(‘కొమరం పులి’ సమీక్ష - పార్ట్ 2) (ఫోటో వివరం - ‘కొమరం పులి’గా పవన్ కల్యాణ్) ..................
ఎంతో ఆసక్తిగా వెళ్ళిన ప్రేక్షకుడికి ‘కొమరం పులి’లో ఫస్టాఫ్ కొంత కాగానే, విసుగు మొదలవుతుంది. ఇంటర్వెల్ కు వచ్చేసరికి అది పై స్థాయికి చేరుతుంది. నిజానికి, ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ లో రకరకాల ఘట్టాలు, కథలో ముందుకు చలనం ఉన్నాయి. కానీ, చిత్రంగా సెకండాఫ్ కాసేపయ్యాక కథ కానీ, కథలో పురోగమనం కానీ పెద్దగా లేని ‘‘ఫస్టాఫే బెటర్రా నాయనా’’ అనిపిస్తుంది. దానికి బాధ్యులు దర్శక, రచయితలే!
పాత్రలు - పాత్రధారుల పనితనంఈ సినిమాకు మొదట అనుకున్న పేరు ‘పులి’ అనే! ఇంతలో పవన్ కల్యాణ్ ప్రమేయమో, అప్పట్లో తెలంగాణ ఉద్యమకారులను మంచి చేసుకొనే ప్రయత్నమో కానీ, దానికి ముందు ‘కొమరం’ వచ్చి చేరింది. (ఇప్పుడు అదే తెలంగాణ విద్యార్థి వర్గంతో వివాదమవుతోంది. అదే వేరే కథ). నిజానికి, మొదలైన దగ్గర నుంచి ఈ సినిమాకు ఏదో ఒక ఇబ్బంది. చిరంజీవి రాజకీయ రంగప్రవేశం, మొదటి వివాహానికి సంబంధించి పవన్ కల్యాణ్ ఎదుర్కొన్న వ్యక్తిగత ఇబ్బందులు, అసెంబ్లీ ఎన్నికలకు పవన్ ప్రచారం - ఇలా రకరకాల స్పీడ్ బ్రేకర్లతో ముచ్చటగా మూడేళ్ళకు ఈ ‘పులి’ జనారణ్యంలోకి వచ్చింది.
పవన్ కల్యాణ్ ను దృష్టిలో ఉంచుకొని రాసుకున్న పాత్ర కాబట్టి, అది ఆయనకు సరైన ఆది చొక్కా తొడిగినట్లు అతికింది. కాకపోతే, ప్రధాని ముందు కవాతు చేస్తూ నడిచొచ్చే లాంటి చోట్ల పోలీసు పాత్ర ఆయన శరీరధర్మానికి సరిపోలేదని తేలిపోతుంది. నవ్వు, ఏడుపు, ధీరత్వం - ఇలా వేర్వేరు భావోద్వేగాలను కూడా ఆ యా ఘట్టాలకు తగినట్లు ఆయన పలికించారు. సుదీర్ఘమైన డైలాగులను కూడా బాగానే చెప్పడానికి ప్రయత్నించారు కానీ, ఆగకుండా ఒకదానిపై మరొకటిగా వచ్చిపడిపోయే అవి సరిగ్గా అర్థం కావాలంటే, కనీసం మూడోసారైనా చూడక తప్పదు. అభిమానులు సరే కానీ, మామూలు ప్రేక్షకుడికి అంత తీరిక, ఓపిక ఉంటాయా అన్నది ఎంతలేదన్నా ప్రతిసారీ ఓ నలభై, యాభై రూపాయల ప్రశ్న (చిన్న ఊరు, మామూలు థియేటర్ కాకపోతే ఈ ప్రశ్న ఖరీదు బాగా పెరిగిపోతుంది).
విలన్ గా మనోజ్ బాజ్ పాయ్ బాగానే చేశారు. కానీ, అసలు ఆ పాత్రలోనే ఓ నిర్దిష్టత కానీ, పాత్రౌచిత్యం కానీ లేవు. రాష్ట్రాన్నీ, దేశాన్నీ గడగడలాడించగల అంత పెద్ద మాఫియా నేత ఓ కారు కోసం గందరగోళపడినట్లు చూపడం అర్థం లేని విషయం. ఇక, ముఖ్యమంత్రి, ఐ.జి. కూడా గుప్పెట్లో ఉన్న సదరు విలన్, ఓ ఐ.పి.ఎస్. అధికారికి అంత చులాగ్గా బెదరడమూ విచిత్రమే. పైపెచ్చు, ఓ దశ దాటాక, విలన్ ను దాదాపు కమెడియన్ స్థాయికి దించేశారు. అయితే, విలన్ కు పి. రవిశంకర్ (‘అరుంధతి’ చిత్రంలో ‘వదల బొమ్మాళీ వదల’ అనే గొంతు గుర్తుందిగా) డబ్బింగ్ అలరిస్తుంది.
