చిత్రం ఏమిటంటే - వయస్సులో నా కన్నా పెద్ద వాళ్ళతో నాకు చటుక్కున దోస్తీ కుదురుతుంటుంది. అది పెరుగుతుంటుంది. నా సమవయస్కులతోనూ, చిన్నవాళ్ళతోనూ ఇట్టే కలిసిపోయినా, పెద్ద వయస్సు వాళ్ళతో మటుకు నా స్నేహం మరింత బలంగా పెనవేసుకుపోవడం జరుగుతుంటుంది. మన జాతకమో, రూపురేఖా విలాసాలో, మాటలో మంచితనమో తెలీదు కానీ, చిన్నప్పటి నుంచీ ఎందుకో నాకు అలా జరుగుతోంది.
ఇంతకీ ఇప్పుడు నేను చెప్పొచ్చేది నాతో అలా బంధం పెనవేసుకుపోయిన ఓ పెద్ద మనిషి గురించి. కనీసం మా నాన్నగారు, తాత గారు వయస్సున్న మంచి మనిషి గురించి. ఆయనతో నా దోస్తీ గురించి. ఆయన - ఎం.ఎస్. శర్మగా ఎక్కువ మందికి సుపరిచితులైన పాత తరం జర్నలిస్టు. పూర్తి పేరు - మద్దాలి సత్యనారాయణ శర్మ. ఆయనకిప్పుడు 92 ఏళ్ళు. ఇప్పటికీ, అందంగా, ఆరోగ్యంగా ఉండే ఆయన నిజానికి మా నాన్నగారు
రెంటాల గోపాలకృష్ణ కన్నా పెద్దవారు. మా నాన్న గారి కన్నా ముందు నుంచీ జర్నలిజంలో ఉన్న కురువృద్ధులు.
శర్మ గారితో నా పరిచయం చిత్రంగా జరిగింది. అది గౌరవం నుంచి స్నేహంగా పరిణమించడం మరీ చిత్రం. ఆ స్నేహం ఇప్పుడు సౌహార్దంగా ఎదగడం ఇంకా విచిత్రం. నార్ల వెంకటేశ్వర రావు, గూడవల్లి రామబ్రహ్మం, చల్లా జగన్నాథం లాంటి 1940ల నాటి ప్రముఖ సంపాదకులతో భుజం రాసుకు తిరిగి, పత్రికా రచన చేసిన పెద్దాయన శర్మ గారు. ‘ప్రజామిత్ర’, ‘గోభూమి’, ‘క్రాంతి’, ‘మీజాన్’, ప్రసిద్ధ కన్నడ వారపత్రిక ‘ప్రజామత’ నడిపిన అప్పటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏ.ఐ.సి.సి) సభ్యుడు బి.ఎన్. గుప్తా గారి ‘ఆంధ్రజ్యోతి’ వారపత్రిక,
ఆంధ్రప్రభ దినపత్రికల్లో ఆయన పనిచేశారు. ఆ తరువాత 1940ల మధ్య నాటి నుంచి రిటైరయ్యే వరకూ 'ఆంధ్రపత్రిక' దినపత్రిక సంపాదక వర్గంలో శర్మ గారు విస్తృత సేవలందించారు. అటు మద్రాసులోనూ, ఆ తరువాత హైదరాబాద్ లోనూ 'ఆంధ్రపత్రిక' డైలీ ఎడిషన్ కు పెద్ద దిక్కుగా పనిచేశారు.
మరో విశేషం ఏమిటంటే - తొలి తరం సినీ పాత్రికేయులలో ఆయన ఒకరు. 1940ల తొలినాళ్ళ నుంచి 1950ల ప్రథమార్థం వరకు ఆంధ్రపత్రిక డైలీలో సినిమా పేజీ నిర్వహణ ఆయన చేతి మీదు గానే జరిగింది. అప్పటి సంగతులు ఇప్పటికీ ఆయన పూస గుచ్చినట్లు చెబుతుంటారు. మా నాన్న గారితో సాహితీ పరిచయం, మా మూడో వదిన వాళ్ళ నాన్న గారు ('ఆంధ్రపత్రిక' సీనియర్ జర్నలిస్టు స్వర్గీయ పినపాక సూర్యప్రకాశరావు)తో సాన్నిహిత్యం శర్మ గారి సొంతం. ఎప్పటి నుంచో శర్మ గారిని కలుసుకోవాలని ఉన్నా, ఎందుకనో కుదరనే లేదు. అలాంటిది - ఉన్నట్టుండి ఆఫీసు పని మీద వివరాల సేకరణ కోసం సరిగ్గా 15 నెలల క్రితం హైదరాబాద్ లో ఆయన ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి కలిశాను. ఓ నాలుగు రోజులు వరుసగా వెళ్ళి, ఆపాత మధురమైన ఆయన జ్ఞాపకాలను తెలుసుకున్నా. అలా మొదలైన మా పరిచయం అక్షరాలా దినదిన ప్రవర్ధమానమైంది. సాయంకాలపు నీడలా పెరుగుతూ వచ్చింది.
ఆయన అనుభవంలో సగమన్నా లేని నాతో ఆయనకు దోస్తీ ఏమిటి! అది విచిత్రమే కాదు, ఆయన మంచితనం కూడా!! ఈ 15 నెలల్లో మా స్నేహం ఏ దశకు చేరిందంటే - కనీసం వారానికి ఒకసారైనా ఓ అరగంట ఎస్టీడీ ఫోన్లో మాట్లాడుకోవాల్సిందే. ఏ పనిలోనైనా ఉండి నేను చేయకపోతే, ఆ మరునాడే 'ఏమైంది, ఏమిట'ని ఆయనే ఫోన్ చేసి, యోగక్షేమాలు అడుగుతారు. సూచనలు, సలహాలిస్తారు. రాజకీయాల నుంచి సాహిత్యం, సినిమాలు, షికార్ల దాకా ఏ అంశం మా మాటల్లో నిషిద్ధం కాదు. అప్పట్లో 'ఆంధ్రపత్రిక'లో చేరిన సుప్రసిద్ధులు ముళ్ళపూడి వెంకట రమణ, నండూరి రామమోహనరావు తదితరులను జర్నలిజంలో చేయి పట్టుకొని నడిపించిన ఈ పాత్రికేయ భీష్ముడికి ఇప్పుడు తెలుగు విశ్వవిద్యాలయ సత్కారం దక్కడం ఎంతో ఆనందకరమైన విషయం. తొలినాళ్ళ జర్నలిస్టు సంఘాల స్థాపనలో ముఖ్యపాత్ర పోషించిన ఎం.ఎస్. శర్మ గారు యూనియన్ కార్యకలాపాల్లో, ప్రెస్ క్లబ్ పక్షాన సలహా సంప్రతింపుల్లో కూడా చాలా కాలం క్రియాశీలంగా వ్యవహరించిన పెద్దలు. అన్నట్లు - ఇవాళ బెజవాడలో పబ్లిసిటీ రంగంలో, ముఖ్యంగా సినీ పబ్లిసిటీ రంగంలో అందరికీ తలలో నాలుకైన పాత్రికేయుడు కృష్ణాజీ సాక్షాత్తూ శర్మ గారి అబ్బాయే.
మరో చిత్రం ఏమిటంటే - ఎం.ఎస్. శర్మ గారు పుట్టింది - 1919 సెప్టెంబర్ 19న, కృష్ణాజిల్లా కలవపాముల గ్రామంలో. సంవత్సరం వేరైనా (1887), సెప్టెంబర్ 19నే పుట్టారు - శర్మ గారి ముందు తరానికి చెందిన రచయిత - పాత్రికేయుడు తాపీ ధర్మారావు. ఇప్పుడు అక్షరాలా ఆ తాపీ ధర్మారావు గారి పేరిట తెలుగు విశ్వవిద్యాలయం ‘కీర్తి’ పురస్కారం శర్మ గారికి లభించింది. తాపీ వారితో శర్మ గారికి ప్రత్యక్ష పరిచయం కూడా ఉండడంతో ఈ సత్కారం మరింత సబబుగా మారింది. కొత్త సొబగు చేకూరింది.
ఈ రోజు (2010 అక్టోబర్ 4, సోమవారం) సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని ఆడిటోరియమ్ లో ఈ పురస్కార ప్రదానోత్సవం జరుగుతోంది. తమ తమ రంగాల్లో చేసిన సేవలకు గాను ఎం.ఎస్. శర్మ గారితో పాటు వివిధ రంగాలకు చెందిన మరో 26 మందికి ఈ ‘కీర్తి’ పురస్కార ప్రదానం చేయనున్నారు. (పురస్కారాలందుకొనే ఈ 27 నక్షత్రాలలో నాకు సుపరిచితులైన మరో ఇద్దరు - బెజవాడకు చెందిన రచయిత - పాత్రికేయుడూ, మా నాన్నగారి మిత్రుడు వీరాజీ గారు, మా ఆకాశవాణి మిత్రుడు నాగసూరి వేణుగోపాల్ గారు కూడా ఉన్నారు).
