జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Monday, September 20, 2010

బ్లాగు, ట్విట్టర్, ఫేస్ బుక్ జిందాబాద్!

(ఈ డిజిటల్ యుగంలో జర్నలిజమ్ ఏమై పోతుంది - పార్ట్ 2)

‘‘ఈ డిజిటల్ యుగంలో ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటివి శక్తిమంతమైన పత్రికా రచనలో శక్తిమంతమైన ఉపకరణాలు. వాటిని కూడా సమాచార సేకరణలో, కూర్పులో ఉపయోగించుకోవాలి. అవి వాడని ఎడిటర్ వెనుకబడి పోతాడు’’ అని బ్రిటన్ లోని 'ది గార్డియన్'కు ఎడిటర్ గా వ్యవహరిస్తున్న అలన్ రస్ బ్రిడ్జర్ అభిప్రాయపడ్డారు. ఈ డిజిటల్ యుగంలో జర్నలిజమ్ రంగంలో అనుసరించాల్సిన కొత్త నియమాలను ఆయన వివరించారు. డిజిటల్ మీడియం వేగవంతంగా జీవితంలోకి చొచ్చుకొని వస్తున్న ప్రస్తుత సందర్భంలో పాఠకులు కూడా మరింతగా పాలుపంచుకొనేలా జర్నలిజమ్ ను తీర్చిదిద్దాలనీ, పాఠకుల స్పందనను కోరడం ద్వారా, అనుమతించడం ద్వారా ఆ పని చేయాలనీ ఆయన చెప్పారు.

ప్రచురణకు ముందు దశలో కూడా పాఠకులను సైతం వార్తా సేకరణలో, వార్తల నిర్ధారణలో భాగం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వార్తలను తెలియజెప్పే అధికారం, నైపుణ్యం, ఆసక్తి పాత్రికేయులకు ఒక్కరికే సొంతమని అనుకోవద్దని కూడా సుతిమెత్తగా విమర్శించారు. ‘‘జర్నలిస్టులు కాకపోయినప్పటికీ, సదరు సంఘటనలకు యాదృచ్ఛికంగా సాక్షులైన వారి డిజిటల్ రికార్డులను వార్తాపత్రికలు ఉపయోగించుకోవచ్చు’’ అని అలన్ బ్రిటన్ లోని తమ అనుభవాలను వివరించారు.

సమాచార విస్ఫోటనం సాగుతున్న ఈ రోజుల్లో సమాచారం కోసం వార్తాపత్రికలొక్కటే సాధనం కాదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బ్లాగులు, సామాజిక సంబంధాల సైట్ల ప్రాధాన్యం, ప్రాసంగికత పెరిగిన విషయాన్ని కూడా వివరించారు. అలాగే, గడచిన అయిదేళ్ళలో బ్రిటన్ లో నాణ్యమైన వార్తాపత్రికల మార్కెట్ సైతం పడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. భారతీయ వార్తాపత్రికల పరిస్థితి ప్రస్తుతానికి బాగానే ఉన్నా, మొబైల్ టెక్నాలజీ, బ్రాడ్ బ్యాండ్ సేవలను జనం వినియోగించుకోవడం అంతకంతకూ పెరిగిపోతున్న దృష్ట్యా డిజిటల్ మీడియమ్ సవాళ్ళకు ఇక్కడి పత్రికలు, జర్నలిస్టులు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.

