జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Sunday, October 3, 2010

‘రోబో’: భారీతనం మింగిన భావోద్వేగాల పండు!('విజువల్స్ సరే...! విషయం మాటేమిటి...?!' – రోబో చిత్ర సమీక్ష 2వ పార్ట్)

ఆట్టే విలనీ చూపించకుండా సగంలోనే చచ్చిపోయిన ప్రొఫెసర్ బోరా పాత్రతో కలుపుకొన్నా సరే, ‘రోబో’ సినిమా మొత్తం నాలుగే నాలుగు పాత్రల చుట్టూ (ప్రొఫెసర్ బోరా, హీరో, హీరోయిన్, రోబో) నడుస్తుంది.

హీరో కన్నా విలనే బెటర్!

ఇందులో సైంటిస్ట్ గా రజనీకాంత్ అందంగా కనిపిస్తారు. ఐశ్వర్యారాయ్ కూడా ఇప్పటికీ అందాల భరిణే అనిపిస్తుంది. కొన్ని పాటల్లో ఆమె ఇవాళ్టికీ కుర్రకారుకు గిలిగింతలు పెట్టారంటే అతిశయోక్తి కాదు. ఆమె అభినయం కూడా పాత్రను సహజంగా మార్చింది.

రోబోగా రజనీకాంత్ నటన భేష్. ముందు మంచితనం, అమాయకత్వం నిండిన రోబోగానూ, ఆ తరువాత చెడు దోవ పట్టిన రోబో గానూ రెండు పార్శ్వాలనూ రజనీకాంత్ మెప్పించారు. గట్టిగా చెప్పాలంటే, సైంటిస్ట్ హీరో పాత్ర కన్నా చెడు దోవ పట్టిన రోబో నటనలోనే రజనీకాంత్ కు ఎక్కువ మార్కులు పడతాయి.

కెరీర్ మొదట్లో విలన్ పాత్రలు పోషిస్తూ, ఆనక హీరోగా ఎదిగిన రజనీకాంత్ ఈ రోబో విలనీని బాగా పండించారు. వంద రోబోల్లో ఒకడిగా మారువేషంలో జొరబడిన సైంటిస్ట్ హీరోను, విలన్ రోబో కనిపెట్టే సన్నివేశం అందుకు ఓ మంచి ఉదాహరణ. అక్కడ విలన్ రోబోగా ఆయన నటన ‘చంద్రముఖి’లో ‘లక లక లక...’ ఘట్టం లాంటి వాటిని గుర్తుకు తెచ్చింది. ఇక, ప్రొఫెసర్ బోరాతో సహా మిగిలిన పాత్రలన్నీ - ఇలా వచ్చి, అలా వెళ్ళేవే.

ఊహలకే రెక్కలు వస్తే...

దేశంలోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందినట్లుగా ప్రచారమవుతున్న ఈ సినిమా సాంకేతికత విషయంలో భారతీయ సినిమాను ఓ కొత్త తీరానికి తీసుకువెళ్ళిందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా, విజువల్ ఎఫెక్ట్ లు, రోబోట్రానిక్స్ (స్టాన్ విన్ స్టన్ స్టూడియో), యాక్షన్ సన్నివేశాల (పీటర్ హెయిన్స్, యూయెన్ వూ పింగ్) రూపకల్పనలో హాలీవుడ్ చిత్రాలను తలపించింది. ఈ కథకూ, సన్నివేశాలకూ ‘ఐ- రోబో’ మొదలు ‘ట్రాన్స్ ఫార్మర్’ దాకా అనేకానేక ఆంగ్ల చిత్రాల నుంచి దర్శకుడు శంకర్ ప్రేరణ పొందారు. ఆంగ్ల సినిమాలు ఎక్కువగా చూసే వారికి ఆ మేరకు రోబోలోని కొన్ని అంశాలు, దృశ్యాలు కొత్తగా తోచకపోవచ్చు.

కానీ, కొన్నేళ్ళ క్రితమే వాటి స్ఫూర్తితో అల్లుకున్న శంకర్ ఆలోచన కమలహాసన్ - ప్రీతీ జింటా; షారుఖ్ ఖాన్ లను దాటి; చివరకు రజనీకాంత్ - ఐశ్వర్యారాయ్ లతో ఇప్పటికి ఇలా తెరపైకి ఎక్కిన తీరు సామాన్య ప్రాంతీయ భాషా ప్రేక్షకులను అబ్బురపరుస్తుంది. భారీ ఊహను అంతే భారీగా తెరపై చూపడానికి దర్శకుడు శంకర్ పటిష్ఠమైన సాంకేతిక బృందంతో కలసి చేసిన కృషి, అతణ్ణి నమ్మి నిర్మాతలు (సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్) చేసిన శతాధిక కోట్ల సాహసం, దానికి చేస్తున్న వీర ప్రచారం దక్షిణాది సినీ రంగంలో అపూర్వ ఘట్టమే. శంకర్ ఈ సినిమాతో తన సమకాలికులకు ఓ కొత్త బెంచ్ మార్కు పెట్టారు.

అపూర్వ సాంకేతిక శ్రమ

నిజం చెప్పాలంటే, ‘రోబో’ సినిమా మొత్తానికీ మూలస్తంభాలు - సాంకేతిక నిపుణులు. ముదిమి మీద పడుతున్న రజనీకాంత్ ను మధ్యవయస్కుడిగా అందంగా (ఇంకా చెప్పాలంటే, మొన్నటి ‘శివాజీ’లో కన్నా అందంగా) చూపడంలో మేకప్ తో పాటు, రత్నవేలు ఛాయాగ్రహణాన్ని చెప్పుకొని తీరాలి.

సైంటిస్ట్ గా, రోబో గా ఒకే ఫ్రేములో ఇద్దరు రజనీలు కనబడినా, అంతా సహజంగానే అనిపిస్తుంది. ఎక్కడా తేడా తెలియదు. సినిమాలో వచ్చే గ్రాఫిక్స్ సరే సరి. ఏకకాలంలో ఓ వంద మంది రజనీకాంత్ లు, (ఒక పాటలో పదుల కొద్దీ ఐశ్వర్యారాయ్ లు) కనిపించి కనువిందు చేస్తారు.

రెహమాన్ బాణీల్లో హాలులో తెలుగు మాటలు సరిగా వినిపించని పాటలు సో - సో అనిపించినా, వాటి చిత్రీకరణ మాత్రం ప్రతి శంకర్ సినిమాలో లానే లార్జర్ దేన్ లైఫే. హీరోయిన్ మీద ప్రేమను రోబో వ్యక్తం చేసే ‘ఇనుములో హృదయం మొలిచెనే...’, పెరూలో చిత్రీకరించిన ‘కిలిమంజారో...’ పాటలు కొన్నాళ్ళు జనాన్ని ఆకర్షిస్తాయి. ఎడారి ఇసుక తిన్నెల నడుమ నీలం రంగు నీటి చెలమలతో సినిమా మొదట్లోనే వచ్చే ‘నీలో వలపు...’ పాట లొకేషన్ ను చూసి, ప్రేక్షకులు మురిసిపోవడం ఖాయం. అలాగే పాటలకు వేసిన సెట్లు, సన్నివేశాల మొదలు పాటల దాకా వాడిన కాస్ట్యూమ్ లూ బాగున్నాయి.

ప్రొడక్షన్ డిజైనర్ గా బాధ్యతలు నిర్వహించిన సాబూ సిరిల్ కృషి ఒకటీ అరా చోట్ల కృత్రిమం అనిపించినా, హైటెక్ రోబోల రూపం నుంచి హెలికాప్టర్లు, సెట్ల దాకా రూపొందించడంలో ఆయన చేసిన శ్రమ సామాన్యం కాదు. ఆంటోనీ ఎడిటింగ్ కథనాన్ని వేగవంతం చేయడంలో సహకరించింది.

డబ్బింగ్ ప్రతిభ

తెలుగులో రజనీకాంత్ కు గాయకుడు మనో చేసిన స్వరదానం పాత్రను సజీవంగా నిలిపింది. ఇక, ఐశ్వర్యారాయ్ కు సవితా రెడ్డి గాత్రం నప్పింది. ‘నకరాలా’ అని పోలీసు అడిగితే (బహుశా తమిళంలో ‘నక్కలా’ (ఎగతాళి అని అర్థం) అయ్యుండాలి), ‘కాదు నికెల్’ అని రోబో జవాబు లాంటి చోట్ల అనుకున్న ఎఫెక్ట్ ను తెలుగు డబ్బింగ్ లో కూడా మాటల రచయిత శ్రీరామకృష్ణ తీసుకురాగలిగారు.

ఇక, తెలుగు పాటలు సుద్దాల అశోక్ తేజ, వనమాలి రచనలు. పాటల్లో ‘యంత్రుడు’ లాంటి అపసవ్యమైన తెలుగు ప్రయోగాలు కూడా అనిపించారు. ‘యంతిరన్’ అని తమిళంలో వస్తే, దానికి ‘యంత్రుడు’ అని యథేచ్ఛగా రాసినట్లనిపిస్తుంది. ఈ మన రచయితలు తమ విశృంఖల సృజనాత్మకతతో తెలుగు భాషకు మరోసారి జోహార్ అనేశారు.

జవాబు లేని ప్రశ్నలెన్నో...

ఇంత పెద్ద సినిమాలో లోపాలు కూడా ఇంకా లేకపోలేదు. మానవ స్పందనలు సైతం ఉన్నదిగా మారిన రోబో చిట్టి - ఆర్మీ టెస్టులో ఫెయిలవడంతో హీరో ముక్కలుగా విడగొట్టి పారేస్తాడు. తనను ముక్కలుగా విడగొట్టి పడేసి, తన ప్రేమను తోసిపుచ్చిన హీరోను మనిషి ఫీలింగ్స్ వచ్చిన రోబో ద్వేషించడం సహజం.

కానీ, తీరా చివరలో ఆ రెడ్ చిప్ ప్రోగ్రామ్ ఒక్కటి తీసేయగానే తన పాత స్పందనలన్నీ రోబో వదిలేస్తుంది. అప్పటి దాకా తాను ద్వేషించి, చంపడానికి కూడా సిద్ధమైన అదే హీరో పట్ల స్నేహంగా, మంచిగా ప్రవర్తిస్తుంది. ఈ మార్పు ఎలాగన్నది అర్థం చేసుకోలేం. స్పందనలనేవి రెడ్ చిప్ తో సంబంధం లేని అంశం కదా!

ఇక, అంత పెద్ద సైంటిస్ట్ హీరో, విడిభాగాలుగా విడగొట్టేసిన రోబోను ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకుండా అలా చెత్తకుండీలో వేసేస్తాడా? పేటెంట్ రావడం కోసం చూస్తున్న సదరు శాస్త్రవేత్త, రోబోలోని సాఫ్టువేర్, ప్రోగ్రామింగ్ ల గురించైనా ఆలోచించకుండా అలా నిర్లక్ష్యంగా పారేస్తాడా…? ఇవన్నీ సమాధానం దొరకని ప్రశ్నలు. అలాగే, విలన్ చేసిన ఒక్క (రెడ్ చిప్) ప్రోగ్రామ్ తో రోబో యావత్ ప్రపంచానికే అంత వినాశకరంగా మారడం కొంత సినిమాటిక్ గా అనిపిస్తుంది.

నో స్టయిల్స్, నో పంచ్ డైలాగ్స్

ఇక, రజనీకాంత్ తరహా మాస్ మెచ్చే స్టయిల్స్, పంచ్ డైలాగులు ఈ సినిమాలో శూన్యం. వాటిని ఆశించే వారికి ఈ సినిమా ఆశాభంగమే. సాధారణంగా రజనీకాంత్ సినిమాల్లో ఉండే భావోద్వేగభరిత అంశాలూ ఇందులో కనిపించవు. అలాగే, కథలో హీరో సైంటిస్ట్ పాత్ర కానీ, కాసేపు విలన్ గా కనిపించి - అర్ధంతరంగా చచ్చిపోయే ప్రొఫెసర్ బోరా పాత్ర కానీ పెద్దగా చేసిందేమీ లేదు. వాటి కన్నా రోబో పాత్రదే పైచేయి అయిందనిపిస్తుంది. ఒకానొక దశకు వచ్చేసరికి, విలన్ రోబోను అరికట్టడానికి హీరో ఏమీ చేయలేకపోయాడని కూడా అనిపించేస్తుంది. ఇలాంటివన్నీ తెలియకుండానే ప్రేక్షకుల అంతరాంతరాళాల్లో అసంతృప్తిని కలిగిస్తాయి. పైకి చెప్పలేని ఏదో వెలితిని మిగులుస్తాయి.

ముగింపు

అన్నట్లు, సినిమా చివరలో 2030 కాలం నాటిదంటూ ఓ భవిష్యత్ సన్నివేశాన్ని చూపారు. ఇరవై ఏళ్ళ క్రితం (2010లో) తయారుచేసిన ఈ రోబోను ఎందుకు డిస్ మ్యాంటిల్ చేశారని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మ్యూజియమ్ సందర్శనకు తీసుకొచ్చిన టీచర్ ని, ఓ విద్యార్థిని అడుగుతుంది.

దానికి, గాజు అరలో ఉన్న రజనీకాంత్ రోబో శిరస్సు సమాధానం చెబుతూ, ‘ఎందుకంటే -- నేను ఆలోచించడం మొదలుపెట్టాను కాబట్టి’ అంటుంది. ఇప్పుడు దర్శకుడు శంకర్ చేయాల్సింది కూడా అదేనేమో అనిపిస్తుంది. సినిమాను సాంకేతికంగా, విజువల్ గా ఇంత భారీగా తీర్చిదిద్దడానికి ఎంతో శ్రమపడిన శంకర్ స్ర్కిప్టు మీద, కథలోని భావోద్వేగాల పైన మరింత లోతుగా ఆలోచించడం మొదలుపెట్టాల్సి ఉంది.

నిజానికి, మనిషి యాంత్రికంగా మారుతున్న వేళ, యంత్రానికే మానవ సహజమైన స్పందన వస్తే అన్న ఆలోచన మంచిదే. రోబోకు రెడ్ చిప్ లాగా, మనుషులు అబద్ధం, అసూయ, వంచన, ద్రోహం, స్వార్థం, ద్వేషం లాంటి రెడ్ చిప్ లు తగిలించుకొని తిరుగుతున్నారన్న అంశమూ సమాజానికి చెంపదెబ్బే. కానీ, వాటిని ఇంకా ప్రభావశీలంగా చెప్పాల్సింది.

చిన్న ఇతివృత్తానికి చిత్రీకరణలోని భారీ తనంతో సరిపుచ్చకుండా, పకడ్బందీ కథనూ, పాత్రచిత్రణనూ, మానవ సంబంధాలనూ మరింత బలంగా అల్లుకోవాల్సిన అవసరం ఉంది. బహుశా, కొన్నేళ్ళుగా స్క్రిప్టు రూపకల్పనలో శంకర్ కు ప్రధానబలంగా నిలిచిన ప్రముఖ తమిళ కథా రచయిత సుజాత ఆ మధ్య మరణించడం కూడా ఇప్పుడు కనిపిస్తున్న ఈ బలహీనతకు కారణమేమో అనిపిస్తుంది. అందుకే, ఈ సినిమాను శంకర్ 'అపరిచితుడు' లాంటి గత చిత్రాలతో పోల్చలేం.

ఈ చిత్రంలో రోబో ప్రేమను హీరోయిన్ తిరస్కరించే ఘట్టం, చివరకు రోబో చిట్టి తనను తానే డిస్ మ్యాంటిల్ చేసుకొనే దృశ్యం లాంటి కొన్ని చోట్ల భావోద్వేగాల మెరుపులు మెరిశాయి. కానీ, ఇంతటి భారీ సినిమా - పై నుంచి కింది వరకూ అందరి మనసుల మీదా బలమైన ముద్ర వేయాలంటే ఆ మెరుపులు చాలవు. అది లేనప్పుడు ఇలాంటి సినిమాలు వట్టి సాంకేతిక అపురూపాలుగానే మిగిలిపోతాయి! బాక్సాఫీస్ కలెక్షన్లలోనే ఒరిగిపోతాయి!!

కొసమెరుపు: సినిమాలోని క్లైమాక్స్ లో వచ్చే దృశ్యాల గురించి చాలామందిమి ఆహా, ఓహో అంటున్నాం. కానీ, నేను సినిమా చూసి బయటకు వస్తున్నప్పుడు ఆ జనంలో యువకుడైన ఓ సగటు ప్రేక్షకుడు మాత్రం పక్కనున్న ఫ్రెండ్ తో ఇలా అన్నాడు: ‘‘అందరూ ‘క్లైమాక్స్ అదిరింది. అద్భుతం’ అంటూ ఉంటే ఏమో అనుకున్నారా బాబూ! చిన్నపిల్లల కామిక్స్, 3డి యానిమేషన్ గేమ్స్ చూసినట్లుందిరా!!’’ భావోద్వేగాల ముద్ర లేకపోతే బంధనాలు లేని ఎంతటి భారీ ఊహలకైనా వచ్చే కామెంట్లు ఇలానే ఉంటాయేమో?!

8 వ్యాఖ్యలు:

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

మీ రీవ్యూ చాలా బావుంది.కొన్ని వెబ్‌సైట్స్ 4/5 ఇచ్చి ఈ సినిమాని ఆకాశానికెత్తేశాయి.ఫీల్ లేని ఈ సినిమాని మన జనం ఎంతకాలం అక్కున చేర్చుకుంటారో చుడాలి.

శివ చెరువు said...

మీ గత పోస్ట్లు చదవలేదు.. కాని రోబో చిత్ర సమీక్ష లలో నేను చదివన వాటిలో .. థిస్ ఇస్ ది బెస్ట్..

Excellent.. the way you concluded.

pavan said...

Everybody said , Robo is a great film..but i can say it can be better much..
The one thing that misses in Robo is, it fails to connect to audience through out the movie.
i think, children will njoy this film a lot

Unknown said...

.....భావోద్వేగాలు లేనప్పుడు ఇలాంటి సినిమాలు వట్టి సాంకేతిక అపురూపాలుగానే మిగిలిపోతాయి! బాక్సాఫీస్ కలెక్షన్లలోనే ఒరిగిపోతాయి!!.....మీ రీవ్యూ చాలా బావుంది.

blogyama said...

music bore .graphics bavunnai.mee review superrandi

పెదరాయ్డు said...

మాష్టారూ మరే౦ పర్లేదు. అవతార్ లా౦టి వీడియో గేమ్ తో పోలిస్తే ఇది ఎ౦తో నయ౦.
ఫా౦టసీ సినిమాను ఫా౦టసీ సినిమాగానే చూడ౦డి, లాజిక్కులకోస౦ చూడాల్సిన పనిలేదు, ప్రత్యేక౦గా రజనీ సినిమాలో.
జస్ట్ ఎ౦జాయ్!

మీకు సినిమాలతో వృత్తి రీత్యా స౦భ౦ధ౦ ఉ౦టే, లజిక్కులకు అతీత౦గా ప్రేక్షకుడిని మ౦త్రముగ్దుడిని చేయడమెలాగో శ౦కర్, రజనీ లతో సహా ఈ సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్ చేసి చూపడాన్ని గమని౦చ౦డి.

Unknown said...

@ బెల్లంకొండ లోకేశ్ శ్రీకాంత్ గారూ, శివచెరువు గారూ, పవన్ గారూ, ధరణీరాయ్ చౌదరి గారూ, బ్లాగ్ యమ గారూ కృతజ్ఞతలు.
@ పెదరాయ్డు గారూ, నమస్తే. మీరు గమనిస్తే - వీడియో గేమ్ కామెంట్ ప్రత్యక్షంగా ఓ ప్రేక్షకుడు అన్న మాట. నా మాట కాదు. అయినా, అవతార్ బాగుందా, రోబో బాగుందా అన్నది కాదు ఇక్కడ సమస్య. ఇది రజనీ సినిమా, శంకర్ సినిమా అని చూడడం మొదలుపెడితే, ఇక భజన స్తోత్రాలు మినహా మాట్లాడుకోవడానికి ఏమీ ఉండదు.

ఏ సినిమా గురించి అయినా చెబుతున్నప్పుడు బలాలు, బలహీనతలు, బాగు, ఓగు - అన్నీ చెప్పుకోవాల్సిందే కదా. ఆ సంగతి మీరూ అంగీకరిస్తారనే భావిస్తాను. సినిమాకు లాజిక్ ఏమిటని అనకండి. ఇది పూర్తి ఫ్యాంటసీ అయితే ఇబ్బందే లేదు. కానీ, సైన్స్ - ఫిక్షన్ కాబట్టి అటు కాస్త లాజిక్ వైపు కూడా ఆలోచించడం తప్పు లేదేమో. చెత్తకుప్పలో ముక్కలుగా పడిపోయినా తనను తాను అసెంబుల్ చేసుకోగల రోబో, ప్రాణభిక్ష పెట్టమని మరెవరినో ప్రాథేయపడడం లాంటివి పంటి కింద రాళ్ళే కదా.

అయినా లాజిక్కులకు అతీతంగా ప్రేక్షకులకు మంత్రముగ్ధులను చేయడం గురించి ఇవాళ రోబోయే చూడక్కర లేదు. భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడు - ఇలా ఎన్నయినా చెప్పుకోవచ్చు. చూడవచ్చు. అంత మాత్రాన శంకర్ గొప్పతనానికి వచ్చిన కొరతేమీ లేదు. నా పాయింటల్లా ఇలాంటి భారీ ఆలోచనలకు ఎమోషన్లు కూడా తోడైతే, వాటి ఫలితం ఎంత బాగుంటుందన్న దాని గురించే మాస్టారూ! సావధానంగా ఆలోచించండి.

Kavitha said...

chala kastapadi review rasaru kani , anta dabbu karchu petti ticket koni cinema choose vallaki tarvata em jarugutundo ani wait chese thrill mottam pogottaru.

naa matuku nenu ee movie baga enjoy chesanu