(ఫోటో వివరం - ‘గాయం-2’లో జగపతిబాబు)
................కొన్నేళ్ళ క్రితం ‘గాయం’ సినిమా వచ్చినప్పుడు అదో సంచలనం. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం, సీతారామశాస్త్రి పాటలు, కోట శ్రీనివాసరావు నటన - ఇవన్నీ ఇప్పటికీ మర్చిపోలేని అంశాలు. ఆ సినిమా వేసిన బలమైన ముద్ర కారణంగా, దానికి సీక్వెల్ గా ‘గాయం -2’ వస్తోందంటే ఆసక్తి కలిగింది. విడుదలైన వారానికి ఇప్పుడు ఆ సినిమా చూడడం, రాయడం కుదిరింది. సినిమా చూశాక నాకు అనిపించిన భావాలే ఈ తాజా టపా.
విజయం అందించిన సూత్రాన్ని విడిచిపెట్టడం ఎవరికైనా అంత సులభం కాదు. అందులోనూ ఏదీ కలసి రానప్పుడు, గతంలో ఎప్పుడో కలిసొచ్చినదాన్ని ఆశ్రయిస్తే, మళ్ళీ విజయం తథ్యమని మనిషి నమ్ముతాడు. ఆ నమ్మకాలు సినిమా వాళ్ళకైతే మరీను. ఒకసారి హిట్ ఇచ్చిన ఫార్ములాను పదే పదే వాడడంలో వారు సిద్ధహస్తులు. కోట్లతో ముడిపడిన సినిమా వ్యాపారంలో ఇది సహజం కూడా. కొంతకాలంగా సరైన విజయాలు లేక అల్లాడుతున్న సినీ హీరో జగపతిబాబు కూడా సరిగ్గా అదే చేశారు. చాలా ఏళ్ళ క్రితం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చి, తన ఇమేజ్ ను మార్చేసి, హీరోగా నిలబెట్టిన ‘గాయం’ సినిమాను తాజాగా మళ్ళీ ఆశ్రయించారు. పాత కథకు కొనసాగింపుగా తెరపై కొత్త సన్నివేశాలు చూపిస్తే, జనం మరోసారి లైఫ్ ఇస్తారని ఆశపడ్డారు. దాని ఫలితమే జగపతిబాబు నటించగా ప్రవీణ్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘గాయం-2’.
వచ్చిన చిక్కేమిటంటే, మొదటి ‘గాయం’ సినిమాలోని పాత్రలను తీసుకున్నారే తప్ప, వాటి ఆలోచనా రీతిని దర్శక, రచయితలు అర్థం చేసుకున్నట్లు లేరు. ఆ యా పాత్రల ప్రవర్తననూ, వాటి మధ్య సైద్ధాంతిక సంఘర్షణనూ తెరపై చూపడం, ప్రేక్షకుణ్ణి అందులో సంలీనం చేయడం మొదటి ‘గాయం’లోని విశేషం. కానీ, అలాంటి శ్రద్ధ లాంటివి ఏమీ ఈ రెండో చిత్రంలో లేవు. దాంతో, పేరు, రూపమే తప్ప, లోపల అసలు సరుకు లేకుండా పాత దానికి సీక్వెల్ తీసినట్లయింది. అందుకే, పాత సినిమా మీద ప్రేమతో ఈ కొత్త సినిమాకు వెళ్ళినవారి మనసుకు ఇది మానని గాయం.
పాత ‘గాయం’తో పోలికలు లేకుండా, తేకుండా ఈ సినిమా చూసినా సరే, అప్పటికీ ఇదేమంత గొప్ప ప్రయత్నం అనిపించదు. సగటు యాక్షన్ సినిమాయే అనిపిస్తుంది. అదే ఈ ‘గాయం-2’కు ఉన్న ఇబ్బంది.
