జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Thursday, December 16, 2010

సర్కారీ ఖజానాకు సినిమా దొంగల గండి

అధికారికంగా సినిమా హాలు కౌంటర్ లోనే బ్లాకులో టికెట్లు అమ్మేస్తున్న ఈ పద్ధతుల వల్ల ప్రభుత్వానికి కూడా భారీ నష్టం కలుగుతోంది. నిజానికి, తెలుగు సినిమా తనకు వచ్చే మొత్తం వసూళ్ళ (గ్రాస్‌)లో సగటున 15 శాతం దాకా వినోదపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే 'రోబో' లాంటి అనువాద, పరభాషా చిత్రాలకైతే ఆ పన్ను 20 శాతం దాకా ఉంటుంది. కానీ, చిత్ర ప్రదర్శకులు తాము నిజంగా అమ్మిన టికెట్ల సంఖ్య కానీ, వాటి అడ్డగోలు రేటు కానీ బయటపెట్టరు. తక్కువ టికెట్లే, అదీ మామూలు రేటుకే అమ్ముడైనట్లు చూపిస్తారు. అలా వీలైనంత తక్కువ వినోదపు పన్ను చెల్లిస్తారు. అంటే, అడ్డగోలు టికెట్‌ రేట్లతో ప్రేక్షకులకే కాక, ఆ రేట్ల లెక్కన వినోదపు పన్ను కట్టరు కాబట్టి ప్రభుత్వానికి కూడా చాలా నష్టమే!

ఉదాహరణకు, కేవలం 3 లక్షల చిల్లర జనాభాతో రాష్ట్రంలో కెల్లా అతి తక్కువ జనాభా ఉన్న నగరపాలక సంస్థ కడప. ఆ నగరంలో చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ్ 'మగధీర' (2009) చిత్రానికి రూ. 95 లక్షల దాకా నికర వసూళ్ళు (నెట్ కలెక్షన్స్) లభించాయి. ఇందులో తొలి వారం అడ్డగోలు టికెట్ రేట్లతో సంపాదించినదే రూ. 45 లక్షల దాకా ఉన్నట్లు భోగట్టా. అలాగే, కడపలోనే బాలకృష్ణ 'సింహా' (2010) చిత్రం రూ. 75 – 80 లక్షలు, రజనీకాంత్ - శంకర్ ల 'రోబో' చిత్రం రూ. 85 లక్షలు నికర వసూళ్ళు సాధించాయి. ఉన్న వాస్తవం చెప్పాలంటే, ఆ యా హాళ్ళలోని సీట్ల సంఖ్య, ప్రభుత్వం వారి అధికారిక టికెట్ రేట్ల ప్రకారమైతే - ఈ చిత్రాలు కనీసం రెండేళ్ళు హౌస్ ఫుల్ గా అడినా సరే రావడం అసాధ్యమైన నికర వసూళ్ళు ఇవి. ఇది ప్రేక్షకుల నుంచి చేసిన దోపిడీ అయితే, ప్రభుత్వ ఖజానాకు కూడా మరో దోపిడీ జరుగుతోంది. ఈ వచ్చిన కలెక్షన్లలో 20 నుంచి 25 శాతం మాత్రమే ప్రభుత్వానికి లెక్క చూపిస్తున్నారు. ఆ మేర మాత్రమే వినోదపు పన్ను కడుతున్నారు. మిగతాదంతా జేబులో వేసేసుకుంటున్నారు. ఇలా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టేస్తున్నారు.

దొంగలకు దొంగ

ఈ అడ్డగోలు టికెట్‌ రేట్ల విధానం ఓ విషవలయం. ఈ పద్ధతిలో వచ్చిన భారీ కలెక్షన్లను సాకుగా చూపెడుతూ, హీరోలు తమ మామూలు పారితోషికాలను సగటున మూడింతలు పెంచేశారు. నటీనటుల పారితోషికాలు, తద్వారా నిర్మాణ వ్యయం, వగైరా పెరిగాయి. ఫలితంగా, ఆ యా ప్రాంతాలకు సినిమాల అమ్మకాల రేట్లు మారిపోయాయి. అంతలేసి మొత్తాలిచ్చి కొన్నవారు పెట్టుబడిని వెనక్కి రాబట్టుకోవడం కోసం ఇలా మళ్ళీ అడ్డగోలు టికెట్ రేట్లనే ఆశ్రయిస్తున్నారు. వెరసి మొత్తం సినిమా వ్యాపారమే మారిపోయింది. పైరసీతో సహా అనేక రోగాలకు ఇదే మూలం. సినిమా చూడడాన్ని ప్రేక్షకుడికి భారంగా మార్చేయడం పరిశ్రమ వాళ్ళు చేస్తున్న తప్పు. అలా మొదటి తప్పును, అన్నిటికీ మూలమైన తప్పును సినిమా పరిశ్రమవాళ్ళే చేస్తూ, మళ్ళీ పైరసీ లాంటి అవతలివాళ్ళ తప్పుల గురించి గొంతు చించుకుంటున్నారు.

సమస్యలకు మూలమైన ఈ దోషాన్ని కనుక్కొని, దానికి సరైన మందివ్వాల్సింది పోయి, తాత్కాలిక ఉపశమనాల వైపు మన సినిమా పరిశ్రమ పరుగులు తీస్తోంది. ''ఇంతింత రేట్లు పెట్టి టికెట్లు అమ్మడం అన్యాయం, అక్రమం కాదా! పైరసీని తిడుతున్న వారికి దానికి మూలమైన తాము చేస్తున్న ఈ తప్పు గురించి తెలియదా! ఇది ఎలా ఉందంటే - (టికెట్లను అడ్డగోలు రేట్లకు అమ్ముతున్న) ఒక దొంగ, (పైరసీ చేస్తున్న) మరొక దొంగను చూపెడుతూ, 'దొంగ... దొంగ...' అని అరుస్తున్నట్లుంది'' అని తొలితరం సినీ పాత్రికేయుల్లో ఒకరైన మద్దాలి సత్యనారాయణ శర్మ విమర్శించారు.

పత్రికల వారి పరోక్ష పాపం

అసలు, ఈ పాపంలో సమాచార ప్రసార సాధనాలకూ పరోక్షంగా పాత్ర ఉందంటున్నారు - తెలుగు సినీ రంగ వ్యాపార, పబ్లిసిటీ ధోరణులను 60 ఏళ్ళ పైగా నిశితంగా పరిశీలిస్తున్న సీనియర్‌ సినీ విశ్లేషకులు కాట్రగడ్డ నరసయ్య. ''ఇవాళ దినపత్రికల్లోని సినిమా కాలమ్స్‌లో ఎంతసేపటికీ చిత్ర నిర్మాణ వార్తలు, గ్లామర్‌ వార్తలే ప్రచురిస్తున్నారు. ఎలక్ట్రానిక్‌ మీడియా కూడా అందచందాల ప్రదర్శనలోనే పడి కొట్టుకుపోతోంది. చిత్ర పరిశ్రమలోని సమస్యలు, వర్తమానంలో ఎదురవుతున్న సంక్షోభాల గురించి రావడమే లేదు. దీని ఫలితం చాలా తీవ్రంగా ఉంటోంది'' అని నరసయ్య వాపోయారు. చిత్ర నిర్మాణ వార్తలతో పాటు పంపిణీ, ప్రదర్శక రంగాలతో కూడిన చిత్ర మార్కెటింగ్‌ వ్యవహారాల వార్తలు, విశ్లేషణలు కూడా విరివిగా మీడియాలో రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటి విశ్లేషణాత్మక కథనాల వల్ల మేడిపండు లాంటి చిత్ర పరిశ్రమ లోలోపలి సమస్యలు నలుగురి దృష్టికీ వస్తాయి. పరిష్కారం దిశగా ప్రయత్నాలూ జరుగుతాయి.

మరి, గడచిన వారం నుంచి రానున్న సంక్రాంతి వరకు ఎన్నో క్రేజీ చిత్రాలు విడుదలవుతున్నాయి. పైరసీ గురించి, ఆ దోపిడీ - దొంగ సొమ్ముల గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలిస్తున్న పెద్ద హీరోలు, దర్శకులు, నిర్మాతలు తమ చిత్రాల టికెట్‌ రేట్ల ద్వారా చేస్తున్న దోపిడీని ఆపేస్తారా? ముందుగా ప్రేక్షకులనూ, ఆ తరువాత వినోదపు పన్ను తక్కువ చెల్లింపుతో ప్రభుత్వాన్నీ నిస్సిగ్గుగా దోచేస్తూ ఆర్జిస్తున్న దొంగ సొమ్మును వదిలేస్తారా? అన్నీ తెలిసినా, ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్న మన ప్రభుత్వాధికారులు, పాలకులు కళ్ళు తెరుస్తారా? సామాన్యులు అడుగుతున్న ఈ ప్రశ్నలకు బదులేది!?

2 వ్యాఖ్యలు:

Kathi Mahesh Kumar said...

నిజమే...పరిశ్రమ అసలు వ్యవస్థాగత సంస్కరణలు వదిలేసి కొసరు విషయాల్ని ఎమోషనలైజ్ చేస్తున్నారుగానీ...మీరన్నట్లు దొంగలే...ఏంచేద్దాం ప్రేక్షకుల ఖర్మ.

RAKSINGAR said...

ఎక్కడో రాష్త్రం కాని రాష్త్రం లొ ఉంటున్నాము.. ఆరెంజ్ సినిమా కి వెల్దామని టిక్కెట్ రేట్ లు చూస్తే చుక్కలు కనిపించాయి (200 రూపాయలు). ఇంక ఏం చేస్తాం లే అని ఇంటికెల్లి డౌన్లోడ్ చేస్కున్నా...