జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Wednesday, October 20, 2010

ఇది రామ్ గోపాల్ వర్మ పబ్లిసిటీ చరిత్ర!

సినిమా సిద్ధమవుతుండగానే, దానికి ఏ రకంగా ప్రచారం పొందాలా అని చూడడం దర్శక - నిర్మాతల్లో సహజం. బహుశా, సినిమా మొదలైన దగ్గర నుంచి విడుదల వరకు ఏదో ఒక వివాదంతో మీడియాను తన చుట్టూ తిప్పుకోవడం దర్శక - నిర్మాత రామ్ గోపాల్ వర్మకు తెలిసినంతగా మరొకరికి తెలియదేమో అనుకోవాలి. ఏ సినిమా తీస్తున్నా, దాని గురించి నలుగురూ చెప్పుకొనేలా చేయడంలో ఆయన కళకు తాజా ఉదాహరణ - రానున్న రక్తచరిత్ర చిత్రం.

ఆంధ్రదేశంలోని అనంతపురం పరిసర ప్రాంతాల్లోని ముఠా నేతల నిజజీవితాలను ఆధారంగా చేసుకొని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆయన సిద్ధం చేసిన రక్తచరిత్ర సినిమా ఇప్పటికి ఎన్ని వివాదాలు సృష్టించిందో అందరికీ తెలుసు. కానీ, ఇవాళ రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన ప్రకటన దానికి పరాకాష్ఠ. ఈ సినిమాలో ఎవరిని ఎక్కువగా, మరెవరిని తక్కువగా చూపారో అనీ ఇప్పటికే కొందరు కత్తులు నూరుతుంటే, అనంతపురంలో రక్తచరిత్ర ప్రీమియర్ ప్రదర్శన జరగనున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇదేమిటి, పబ్లిసిటీ వ్యూహమా అని అడిగిన వాళ్ళకు వర్మ నిర్లజ్జగా ఒకే మాట చెప్పారు. ‘‘అవును. పబ్లిసిటీ కోసమే’’ అని తడుముకోకుండా బదులిచ్చారు. పైగా, ‘‘నేను చేస్తున్నది సినిమా వ్యాపారం. దేనికైనా పబ్లిసిటీ అవసరం. సినిమాకు మరీ అవసరం’’ అని ఓ విశ్లేషణ కూడా వాక్రుచ్చారు. వర్మాజీ, వాట్ యాన్ ఎనాలసిస్. అంటే, ఇటు పబ్లిసిటీ కోసం వాస్తవికత, అటు (అ)వాస్తవికతతో పబ్లిసిటీ అన్న మాట.

రాయలసీమ అంటేనే రక్తపాతాలు, బాంబులు, బరిసెలు, వందలాది టాటా సుమోలని చూపుతున్న సగటు తెలుగు సినిమా చాలదన్నట్లు, ప్రచారం కోసం మీరూ ఏదన్నా చేస్తారన్నమాట. అన్నట్లు, మొన్నే వర్మ గారు మరో మాట అన్నారు. ‘‘నేను ఏవో పాత్రలు తీసుకొని సినిమా కథలు రాసుకుంటున్నా. దానికి మీడియానే లేని పోని వివాదం రేపుతోంది’’ అని వర్మ ఉవాచ. పబ్లిసిటీ కోసమే అంతా అని స్పష్టత ఉన్న రామ్ గోపాల్ వర్మ తప్పు మరెవరిదో అనేస్తున్నారు. ఆయన మాటలు వింటే, ‘తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా అంటే, దూడకు గడ్డి కోసం’ అన్న మాటకు నాలుగు ఆకులు ఎక్కువగా - ‘గడ్డి మేస్తున్న దూడ కోసం’ అని చెబుతున్నట్లుంది.

1 వ్యాఖ్యలు:

Unknown said...

సినిమా అన్నది మనిషికి ఆహ్లదం కలిగించడానికి, బయట ప్రపంచాన్ని కొద్ది సేపు మర్చిపొవటానికి ఒక చక్కని టానిక్ లాంటిది. ఆటువంటి సినిమా ఈనాడు రాంగొపాల్ వర్మ లాంటి వాళ్ళ కబంధ హస్తాల్లొ చిక్కి విలవిల లాడుతొంది. మంచిరోజులు వస్తాయని ఆశించడం మినహ ప్రస్తుతం ఛేయగలిగింది ఇంకేమీ లేదు అనిపిస్తొంది అండి.