్ళు శ్రమించి, తెరపై ప్రాణం పోశారు.

ఆశుతోష్ కాపీ కొట్టారా?
చరిత్రను సరిగ్గా చూపించడం లేదన్న వివాదాలు చాలదన్నట్లు... ఈ సినిమా కథ తనదనీ, ఆశుతోష్ కాపీ కొట్టారనీ ముంబయ్‌లోని అసిస్టెంట్ డెరైక్టర్ కమ్ రైటర్ ఆకాశాదిత్య లామా రచ్చ చేశారు. బాంబే హైకోర్టుకెళ్ళారు. 1995లో ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’లో పనిచేస్తున్నప్పుడే ‘మొహెంజొ దారో’ స్క్రిప్ట్ రాసుకున్నాననీ, 2002లో స్క్రిప్టును ఆశుతోష్‌కు పంపితే, ‘పీరియడ్ ఫిల్మ్ తీసే ఆలోచన లేదు’ అంటూ వెనక్కి ఇచ్చేశారనీ, తీరా ఇప్పుడు ‘మొహెంజొ దారో’ తీశారనీ ఆరోపించారు. మీడియాలో సంచలనమైన ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. లామాకు లక్షన్నర జరిమానా వేసింది.
 
లొకేషన్‌లో 3 వేల మంది
భుజ్‌లో మండే ఎండల్లో 100 రోజులకు పైగా జరిగిన షెడ్యూల్‌లో పని సజావుగా జరగడానికి రోజూ 300మంది తెర వెనక కష్టపడేవారు. భారీ నగర దృశ్యాల్లో వేల కొద్దీ జనం కావాలి. స్థానిక భుజ్ వాసులకు ఆడిషన్ పెట్టి ఎంపిక చేశారు. లొకేషన్లో ఒక్కోసారి 3 వేలమంది దాకా ఉండేవారట!  ‘లగాన్’ షూటింగ్ టైవ్‌ులో భుజ్‌లోని నివాసగృహాల్లోనే యూనిట్ మొత్తం బస చేసేది. ఇప్పుడు ఆ ప్రాంతం కొద్దిగా అభివృద్ధి చెందింది.  ఔట్‌డోర్ జరిగినంతకాలం హృతిక్ అక్కడే మొబైల్‌జిమ్ పెట్టారు.
 
మనకు తెలిసినవాళ్ళూ ఉన్నారు!
చిత్ర హీరోయిన్ పూజా హెగ్డే తెలుగులో నాగచైతన్య ‘ఒక లైలా కోసం’, వరుణ్‌తేజ్ ‘ముకుంద’ల నాయికే.విలన్ కబీర్‌బేడీ మన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో విలనే.  ‘రుద్రమదేవి’, ‘గౌతమిపుత్ర...’ల కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లాయే దీనికీ డిజైనర్. గతంలో ఆశుతోష్ ‘లగాన్, స్వదేశ్, జోధా అక్బర్’ చిత్రాలకు పనిచేసిన ఎ.ఆర్. రహమాన్ ఈ సినిమాకూ సంగీతం సమకూర్చారు.
 
ఇండియన్ స్క్రీన్‌పై... హాలీవుడ్ యాక్షన్
తల పెకైత్తి చూడాల్సినంత భారీ నగరం నేపథ్యంలో అప్పటి కాలానికి తగ్గట్లు ఆయుధాల్లేకుండా గాలిలోకి ఎగిరి కురిపించే ముష్టిఘాతాలు, 20 అడుగుల భారీ మొసళ్ళు, క్రూరమైన పులులు, దున్నపోతులతో ఫైట్స్ ‘మొహెంజొ దారో’లో పుష్కలం. ‘టైటానిక్’, ‘ది మ్యాట్రిక్స్’, ‘ది హాబిట్’ చిత్రాల హాలీవుడ్ స్టంట్ కోఆర్డినేటర్ గ్లెన్ బోస్వెల్‌ను ఏరికోరి పెట్టుకున్నారు ఆశుతోష్. 42 ఏళ్ళ హృతిక్ డూప్ లేకుండా ఫైట్స్ చేసి, గాయాల పాలయ్యారు. గ్రాఫిక్స్‌కి హాలీవుడ్ నిపుణుడు కరేన్ గౌలేకస్ వర్‌‌క చేశారు.

సెన్సార్... కట్ చేయని మూడు ముద్దులు
బ్రిటీషు పాలకుల కన్నా, మెఘలుల కన్నా, బౌద్ధం కన్నా, క్రీస్తు కన్నా మునుపటి కాలానికి, ఇప్పటి దాకా మనం చూడని ఇండియాకు సంబంధించిన కాలానికి చెందిన కథ అని దర్శక, నిర్మాతలు సగర్వంగా ప్రకటించారు. కాలం ఏదైనా ప్రేమ, ప్రణయం తప్పవుగా! ఈ బాక్సాఫీస్ ప్రేమకథలో ఏకంగా మూడు ముద్దు సీన్లున్నాయి. హృతిక్, పూజా హెగ్డేల మధ్య సినిమాలో ‘అధర బంధన చుంబనాలు’ (లిప్ లాక్) గురించి మీడియా కోడై కూస్తోంది. సెన్సార్ బోర్డ్ కట్స్ లేకుండా ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చింది.
 
రిలీజ్ రోజునే... లోకార్నో ఫిల్మ్ ఫెస్టివల్‌లో...
ప్రపంచం నలుమూలల్లో గొప్ప చిత్రాలను గుర్తించేది ‘లోకార్నో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’. ఎటా జరిగే ఈ ఫెస్టివల్‌లో ఈసారి ముగింపు చిత్రం ‘మొహెంజొ దారో’. వివిధదేశాల నుంచి 8 వేలమంది హాజరయ్యే ఈ 69వ ఫెస్టివల్‌లో ఆరుబైట ప్రపంచ భారీ తెరల్లో ఒకదానిపై ఈ చిత్రాన్ని ఆగస్ట్ 12న ప్రదర్శిస్తున్నారు. గతంలో ‘లగాన్’ని ఇక్కడే వేశారు. పదిహేనేళ్ళ తర్వాత మరోసారి ఆ అనుభూతి ఆశుతోష్‌కి దక్కుతోంది.

- రెంటాల జయదేవ

(published in 'sakshi' Telugu daily, Family Page, 12th Aug 2016, Friday)

0 వ్యాఖ్యలు: