జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Monday, September 6, 2010

అవిశ్రాంత అక్షర తపస్వి



(ఓ బెజవాడ కవి - రచయిత జీవితం -2)


(ఫోటోలో - రెంటాలకు పేరు తెచ్చిన అనువాదాల్లో ఒకటైన 'యమకూపం' నవల ముఖచిత్రం)

రఘువంశం నుంచి రష్యన్ సాహిత్యం దాకా రెంటాల గోపాలకృష్ణ స్పృశించని అంశం లేదు. రష్యన్ నాటకకర్త గొగోల్ రాసిన ప్రఖ్యాత నాటకం ‘ఇన్ స్పెక్టర్ జనరల్’ ను అనుసరిస్తూ, రెంటాల అదే పేరుతో నాటకం రాశారు. ఆ నాటకం బహుళ ప్రజాదరణ పొందింది. ‘ఇన్ స్పెక్టర్ జనరల్’, ‘అంతా పెద్దలే’ లాంటి ఆయన నాటకాలు రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాలలో వందలాది ప్రదర్శనలకు నోచుకున్నాయి. నాటక రంగంలో చేసిన విశేష కృషితో రెంటాలకు ప్రజా నాట్యమండలి, ఆంధ్ర ఆర్ట్స్ థియేటర్ లతో పాటు అనేక ఇతర ఔత్సాహిక నాటక సమాజాలతో అనుబంధం ఏర్పడింది.

నాటి నుంచి ఆయన అనేక గీతాలు, నాటికలు, కథలు, అనువాదాలు రాసి ప్రచురించారు. కవిగా, రచయితగా, నాటకకర్తగా, అనువాదకుడిగా, విమర్శకుడిగా సాహితీ రంగస్థలిపై ఆయన బహుపాత్ర పోషణ చేస్తూ వచ్చారు. ‘శిక్ష’, ‘అంతా పెద్దలే’, ‘రజని’, ‘కర్ణభారం’, ‘మగువ మాంచాల’, ‘రాణీ రుద్రమదేవి’, ‘మాయమబ్బులు’.... ఇలా ఎన్నో రంగస్థల నాటికలు, నాటకాలు, రేడియో నాటకాలు ఆయన కలం నుంచి వెలువడ్డాయి.

ఆరు పదుల నిరంతర సాహితీ సేద్యం

రష్యన్, ఆంగ్ల సాహిత్యాలను తేటతెలుగులో అందించడానికి రెంటాల చేసిన కృషి ఎన్నదగినది. లియో టాల్ స్టాయ్ రాసిన బృహన్నవల ‘వార్ అండ్ పీస్’ రష్యన్ సాహిత్యంలో సుప్రసిద్ధమైనది, సుదీర్ఘమైనది. జార్ చక్రవర్తులను గురించి తెలిపే ఈ నవలా రాజంలో దాదాపు 500 పైచిలుకు పాత్రలున్నాయి. ఈ బృహత్తర రచనను బెల్లంకొండ రామదాసుతో కలసి రెంటాల అనువదించారు. తెలుగు పాఠకులకు ‘యుద్ధము - శాంతి’ పేరిట సులభశైలిలో అందించారు. ఇక, రెంటాల స్వతంత్రంగా విశ్వవిఖ్యాత టాల్ స్టాయ్ నవల ‘అన్నా కెరినినా’ను సరళంగా తెలుగులోకి అనువదించారు. మేలెన్నికగన్న అనువాదంగా ఆ రచన సాహితీవేత్తల ప్రశంసలను అందుకుంది.

అలాగే, అలెగ్జాండర్ కుప్రిన్ రాసిన ‘యమా ది పిట్’ను ‘యమకూపం’గా తెనుగు చేశారు. మాక్సిమ్ గోర్కీ నవల ‘ది మ్యాన్ హు వజ్ ఎఫ్రైడ్’ను ‘భయస్థుడు’గా అనువదించారు. నోబెల్ బహుమతి గ్రహీత నట్ హామ్సన్ రచన ‘హంగర్’ను ‘ఆకలి’గా రెంటాల అందించారు. తెలుగు సాహితీలోకానికి రష్యన్ సాహిత్యామృతాన్ని పంచారు. రవీంద్రనాథ్ టాగోర్, లూయీ చార్లెస్ రాయర్, రష్యన్ రచయితలు అలెగ్జాండర్ పుష్కిన్, చకోవ్ స్కీ, ఫ్రెంచ్ రచయితలు ఆనటోల్ ఫ్రాన్స్, విక్టర్ హ్యూగో, మపాసా - ఇలా ఎంతో మంది ప్రసిద్ధుల రచనలను రెంటాల తెలుగులో అందించారు. అనువాద సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు.

బాలల అకాడమీ అవార్డుల నిర్ణేతల దృష్టికి రాలేదేమో కానీ, ఏ తెలుగు ప్రచురణాలయానికి వెళ్ళినా, ‘బాలజ్యోతి’ లాంటి బాల సాహిత్య పత్రికలను తిరగేసినా, రెంటాల బాల సాహిత్యంలో చేసిన అవిరళ కృషి స్పష్టంగా కనిపిస్తుంది. లియో టాల్ స్టాయ్ బాల సాహిత్యాన్నంతటినీ రెంటాల తెనిగించారు. భారత, రామాయణ, భాగవతాదుల నుంచి ‘భట్టి విక్రమార్క కథల’ దాకా, ‘కాశ్మీర గాథల’ నుంచి ‘ఈసఫ్ కథలు’, ‘గ్రీకు గాథల’ దాకా విస్తారమైన సాహిత్యాన్ని సరళమైన వచనంలో చెప్పారు. అరటిపండు ఒలిచి నోటిలో పెట్టినంత సులభరీతిలో పిల్లలకు అందించారు. పెద్దలను సైతం అలరించారు.

ఇక, వాల్మీకి, వ్యాస ప్రణీతాలైన రామాయణ, భారత, భాగవతాలను సంస్కృత మూలాన్ని అనుసరిస్తూ సంపూర్ణంగా తెనిగించారు. అయ్యలరాజు నారాయణామాత్యుని ‘హంస వింశతి’, జయదేవుని ‘గీత గోవిందమ్’, లీలాశుక యోగీంద్రుని ‘శ్రీకృష్ణ కర్ణామృతమ్’, భర్తృహరి విరచిత ‘సుభాషిత త్రిశతి’ మొదలైనవన్నీ ‘స్వాతి’ సాహిత్య మాసపత్రికలో ధారావాహికంగా ప్రచురితమయ్యాయి.

నాలుగు పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షాలలో కామానికి సంబంధించినంత వరకు వాత్స్యాయనుడిదే మొదటి మాటా, చివరి మాటా. అలాంటి వాత్స్యాయనుడు రాసిన ప్రసిద్ధ ప్రాచీన శాస్త్రీయ గ్రంథం - ‘వాత్స్యాయన కామసూత్రాలు’. దాన్ని యశోధరుని ‘జయమంగళ’ వ్యాఖ్యానుసారం మూల శ్లోకాలతో సహా పామరులకు సైతం అర్థమయ్యే రీతిలో రెంటాల తెనిగించారు. సరళమైన తెలుగు వచన రచనా శైలిలో రసహృదయులైన పాఠకులకు అందించారు. శభాష్ అనిపించుకున్నారు. ఈ రచన అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’ వారపత్రికలో ధారావాహికంగా ప్రచురితమైంది. అంతేకాకుండా, తరువాత పుస్తకరూపంలో వచ్చి, అతి స్వల్పకాలంలోనే దాదాపు డజను ముద్రణలకు నోచుకొంది. పండితుల, పామరుల ప్రశంసలకు పాత్రమైంది.

అవార్డులు - రివార్డులు

పదహారో ఏట తొలి పుస్తకం ‘రాజ్యశ్రీ’తో మొదలుపెట్టి 75వ ఏట మరణించే వరకు మొత్తం 60 ఏళ్ళ పాటు రెంటాల అలుపెరగకుండా రచనలు చేస్తూ వచ్చారు. అలా ఆరు పదుల సుదీర్ఘ కాలం పాటు సాహిత్య వ్యవసాయ క్షేత్రంలో నిర్విరామంగా కృషి చేసి, బంగారు పంటలు పండించారు. రెంటాల రచనలు రాశిలోనూ, వాసిలోనూ ఎక్కువే. దాదాపు 200 పుస్తకాలు ఆయన రాయగా, అందులో 170 దాకా గ్రంథ రూపంలో ప్రచురితం కావడం విశేషం.

ఆయన గ్రంథాలు అశేష ఆంధ్ర పాఠకుల ఆదరాభిమానాలను చూరగొన్నాయి. పలు రచనలు పదే పదే ముద్రితమై, బహుళ ప్రచారం పొందాయి. వారణాసి విశ్వవిద్యాలయం లాంటి రాష్ట్రేతర పుస్తక భాండాగారాలలో సైతం స్థానం సంపాదించుకున్నాయి. రెంటాల రచనలను పలు విశ్వవిద్యాలయాలు పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టాయి. ఆయన వచన రచన ‘పల్నాటి వీరచరిత్ర’ను బెంగుళూరు విశ్వవిద్యాలయం వారు కన్నడంలోకి అనువదించి, ప్రచురించారు.

రెంటాల గోపాలకృష్ణ స్వస్థలం గుంటూరు జిల్లా పల్నాడు తాలూకా రెంటాల గ్రామమైనా, 1943 ప్రాంతం నుంచి ఆయన బెజవాడలోనే ఉంటూ వచ్చారు. స్వర్గస్థులయ్యే వరకు ఆ నగరాన్ని తన సాహితీ క్షేత్రంగా మలుచుకున్నారు. అలా విజయవాడతో ఆయనది 52 ఏళ్ళ బంధం. పుట్టి పెరిగిన నరసరావుపేట పరిసర ప్రాంతాలతో అనుబంధాన్నీ, ఆత్మీయతనూ కొనసాగిస్తూనే, విజయవాడ కార్యస్థానంగా ఆయన బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శించారు.

ఈ పండిత పాత్రికేయుడు అనేక అవార్డులు, సన్మానాలు అందుకున్నారు. ఆంధ్ర నాటక పరిషత్ అవార్డు (1979లో), నెల్లూరు నెఫ్జా నాటక కళాపరిషత్ అవార్డు (1981లో) రెంటాలను వరించాయి. ఉత్తమ సినీ విమర్శకుడిగా వంశీ ఆర్ట్ థియేటర్స్ వారి చేత ‘దాసరి నారాయణరావు స్వర్ణపతకా’న్ని (1987లో) అందుకున్నారు. ఘంటసాల అకాడమీ, విజయవాడ వారిచే ఉత్తమ జర్నలిస్టు అవార్డు (1990 -91లో) పొందారు. కన్నుమూయడానికి సుమారుగా రెండు నెలల ముందు 1995లో ‘క్రాంతి’ ఉత్తమ జర్నలిస్టు అవార్డు రెంటాలకు లభించింది.

ఆశయాలు, ఆకాంక్షలు, బాధలు, వేదనలు. బాధామయ జగత్తును దర్శించి, దరిద్రంలోనే శాంతినీ, అంధకారంలోనే వెలుగునూ కవిత్వం ద్వారా, సాహితీ వ్యాసంగం ద్వారా రెంటాల అన్వేషించారు. ఒకవైపు సాహిత్యంలో అన్వేషణ, మరోవైపు జీవన సమరం. ఇలా రెంటాల అవిశ్రాంత పోరాటం సాగించారు. అవినీతి రాజకీయాలపై అస్త్రసంధానం చేస్తూ, ‘‘...దించండి తెర, దించండి తెర / చాలు చాలు ఈ విషాద సారంగధర... ’’ అంటూ, 1995 జూలై 18వ తేదీ మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల పది నిమిషాలకు విజయవాడలో కన్నుమూశారు. నిరాడంబరుడు, నిగర్వి, సహృదయుడు, సాహితీమూర్తి రెంటాల గోపాలకృష్ణ భౌతికంగా మన మధ్య లేరు. కానీ, చేసిన శతాధిక రచనల ద్వారా సాహితీ జగాన ఆయన చిరంజీవి!!

భర్తృహరి చెప్పినట్లు,

‘‘ జయన్తి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః
నాస్తి తేషాం యశః కాయే జరా మరణజం భయం’’

0 వ్యాఖ్యలు: