ఎవరు మాసు? ఎవరు క్లాసు? ఇది చాలా చిత్రమైన ప్రశ్న. చిక్కుప్రశ్న. జవాబు తెలుసని అనిపిస్తూనే, చెప్పాలంటే ఇబ్బందిగా మారే అంశం. బృందావనం - ఈ గోవిందుడు 'ఎందరి' వాడోలే... అన్న నా టపాపై కొత్త పాళీ గారు పెద్ద చర్చకే తెర తీశారనిపించింది. దీనికి జవాబు మీకు తెలియనిదని నేను అనుకోను. నాకు పూర్తిగా తెలుసని చెప్పడానికి ధైర్యం చేయను. అయితే, ఇటీవల నేను రాసిన బృందావనం... చిత్రంపై సమీక్ష వరకు పరిమితమై నాకు తోచిన వివరణ ఇవ్వదలిచాను.
చెప్పాలంటే - ఒక్కో నటుడికి / హీరోకు ఒక్కో వర్గం ప్రేక్షకులలో అభిమానం, ఆదరణ ఎక్కువ ఉండడం చిత్ర సీమలోని లక్షణం. అయితే, ప్రతి వర్గమూ దానికదే ప్రత్యేక ఉనికితో కూడినదని కానీ, మరొక వర్గం ప్రేక్షకులతో ఎక్కడా ఉమ్మడి లక్షణాలు లేనిదని కానీ చెప్పలేం. అలాగే, అన్ని వర్గాలనూ, అన్ని వేళలా, అన్ని సినిమాల్లో ఆకట్టుకొనే నటుడు, నటన ఉంటాయని అనుకోలేం.
మార్కెట్ లో ఉన్న విశ్లేషణను బట్టి చెప్పాలంటే - చిన్న ఎన్టీయార్ మాస్ హీరో. మొదటి నుంచి అతని సినిమాలకు ఉన్న ఓ నిర్దిష్ట ప్రేక్షక వర్గాన్ని ఉద్దేశించి చేసిన ఉరామరిక వర్గీకరణ అది. అతని సినిమాలు సామాన్య ప్రేక్షక జనాన్ని ఉద్దేశించి, ఎక్కువగా సాగుతాయన్నది ఆ అంచనా. తదనుగుణంగానే, ఎక్కువ భాగం అతని సినిమాలకు వారే మహారాజ పోషకులు. సింహాద్రి, ఆది, నా అల్లుడు, ఆంధ్రావాలా, యమదొంగ, అదుర్స్ లాంటి ఆయన చిత్రాల సరళి, వాటిలోని అంశాలు గమనిస్తే - ఆ మాటలోని అంతరార్థమేమిటో గ్రహించవచ్చు.
అది రచన అయినా, సినిమా అయినా, మరొకటైనా సరే - ప్రతి సృజనకూ దానికంటూ ఓ లక్షిత పాఠక వర్గం / వీక్షక వర్గం ఉంటుంది. అయితే, ఆ లక్షిత వర్గాన్ని అవి రంజింపజేస్తాయా లేదా అన్నది వేరే అంశం. ఇప్పటి వరకు చిన్న ఎన్టీయార్ చిత్రాలన్నీ ప్రధానంగా పైన చెప్పిన సామాన్య ప్రేక్షక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని తీసేవే.
అయితే, చిత్రాల మార్కెట్ ను విస్తరించుకోవాలన్నా, వాటికి వసూళ్ళు పెంచుకోవాలన్నా, నటుడిగా చిరకాలం నిలబడాలన్నా - ఉన్న అభిమాన ప్రేక్షక వర్గ పునాదిని నిలుపుకొంటూనే, కొత్త వర్గాలను కూడా తన చిత్రాలకు వీక్షకులుగా మార్చుకోవాలి. స్టార్ హీరోలు అయిన వారు, అవుదామని ప్రయత్నించేవారు అనివార్యంగా చేసే ప్రయత్నం ఇదే. పైగా, ఎప్పుడూ ఒకే వర్గ ప్రేక్షకులను ఆకర్షించే చిత్రాలు చేసి, చేసీ, హీరోలకూ మొహం మొత్తడం మొదలవుతుంది. ఆ పరిస్థితుల్లో కొత్త వర్గాన్ని ఆకర్షించేలా ఇమేజ్ మార్పునకు హీరో ప్రయత్నిస్తాడు.
ఎన్.టి.ఆర్. జూనియర్ తాజాగా బృందావనం చిత్రంలో చేసిన పని అదే. పోరాటాలు నిండిన యాక్షన్ పాత్రలతో, నృత్యాలతో తాను అభిమానులుగా సంపాదించుకున్న ప్రధానమైన సామాన్య ప్రేక్షక వర్గానికి తోడుగా, కుటుంబ ప్రేక్షకులనూ, ఎగువ తరగతి ప్రేక్షక వర్గాలనూ కూడా మరింత ఎక్కువగా ఆకర్షించాలనీ, ఆ రకం కథలు, పాత్రలు ఎంచుకోవాలనీ అతను నిర్ణయించుకున్నట్లు కనిపిస్తుంది. కెరీర్ పురోగమనంలో అది అతనికి తప్ప లేదు. అందులో తప్పూ లేదు. అందుకే, బృందావనం కథ, అతని రూపురేఖలు ఈ ఆశించిన కొత్త మార్పునకు తగ్గట్లు ఉన్నాయి. దీన్నే ముతకగా సినిమా పరిభాషలో మాస్ నుంచి క్లాస్ హీరోగా ఇమేజ్ మార్చుకోవడం అంటున్నాం. (అఫ్ కోర్స్, మళ్ళీ తనకున్న సామాన్య అభిమాన వర్గం పునాదిని కోల్పోకుండా ఉండడం కోసం ఇదే సినిమాలో ఎన్.టి.ఆర్. జూనియర్ యాక్షన్ తరహా చిత్రాల ఫైట్లూ ఎక్కువే చేశారు. అది వేరే సంగతి).
అయితే, ఇక్కడే ఓ చిక్కొస్తుంది. ఒకప్పుడు తెలుగు సినిమాకు రోజు కూలీ శ్రామికుడు రాజ పోషకుడు. మహిళలు మహారాజ పోషకులు. మాయ చేసి, జోల పాడే సినిమా అప్పట్లో సమస్యల నుంచి మధ్యతరగతి జనం ఎస్కేపిజానికి మార్గం. ఈ వర్గాలన్నిటికీ సినిమా తప్పనిసరి వినోదం. ఇలాంటి విస్తృత జనబాహుళ్యాన్ని మెప్పించడమే ధ్యేయంగా మన సినిమా నడిచింది.
టీవీ చానళ్ళ ప్రభంజనం మొదలయ్యాక, హాళ్లలో టికెట్ రేట్లు అందీ అందకుండా పోయాక, ఇవాళ హాలుకు వచ్చే ప్రేక్షక వర్గాలు, వారి అభిరుచులు మారిపోయాయన్నది నిష్ఠుర సత్యం. ఈ పరిస్థితుల్లో, సినిమాను వ్యాపారంగానే చూస్తున్న ప్రస్తుత తరుణంలో మన సినిమాలన్నీ ప్రధానంగా యువతరాన్నీ, కాలేజీ కుర్రకారునూ (తెలుగునాట వాళ్ళే ఇవాళ ఎక్కువగా సినిమాలకు వస్తున్నారన్నది ఓ థీరీ) దృష్టిలో పెట్టుకొని వస్తున్నాయి. తరచూ సినిమాలకొచ్చే శ్రామిక వర్గం, ఈ యువజన వర్గాలే ఇవాళ తెలుగు సినిమాకు పోషకులు. కాబట్టి అదే నేటి సామాన్య ప్రేక్షక వర్గం.
ఇక, ఒకప్పుడు సినిమాలు చూసినా ఇప్పుడు ఆ జోరు తగ్గించేసిన పెద్దలు, నడి వయసు దాటిన మహిళలు, సకుటుంబ ప్రేక్షకులు - వీరంతా అదనపు వర్గాలు. అరుదుగానో, అప్పుడప్పుడో, తమను ఆనందింపజేసే కథ తెరపై వచ్చినప్పుడో మాత్రమే హాళ్ళకు కదిలే ఈ వర్గాన్నే సినిమా ట్రేడ్ వర్గాలు క్లాస్ అంటున్నారు. ఈ వర్గీకరణలు ఏ మేరకు నిర్దుష్టమైనవన్నది పెద్ద చర్చే. కానీ, ఈ పరిభాషను తప్పించుకొంటూ, సినిమాలను సమీక్ష చేయడం అసాధ్యం కాకపోవచ్చు. అలాగని ఈ నేపథ్యాన్ని పూర్తిగా విస్మరిస్తూ, విశ్లేషణకు దిగడం మాత్రం ఆచరణలో, అనుభవంలో అవివేకమయ్యే ప్రమాదం ఉంది.
తోడుకునేవాళ్లకి తోడుకున్నంత
4 years ago
8 వ్యాఖ్యలు:
నా మాట చాదస్తమని కొట్టిపారెయ్యకుండా విపులంగా చర్చించబూనుకున్నందుకు ముందస్తు ధన్యవాదాలు. కామెంటయితే వేసేశానుగానీ, ఈ విషయమై నా మనసులోనూ ఆలోచనలు గజిబిజిగా ఎగురుతున్నై. క్షుణ్ణంగా చదివి, తీరిగ్గా ఆలోచించి మళ్ళీ వస్తాను.
all about movies. I liked it. keep it up. నిష్పాతంగా సినిమాలపై అభిప్రాయలు తెలియజేయండి.