హీరో తల్లి పాత్రను కాసేపు సెంటిమెంట్ కూ, కాసేపు జిజియాబాయి తరహా ధీరత్వానికీ బాగానే వాడుకున్నారు. పొట్టిగా ఉన్నా, గుట్టు లేకుండా తెరపై గట్టిగానే కనిపించిన నిఖిషా పటేల్ తన శృంగారోచిత చేష్టలు, మాటలతో (డబ్బింగ్ వేరెవరిదో లెండి) మాస్ ను ఆకర్షిస్తారు. కానీ, పాటలకూ, కామికల్ రిలీఫ్ కే తప్ప, ఆ పాత్రకు ప్రాధాన్యం పూజ్యం.
విలన్ కు గర్ల్ ఫ్రెండ్ గా, క్యాసినోలో ‘...దోచేయ్ దొరికింది దోచెయ్....’ అనే ప్రత్యేక నృత్య గీతంలో శృంగార నర్తకిని మించి నర్తించారు - అతిథి నటి శ్రియ. ఆ పై మరొక్క సీన్ లోనే ఆమె కనిపిస్తారు. అదంతా చూశాక, ఎంతటి హీరోయిన్ కు ఇంతటి దుఃస్థితి అనిపించక మానదు. కర్తవ్యానికీ, మాఫియా బెదిరింపులకూ మధ్య నలిగే ఏ.సి.పి.గా నాజర్, మాఫియా నేతకు చెమ్చాగిరీ చేసే ఐ.జి. రంజిత్ ప్రసాద్ గా చరణ్ రాజ్ ఎదురవుతారు. పేపర్ బాయ్ (బాల నటుడు భరత్), కనిపించకుండా పోయిన హుస్సేన్ (ఎస్.జె. సూర్య ఫోటో మాత్రం కనిపిస్తుంది) లాంటి పాత్రలతో ముందుగా కొన్ని సీన్లు తీసినా, ఆఖరి కూర్పులో అవేవీ మిగలలేదని సినిమా చూసినప్పుడు అనిపిస్తుంది.
సాంకేతిక విభాగాల సంగతిఆస్కార్ అవార్డుల విజేత ఏ.ఆర్. రెహమాన్ అందించిన సంగీతంలోని పాటల్లో ఎక్కువ భాగం వడి వడిగా నడిచే పాటలే. సినిమా నడిచినన్నాళ్ళే తప్ప, విడిగా గుర్తుండేవి కావు. మారాలంటే లోకం.... పాట రెహమాన్ గొంతులో నేపథ్య గీతంగా వినిపిస్తుంది. అలాగే, ‘మా తెలుగుతల్లికీ మల్లెపూదండ...’ అన్న పదాలకు రెహమాన్ తన గొంతులో కొత్త జోష్ తెచ్చే ప్రయత్నం చేశారు. ‘ఓ చెకుముకీ...’ పాట కుర్రకారుకూ, ‘పవర్ స్టార్...’ పాట అభిమానులకూ పట్టవచ్చు. పాటలన్నీ చంద్రబోస్ రచనలు. కాకపోతే, (సంగీత) శబ్దాల హోరులో (సాహిత్య) శబ్దమేమిటో అర్థం కావాలంటే తాతలు దిగొస్తారు. ముంబయ్ కెమేరామన్ బినోద్ ప్రధాన్ తన ప్రతిభ చూపారు. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ, థాయిలాండ్ దృశ్యాల లాంటి చోట్ల గుర్తింపు వస్తుంది.
ప్రభాకరన్ ఎడిటింగ్ సో సో. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల మధ్య శాబ్దిక లయ ప్రధానంగా వచ్చే ఓ వేగవంతమైన పాటలో ఆ లయకు తగ్గట్లు చకచకా షాట్లు కట్ చేస్తూ, దృశ్యభాగాన్ని కూర్చడం ప్రేక్షకుల కళ్ళకు సంతోషం కన్నా, శ్రమే మిగిల్చింది. మధ్యలో ‘...నోటి ముత్యాల్ జారనీయకే...’ అంటూ వచ్చే ఆ పాట మొత్తం ముక్కలు ముక్కల తెలుగు వినడం ఓ నరకం.
హాలీవుడ్ ప్రేరణతో చేసిన యాక్షన్ సన్నివేశాలు (ముఖ్యంగా మొదట్లోనే వచ్చే ప్రధానిపై హత్యాయత్న భగ్నం ఘట్టం) మాస్ కు బాగుంటాయి. వాటికి పడ్డ శ్రమ, ఖర్చు కూడా ఎక్కువే. కానీ, హెలికాప్టర్ లో నుంచి హీరో కిందకు దూకేయడం, భవనాల మీద నుంచి గాలిలోకి, గాలిలో నుంచి భవనాల మీదకు వేసే గ్రాఫిక్స్ గెంతులు నమ్మశక్యంగా లేవు.
సినిమా అంటే కొంత కల్పన, ఎంతో ఎగ్జాగరేషన్ తప్పవనుకున్నా సరే, నర మానవులకు సాధ్యం కాని ఈ విన్యాసాలు నవతరం ప్రేక్షకుల్ని నవ్విస్తాయి. హాలీవుడ్ చిత్రాల నుంచి ప్రేరణ పొందడం తప్పు కాదు కానీ, సహజత్వానికి దగ్గరగా, నమ్మించేలా లేకపోతే, ఎంతటి శ్రమైనా, బూడిదలో పోసిన పన్నీరే అనడానికి ఇది తాజా ఉదాహరణ.
మితి మీరిన మాటల విన్యాసం‘జల్సా’ (2008)లో ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర సంజయ్ సాహూ పాత్ర (హీరో పవన్ కల్యాణ్) మనసులోని మాటలు గట్టిగా, సుదీర్ఘంగా బద్దలవడం చూశాం. ఆ ఆవేశభరిత నటన చూసి, దాని ప్రేరణతోనో ఏమో, సినిమా అంతా హీరో అదే పద్ధతిలో మాట్లాడే విధంగా ఈ ‘కొమరం పులి’ కథ, కథనం అల్లుకున్నారు. పిడుగుకీ, బియ్యానికీ ఒకే మంత్రం వాడి, పీకల మీదకు తెచ్చుకున్నారు.
ఈ సినిమాలో చాలా చోట్ల కథానాయకుడు నాన్ స్టాప్ ఎక్స్ ప్రెస్ లా మాట్లాడుతూ, ధ్వనికాలుష్యం చేస్తూనే ఉంటాడు. దేశం గురించి, వ్యవస్థ గురించి ఆ పాత్ర చేసే పరిశీలనలు విలువైనవిగా అనిపించినా, మొదటి రెండు మూడు సార్లు గడిచాక, భరించడం కష్టమే. దాంతో, ‘...చస్తూ బతికేవాడి కన్నా, చచ్చినా బతికేవాడిగా ఉండాలి...’ లాంటి పంచ్ లు కూడా గాలికి పోయాయి.
ఈ సినిమా టైటిల్స్ లో మాటలకు ఇద్దరి పేర్లు వచ్చాయి. మొదట్లో మాటలు - సిప్పీ అని వేశారు. ఆ తరువాత మళ్ళీ ఏమనుకున్నారో ఏమో టైటిల్స్ చివరకొచ్చేసరికి, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంటూ ఎస్.జె. సూర్య అని క్రెడిట్ వేశారు. ఈ గొడవేమిటో అర్థం కాదు. లోతుగా గమనిస్తే, కో-డైరెక్టర్, పవన్ కల్యాణ్ దగ్గర సన్నిహితుడూ అయిన సిప్పీ యే మాటలు ఎక్కువగా రాశారేమో అనిపిస్తుంది. దేశం గురించి, వ్యవస్థ గురించి హీరో చేసే సుదీర్ఘ ఉపన్యాసాల్లో పవన్ కల్యాణ్ ప్రేరేపణతో సిప్పీ రాసి ఉండవచ్చని అనుమానం వస్తుంది.
అలాగే, ఇంతా చేసి తండా ప్రాంతంలో పుట్టి పెరిగిన హీరో పేరు కొమరం పులి అయితే, అతని తండ్రి పేరు రాజా రెడ్డి అని సినిమా మొదటి సీనులో మాటల్లో అనిపించారు. (ప్రేక్షకుల అరుపుల మధ్య నాకైతే అలాగే వినిపించింది). సినిమాలో హీరో పేరు - కాసేపు ‘కొమరం’ పులిగా, మరికాసేపు ‘కొమ్రం’ పులిగా కనిపిస్తుంది. హీరో మాటలు కూడా ఉన్నట్లుండి తెలంగాణ మాండలికంలోకి మారడం, ఆ వెంటనే మళ్ళీ అదేమీ లేకుండా పోవడం లాంటి విచిత్రాలు కూడా ఉన్నాయి.
