జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, October 16, 2010

‘బృందావనం’: ఈ గోవిందుడు ‘ఎందరి’ వాడోలే...?!

ఒక ఇమేజ్ ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్న పెద్ద హీరోను మరో ఇమేజ్ వైపు మరలించడం అంత సులభం కాదు. ఆ మార్పునకు అభిమాన ప్రేక్షక జనంతో అవుననిపించుకోవాలంటే చాలా శ్రమే పడాలి. మంచి కథ, ఆసక్తి కరమైన కథనం, ఆర్టిస్టుల అభినయ ప్రతిభ, ఆహ్లాదకరమైన సంగీతం - అన్నీ కావాలి. అవన్నీ ఆశించిన స్థాయిలో కుదరకపోతే కష్టమే. మాస్ హీరోగా ముద్ర పడిన చిన్న ఎన్టీయార్ ను, మంచి లవర్ బాయ్ గా చూపి, క్లాస్ కు దగ్గర చేయాలనే ప్రయత్నంగా ‘బృందావనం’ చిత్రాన్ని చెప్పుకోవచ్చు. కానీ, ఆ ప్రయత్నం ఉడికీ ఉడకని అన్నంగా తయారవడమే విషాదం.

వేల కోట్ల రూపాయల కూడిన కృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు అధినేత సురేంద్ర (ముఖేశ్ ఋషి). అతనికి ఏకైక సంతానం కృష్ణ అలియాస్ క్రిష్ (ఎన్టీయార్ జూనియర్). ప్రాణాలకు తెగించి అయినా సరే, స్నేహితుడి ప్రేమను సఫలం చేసే రకం. ఏ సమస్యా లేకుండా హాయిగా కాలం గడిపేస్తున్న హీరో, కాలేజీలో ఇందు (‘ఏ మాయ చేశావే’ చిత్ర ఫేమ్ సమంత)ను ప్రేమిస్తాడు. ఆ అమ్మాయిని తెచ్చి, ఇంట్లో అమ్మా నాన్నకు పరిచయం కూడా చేస్తాడు.

స్నేహితురాలి సమస్యకు పరిష్కారం కోసం హీరోను ఇందు ఆశ్రయిస్తుంది. ఇందు స్నేహితురాలు భూమి (కాజల్ అగర్వాల్). ఆమెకు విదేశాల్లో పై చదువులు చదవాలని ఉంటుంది. కానీ, ఆమె నాన్న (ప్రకాశ్ రాజ్) మాత్రం తన అక్క కొడుకు (అజయ్)కు ఆమెను ఇచ్చి పెళ్ళి చేసేయాలని నిర్ణయిస్తాడు. ఆ పెళ్ళి తప్పించుకోవడం కోసం తాను ఇప్పటికే ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నట్లు భూమి తమ ఇంట్లో అబద్ధం చెబుతుంది. ఆ అబ్బాయిని తీసుకురమ్మంటాడు ఆమె తండ్రి. లేని బాయ్ ఫ్రెండ్ ను ఎక్కడ నుంచి తేవడమా అని భూమి ఇబ్బంది పడుతుంటుంది. భూమితో పాటు వాళ్ళ ఊరుకి వెళ్ళి, బాయ్ ఫ్రెండ్ గా నటించి, ఆ గండం నుంచి ఆమెను గట్టెక్కించాల్సిందిగా హీరోను ఒప్పిస్తుంది ఇందు.

భూమికి బాయ్ ఫ్రెండ్ గా నటిస్తూ, ఆమెతో పాటు ఊరెళ్ళిన హీరో ఆ పెద్ద కుటుంబంలో అందరి అభిమానాన్నీ సంపాదిస్తాడు. బద్ధశత్రువులుగా వేరు వేరు ఊళ్ళలో బతుకుతున్న భూమి తండ్రి (ప్రకాశ్ రాజ్)నీ, బాబాయ్ (శ్రీహరి)నీ కూడా కలుపుతాడు. భూమిని ఏకంగా హీరోకే ఇచ్చి పెళ్ళి చేసేయాలన్న దాకా కథ వెళుతుంది. అప్పటి దాకా బాయ్ ఫ్రెండ్ గా నటిస్తున్న హీరో ఒక్కసారి ఉలిక్కిపడతాడు. అదే సమయంలో పట్నం నుంచి ఇందు కూడా ఆ ఊరికి, ఆ ఇంటికి వస్తుంది. దాంతో కథ రసకందాయంలో పడుతుంది. గోవిందుడు ఏమవుతాడో... అంటూ ఫస్టాఫ్ ముగుస్తుంది.

పట్నం నుంచి వచ్చిన ఇందుకూ, ఆ ఇంటికీ సంబంధం ఏమిటి, ఈ దొంగ బాయ్ ఫ్రెండ్ నాటకం ఏమైంది, భూమిని పెళ్ళాడాలని తపిస్తున్న విలన్ బావ సంగతి ఏమైంది, ఇద్దరు భామల మధ్యన నలిగిన హీరో చివరకు ఏం చేశాడు - లాంటి ప్రశ్నలకు జవాబులన్నీ సెకండాఫ్ లో చూడవచ్చు.

(మిగతా భాగం మరి కాసేపట్లో...)

2 వ్యాఖ్యలు:

కొత్త పాళీ said...

"మాస్ హీరోగా ముద్ర పడిన చిన్న ఎన్టీయార్ ను, మంచి లవర్ బాయ్ గా చూపి, క్లాస్ కు దగ్గర చేయాలనే.."
ఏంటి సార్ మీరుకూడా ఈ క్లాసు - మాసు .. అంటూ వర్గీకరణలు?
ఈ రెండు మాటలు లేకుండా ఒక సాధారణ తెలుగు సినిమా సమీక్ష రాయలేమా?
తెలివైన వీక్షకులు, సమీక్షకులు కూడా ఈ వర్గీకరణలని అంగీకరిస్తూ ఆమోదిస్తూ ఉండడం కూడా ఒక కారణం మన చిత్రరాజాలు మరి పైకి లేవలేనంతగా ఆయా గాళ్ళలో కూరుకుపోయి.

Unknown said...

@ కొత్త పాళీ గారూ, నమస్కారం. ఆలోచింపజేసే మీ వ్యాఖ్యకు ముందుగా కృతజ్ఞతలు. మీరు అడిగిన ప్రశ్న చాలా విలువైనది. లోతైనది. దీనికి జవాబుగా పోస్టే రాస్తున్నాను. అవధరించండి.