జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Sunday, December 5, 2010

రెక్కలొచ్చిన తెలుగు సినిమా టికెట్ రేట్లు!



ఈ మధ్య 'రగడ‌' చిత్రం పాటల విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ హీరో నాగార్జున, అలాగే అంతకు కొన్ని వారాల ముందు 'ఆరెంజ్‌' చిత్ర పాటల విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ, హీరో చిరంజీవి చాలా ఆవేశంగా పైరసీదారులపై విరుచుకుపడ్డారు. ఎంతో కష్టపడి, కోట్ల రూపాయలు వెచ్చించి, చిత్ర నిర్మాతలు సినిమా తీస్తుంటే, వాళ్ళ మొత్తం కష్టాన్ని పది రూపాయల సీడీలతో పైరసీదారులు తేలిగ్గా కొట్టేసి, దొంగ సొమ్ము సంపాదించేస్తున్నారంటూ దుయ్యబట్టారు. నిజమే! చిత్రసీమకు పట్టిన దౌర్భాగ్యం - దారుణమైన పైరసీ! దీన్ని అందరూ ఖండించాల్సిందే! పైరసీని నిరోధించాల్సిందే! ఒక్క క్షణం ఆ సంగతి అటుంచి, ఇప్పుడు నాణానికి రెండో కోణం చూద్దాం. ఇంత పైరసీ అసలు ఎలా పెరుగుతోంది? దీనికి హీరోలు, దర్శక - నిర్మాతల బాధ్యత ఏమిటి? ప్రేక్షకులు హాలుకు వెళ్ళడం మానేసి, పైరసీ సీడీలను ఎందుకు ఆశ్రయిస్తున్నారు? ఈ విషయాలన్నీ లోతుగా ఆలోచిస్తే, పైరసీకి కారణమై, ఊరూరా పాకుతూ, తెలుగు సినిమాను తినేస్తున్న క్యాన్సర్‌ కనిపిస్తుంది. అది ఏమిటంటే - సామాన్యుడికి అందుబాటులో లేని సినిమా టికెట్‌ రేట్లు!

టికెట్ రేట్ల వ్యవహారం ఎప్పుడూ ఉన్నదే కదా అని తేలిగ్గా కొట్టిపారేయకండి. ఆంధ్రప్రదేశ్ లోని పెద్ద నగరాలను కాస్త పక్కనపెడదాం. రాష్ట్రంలోని మిగిలిన ఏ ఊళ్ళోనైనా అగ్ర హీరోల సినిమాకు విడుదలైన తొలి రోజుల్లో వెళ్ళి చూశారా. వెళ్ళి చూస్తే, చూద్దాం. సినిమా హాళ్ళలో పబ్లిక్‌గా ప్రేక్షక జనానికి జరుగుతున్న నిలువు దోపిడీ కళ్ళెదురుగా కనబడుతుంది. సినిమాకున్న క్రేజును బట్టి హాలు కౌంటర్‌లోనే అధికారికంగా టికెట్లను ఎక్కువ రేట్లకు అమ్మేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద హీరోల తెలుగు చిత్రాలు సగటున 250 నుంచి 300 కేంద్రాల్లో విడుదలవుతున్నాయి.
సినీ వ్యాపార పరిభాషలో ఈ కేంద్రాలను ఏ ప్లస్ (హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం లాంటివి), ఏ (తెనాలి, ఒంగోలు, నరసరావుపేట, చిలకలూరిపేట లాంటివి), మేజర్ బి, మైనర్ బి, మేజర్ సి, మైనర్ సి - అనే ఆరు వర్గాలుగా వర్గీకరిస్తుంటారు.

ఇందులో ప్రభుత్వ అధికారుల నిఘా ఎంతో కొంత ఉండే 'ఏ ప్లస్‌' కేంద్రాల్లో తప్ప, మిగిలిన అన్ని కేంద్రాల్లో ఈ అడ్డగోలు టికెట్‌ రేట్ల విధానం ఇష్టారాజ్యంగా సాగుతోంది. ...రాష్ట్రంలో మహా అయితే ఓ 10 కేంద్రాలు మినహా, మిగిలిన అన్ని చోట్లా ఈ దోపిడీ సాగుతోంది. ఒకప్పుడు హాలు బయట ఎవరో, అదీ కొన్ని టికెట్లే బ్లాకులో అమ్మేవారు, అమ్మించేవారు. కానీ, ఇవాళ బాహాటంగా బుకింగ్ లోనే అన్ని టికెట్లూ బ్లాకులో అమ్మేస్తున్నారు... అని సినిమా పంపిణీ, ప్రదర్శక రంగాలపై పట్టున్న కొమ్మినేని వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు.

