జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Thursday, December 23, 2010

వసూళ్ళ యావే తప్ప, ఆత్మే లేని ఆత్మ కథ ‘నాగవల్లి’ఓ సినిమా పొరపాటునో, గ్రహపాటునో, అనుకోకుండా అన్నీ కుదిరో హిట్టయితే చాలు - ఆ కథను వివిధ భాషల్లో తెరకెక్కించడానికీ, అదే ఫార్ములాతో రకరకాల కథలు అల్లుకోవడానికీ మన దర్శక - నిర్మాతలు అత్యుత్సాహం చూపిస్తుంటారు. పదిహేడేళ్ళ క్రితం మలయాళంలో హిట్టయిన ‘మణి చిత్ర తాళు’ కథ ఇప్పటికి ఎన్ని రూపాలు ధరించిందో చూస్తే, ఆ మాట కచ్చితంగా నిజమని ఎవరైనా ఇట్టే చెప్పవచ్చు. కేరళ ప్రాంతపు ఓ రాజవంశంలో జరిగిన నిజ జీవిత కథగా ప్రచారంలో ఉన్న అంశాలను ఆధారంగా చేసుకొని ఆ మలయాళ చిత్రం తయారైంది. ప్రజాదరణ పొందిన ఆ చిత్రంలో నాయిక పాత్ర నటి శోభనకు జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్నీ తెచ్చింది. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే - ఆ సినిమా తెలుగులో డబ్బింగ్ కూడా జరుపుకొంది.

రీమేకులు తీయడంలో దిట్ట అయిన దర్శకుడు పి. వాసు అదే సినిమాను కన్నడంలో ‘ఆప్తమిత్ర’గా, తమిళంలో ‘చంద్రముఖి’గా రూపొందించారు. రెండూ సూపర్ హిట్ కావడంతో వాసులో మరో ఆశ మొగ్గ తొడిగింది. ఈ కథకు కొనసాగింపుగా మరో కథ అల్లుకొని, ‘చంద్రముఖి -2’గా రజనీకాంత్ తోనే మళ్ళీ తీయాలని తెగ ఉత్సాహపడ్డారు. కానీ, రజనీ పచ్చజెండా ఊపకపోవడంతో, ఆ కథనే కన్నడ సూపర్ స్టార్ విష్ణు వర్ధన్ తో ‘ఆప్త రక్షక’గా తీశారు. సరిగ్గా విష్ణువర్ధన్ మరణం, ఆ సినిమా రిలీజు ఒకే సమయంలో జరగడంతో ఆ మహానటుడి ఆఖరి సినిమాగా జనం ఆ కథకు బ్రహ్మరథం పట్టారు. దాంతో, సహజంగానే దాని తెలుగు రీమేక్ కు మన వాళ్ళు ఎగబడ్డారు. రీమేకుల నిర్మాణానికి వేయి కళ్ళతో కాచుకొని ఉండే బెల్లంకొండ సురేశ్ తెలుగులో దీని హక్కులు తీసుకున్నారు. పి. వాసు దర్శకత్వంలోనే ఇది ‘నాగవల్లి’గా రీమేక్ అయింది.

రజనీకాంత్ నటించిన పాత్రకు కొనసాగింపు, విభిన్నమైన గెటప్ తో కూడిన రాజు పాత్ర లాంటివి కన్నడ మాతృకలో చూసి మురిసిపోయిన తెలుగు హీరో వెంకటేశ్ ఏరి కోరి ఈ రీమేక్ లో నటించారు. కానీ, ఎంత ఆత్మల కథ అయినా కథలో ఆత్మ లేకపోతే, లాభం లేదని మరో మారు ‘నాగవల్లి’ నిరూపించింది. నటుడనే వాడికి రకరకాల పాత్రల మీద ప్రేమ ఉంటే చాలదు, ఆ పాత్రపోషణకు మనం సరిపోతామా, లేదా అన్న ఆలోచన, అవగాహన కూడా ఉండాలని ‘నాగవల్లి’ చూస్తే అర్థమవుతుంది. మానిటర్లో చేసిన షాట్ చూసుకొనే సౌకర్యాలు సైతం ఉన్న ఈ రోజుల్లో ఈ చిత్రంలోని నటీనటులు, దర్శకుడు పాత్రపోషణకు కావాల్సిన కనీసపు జాగ్రత్తలు కూడా తీసుకున్నట్లు కనిపించదు.

అసలు ‘చంద్రముఖి’ సినిమాలో ఏ అంశం జనానికి అంతగా పట్టిందో అర్థం కాక ఇప్పటికీ కొందరు జుట్టు పీక్కుంటున్న తరుణంలో, దానికి సీక్వెల్ నంటూ ‘నాగవల్లి..... చంద్రముఖి’ వచ్చింది. నూరేళ్ళ పైచిలుకు నాటి చంద్రముఖి తైలవర్ణ చిత్రం ఓ చిత్రకారుడికి దొరకడంతో ఈ కథ మొదలవుతుంది. ఆ వర్ణచిత్రం కారణంగా చిత్రకారుడు మరణించడం, శాస్త్రీయ నృత్య పోటీల్లో ఆ చిత్రాన్ని బహుమతిగా పొందిన వెంటనే గాయత్రి (కమలినీ ముఖర్జీ) భర్త యాక్సిడెంట్ కు గురై మరణించడం, ఆ పటాన్ని తెచ్చుకున్న గాయత్రి కుటుంబంలో ఆడపిల్ల పెళ్ళిళ్ళు చెడిపోతూ ఉండడం లాంటివన్నీ జరుగుతాయి. తిరుపతి సమీపంలో ఓ కలవారి ఇంట్లో ఓ 30 అడుగుల పాము కనిపిస్తుంటుంది. ఆ చిత్రవిచిత్ర సమస్యలన్నిటి నుంచి బయట పడడం కోసం వారు దైవశక్తి గల రామచంద్ర సిద్ధాంతి (అవినాశ్)ని కలుస్తారు. ఈ చంద్రముఖి వ్యవహారాన్ని పరిష్కరించేందుకు గతంలో తనకు సాయపడ్డ సైకియాట్రిస్ట్ కు సహచరుడైన డాక్టర్ విజయ్ (వెంకటేశ్)ను ఆయన పిలిపిస్తారు.

ఆ సైకియాట్రిస్ట్ హేతుబద్ధంగా, ఈ సిద్ధాంతి దైవ - దుష్టశక్తుల పట్ల నమ్మకాల పరంగా ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో ఒకప్పటి చంద్రముఖి ఆ ఇంట్లోని ఎవరిని ఆవహించి ఉందో తెలుసుకొనే ప్రయత్నాలు జరుగుతాయి. ఆ కృషిలో భాగంగా నూరేళ్ళ పైచిలుకు క్రితం నాటి వెంకటాపురం రాజు చరిత్రను విజయ్ తెలుసుకోవాల్సి వస్తుంది. ఆ నాగభైరవ రాజశేఖరుడు (మళ్ళీ వెంకటేశే) ఎవరు, ఏమిటి, ఏం చేశాడు, అతనికీ - తంజావూరు ప్రాంత నర్తకి చంద్రముఖికీ ఉన్న సంబంధం ఏమిటి లాంటి అనేక అంశాల గత చరిత్రను తెలుసుకుంటాడు.

ఆ తరువాత ఏం జరిగింది, ఆ ఇంట్లో చంద్రముఖిలా ప్రవర్తిస్తున్నది ఎవరు లాంటి సస్పెన్స్ నిండిన అంశాలతో మిగిలిన సినిమా నడిచింది. సినిమా అంతటా చంద్రముఖి ఆత్మ ప్రస్తావన వస్తుందన్న మాటే కానీ, కథలో మనల్ని కట్టిపడేసే ఆత్మే ఎక్కడా లేదు. ఏ ఘట్టంలోనూ ప్రేక్షకుణ్ణి తనతో పాటు ప్రయాణం చెయ్యనివ్వని దృశ్యాలు, సంఘటనల సమాహారం ఈ చిత్రం. అందుకే, ‘నాగవల్లి’ని చూస్తుంటే, మనం తెర మీద కన్నా చేతికున్న వాచీని ఎక్కువగా చూస్తాం.

( ‘నాగవల్లి’లోని లోటుపాట్లు, వెంకటేశ్ చేసిన తప్పేమిటి. ఒప్పేమిటి వగైరా వివరాల మిగతా భాగం తరువాయి పోస్టులో...)

2 వ్యాఖ్యలు: