అంతా అనుకున్నట్లే అయింది. మెగా తారగా ప్రేక్షకుల మనస్సు దోచుకున్న చిరంజీవి మళ్ళీ సినిమాల్లో నటించనున్నట్లు ఎట్టకేలకు స్వయంగా ధ్రువీకరించారు. ఆ రకంగా చిరంజీవి నటించడం ఖాయమే! అంటూ అందరి కన్నా ముందుగా భవిష్యత్తును అంచనా వేస్తూ సరిగ్గా నెల రోజుల క్రితం (ఆగస్టు 7న)ఈ బ్లాగులో రాసిన పోస్టు అక్షరాలా నిజమైంది. సమాజంలో అందరికీ ఉపయోగపడే సందేశం ఇచ్చేలా తన తాజా చిత్రం ఉండబోతున్నట్లు చిరంజీవి ఈ రోజు (సెప్టెంబర్ 8న) ప్రకటించారు. నటుడిగా ఇది ఆయనకు 150వ సినిమా కానుంది.
రజనీకాంత్ - శంకర్‌ల తాజా చిత్రం 'రోబో' తెలుగు ఆడియో విడుదలలో జూలై చివరలో చిరంజీవి మాట్లాడినప్పటి నుంచి ఆయన సినీ రంగ పునఃప్రవేశంపై వార్తలు వస్తూ వచ్చాయి. ఆగస్టు ద్వితీయార్ధంలో పుట్టిన రోజున చిరంజీవి నుంచి సినిమా ప్రకటన వెలువడుతుందని కూడా
ఊహాగానాలు వచ్చాయి. ఎట్టకేలకు ఈ రోజు చిరు తాజా ప్రకటనతో ఆ సస్పెన్స్‌కు తెరపడింది. మెగాస్టార్ నటించాల్సిందేనంటూ అభిమానుల
నుంచి ఒత్తిడి, జనంలో ఆసక్తి క్రమంగా పెరిగేలా చూసుకుంటూ వచ్చిన చిరు ఆ టెంపోను కావలసినంత మేరకు పెంచి, ఎట్టకేలకు పచ్చజెండా
ఊపారు.
"శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్. తదితర చిత్రాల తరహాలోనే ఈ రానున్న సినిమాలో కూడా చక్కటి సందేశం ఉంటుంది. అయితే, నేరుగా సందేశం చెబితే ఎవరికీ ఎక్కదు. అందుకని కథను వినోదాత్మకంగా నడిపిస్తూ, అంతర్లీనంగా సందేశాన్ని చెప్పాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడు నేను మళ్ళీ నటించే చిత్రం కూడా అదే పద్ధతిలో ఉంటుంది..." అని చిరంజీవి స్పష్టం చేశారు. "వచ్చే ఏడాదిలో ఆ సినిమా విడుదల అవుతుంద"ని కూడా చిరు తన అభిమానులకు చల్లని కబురు చెప్పారు. కుమారుడు రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా ఈ చిరు 150వ చిత్రం రూపొందనున్నట్లు ఆంతరంగిక వర్గాలు చెబుతున్నాయి.చిరంజీవి ఇప్పుడు కథల ఖరారీ పనిలో పడ్డారు.
దర్శక, నిర్మాతలు, కథ ఖరారు మాటెలా ఉన్నా, దాదాపు మూడేళ్ళుగా పూర్తి స్థాయి నటనకు దూరమై, ఒంటి మీద అదుపు తప్పిన చిరంజీవి తన తాజా 150వ సినిమా కోసం ఇప్పటికే రోజూ వ్యాయామం చేస్తూ, సన్నబడేందుకు కష్టపడుతున్నారు. తప్పదు మరి. ఎంతైనా, 'కష్టే ఫలి' అన్నారు కదా పెద్దలు. మొదటి నుంచి ఆ మాటను నిరూపిస్తూ వస్తున్న చిరంజీవికి ఆ సంగతి మన కన్నా బాగా తెలుసు. కాదంటారా!?
డియర్ మేరీ
4 months ago
1 వ్యాఖ్యలు:
Interesting.. కథల మీదా, వళ్ళు తగ్గటం మీదా సమయాన్ని వెచ్చించి సినిమాలు చేస్తే.. మరి ప్రజా రాజ్యం? పోలవరం సమస్య తీరే దాకా చేస్తానన్న అలుపెరుగని పోరాటం? ఆయన మాటల మీద నమ్మకం తో ఓట్లేసిన జనం?
Post a Comment