ఆరోపణలు చేయడం సులభం. తర్కం, ఆధారాలు లేకుండా ఆరోపించడమైతే మరీ సులభం. తొలి సంపూర్ణ తెలుగు టాకీ భక్త ప్రహ్లాద
విడుదల తేదీ మీద నేను సమర్పించిన పరిశోధన పత్రంలోని అంశాలపై కొందరు ఆ పనే చేయడం నాకు ఆశ్చర్యం కలిగించింది. మరికొందరు ఓ మెట్టు పైకెక్కి పరిశోధనకు దురుద్దేశాలు పులిమే ప్రయత్నం చేశారు. వాస్తవాలను నివేదిస్తూ, వాటి ఆధారంగానే వార్తలు, వ్యాసాలు అందించాల్సిన పత్రికా రచయితలలోని సీనియర్లు కొందరూ, దీర్ఘకాలంగా పత్రికా రంగంలో సమున్నత సేవలందిస్తున్న ప్రముఖ పత్రికలలో కొన్నీ - కూడా తొందరపాటుతో ఆ అవాంఛనీయ వైఖరినే అవలంబించడం ఆశ్చర్యకరమే కాదు, బాధాకరం కూడా. తొలి తెలుగు టాకీ పుట్టిన ‘‘తేదీపై వివాదమెందుకు?’’ అంటూ ఆంధ్రప్రభ దినపత్రిక తమ వారం వారీ సినీ ప్రత్యేకానుబంధం ’’చిత్రప్రభ’’లో ఏకంగా సంపాదకుడి సంతకంతో ఎడిటోరియల్ రాసింది (ఆ ఎడిటోరియల్ తాలూకు డిజిటల్ బొమ్మ, అందులోని సమాచారం ఈ పోస్టులోనే పక్కనే చూడగలరు).
తెలుగు సినిమా ఎనభై ఏళ్ళ ఉత్సవాన్ని జరుపుకొంటున్న తరుణంలో ఈ హడావిడి ఏమిటంటూ, పరిశోధన ఉద్దేశాన్నే ప్రశ్నించింది. దురుద్దేశాలు అంటగట్టేందుకు ప్రయత్నించింది. తర్కానికి అందని వ్యాఖ్యలెన్నో చేసింది. చేసిన పరిశోధనను సహృదయంతో అనుశీలించకపోగా, మళ్ళీ తానే గొంతు సవరించుకొని - ‘‘కొత్త తేదీ వెలుగులోకి రావడం వల్ల అసలు తేదీ ఏదనే దానిపై పరిశోధన జరగాల్సిన అవసరం కనిపిస్తోంది’’ - అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది. ఆ వెంటనే తానే తీర్పరి పాత్ర పోషిస్తూ - ‘‘అయితే తేదీ ఏదనే విషయం ప్రధానం కాదు. ముందుగా అనుకున్నట్టుగానే సెప్టెంబర్ 15వ తేదీని తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకగా ప్రతి ఏడు ఘనంగా జరుపుకోవడానికి ప్రయత్నించాలి’’ - అని ఆ పత్రిక ముక్తాయించింది.
పరిశోధన జరపాలని ఓ నాలికతో అంటూ, ఇప్పటిదాకా సరైన సాక్ష్యాధారమేదీ లేని సెప్టెంబర్ 15వ తేదీనే తెలుగు సినిమా పుట్టినరోజు జరుపుకోవాలని అలా తెగేసి మరో నాలికతో తీర్మానించేయడం ఏమిటో అర్థం కాదు. పరిశోధన చేస్తేనేమో దురుద్దేశాలు అంటగడుతున్నారు. కానీ పరిశోధన జరగాల్సి ఉందనీ మళ్ళీ తామే అంటున్నారు. ఇదెక్కడి చిత్రం. పరిశోధనపై ఆరోపణలు చేసి, అనుమానాలు వ్యక్తం చేసిన ఆంధ్రప్రభ ఎడిటోరియల్ పూర్తిపాఠం ఇదీ --..........................................
తేదీపై వివాద మెందుకు?భక్త ప్రహ్లాద విడుదల తేదీపై వివాదం చెలరేగింది. ఇప్పటి వరకు 1931 సెప్టెంబర్ 15న ఈ చిత్రం విడుదలైందని చరిత్రకారులు చెబుతూ వస్తున్నారు. ఇటీవలే భక్త ప్రహ్లాద విడుదలైన తేదీని తెలుగు సినిమా పుట్టినరోజుగా పరిశ్రమ ఘనంగా జరుపుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్న సమయంలోనే కొత్త తేదీ ప్రచారంలోకి వచ్చింది. ఐదు సంవత్సరాల క్రితం వజ్రోత్సవాలను అట్టహాసంగా జరుపుకుని, ఇప్పుడు
ఎనబై యేళ్ళ ఉత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలోనే విడుదల తేదీ, సంవత్సరం సరికాదంటూ వివాదం చేయడం వెనుక వారికి ఉన్న ఉద్దేశాల గురించి రంధ్రాన్వేషణ చేయడం అనవసరం.
సినీ ప్రముఖులు దాసరి నారాయణరావుగారు పేర్కొన్నట్టు తేదీపై సంపూర్ణ సమాచారం లేదు. ఆ రోజుల్లో తొలుత విజయవాడ మారుతీ టాకీస్‌లో తర్వాత రాజమండ్రి శ్యామల టాకీసులో విడుదలైన తర్వాత మద్రాసులో 1932లో విడుదలై ఉండవచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ, దీనిపై శాస్త్రీయంగా పరిశోధన జరగాలని సూచించారు. దాసరిలాంటి ప్రముఖులు ఎలాంటి ఆధారం లేకుండా మాట్లాడరనే విషయం పరిశ్రమకు తెలియంది కాదు. హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన భక్త ప్రహ్లాద తొలి టాకీ తెలుగు సినిమానా, లేక హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వంలోనే తెలుగు తమిళ సంభాషణలతో, తెలుగు పాటలకు ప్రాధాన్యత ఇస్తూ తమిళ చిత్రంగా రూపొందిన కాళిదాసు తొలి తమిళ చిత్రమా అనేది కూడా తేలాలి.
దీనిపై సినీ పరిశోధకులు ఇంటూరి వెంకటేశ్వరరావు, వి.ఏ.కె.రంగారావు వంటి వారు ఎప్పుడో శోధించారు. వారి సూచన మేరకే 1931 సెప్టెంబర్ 15 అని పరిశ్రమ నిర్ణయానికి వచ్చింది. 1932న విడుదలైందంటూ కొన్ని ఆధారాలు చూపుతున్న పరిశోధకులు ఇంతకాలం మౌనంగా ఎందుకున్నారనేది ఆలోచించాల్సిన విషయం. ఎనిమిది దశాబ్ధాల ఉత్సావాన్ని సంబరంగా చేసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలోనే ఇవిగో సాక్ష్యాలంటూ హడావుడి చేయడం వెనుక ఉన్న వారి ఉద్దేశాన్ని తెలియజేస్తోంది. ఎనిమిది దశాబ్ధాలుగా నిజమని విశ్వసిస్తున్న తెలుగువారి నమ్మకాన్ని కాదని చెబుతున్నారు.
భక్త ప్రహ్లాద విడుదలైన తర్వాత సెన్సార్ జరిగి ఉండవచ్చు, లేదా దాసరి చెప్పినట్టు విజయవాడ, రాజమండ్రి తర్వాత మద్రాసులో రిలీజై
వుండవచ్చు కూడా. మన దేశంలో తక్కువ సంఖ్యలో అప్పట్లో టాకీచిత్రాలు (అంతకుముందు మూకీ చిత్రాలు వచ్చాయి) వస్తున్న సందర్భంలో సెన్సార్ శాఖ వేలసంఖ్య (11032)ను పొందు పరుస్తూ ఎందుకు సర్టిఫికెట్ జారీ చేసిందో మరి. ఏది ఏమైనప్పటికీ, విడుదల తేదీని పెద్ద వివాదం చేయడం సరికాదు. కొత్త తేదీ వెలుగులోకి రావడం వల్ల, అసలు తేదీ ఏదనే దానిపై పరిశోధన జరగాల్సిన అవసరం కనిపిస్తోంది. అయితే తేదీ ఏదనే విషయం ప్రధానం కాదు. ముందుగా అనుకున్నట్టుగానే సెప్టెంబర్ 15వ తేదీని తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకగా ప్రతి ఏడు ఘనంగా జరుపుకోవడానికి ప్రయత్నించాలి.
- పి. విజయబాబు,
ఎడిటర్
................................
0 వ్యాఖ్యలు:
Post a Comment