ఇప్పుడే అందిన వేడి వేడి తాజా కబురు. మహేశ్ బాబు అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న
ఖలేజా ఎట్టకేలకు రిలీజ్ కు రెడీ అయింది. అన్ని కార్య క్రమాలూ పూర్తి చేసుకొన్న ఈ సినిమా నిన్న (అక్టోబర్ 4వ తేదీ - సోమవారం) రాత్రి కల్లా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ అధికారులు ఖలేజాకు యు /ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. దాంతో, సినిమా విడుదలకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి.
ప్రస్తుతం సినిమా ప్రదర్శనకు కావాల్సిన వందల కొద్దీ ప్రింట్లను ల్యాబ్ లో సిద్ధం చేస్తున్నారు. ఓ పక్కన ప్రింట్ల పని జరుగుతుంటే, మరోపక్క సినిమా కు సంబంధించిన టీవీ ట్రైలర్ల తయారీ హడావిడి సాగుతున్నట్లు భోగట్టా. అక్టోబర్ 7వ తేదీ గురువారం నాడు విడుదల కోసం నిర్మాణ వర్గాలు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటికే ఓ పక్క రోబో వాణిజ్యపరంగా కలెక్షన్లలో సంచలనం రేపుతుండడంతో, ఖలేజా కు తగినన్ని హాళ్ళను సమకూర్చుకోవడంలో కొంత ఇబ్బంది తలెత్తుతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా, ఈ హంగామాలను ఊహించి, డిస్ట్రిబ్యూటర్లు పట్టుబట్టడంతో జూనియర్ ఎన్టీయార్ నటిస్తున్న బృందావనం రిలీజ్ ను అక్టోబర్ 14కు వాయిదా వేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించేశారు. ఆ రకంగా అక్టోబర్ 1, 7, 8 తేదీలను దాటి ఎట్టకేలకు 14కు బృందావనం విడుదల ఖరారైంది.
సెప్టెంబర్ ఆఖరులో విడుదలైన
ఖలేజా పాటల్లో కొన్ని ఇప్పటికే జనాన్ని ఆకర్షిస్తున్నాయి. మణిశర్మ సంగీత దర్శకత్వంలోని ...పిలిచే పెదవుల పైనా..., ఓం నమో శివ రుద్రాయ.... పాటల గురించి అభిమానులు మురిసిపోతున్నారు. ఏమైనా, దాదాపు మూడేళ్ళ తరువాత వస్తున్న సినిమాగా మహేశ్ బాబు ఖలేజా అభిమానుల్ని ఏ మేరకు ఆకట్టుకుంటుందన్నది ఇప్పుడు సినీ వర్గాల్లో అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్న అంశం. అది తెలుసుకోవడానికి మరో రెండు రోజులు ఆగాల్సిందే.
0 వ్యాఖ్యలు:
Post a Comment