ఏ హీరో కూడా అటు క్లాసు,ఇటు మాస్ లు కాదు.అంతా "కాస్స్"ళ హీరోలే..
మార్కెట్ విశ్లేషణ లేకుండా, మార్కెట్ విశేషణాలను ఉటంకించకుండా సమీక్ష రాయడం కుదరని పని. ఆ నిర్వచనాలని మనం ఎంత debatable అనుకున్నా, ఉన్నాయి కాబట్టి ఆ భాషలో రాయక తప్పదు. :)
క్లాసు మాసు అనే తేడా యెప్పుడొ చెరిగి పొయింది. ఇప్పుడు ఉన్నదంతా మాసే. హీరొఇన్ లకు లేని క్లాసు వర్గికరణ హీరొ లకు యెందుకండి? వెనకటికి జయమాలిని, జ్యొతిలక్ష్మి వేసే డ్యాన్సులు ఇప్పుడు హీరొఇన్లు గుడ్డల్ విప్పుకొని మరీ వేస్తున్నారు. హీరొ డయలోగ్లు నుండి డ్యాన్సులు వరకు అంతా మాసే. క్లాసు సినీమాలొ కూడ, హేరొ 'తొక్కా' అనే పదాన్ని అతి తేలికగ వాడుకలోకి తీసుకువచ్హారు. ఎంటే, ఎంటిరా అని పలకరించుకునే స్థితికి తెలుగు సినిమా దిగజారింది.
అద్భుతమయిన చర్చ.
చాలా వరకు బాగానే రాసారు. మీరు చెప్పినట్టే జూ మాస్ ఇమేజ్ నుండి బయట పడడానికి చేసిన ప్రయత్నం ఈ సినిమా.
మాస్, క్లాస్ అన్న వర్గాలు కూడా కాలానుగుణంగా మారుతూ వచ్చాయి. ఇంకొంచెం వివరణ ఇచ్చుంటే సందేహాలు తీరేవనుకుంటా.
నాకున్న రేండం ఆలోచనలు కొన్ని:
క్లాసు మాసు ఏమీ లేదు. ఉన్నవల్లా - మంచి సినిమా, చెత్త సినిమా, పర్లేదనిపించే సినిమా.
క్లాసు మాసు అనేది జాన్ర కాదు, సైఫై, హారర్, క్రైం లాగా.
మీరు రాసిన విశ్లేషణ (చాలా బాగుంది, ఒప్పేసుకోవాలని కూడా అనిపించింది), పక్కన వినబడుతున్న అభిప్రాయాలు సాధారణంగా ఇటువంటి విషయాల్ని చర్చించే వర్గాల్లో అంతే సాధారణంగా వినబడుతుండే "టాక్" తప్ప వేరు కాదు. అందులో సవ్యమైన డేటా గానీ, డేటాని ఒక పద్ధతిగా తరచి చూడ్డం గానీ లేదు.
ట్రేడ్ జర్నల్స్‌లోనూ, మామూలు వార్తా పత్రికల్లోనూ ఇటువంటి పడికట్టు మాటలు వాడుతూ పడికట్టు రాతలు రాశారంటే సరే. కానీ బ్లాగు మనకోసం మనం రాసుకునేది గద! కనీసం అందులోనైనా విషయాల్ని "మన" దృష్టితో చూడచ్చు కద!
ఇవి రేండం ఆలోచనలే. ఇందులో నేను జయదేవ్ గారినిగాని మరెవరినిగానీ, ఆయా సినిమాల్ని గానీ తప్పు పట్టడం లేదు. కనీసం మనలో మనం సినిమాల గురించి మాట్లాడుకునేప్పుడు మన భాష, తద్వారా మన ఆలోచన కొద్దిగానైనా రొడ్డుకొట్టుడి నించి ఎడంగా జరగాలని - ఇదొక్కటే ప్రస్తుతానికి నా గొడవ.
ఐనా ఇది అప్పుడే వొదిలి పెట్టేసే అంశం కాదు.
సమకాలీన తెలుగు సినిమాని నాకంటే సన్నిహితంగా తెలిసిన మిత్రులకి కొన్ని ప్రశ్నలు.
2009-2010 లో విడుదలైన సినిమాల్లో
అచ్చ "మాస్" సినిమాలు రెండు చెప్పండి.
అలాగే అచ్చ "క్లాస్" సినిమాలు రెండు చెప్పండి.
మీ దృష్టిలో ప్రస్తుతం విరివిగా నటిస్తున్న హీరోల్లో
అచ్చ క్లాస్ హీరో ఎవరు?
అచ్చ మాస్ హీరో ఎవరు?
ఈ సమాధానాల్ని బట్టి నేను మళ్ళీ వస్తా.
జయదేవగారు, నా పొడిగింపు ఇక్కడ.
Post a Comment