కథ కూడా ముందుగానే అనుకున్న ఓ క్లైమాక్స్‌కు కావాల్సినట్లుగా వెనుక నుంచి ముందుకు సన్నివేశాలు అల్లుకున్నట్లుంది. అంతేతప్ప, పకడ్బందీగా లేదు. హీరో రామ్ (జగపతిబాబు) బ్యాంకాక్ లో ఓ రెస్టారెంట్ నడుపుతూ, భార్య విద్య (విమలారామన్), పిల్లవాడు చైతుతో ఆనందంగా జీవితం గడిపేస్తుంటాడు. హీరోకు ఓ బావమరిది (హర్షవర్ధన్). బ్యాంకాక్ అమ్మాయిని ప్రేమించే ఆ బావమరిదితో కాసేపు కామెడీ.
ఇది ఇలా ఉండగా, రెస్టారెంట్ కు వచ్చి, అమ్మాయి మీద అత్యాచారం చేయబోయిన ఇద్దరు సైకో కిల్లర్లను అనుకోనిరీతిలో హీరో చంపేయడం పెద్ద సంచలనం అవుతుంది. ఆ వార్త బ్యాంకాక్ నుంచి ఆంధ్రదేశం దాకా పాకి, ఇక్కడి తెలుగు టీవీ వార్తా చానళ్ళలో వచ్చేస్తుంది. టీవీలోని ఆ దృశ్యాల్లో రామ్ ను చూసి, ఎప్పటికైనా ముఖ్యమంత్రిని కావాలని తపిస్తున్న అసమ్మతి రాజకీయ నాయకుడు గురునారాయణ్ (కోట శ్రీనివాసరావు), అతని కొడుకు శంకర్ నారాయణ్ (కోట ప్రసాద్) బెంబేలెత్తిపోతారు. ఏళ్ళ క్రితం తాము చంపామనుకుంటున్న దుర్గాకూ, ఈ రామ్ కూ పోలికలు ఉండడంతో, అసలు హీరో ఎవరనే ఆరా వస్తుంది.
ఆ సంగతి కనుక్కోవడం కోసం బ్యాంకాక్ వస్తారు - విలన్ కొడుకు, విలన్ తరఫు లాయర్ సాబ్ (తనికెళ్ళ భరణి). హీరో కుటుంబాన్ని నానా ఇబ్బందులూ పెట్టి, అతనే ఒకప్పటి దుర్గా అన్న నిజాన్ని ఒప్పిస్తారు. తన భర్త ఒకప్పుడు పచ్చి గూండా నేత అనీ, చావుకైనా, చంపడానికైనా సిద్ధపడిన వ్యక్తి అనీ తెలిసి, హీరోయిన్ హతాశురాలవుతుంది. తాను ఎందుకు అలా ముఠా నేతగా తిరిగానో, ఎందుకిలా అందరికీ దూరంగా సగటు మనిషిలా బతుకుతున్నానో హీరోయిన్ కు హీరో టూకీగా చెబుతాడు. (ఈ ఫ్లాష్ బ్యాక్ ఘట్టంలోనే పాత ‘గాయం’ దృశ్యాలను తెరపై 5 నిమిషాల పైనే చూపించి, ప్రేక్షకులతో పునశ్చరణ చేయించారు. హింసను వదిలేసి, మామూలు జీవితం వైపు రావడానికి కారణంగా రేవతి, శివకృష్ణలతో ఒకటి రెండు కొత్త సన్నివేశాలు చూపారు).
పాత కథంతా తుడిచేసి, కొద్దికాలంగా బ్యాంకాక్ లో ప్రశాంత జీవితం గడుపుతున్న హీరో కాస్తా విలన్ల గొడవ పెరగడంతో ఒక్కసారిగా తన అసలు రూపం చూపుతాడు. రామ్ అన్న ముసుగు తీసేసి, మళ్ళీ దుర్గా అవతారమెత్తి, శత్రువులను ఏరేసేందుకు హైదరాబాద్ వస్తాడు. ఇక అక్కడ నుంచి గురునారాయణ్ తదితరులకూ, హీరోకూ మధ్య వ్యూహ ప్రతివ్యూహాలు, నరకడాలు, చంపడాలతో ద్వితీయార్ధమంతా నడుస్తుంది.
ఇద్దరు భార్యల ముద్దుల మొగుడనే కుటుంబ కథల ఇమేజ్ కు ముందు తనకు యాక్షన్ ఇమేజ్ తెచ్చిన ఒకప్పటి ‘గాయం’ కథ మీద జగపతిబాబు చాలానే కష్టపడ్డారు. వయసు మీద పడినట్లు కనిపించేస్తున్నా, అటు అమాయకుడైన రామ్ లాగా, ఇటు అన్నీ తెలిసిన దుర్గ లాగా రెండు పూర్తి భిన్నమైన షేడ్లను ఒకే పాత్రలో పలికించడంలో ఆయన విజయం సాధించారనే చెప్పాలి. ముఖ్యంగా తాను దుర్గను కాదు, రామ్ ను అని కన్నీళ్ళ పర్యంతమవుతూ నమ్మించే సీన్లో బాగా చేశారు.
హీరో భార్య పాత్రలో విమలా రామన్ ఓ.కె. ఎవరైనా ఎపుడైనా లాంటి చిత్రాల్లో కుర్ర హీరోయిన్ పాత్రల కన్నా ఇలాంటి ప్రౌఢ పాత్రలే ఆమెకు సరిపోతాయనిపిస్తుంది. అప్పటి ‘గాయం’ నాటికి కొత్తగా కనిపించినా, ఇప్పటికొచ్చేసరికి గురునారాయణ్ తరహా పాత్రలు కోట శ్రీనివాసరావు చాలానే చేసేశారు. మనమూ చూసేశాం. అయినా సరే, మళ్ళీ ‘గాయం-2’లోనూ ఆ పాత్రకు అలవాటైన రీతిలో ప్రాణం పోశారు కోట. ఇక ఈ సినిమాలో గుర్తుంచుకోదగ్గ పాత్రలేవీ పెద్దగా లేవనే చెప్పాలి. నిజజీవితంలో కోట శ్రీనివాసరావు కుమారుడైన ప్రసాద్ ఈ సినిమాలో కూడా ఆయన కుమారుడిగా నటించడం, సినిమాలో లానే జీవితంలో కూడా ఇటీవల అర్ధంతరంగా చనిపోవడం విధి వైచిత్రి అనిపిస్తుంది.
ఈ చిత్ర కథా రచయిత, దర్శకుడు ప్రవీణ్ శ్రీ కొత్తవారనుకుంటా, అయినా దృశ్యాన్ని తెరపై చూపడంలో మాత్రం ఇప్పటికే ఎందరో వెళుతున్న బాటనే అనుసరించారు. సంగీతానికి ఇళయరాజా, ఫైట్లకు రామ్ - లక్ష్మణ్ - ఇలా ఈ సినిమాకు పేరున్న సాంకేతిక నిపుణులు చాలామందే పనిచేశారు. కొన్నిచోట్ల రీ-రికార్డింగ్ లో ఇళయరాజా మార్కు కనిపిస్తుంది. అలాగే, ఆయనే పాడిన ‘కల గనే కన్నుల్లో కరగకే కన్నీరా...’ అనే సందర్భోచిత విషాద గీతం ఇప్పటికే విన్న ఆయన పాటల బాణీలోనే ఉన్నా, విన్నకొద్దీ వెంటాడుతుంది. మిగిలిన పాటల మాటెలా ఉన్నా ‘ఎందుకమ్మా ప్రేమా ప్రేమా గుండెలోన ఆగేవమ్మా రా...’ అన్న పాటకు ఆయన బాణీ చెవికి ఇంపుగా తోస్తుంది. కాకపోతే, హీరో హీరోయిన్ల మధ్య సాగే ఈ గీతం చిత్రీకరణ మటుకు పచ్చి ‘మిడ్ నైట్ మసాలా’ పాటల ధోరణిలో వెళ్ళింది. రాగల కొద్దిరోజుల్లో ఈ పాట ఆ తరహా టీవీ పాటల్లో తప్పనిసరిగా పదే పదే కనిపించడం ఖాయం.