ఇటీవలి కాలంలో ఏ తెలుగు సినిమా అయినా చూడండి. ఆరంభంలోని ఈ అడ్డగోలు టికెట్ రేట్ల పుణ్యమా అని ప్రతి అగ్రహీరో తెలుగు సినిమా తొలి వారంలోనే కోట్ల కొద్దీ ఆర్జిస్తోంది. చిత్రం ఏమిటంటే - బాగా లేదని టాక్ వచ్చిన సినిమాకు కూడా తొలినాళ్ళ కలెక్షన్లు కళ్ళు తిరిగేలా ఉంటున్నాయి. దీనికి కారణం - ఇలా అడ్డగోలు రేట్లకు టికెట్లను అమ్మే విధానమే. నిజానికి, ప్రభుత్వపరంగా ఈ విధానానికి అనుమతి లేదు. గతంలో జై చిరంజీవ (2005 డిసెంబర్) చిత్రం విడుదల సమయంలో మన సినిమా పెద్దలే తమ పలుకుబడితో, అప్పటి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంతో ఓ ఉత్తర్వు ఇప్పించుకున్నారు. విడుదలైన కొత్త సినిమాకు రెండు వారాల పాటు హాలులోని పై రెండు తరగతుల టికెట్ రేట్లనూ పెంచుకొనేందుకు అనుమతి పొందారు. అలా టికెట్ రేట్లు ఒక్కసారిగా అందని ఎత్తుకు వెళ్ళాయి. దాదాపు 40 రూపాయల బాల్కనీ టికెట్ కాస్తా రూ. 70 దాకా వెళ్ళింది. అలా టికెట్లను అధికారికంగానే ఎక్కువ రేట్లకు అమ్మే ఏర్పాటును తెలివిగా చేసుకున్నారు. భారీ ఖర్చు పెట్టి జై చిరంజీవ తీసినవాళ్ళూ, భారీ రేట్లకు ప్రాంతాల వారీగా సినిమా హక్కులు కొన్నవారూ ఈ రేట్ల పెంపు వెనుక ఉన్నారని అప్పట్లో కృష్ణానగర్ జనం కోడై కూశారు.

అది అలా ఉంచితే, మొత్తానికి ఈ పద్ధతి వల్ల తొలివారాల్లో పెద్ద సినిమాలకు వసూళ్ళు పెరిగినా, పోను పోనూ పైరసీకి ఇది యథోచితంగా తోడ్పడింది. దానికి చిత్రపరిశ్రమలోని వర్గ రాజకీయాలు వచ్చి చేరడంతో - మళ్ళీ అదే సినీ పెద్దలు ఆ రెండు వారాల టికెట్ రేట్ల పెంపు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో రద్దు చేయించారు. కాగా, మళ్ళీ ఇటీవలే కొద్ది నెలల క్రితం మళ్ళీ రోశయ్య నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. ఈ సారి మొదటి రెండు వారాలనే కాకుండా శాశ్వతంగా టికెట్ రేట్లు పెంచుకొనే అనుమతి తెచ్చుకున్నారు. దీంతో ఇప్పుడు పెద్ద ఊళ్ళలో బాల్కనీ టికెట్ రేటు రూ. 40 నుంచి రూ. 50 అయింది. ఇక, మల్టీప్లెక్సుల్లో టికెట్ రూ. 100 నుంచి రూ. 150 అయింది. ...ఈ అనుమతులన్నీ పరిశ్రమ కోసం, ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలు కానే కావు. భారీ రేటుకు తాము ఏరియాల వారీగా కొన్న సినిమాల మీద డబ్బులు వెనక్కి రాబట్టుకోవడం కోసమే. ఇవన్నీ ప్రభుత్వాన్ని మభ్యపెట్టి సంకుచిత, స్వార్థ ప్రయోజనాలతో చేసిన పనులే... అని చిత్రపరిశ్రమ అంతర్గత వర్గాలు లోగుట్టు బయటపెట్టాయి.

(తెలుగునాట జరుగుతున్న మరిన్ని బ్లాక్ మార్కెట్ సిత్రాలు తరువాయి పోస్టులో...)

0 వ్యాఖ్యలు: