స్థానిక ప్రభుత్వ, పోలీసు యంత్రాంగం కావాలని కళ్ళు మూసుకుంటూ ఉండడంతో, ఇవాళ అధికారికంగా సినిమా హాలు కౌంటర్ లోనే బ్లాకులో టికెట్లు అమ్మే విధానాలు ఆంధ్రదేశంలో ప్రతి అగ్ర హీరో సినిమాకూ నిత్యకృత్యమయ్యాయి. విడుదలైన సినిమాకు క్రేజు ఉన్నన్ని రోజులూ ఈ జంపింగ్ రేట్లు, ఫ్లాట్ రేట్ల విధానంలోనే టికెట్లు అమ్ముతున్నారు. అత్యధిక శాతం హాళ్ళ వారందరూ ఒక్కో టికెట్ రూ. 200 - 300 ఉండే 'జంపింగ్ రేట్ల' విధానాన్నే ఆశ్రయిస్తున్నారు. గత పోస్టులోనే చెప్పినట్లు - తెలుగు హీరోల చిత్రాలతో పాటు, తాజా అనువాద చిత్రం ‘రోబో’కు కూడా ఈ పద్ధతే యథేచ్ఛగా కొనసాగింది. ఆ నేపథ్యంలో ‘రోబో’ వసూళ్ళు తొలి వారం పది రోజులకు రికార్డుల మీద రికార్డులు సృష్టించాయి.
భారీ రికార్డుల్లో బలుపు కన్నా వాపే ఎక్కువ
అగ్ర హీరోల సగటు తెలుగు సినిమా కలెక్షన్లకు సంబంధించి ఓ ఆశ్చర్యకరమైన విషయం ఉంది. ఈ అడ్డగోలు టికెట్ రేట్లతో వస్తున్న తొలి వారం వసూళ్ళే ఆ సినిమాకు మొత్తం మీద వచ్చే కలెక్షన్లలో 60 నుంచి 70 శాతం! ఇది విస్మయం కలిగించే వాస్తవం. ఉదాహరణకు, చిన్న ఎన్టీయార్ నటించిన ‘అదుర్స్’ చిత్రం గుంటూరు జిల్లాలో ఆడిన అన్ని వారాలూ కలిపి మొత్తం రూ. 2.7 కోట్ల మేర వసూళ్ళు సాధించింది. అయితే, అందులో ఒక్క తొలి వారంలో వచ్చినవే రూ. 1.75 నుంచి 1.78 కోట్లు. దీన్నిబట్టి సగటు తెలుగు చిత్రాల మొదటి ఒకటి రెండు వారాల వసూళ్ళలో బలుపు కన్నా వాపే ఎక్కువని ఇట్టే గ్రహించవచ్చు.
ప్రేక్షకులను దోచేస్తున్న ఈ పద్ధతి వల్ల ఒకే ఒక్క ప్రయోజనం ఉంది. ఫ్లాపైన సినిమా కూడా భారీగా నష్టపోకుండా, మొదటి వారం రోజుల కలెక్షన్లతో కొంత మేర పెట్టుబడిని వెనక్కి రప్పించడానికే ఈ పద్ధతి ఉపయోగపడుతోంది. దాదాపు రూ. 35 కోట్ల పైగా ఖర్చుతో రూపొంది, టైటిల్ విషయంలో తెలంగాణ ప్రాంతంలో వివాదాస్పదమైన ఓ ప్రముఖ హీరో చిత్రం ఇటీవల పెద్ద ఫ్లాపైంది. అయినా సరే, రాష్ట్రంలో ఆ చిత్రానికి వచ్చిన నికర వసూళ్ళు దాదాపు రూ. 15 కోట్లు. లెక్క చూస్తే, అందులో సగం ఇలా అడ్డగోలు టికెట్లతో తొలి రోజుల్లో వచ్చిన అక్రమ సొమ్మే! ఈ అడ్డగోలు టికెట్ అమ్మకాలే లేకపోతే, ఆ సినిమా మరింత నష్టపోయేది. కౌంటర్‌లోనే అమ్మిన బ్లాక్ పుణ్యమా అని అంత పెద్ద ఫ్లాప్‌లో కూడా నష్టాన్ని కొంత పూడ్చుకోగలిగింది.
పారిపోతున్న ప్రేక్షకులు - పెరిగిపోతున్న పైరసీ
గతంలో కింది పట్నాల్లో ఇలాంటి వినాశకర ధోరణి ఉన్నా, నెల్లూరు లాంటి పెద్ద పట్నాల్లో అధికారుల నిఘాకు వెరచేవారు. మామూలు రేట్లకే టికెట్లు అమ్మేవారు. కానీ, ఇప్పుడు అక్కడ కూడా పరిస్థితి మారిపోయింది. అగ్ర హీరోల సినిమాను తొలి రోజుల్లో చూడాలంటే, అయిదుగురు సభ్యుల కుటుంబానికి కనీసం వెయ్యి రూపాయలు టికెట్లకే అవుతోంది! గుంటూరు జిల్లా సంగతే చూస్తే, అక్కడ సగటున ప్రతి పెద్ద సినిమా 22 ప్రింట్లతో విడుదలవుతుంది. ఇప్పుడు వాటిలో 21 ప్రింట్లు ఈ రకంగా అడ్డగోలు టికెట్ రేట్లతోనే ప్రదర్శితమవుతున్నాయి. ఈ రేట్ల దెబ్బతో - హాలుకొచ్చి సినిమా చూడాలంటే ప్రేక్షకుడు భయపడి పారిపోతున్నాడు. అదే సమయంలో సినిమా చూడాలనే కోరికను చంపుకోలేక, చౌకగా దొరికే పైరసీ సీడీలను అనివార్యంగా ఆశ్రయిస్తున్నాడు.
''ఇది చిత్రపరిశ్రమ స్వయంకృతాపరాధం. ప్రేక్షకులను దేవుళ్ళుగా పేర్కొంటూనే, ఎక్కువ రేట్లతో వాళ్ళను మేమే హింసిస్తున్నాం. వాళ్ళను అక్షరాలా దేవుళ్ళ లాగా చూసుకుంటేనే, వాళ్ళు ఒకటికి పదిసార్లు హాళ్ళలో సినిమా చూసి, వరాలిస్తారు. దీర్ఘకాలం పాటు పరిశ్రమను పరిరక్షిస్తారు. కానీ, అలా జరగడం లేదు'' అని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కార్యదర్శి టి. ప్రసన్నకుమార్ వాపోయారు. ''పరిస్థితి ఎలా ఉందంటే - ఇవాళ వేగంగా కోడిని కోసుకు తిందామని అనుకుంటున్నామే తప్ప, గుడ్లు పెట్టే దాకా ఆగడం లేదు. రోజుకో గుడ్డు తిందామని అనుకోవడం లేదు. అదే జరుగుతున్న పెద్ద తప్పు'' అని ఆయన ఆవేదనగా వ్యాఖ్యానించారు.
(ప్రభుత్వ ఖజానాకు జరుగుతున్న భారీ నష్టం కథా కమామిషు తరువాయి పోస్టులో...)
తోడుకునేవాళ్లకి తోడుకున్నంత
4 years ago
0 వ్యాఖ్యలు:
Post a Comment