‘‘పవర్, పదవి ఒకరిస్తే తీసుకొనేది కాదు బిడ్డా., మనం గుంజుకొనేది’’ (కొడుకు పాత్రధారితో కోట శ్రీనివాసరావు), ‘‘చావు కన్నా భయం చాలా భయంకరమైనది. పారిపోవడం మొదలుపెడితే, చచ్చేవరకూ వెంటాడుతూనే ఉంటుంది’’ లాంటి చోట్ల రవిరెడ్డి,గంధం నాగరాజు రాసిన డైలాగులు మెరిశాయి. గమ్మత్తు ఏమిటంటే, తెలుగునాట ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలను అన్యాపదేశంగా ఈ కథలో వాడుకున్నారు. నాయకుల నిరాహారదీక్షలు, దీక్షా శిబిరాలు, దీక్షా భగ్నాలు, విద్యార్థుల ఉద్యమంలో అసాంఘిక శక్తుల ప్రవేశం, తమ స్వార్థం కోసం విద్యార్థులను బలి తీసుకొని - దొంగ సూసైడ్ నోట్లతో ఆత్మబలిదానాలుగా చిత్రించే ప్రయత్నం లాంటివన్నీ ఇటీవలి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఘటనల ప్రేరణతో తెరపైకి వచ్చినవే. ‘‘మన నీళ్ళు మనం అడిగినం. మన వాటా ఉద్యోగాలు మనం అడిగినం. ఇందులో తప్పేంటి. నోటి కాడ కూడు కొట్టేయద్దని అన్నాం. దీనికే కాల్పులు, బంద్ లా’’ అంటూ కోట నోట వినిపించే డైలాగులు ఎవరివో, సామాన్య తెలుగు ప్రేక్షకుడికి కూడా ఇవాళ చెప్పనక్కరలేదు.
అలాగే, మీడియా మీద విసుర్లు కూడా ఉన్నాయి. టీవీ 9 చానల్ నూ, ఆ నిర్వాహకులను గుర్తుకు తెచ్చే పాత్రలనూ, పేర్లనూ చూపెడుతూ, ‘‘ఇవాళ సెన్సేషనల్ న్యూస్ కూ, పెయిడ్ న్యూస్ కూ తేడా లేదు’’ అని ఓ టీవీ చానల్ నిర్వాహకుడి పాత్ర నోటి వెంట పలికించారు. అయితే, సహజంగానే ఈ అంశాలను వేటినీ లోతుగా చర్చించలేదు. సినిమా కథకో, చాలా వరకు కమర్షియల్ విజయానికో కావాల్సినంత వరకే వాడుకోవడంతో సరిపెట్టారు.
మొత్తం మీద ఇది పక్కా ‘ఏ’ సర్టిఫికెట్ యాక్షన్ చిత్రం. ప్రథమార్ధమంతా కాసేపు కుటుంబ జీవితం, కాసేపు కామెడీ, కాసేపు విలన్ల హంగామా - ఇలా గడిచిపోతుంది. ఒకప్పటి దుర్గాయే హీరో అన్న సంగతి తెలిసేసరికి ఇంటర్వెల్ బ్యాంగ్. అక్కడ నుంచి కథ రసకందాయంలో పడాల్సింది. కానీ, ద్వితీయార్ధం మొత్తాన్నీ విలన్లను వేటాడే హీరో హంగామాగా నడిపేశారు. దాంతో, ప్రేక్షకులకు నిరాశ కలుగుతుంది. పాత సినిమాతో పోలికలు వచ్చి, అసంతృప్తి అనిపిస్తుంది. వెరసి ఇది - మరపురాని పాత జ్ఞాపకాలకు గాయం.
0 వ్యాఖ్యలు:
Post a Comment