ఇది దర్శకత్వ ప్రతిభే...నిజానికి, ఈ సినిమా పట్ల సవాలక్ష అసంతృప్తులకు దర్శకత్వం, స్క్రీన్ ప్లే లోపాలే ప్రధాన కారణం. తమిళంలోనే అవకాశాలు లేక అల్లాడుతున్న దర్శకుడు ఎస్.జె. సూర్యను తెచ్చి నెత్తిన పెట్టుకున్న మన వాళ్ళ పొరుగింటి పుల్లకూర అభిరుచికి జోహార్. శృంగారం మీదే తప్ప యాక్షన్ దృశ్యాల మీద పట్టు లేని సూర్య ఇందులోనూ ఆ పనే చేశారు. సీరియస్ గా సాగాల్సిన కథను ఒక రకంగా హీరో, హీరోయిన్ల మధ్య ట్రాక్ తో పక్క దోవ పట్టించారు.
అన్నట్లు పవన్ కల్యాణ్ కు గిటార్ మీద ఎంత మోజుంటే మాత్రం ప్రతి సినిమాలోనూ హీరోయిన్తో, గిటార్ తో కనిపించాలా. ‘తొలి ప్రేమ’, ‘బాలు’... తరువాత మళ్ళీ ఇందులోనూ ఓ పాటలో అదే దృశ్యం. దాంతో, పాత సినిమా చూస్తున్నామని అనిపిస్తే అది ప్రేక్షకుల పొరపాటేమీ కాదు.
ఎంచుకున్న అంశమే అంతంత మాత్రమైనప్పుడు, దాన్ని తెరపైకి ఎలా ఎక్కించాలన్న దానిపైన అయినా శ్రద్ధ పెట్టాల్సింది. కానీ, అందులోనూ దర్శకుడి పనితనం ఏమీ లేకుండా పోయింది. ‘‘...బావ గారూ, కొంచెం తిని, పెట్టండి...’’ (హీరోయిన్ అన్నం ప్లేటు తీసుకురాగానే, అప్పుడే పెళ్ళయిన హీరోతో అలీ అనే మాట), ‘‘...ఏయ్ పవర్ స్టారూ, నీ పవర్ బయటే కాదు. ఇంట్లో కూడా కొంచెం చూపించు.... ’’ (పెళ్ళయినా సరే కర్తవ్యమంటూ ఇల్లు పట్టకుండా తిరిగే హీరోను సంసారం ముగ్గులోకి దింపే ప్రయత్నంలో హీరోయిన్) లాంటి డైలాగులు, చేష్టలతో సినిమాను వినోదాత్మకంగా మలిచినట్లు భ్రమపడ్డారు.
రకరకాల మూడ్స్ పుణ్యమా అని సినిమాల్లో నటించక అభిమానులనూ, నటిస్తున్నప్పుడు దర్శక - నిర్మాతలనూ కొంత ఇరకాటంలో పెడతాడని పవన్ కల్యాణ్ గురించి పరిశ్రమలో చెవులు కొరుక్కుంటూ ఉంటారు. కానీ, ఈసారి మాత్రం ఆయన తన ఆలోచనలకు దగ్గరగా ఉన్న ‘కొమరం పులి’ సినిమాలో రమారమి మూడేళ్ళు నటించి, తన నుంచి కమర్షియల్ సినిమా కోరుకొనే అభిమానులను సైతం ఇరకాటంలో పడేశారు.
కొసమెరుపు: పేజీల కొద్దీ డైలాగులు ఆగకుండా, అర్థం కాకుండా, పదే పదే చెప్పే హీరో పాత్రను చూసిన మత్తులో హాలులో నుంచి బయటకు వస్తూ ఓ కుర్రాడు చేసిన కామెంట్ - ‘‘అబ్బ... బాలకృష్ణ సినిమా చూసినట్లుంది. ’’ ఇక, సినిమా చూశాక, ఓ సగటు ప్రేక్షకుడు తన మిత్రులకు మొబైల్ లో పంపిన మెసేజ్ - ‘‘బాబా (బో)య్, ‘పులి’ తినేసింది!’’ దానికి అవతలి విశ్లేషక మిత్రుడు ఇచ్చిన రిప్లయ్ మెసేజ్ ఇది - ‘‘ఎవడెళ్ళమన్నాడు - క్రూర జంతువని తెలిసి!?’’
0 వ్యాఖ్యలు:
Post a Comment