జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Sunday, October 3, 2010

‘రోబో’: విజువల్స్ సరే...! విషయం మాటేమిటి...?!


సినిమా అంటే కొద్ది గంటల పాటు ఓ చీకటి గదిలో కళ్ళ ముందు కదిలే జీవితం. మనం కూడా అందులో భాగమనిపించేలా భ్రమ పెట్టే (కొన్నిసార్లు భయపెట్టే) మాయ. అలాంటి మాయా లోక విహారంలో వాస్తవం పాలు ఎంత, కల్పన పాలు ఎంత అన్న విచికిత్స ఒక్కోసారి ఎంత అవసరమో, అంత అనవసరం కూడా.

తీస్తున్నదీ, తెరపై చూస్తున్నదీ మాయలు, మంత్రాల కథో, ఆధునిక సైన్స్ - ఫిక్షనో అయినప్పుడు ఇక తర్కాలు, వాస్తవాలు, సంభావ్యతల కన్నా ఏ మేరకు సంభ్రమానికి గురయ్యామన్నదే కీలకమై కూర్చుంటుంది. రజనీకాంత్ హీరోగా, దర్శకుడు ఎస్. శంకర్ రూపొందించిన ‘రోబో’ (తమిళంలో ‘యంతిరన్’) సరిగ్గా అదే కోవకు చెందిన సినిమా. నిన్న ప్రపంచవ్యాప్తంగా వేల కొద్దీ థియేటర్లలో, ఆ స్థాయిలోనే ప్రింట్లతో, వందల కొద్దీ షోలతో విడుదలై, సంచలనం రేపిన (రేపుతూనే ఉన్న) ‘రోబో’ అనేకులతో ‘అమ్మో’ అనిపించడానికి కారణం అదే. కానీ, అదే సమయంలో సినిమా మొత్తం చూశాక, సాంకేతిక నైపుణ్యం, విజువల్స్ సరే కానీ, కథ, పాత్రల లోతుపాతులేమిటని ఆలోచిస్తే మాత్రం - పెళ్ళి విందుకని పిలిచి, మంచి మండపంలో మెస్ భోజనం పెట్టించినట్లుంది.

కథాక్రమంబెట్టిదనిన....

కథగా చెప్పాలంటే - డాక్టర్ వశీకర (రజనీకాంత్) ఓ మంచి శాస్త్రవేత్త. ఎంతో కష్టపడి అచ్చం తన లాగే ఉండే ఓ యాండ్రో - హ్యూమనాయిడ్ రోబోను తయారుచేస్తాడు. చెప్పిన పనల్లా చేయడమే కాక, బోలెడంత సమాచారాన్ని నిల్వ చేసుకోగల రోబో అది. ఎన్నో భాషలు, కళలు కూడా వచ్చిన ఈ మర మనిషికి చిట్టి (రెండో రజనీకాంత్) అని పేరు పెడతాడు హీరో. వంద మంది తెలివితేటలతో, సామర్థ్యంతో, శతయోధులకు సమానంగా సిద్ధం చేసిన ఈ రోబోను సైన్యానికి అప్పగించి, దేశభక్తిని చాటుకోవాలని ఆ సైంటిస్ట్ హీరో ఆలోచన.

ఈ పనుల్లో పడి ప్రేమించిన వైద్యవిద్యార్థిని సనా (ఐశ్వర్యారాయ్ బచ్చన్)ను కూడా కొంత అలక్ష్యం చేస్తాడు. అన్ని విధాలా తయారైన రోబోను శాస్త్రవేత్తల సదస్సులో నిలబెట్టి, ప్రశంసలు పొందుతాడు. అయితే, అదే సదస్సుకు హాజరైన వశీకర గురువు ప్రొఫెసర్ బోరా (డేనీ డెన్ జొప్ప)కు ఇది కంటగింపుగా మారుతుంది. అచ్చం మనిషిలా ప్రవర్తించే అలాంటి రోబోను తయారు చేయాలని అప్పటికే అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్న బోరా, పైకి కనిపించనంతటి ద్వేషాన్ని వశీకర మీద పెంచుకుంటాడు.

