ఆమిర్ ఖాన్ నటించగా హిందీ చిత్రసీమలో సంచలనాత్మక విజయం సాధించిన ‘3 ఇడియట్స్’ తెలుగులోకీ, తమిళంలోకీ రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ‘రోబో’ ఫేమ్ శంకర్ దర్శకత్వంలో జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ నిర్మిస్తున్న ఈ రెండు భాషల రీమేక్ చిత్ర కథ ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. ఇప్పుడే అందిన తాజా వార్త... ఆ చిత్ర తమిళ రీమేక్ లో హీరో విజయ్ నటించడం లేదహో.....
నిజానికి, ఈ రీమేక్ చిత్రంలో తమిళంలో విజయ్, తెలుగులో మహేశ్ బాబు నటించాల్సి ఉంది. కానీ, సినిమా సెట్స్ మీదకు వెళ్ళక ముందే తమిళ హీరో విజయ్ కూ, దర్శకుడు శంకర్ కూ భేదాభిప్రాయాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. విగ్ విషయంలో ఇద్దరికీ ఏకాభిప్రాయం కుదరలేదని కూడా కోడంబాకమ్ కబురు. మొత్తం మీద ఈ చిత్రంలో విజయ్ ఉన్నాడనీ, లేడనీ రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ తమ సినిమాలో విజయ్ నటించడం లేదని తేల్చి చెప్పింది. కొద్దిసేపటి క్రితమే ఈ మేరకు అధికారిక ప్రకటన ఇచ్చింది. హీరో విజయ్, తాము ఎంతో సామరస్యపూర్వకంగానే విడిపోయామనీ, ఇప్పుడు 3 ఇడియట్స్ తమిళ రూపం కోసం మరో హీరోను వెతుకుతున్నామనీ తెలిపింది. అన్నట్లు మరో అగ్ర తమిళ హీరోను ఆ పాత్రలో నటింపజేసేందుకు నిశ్చయించుకున్నారు. ఆ నటుణ్ణి ఇప్పటికే సంప్రతించారు కూడా. సదరు అగ్ర హీరో నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే, అధికారికంగా ప్రకటన చేయనున్నారు. ఆ హీరో సూర్య అని కోడంబాకమ్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.
తమిళ రీమేక్ రూపం మాట అటుంచితే, తెలుగు రీమేక్ వ్యవహారం కూడా అంత సజావుగా సాగుతున్నట్లు లేదు. శ్రీను వైట్ల దర్శకత్వంలో తయారవుతున్న ‘దూకుడు’ చిత్రంతో బిజీగా ఉన్న హీరో మహేశ్ బాబు ఈ ‘3 ఇడియట్స్’ కు డేట్లు సర్దలేక సతమతమవుతున్నట్లు కృష్ణానగర్ కబురు. ఆయన ఏకంగా ఈ సినిమాకు గుడ్ బై చెప్పేశాడని కూడా అనధికారికంగా వార్తలు వస్తున్నాయి. ఆ సంగతేదో అధికారికంగా ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. అప్పటి దాకా మనకు సస్పెన్సే.
0 వ్యాఖ్యలు:
Post a Comment