జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Monday, December 6, 2010

నను వీడని నీడ - అయోధ్యఈ మధ్య అయోధ్య అంశంపై లక్నో ధర్మాసనం తీర్పు వెలువరించినప్పుడు నేనొక్కసారిగా గతంలోకి వెళ్ళా. మళ్ళీ ఇవాళ సరిగ్గా 18 ఏళ్ళ క్రితం అయోధ్యలోని వివాదాస్పద కట్టడం కూల్చివేతకు గురైనప్పటి సంగతులు జ్ఞాపకానికి వచ్చాయి. అది నేను పూర్తిస్థాయి జర్నలిజం ఉద్యోగంలో చేరిన తొలి రోజుల సంగతి. అత్యధిక సర్క్యులేషన్ ఉన్న తెలుగు దినపత్రిక ‘ఈనాడు’లో జర్నలిజమ్ పాఠాలు బూదరాజు రాధాకృష్ణ లాంటి పెద్దల వద్ద గురు ముఖతః నేర్చుకొని, పత్రిక సంపాదకవర్గంలో నేను, నా బ్యాచ్ మేట్లు అప్పుడే చేరాం.

మా బ్యాచ్ లో టాప్ లో నిలిచిన అయిదుగురిని జనరల్ డెస్కులో వేశారు. ఆ అయిదుగురిలో నేనూ ఒకడిని. జనరల్ డెస్కు అంటే పత్రికలోని మొదటి పేజీతో సహా ప్రధానమైన పేజీల్లో వచ్చే జాతీయ, అంతర్జాతీయ వార్తలను తెలుగు నుంచి ఇంగ్లీషులోకి అనువదించడం, శీర్షికలు పెట్టడం, మొదటి పేజీలో వచ్చే స్థానిక వార్తలను రిపోర్టర్లు తెలుగులో రాసిస్తే, దిద్ది, హెడ్డింగులు పెట్టడం వగైరా పనులు ఉంటాయి. ఎంత బాగా చదువుకున్నవాళ్ళమైనా సరే, మేము కొత్తగా పనిలోకి దిగినవాళ్ళం గనక మమ్మల్ని జర్నలిజమ్ పరిభాషలో చెప్పాలంటే ‘కబ్’ జర్నలిస్టులుగానే చూసేవారు. అచ్చతెలుగులో అర్థమయ్యేలా చెప్పాలంటే ‘పిల్లకాకులు’ అన్నమాట.

అప్పటికి ఆఫీసులో అత్యధిక శాతం మంది నేరుగా ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళే తప్ప, జర్నలిజం స్కూలులో ఓనమాలు దిద్దుకొని వచ్చినవాళ్ళు కాదు. దాంతో, కొండొకచో కొందరికి మా మీద కాస్తంత గుర్రుగా కూడా ఉండేది. మాకు ఏమీ రాదని నిరూపించాలని కూడా ఒకరిద్దరు సీనియర్లకు మహా పంతంగా ఉండేది. అలా ఎందుకు అనుకొనేవారో మాకు (కనీసం నాకు) అర్థమయ్యేది కాదు. ఇలాంటివన్నీ జర్నలిజమ్ రంగంలో సర్వసాధారణంగా ఉండే జాడ్యాలని ఆ తరువాతెప్పటికో కానీ మాకు తెలియలేదు.

నిజానికి, వారితో తగాదా పడాలనో, వాళ్ళ కన్నా మేమేదో ఊడబొడవగలమని చెప్పాలనో మాలో ఎవరికీ ఉండేది కాదు. పైగా, మాలో అందరికీ అదే తొలి ఉద్యోగం. నేనైతే అప్పుడే కాలేజ్ నుంచి, మా ఊరి నుంచి ఫ్రెష్ గా ఉద్యోగంలోకి వచ్చినవాణ్ణి. బయటి ప్రపంచం కూడా పెద్దగా తెలియదంటే నమ్మండి. (అఫ్ కోర్స్... ఇప్పటికీ నాకు తెలియదు లెండి. మా అన్నయ్యలు, అక్కయ్యలు ఆ మాటే పదే పదే చెబుతుంటారు. అది వేరే కథ).

అది 1992 డిసెంబర్ 6వ తేదీ. అప్పటికి మేము డెస్కులో చేరి నిండా రెండు నెలలైనట్లుంది. అంతే. రామజన్మభూమి - బాబ్రీ మసీదు వివాదం జోరుగా సాగుతోంది. ఆ రోజు ఉదయం నేను మా అద్దె గదిలో ఉన్నాను. ఇల్లుగలవాళ్ళ వాటాకు వెనకాలగా మా గది ఉండేది. అందులో నేను, ధన్వంతరి అనే ఇంకో మిత్రుడు ఉండేవాళ్ళం. మధ్యాహ్నం 12 గంటల సమయంలో మా ఇల్లు గల వాళ్ళ వాటాలోని టీవీ పెద్దగా వినిపిస్తోంది. అయోధ్యలో వివాదాస్పద కట్టడం మీద కరసేవకులు ఎక్కి ధ్వంసం చేస్తున్న దృశ్యాలను బి.బి.సి. ప్రసారం చేస్తోంది.

ఇల్లు గల వాళ్ళబ్బాయి చెప్పడంతో నేను హడావిడిగా వెళ్ళి, కాసేపు ఆ దృశ్యాలు టీవీలో చూశాను. జరుగుతున్న పరిణామాలు ఓ పెద్ద చరిత్ర కాబోతున్నాయన్న గ్రహింపు నాకు అప్పటికి ఏ మేరకు ఉందో చెప్పలేను కానీ, ఆ రోజుకు పేపర్లో అదే పతాక శీర్షిక అన్న సంగతి మాత్రం అర్థమైంది.

మధ్యాహ్నం మెస్ లో భోజనం చేసి, యథాప్రకారం సాయంత్రం డ్యూటీకి అటు నుంచి అటే వెళ్ళిపోయా. అప్పటికే టెలిప్రింటర్ మీద వివాదాస్పద కట్టడం విధ్వంసం వార్తలు కట్టలు కట్టలుగా వచ్చి పడ్డాయి. వివాదాస్పద కట్టడంలోని మూడు గుమ్మటాల్లో ఒక్కొక్కటి విధ్వంసాని గురై, సాయంత్రం 3.30 – 4 గంటల మధ్య ఆఖరి గుమ్మటం కూడా కూల్చివేతకు గురైందని తెలిసింది.

ఆ రోజు ఎందుకనో డ్యూటీలో ఒకే ఒక్క సీనియర్ మినహా మిగతా సీనియర్లు ఎవరూ లేరు. దాంతో, అనివార్యంగా, మా కుర్రకారుకు ఆశ్చర్యంగా, ఆనందంగా ఆనాటి బ్యానర్ వార్త రాసే అవకాశం మాకు దక్కింది.

వార్తలన్నీ రెండు నెలలైనా అనుభవం లేని మేము రాస్తే, ఉన్న ఒక్క సీనియర్ వాటిని సమన్వయం చేసుకుంటూ, సూపర్ లీడ్ వగైరా రాశారు. డ్యూటీలో అనుభవజ్ఞులు ఎవరూ లేకపోవడంతో చేరిన రెండు నెలలకే మొదటి పేజీలోని పతాక వార్త రాసే అవకాశం, అదృష్టం మాకు దక్కాయి. ఆ రోజున సమయానికి తగ్గట్లుగా చేతికి అందివచ్చి, నేను, మా బ్యాచ్ మేట్లు (సూరావజ్ఝల రాము, ఇసికేల ఉదయకుమార్, పమిడికాల్వ మధుసూదన్,వగైరా అని గుర్తు) బ్యానర్ రాయడం ఓ సంచలనమే అయింది.

అప్పట్లో బ్యానర్ రాయడమంటే పెద్ద ఎఛివ్ మెంట్. చేరిన ఎన్నో నెలలకూ, ఏళ్ళకు కానీ బ్యానర్ రాసే అవకాశం వచ్చేది కాదు, ఇచ్చేవారూ కాదు. అలాంటిది అయోధ్య అంశం మాకు అనుకోని అవకాశంగా పరిణమించి, మాలోని పనితనాన్ని సీనియర్లకు తెలిసేలా చేసింది. మరునాడు (అంటే, 1992 డిసెంబర్ 7) ఉదయం పొద్దున్నే పేపర్లో మా రాతలు మేమే బ్యానర్లో చూసుకొని, ఉద్విగ్నతకు గురయ్యాం.

వివాదాస్పద కట్టడం విధ్వంసం తాలూకు పరిణామాలు దేశ చరిత్రను ఎంతో ప్రభావితం చేయడమనేది తరువాతి చరిత్ర. ఇప్పుడు మొన్నీమధ్య అలహాబాద్ హైకోర్టుకు చెందిన లక్నో ధర్మాసనం అయోధ్య అంశంపై తీర్పు సందర్భంలో నాకు ఇవన్నీ మళ్ళీ జ్ఞాపకం వచ్చాయి. యాదృచ్ఛికంగా, ఇప్పుడు కూడా ఆ వార్తలు రాసి, పాఠకులతో పంచుకొనే అవకాశం నాకు వచ్చింది.

సుప్రీమ్ కోర్టు జోక్యంతో మొదట తీర్పు వాయిదా పడ్డ వారం, ఆఖరికి సెప్టెంబర్ 30న లక్నో ధర్మాసనం తీర్పు నిచ్చిన వారం - వరుసగా ఈ రెండు వారాలూ, ఈ రెండు సందర్భాల్లోనూ ‘ఇండియా టుడే’ తెలుగు వారపత్రిక ముఖచిత్ర కథనాలు నేను, నా సహోద్యోగి మరొకరు (ఒకవారం నేను, మూర్తి గారు, మరొకవారం నేను, ధూర్జటి గారు) కలసి తెలుగు చేసి, అందించాం. డైలీకి బ్యానర్ ఎలాగో, వీక్లీకి కవర్ స్టోరీ అలాగన్నది తెలిసిందేగా. ఉద్యోగానికి కొత్త అయిన అప్పుడూ, అనుభవం వచ్చిన ఇప్పుడూ - రెండు సార్లూ అయోధ్య అంశం కీలక వార్తలు యాదృచ్ఛికంగా నేనే రాయడం నా కెరీర్ లో ఓ చెరగని జ్ఞాపకం.

కొసమెరుపు -

అన్నట్లు అప్పట్లో జర్నలిజమ్ స్కూల్ లో చేరడానికి పరీక్ష రాయాలంటే, అప్లికేషన్ తో పాటు ఏదైనా సమకాలీన అంశం మీద ఓ వ్యాసం రాసి పంపాల్సి ఉండేది. ఆ వ్యాసం ఆధారంగా మన రచనా సామర్థ్యాన్ని అంచనా కట్టి, పరీక్షకు పిలిచేవారు. అందులో పాసైతే, ఆ పైన ఇంటర్వ్యూ. అక్కడా పాసైతే, అప్పుడు జర్నలిజమ్ స్కూల్లో అడ్మిషన్. అలా నేను 1991 చివరలోనో, 1992 జనవరిలోనో ‘ఈనాడు’ జర్నలిజమ్ స్కూల్ కు అప్లికేషన్ పెడుతూ, రాసిన మొదటి వ్యాసం కూడా అప్పటికే బర్నింగ్ టాపిక్ అయిన అయోధ్య మీదే.

అప్పుడే డిగ్రీ పూర్తి చేసి, బయటకొచ్చిన ఆవేశంలో అయోధ్యపై (‘ఆరని రావణకాష్ఠం అయోధ్య’ అన్న టైటిల్ తో అనుకుంటా) ఘాటుగా వ్యాసం రాసి, అప్లికేషన్ తో పంపా. అది చూసి పరీక్షకు పిలవడం, ఆ పై ఇంటర్వ్యూ, అడ్మిషన్, జర్నలిజమ్ లో ప్రవేశం - అన్నీ జరిగిపోయాయి. అలా జర్నలిజమ్ లోకి నా పూర్తి కాలిక ప్రవేశానికి కూడా అయోధ్యతో సంబంధం ఉంది. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఈ వృత్తిలో కొనసాగుతున్నా. మరి, అయోధ్యతో ఈ నా బంధం యాదృచ్ఛికమా? దైవ ఘటనా? జననాంతర సౌహృదమా, సంబంధమా? మరేదన్నానా!? ఏమో!? మీరేమంటారు!

(అయోధ్యలో నా ప్రత్యక్ష అనుభవం గురించి మరోరోజు... మరోసారి....)

3 వ్యాఖ్యలు:

Anil Atluri said...

You are at the right place at the right time అని అంటాను. :)

durgeswara said...

ఆలోచించండి మరి..ఇంకా లోతుగా..పరిశీలనగా..పరీక్షగా....

Unknown said...

ఇటువంటి గతాన్ని మళ్లీ మళ్లీ తలచుకొకూదదు జయదేవ గారు. ఇది కేవలం యాద్రుచ్చ్హికం. బాబ్రీ మసీదు కూల్చివేత అనేది మీడియా ఒక బూతద్దంలొ చూపించిన ఘటన. హిందువుల ఎన్నో గుడులను పత్రికలు, టీవీలు లేని రోజుల్లొ ముస్లిం పరిపాలకులు ధ్వంసం చేసారు. వాటి గురించి రాసేవాళ్లు, మాట్లాడేవాళ్లు ఎక్కడ? ఇది అంతా మయనారిటీ వోటు బ్యాంక్ రాజకీయం.