1940 నాటి నుంచి ప్రధాన స్రవంతి పత్రికా రంగంలో పనిచేస్తూ, ఇప్పటికీ వివిధ అంశాలపై తన అభిప్రాయాలనూ, అనుభవాలనూ పత్రికల్లో పంచుకుంటున్న పాత్రికేయ పితామహుడు శర్మ గారు. ఆయనకు ఇన్నాళ్ళకు, ఈ పాటి చిన్న గుర్తింపు ప్రభుత్వం నుంచి రావడం మన వ్యవస్థ, దాని పాలకుల స్థితిగతులకు నిదర్శనం. అయితే, 70 ఏళ్ళుగా ఓ రంగంలో పని చేస్తున్న వ్యక్తికి ఇప్పటికైనా, ఈ మాత్రం గుర్తింపైనా దక్కడం ఆవేదనలోనూ ఆనందమనిపిస్తోంది. లేటు వయసులోనూ రాతలో, మాటలో ఘాటు తగ్గని ఎం.ఎస్. శర్మ గారికి ఈ శుభ సందర్భంగా తెలుగు పత్రికా రంగం తరఫున జేజేలు!!
కొసమెరుపు - గగన్ మహల్ ప్రాంతంలో ఉన్న బాల్య మిత్రుడి దగ్గరకు ఇప్పటికీ ప్రతి వారం బస్సులో వెళ్ళి, ఓ రోజంతా కబుర్లాడుకొని రావడం ఎం.ఎస్. శర్మ గారికి వారకృత్యం. సరిగ్గా అయిదు రోజుల క్రితం ఆయన అలాగే వెళ్ళి, మళ్ళీ ఇంటికి బస్సులో వచ్చేస్తుంటే ఓ గమ్మత్తు జరిగింది. అదే బస్సులో ఎక్కిన ఓ యువతి ఆయనను అదే పనిగా గమనిస్తోంది. విషయమేమిటో శర్మ గారికి అర్థం కాలేదు. తీరా దిగాల్సిన స్టాపు దగ్గర పడేసరికి, సర్దుకొని లేచిన ఆ అమ్మాయి, హడావిడిగా దిగిపోతూ, తెల్లటి లాల్చీ - పంచెల్లో దబ్బపండులా ఉన్న ఎం.ఎస్. శర్మ గారి దగ్గరకు వచ్చి, ‘‘మీరు బాగున్నారండీ!’’ అంది. దానికి, శర్మ గారు లిప్తపాటు కాలం నివ్వెరపోయినా, వెంటనే -‘‘మనుమరాలి స్వయంవరం మంచిదే!’’ అని హాయిగా నవ్వేస్తూ, ఆశీర్వదించారు. నిండు జీవితాన్ని ఇలా ఆహ్లాదంతో నింపుకోవడం ఆ తరం నుంచి మన తరం అక్షరాలా నేర్చుకోవాల్సిందే!
అందుకే, "శర్మాజీ! మీరు మరిన్ని పురస్కారాలతో, ఆరోగ్యంగా, ఆనందంగా కాలం గడపాలి. మీ అనుభవాలనూ, జ్ఞాపకాలనూ యువతరం పాత్రికేయులతో సదా పంచుకోవాలి." అదే నా ఆశ, ఆశంస!
(మిత్రులకో మాట - హైదరాబాద్ లో ఉండి, తీరిక, ఓపిక ఉన్న మిత్రులు, మరీ ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు ఈ పురస్కార ప్రదానానికి వెళితే బాగుంటుంది. వయస్సులోనూ, అనుభవంలోనూ అక్కడ అందరిలోకీ పెద్దాయన శర్మ గారు పురస్కారం అందుకుంటున్నప్పుడు నాలుగు చప్పట్లు కొడితే మరీ బాగుంటుంది. అది ఆయన కోసం కాదు, మన కోసం! 70 ఏళ్ళుగా ఓ రంగంలో ఓ వ్యక్తి చేసిన విశిష్ట కృషిని గౌరవించాలన్న సంస్కారాన్ని నలుగురితో పంచుకోవడం కోసం, మనలో మనం పెంచుకోవడం కోసం!!)
4 వ్యాఖ్యలు:
RJD jee,good post but "పాత్రికేయ"పదం వింటున్నా,చదువుతున్నా కొంచం నవ్వోస్త్తుంది నాకు,మనమంతా పత్రికలకు పుట్టినవాళ్ళామా?how far it is justified?pl.ask sri sarma gaaru,reg my doubt mitramaa?
మనుమరాలి స్వయంవరం హ హ హ భలే
శర్మ గారికి అభినందనలు.
@ కొత్తపాళీ గారూ, ఆస్ట్రోజాయిడ్ గారూ, కల్పనా... శ్రీ మద్దాలి సత్యనారాయణ శర్మగారి లాంటి పత్రికా రంగ భీష్ములను మనం గుర్తుంచుకోవడమే వారికి పెద్ద ఆనందం. మనుమరాలు వెబ్ నుంచి ప్రింటు తీసుకువెళ్ళి చూపితే, ఈ పోస్టుకూ, మీ వ్యాఖ్యలకూ ఆయన ఎంతో సంతోషించారు. ఆ ఆనందాన్ని మీ అందరితో కూడా పంచుకోవాల్సిందిగా ఆయన ప్రత్యేకించి కోరారు. మీ వ్యాఖ్యలకు కృతజ్ఞతలు.
Post a Comment