రోబో చిట్టి చేసే విన్యాసాలు, కథానాయికను ఆదుకొనే సంఘటనలతో సినిమా మరికాసేపు గడుస్తుంది. రోబోను సైన్యానికి అప్పగించేందుకు అనుమతి కోసం శాస్త్రవేత్తల ముందు పరీక్షకు పెడతాడు సైంటిస్ట్ వశీకర. కానీ, అక్కడ మనిషి లాగా విచక్షణనూ, స్పందననూ ఉపయోగించలేని, ‘తన - పర’తేడా తెలియని వట్టి మరమనిషి అంటూ రోబోను ఫెయిల్ చేస్తాడు - ప్రొఫెసర్ బోరా. బయటి ప్రపంచంలోకి ఆ రోబోను పంపితే ప్రమాదమనేస్తాడు. మరొక్క అవకాశం ఇవ్వమంటాడు హీరో.

ఓ సవాలుగా తీసుకొని, రోబో చిట్టికి కోపం, ప్రేమ, సంతోషం లాంటి మనుషుల భావావేశాలనూ, స్పందనలనూ కష్టపడి ప్రోగ్రామ్ చేస్తాడు. ప్రాణాపాయ స్థితిలో పడ్డ ఓ గర్భిణికి హీరోయిన్ తో కలసి మామూలు ప్రసవం చేసి, రోబో చిట్టి చరిత్ర సృష్టిస్తాడు. ముద్దిచ్చి, అభినందించిన హీరోయిన్ ను మానవ స్పందనలున్న రోబో చిట్టి నిజంగానే ప్రేమించడం మొదలుపెడతాడు. అక్కడికి సినిమా ఫస్టాఫ్ పూర్తవుతుంది.

రోబో చిట్టిలో పెరిగిన ఈ ప్రేమ తరహా ప్రకృతి సహజమైన స్పందనలు హీరో, హీరోయిన్లకు తలనొప్పిగా తయారవుతాయి. ప్రకృతి విరుద్ధమైన ఆ ప్రేమను మర్చిపొమ్మని వాళ్ళు రోబోకు నచ్చజెబుతారు. కానీ, ఆ మాటలతో రోబో చిట్టి సమాధానపడడు. మరోపక్క విధ్వంసకరమైన వంద రోబోలను తయారుచేసి ఇవ్వడానికి విదేశీ అక్రమ ఆయుధ వ్యాపారులతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రొఫెసర్ బోరా ఆ పని పూర్తి చేయలేక సతమతమవుతుంటాడు. రోబో చిట్టిలోని బాధను ఆసరాగా చేసుకొని, హీరో మీద అతని మనసు విరిచేస్తాడు బోరా.

దాంతో, మరునాడు ఆర్మీ టెస్టులో రోబో చిట్టి కావాలనే ప్రేమపాఠాలు వల్లిస్తూ, ఫెయిలవుతాడు. కొన్నేళ్ళ శ్రమ బూడిదలో పోసిన పన్నీరైనందుకు హీరో కోపం కట్టలు తెచ్చుకుంటుంది. బతకాలని ఉందని రోబో బతిమాలుతున్నా వినకుండా, ముక్కలు ముక్కలు చేసి, చెత్తకుండీలో పారేయిస్తాడు. అన్నేళ్ళ ప్రయోగం విఫలమైందని బాధపడతాడు.

అప్పటికే హీరో మీద అక్కసుతో ఉన్న అతని అసిస్టెంట్ల (సంతానం, కరుణాస్) సహాయంతో ఆ రోబోకు మళ్ళీ జీవం పోస్తాడు ప్రొఫెసర్ బోరా. ప్రేమ కోసం బతకదలచిన రోబో చిట్టి నుంచి అలాంటి రోబోలను మరిన్ని తయారుచేసే మూలసూత్రం రాబడతాడు. ఉన్న ప్రోగ్రామ్ లకు తోడుగా, విధ్వంసాలు సృష్టించే తనదైన ప్రమాదభరిత రెడ్ చిప్ ప్రోగ్రామ్ ను కూడా రోబో చిట్టిలో ప్రవేశపెడతాడు.

విధ్వంసక శక్తిగా మారిన రోబో చిట్టి తన లాంటి మరిన్ని రోబోలను సృష్టించి, తనదైన సామ్రాజ్యం నెలకొల్పుకుంటాడు. సమాజంలో అల్లకల్లోలం రేపుతాడు. మళ్ళీ జీవం పోసిన ప్రొఫెసర్ బోరాను సైతం చంపేస్తాడు. హీరో, హీరోయిన్ల పెళ్ళి చెడగొట్టి, పెళ్ళి పీటల మీద నుంచి హీరోయిన్ ను ఎత్తుకు వచ్చి, తన రోబో సామ్రాజ్యంలో బందీని చేస్తాడు.

అక్కడ నుంచి అతణ్ణి ఎదుర్కోవడానికి అందరూ పడే తంటాలు, హాలీవుడ్ యాక్షన్ సన్నివేశాలను తలపించే గ్రాఫిక్స్ నిండిన పతాక సన్నివేశాల్లో రోబోలను హీరో ఎలా నిర్వీర్యం చేశాడన్నది మిగతా సినిమా.

కథా కథనం

ఈ సినిమాలో ఫస్టాఫ్ కాస్త సరదా ఘట్టాలతో గడిచిపోతుంది. నీటికీ, నిప్పుకూ తట్టుకొనే రోబో చిట్టి పెద్దగా పాటలు పెట్టిన వారిని ఎదుర్కోవడం, దుండగుల బారి నుంచి లోకల్ ట్రైన్లో హీరోయిన్ ను కాపాడడం, అగ్నిప్రమాదంలో చిక్కుకున్న బాధితులను రక్షించడం లాంటి సన్నివేశాలతో ప్రథమార్ధంలో కొద్దిపాటి కథే అయినా, గబగబా గడిచిపోతుంది.

అక్కడికక్కడ ఆ యా సన్నివేశాల్లో ఆసక్తిని నిలిపి, పిల్లలను ఆకట్టుకోవడానికి ఆ కథనం తోడ్పడుతుంది. పిల్లలను ప్రధానమైన టార్గెట్ గా చేసుకొన్న ఈ సినిమాలో దోమలతో, రోబో సంభాషణల లాంటి లాజిక్ కు అందని మేజిక్కులు కూడా పుష్కలం.

ద్వితీయార్ధానికి వచ్చేసరికి అసలు కథ మొదలవుతుంది. కథలోని అసలు పీటముడి, దానికి పరిష్కారమంతా సెకండాఫ్ లోనే వస్తాయి. సెకండాఫ్ సగమైన తరువాత నుంచి కథ మొత్తం సాంకేతికత సాయంతో చేసిన విజువల్ మాయ. దాంతో, ఓ దశకు వచ్చేసరికి పాత్రల మధ్య సంఘర్షణ కన్నా, ఏ మీట నొక్కి, ఏ టెక్నిక్ తో హీరో, ఆ రోబోల ఆట కట్టిసాడోనని ఎదురుచూడడమే మిగులుతుంది. అదే ఈ సినిమాలోని బలమూ, బలహీనత కూడా!

(మిగతా భాగం మరికాసేపట్లో...)

2 వ్యాఖ్యలు:

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ said...

hmmm.

You told most of the story.

Kathi Mahesh Kumar said...

మీ రెండో భాగం కోసం వెయిటింగ్ :)