'డిజిటల్ యుగంలో జర్నలిజమ్ భవిష్యత్తు' అన్న అంశంపై సరిగ్గా గంట సేపు ఉపన్యసించిన అలన్ ఆ తరువాత ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు దాదాపు ముప్పావు గంట సేపు సమాధానాలిచ్చారు. ఇవాళ (భారతీయ) పత్రికల్లో పెరిగిపోతున్న ‘పెయిడ్ న్యూస్’ (వాణిజ్య ప్రకటనలు తీసుకొనో, డబ్బు తీసుకొనో వార్తలు రాసే) సంస్కృతి విషయంలో కూడా ఆయన తన భావాలు పంచుకున్నారు. ‘‘పత్రికలు గనక గౌరవప్రదంగా వ్యవహరిస్తూ, నిఖార్సయిన వార్తలు అందించనట్లయితే, పతనమైపోతాయి. సామాజిక సంబంధాల సైట్లు విస్తరిస్తున్న నేపథ్యంలో పత్రికల అసలు రంగు బయటపడిపోతుంది’’ అని అలన్ అన్నారు.

నా మటుకు నాకు ఈ ఉపన్యాసం ఓ దిక్సూచిగా అనిపించింది. జర్నలిజమ్ లో ఉన్న, ఉంటున్న, ఉండబోతున్న వారందరూ ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టడం కచ్చితంగా అవసరం అనిపించింది. ఈ కార్యక్రమంలో నాకు ఆనందం కలిగించిన విషయం ఇంకొకటి ఉంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ‘ది హిందూ’ పత్రిక ఎడిటర్ రామ్ స్వయంగా దగ్గరుండి అందరినీ ఆహ్వానించడమే కాకుండా, ఉపన్యాసం మొదలయ్యాక ఆడిటోరియమ్ లో చివరకు వచ్చి, స్పీకర్లలో శబ్దం సరిగా వినిపిస్తున్నదీ, లేనిదీ చూడడం, నిశ్శబ్దంగా ఆ ఆపరేటర్ దగ్గరకు వెళ్ళి వాల్యూమ్ పెంచాలంటూ సైగ చేయడం గమనించి, అబ్బురపడ్డా.

అంత పెద్ద ఎడిటరై ఉండీ చిన్న చిన్న విషయాల మీద కూడా రామ్ స్వయంగా శ్రద్ధ వహించడం, ప్రశ్నోత్తరాల సమయంలో వేదిక మీదకు వచ్చి అయ్యే వరకు అలన్ పక్కనే నిలబడే ఉండడం, తానూ ఆ చర్చలో భాగస్వామి కావడం చూస్తే -- పేరు ప్రతిష్ఠలతో సంబంధం లేకుండా ఎడిటర్లు ఎంత నిరాడంబరంగా ఉండవచ్చో, ఉండాలో చెప్పకనే చెప్పినట్లయింది. ఆ పరిస్థితిలో మన వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండి ఉండేదన్న ఆలోచనలోకి నేను అనుకోకుండా అయినా, అనివార్యంగా వెళ్ళాను. ఇంకో గమ్మత్తేమిటంటే, ఈ సభలో అలన్ కు శాలువా కప్పే పని కోసం పిలిపించబడిన తమిళనాడు రాష్ట్ర మంత్రి తంగం తెన్నరసు సభారంభానికి ముందే ఠంచనుగా వచ్చేశారు. సభ అయ్యే వరకూ ఉన్నారు. ప్రసంగం ఆసాంతం విన్నారు. వద్దనుకున్నా మళ్ళీ ఇక్కడా మనవాళ్ళతో పోలిక వచ్చేసింది.

కొసమెరుపు - సభ మొదలవడానికి ముందు నేను థియేటర్ బయట జర్నలిస్టు మిత్రులతో నిలబడి ఉన్నప్పుడు ఓ పోలీసు నా దగ్గరకు వచ్చాడు. ‘మీటింగు ఎన్నింటి నుంచి ఎన్నింటి దాకా సార్’ అని అడిగాడు. ‘ఎంత ఆసక్తి’ అని ఆశ్చర్యపోతూనే, ‘ఎందుకు అడిగాడో’ అనుకుంటూ నాకు తెలిసిన సంగతి చెప్పాను. మంత్రి గారి బందోబస్తు కోసమే అదంతా అని ఆఖరుకు కానీ నాకు అర్థం కాలేదు.

3 వ్యాఖ్యలు: