నిజాయతీగా ఉండే నిఖార్సయిన పోలీసు అధికారుల కథలు తెలుగు
సినిమాకు అరిగిపోయిన బాక్సాఫీస్ ఫార్ములా. ఈ ఫార్ములాతో సవాలక్ష కథలు
వచ్చేసినా, మళ్ళీ మళ్ళీ తీయడానికి బాక్సాఫీస్ విజయ సూత్రమే కారణం.
అందులోనూ ఒక కథ కానీ, కథానాయక పాత్ర చిత్రణ కానీ జనరంజకమైందంటే, దాన్ని
తిరగేసి, మరగేసి, బోర్లేసి ఒకటికి వంద కథలు అల్లడం సినీ సీమ అనుసరించే
పద్ధతి. సినిమాలు కూడా సీరియళ్ళ లాగా ఒకటికి రెండు భాగాలుగా, సీక్వెల్స్‌గా
వస్తున్నది అందుకే! ఆ కోవలోదే తాజా 'సింగం - యముడు2'.
........................................................................................................
తారాగణం
: సూర్య, అనూష్క, హన్సిక, ముఖేశ్ ఋషి, రహమాన్, మాటలు : శశాంక్
వెన్నెలకంటి, పాటలు : సాహితి, రామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్,
ఛాయాగ్రహణం : ప్రియన్, కూర్పు : వి.టి. విజయన్ - టి.ఎస్. జెరు, సమర్పణ:
కె.ఇ. జ్ఞానవేల్ రాజా, నిర్మాత: ఎస్. లక్ష్మణ్ కుమార్,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : హరి
.........................................................................
తమిళ
హీరో సూర్యతో అక్కడి దర్శకుడు హరి తమిళంలో రూపొందించిన సినిమా 'సింగమ్'
అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ 'యముడు' (2010)గా పెద్ద హిట్టయింది.
దానికి కొనసాగింపు కథ - 'యముడు2'. భారతీయ పోలీసు గొప్పవాడనీ, దోషులను
పట్టుకోవడానికి ప్రాణాల్ని పణంగా పెడతాడనీ, హీరో పాత్ర ద్వారా చెప్పించడం ఈ
చిత్ర ఇతివృత్తం.
కథ ఏమిటంటే...
మొదటి భాగంలో లాగానే ఈ
చిత్ర కథలోనూ కథానాయకుడు నరసింహం (సూర్య) నిజాయతీపరుడైన పోలీసు అధికారి.
సముద్రతీర ప్రాంతంలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికి
అతడిని నియమిస్తారు. స్వయంగా రాష్ట్ర హౌమ్ మంత్రి అండదండలతో
డి.ఎస్.పి.గా అతను నియమితుడవుతాడు. అయితే, పదవీ బాధ్యతలు చేపట్టకుండా, ఓ
స్కూల్‌లో ఎన్.సి.సి. టీచర్‌గా పనిచేస్తూ, తీర ప్రాంతంలోని అసాంఘిక శక్తుల
గుట్టుమట్లను ముందుగా పసిగట్టాలన్నది హీరో ఆలోచన. మంత్రి గారు కూడా అందుకు
సరేనంటారు! ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా ఆ పనిలో ఉంటాడు హీరో.
కాకినాడ
తీరంలో జరిగే ఈ కథలో భారు (ముఖేశ్ ఋషి) ముఠా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా
చేస్తున్నట్లు హీరో గ్రహిస్తాడు. పైకి పరస్పర విరోధులుగా కనిపిస్తున్నా,
ఊళ్ళోని మరో పెద్ద పారిశ్రామికవేత్త త్యాగరాజు (రెహమాన్) కూడా ఆ దంధాలో
అతనికి భాగస్వామే! వారికి ఆ డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న సూత్రధారి ఎవరన్నది
హీరో కనిపెట్టే లోపలే, ఊళ్ళో కుల ఘర్షణలతో అదుపు తప్పుతున్న శాంతి
భద్రతలను కాపాడడానికి హీరో తన పోలీసు ఉద్యోగంలో చేరిపోవాల్సి వస్తుంది. ఇక,
అక్కడ నుంచి హీరోకూ, ఆ విలన్లకూ మధ్య మాటలు, చేతల యుద్ధం.
మన
సముద్ర తీరానికి వస్తున్న మాదక ద్రవ్యాల వెనుక ఉన్నది అంతర్జాతీయ డ్రగ్స్
ముఠా నేత డానీ (లండన్‌లో ఉంటున్న ఘనా సంతతికి చెందిన ఇంగ్లీష్ నటుడు డానీ
సపానీ) అని యాదృచ్ఛికంగా హీరోకు తెలుస్తుంది. భారతీయ పోలీసులు లంచగొండులంటూ
వెక్కిరించి, వేళాకోళం చేసి ఈ పెద్ద విలన్ తప్పించుకుంటాడు. ఓ పక్క
ఊళ్ళోని విలన్లను ససాక్ష్యంగా పట్టుకోవడం, ఆ వెంట ఈ అంతర్జాతీయ విలన్‌ను
వెంటాడడం - ఇదీ స్థూలంగా చిత్రకథ. ఈ ప్రధానమైన కథలో మధ్య మధ్య వచ్చిపోయేవి -
హీరో పెళ్ళి వ్యవహారం, అతణ్ణి ప్రేమిస్తున్నానంటూ వెంటపడే స్టూడెంట్ సత్య
(హన్సిక) ఉదంతం. హీరో అనుచర పోలీసులు, ఇతరులతో వినోదాత్మక ఘట్టాలు ఈ కథలో
తాలింపులు.
నటన, సాంకేతిక విలువలు
అత్యంత రొటీన్‌గా
సాగే ఈ కథలో హీరో సూర్య పోలీసు అధికారిగా శక్తిమంతంగా నటించారు. అతనికి
డబ్బింగ్ కూడా అదే స్థాయిలో కుదిరింది. ఇక, కథానాయిక కావ్యగా అనూష్కది ఓ
రెండు పాటలు, నాలుగు సన్నిశాలకు పరిమితమైన పాత్ర. హన్సిక విషయమూ అంతే!
కనిపించేదే అంతంత మాత్రమైన ఈ పాత్రల్లో సహజంగా ఆ పాత్రధారులు నటించగలిగేదీ
అతి తక్కువే. వినోదం కోసం సినిమాలో మరో పోలీసు అధికారి జమదగ్నిగా వివేక్,
స్కూలులో పనిచేసే దాసుగా సంతానం కనిపిస్తారు. ముఖేశ్ ఋషి, రహమాన్‌లు తమ
ప్రతినాయక పాత్రలను ఉన్నంతలో బాగానే పోషించారు. హీరోయిన్ తండ్రిగా నాజర్,
హీరో తండ్రిగా రాధారవి, పోలీసు అధికారి కరీమ్‌గా మన్సూర్ అలీ ఖాన్,
రాష్ట్ర హౌమ్ మంత్రిగా విజయకుమార్, ముఖ్యమంత్రిగా కె. విశ్వనాథ్, ఇంకా
మనోరమ - ఇలా సినిమా నిండా తెలిసిన ముఖాలు చాలానే ఉన్నాయి.
'ఆపరేషన్
డి' పేరిట హీరోకు అన్ని రకాల పర్మిషన్లూ ఇచ్చేయడం, రాష్ట్ర హౌమ్ మంత్రి ఓ
పోలీసును అంతర్జాతీయ డాన్ వేటకు దక్షిణాఫ్రికా పంపడం లాంటి వాటిలో
లాజిక్‌లు వెతుక్కోవడం అనవసర శ్రమ. కథా రచయిత కూడా తానే అయిన దర్శకుడు
విలన్లకూ, హీరోకూ మధ్య సంఘర్షణను సమర్థంగా చూపెట్టలేకపోయారు. అందరినీ
గడగడలాడించే అంతర్జాతీయ ముఠా నేతగా చెప్పిన డానీకీ, హీరోకూ మధ్య ఎత్తులు
పైఎత్తుల లాంటివేమీ లేకుండా, మాటలకూ, ముష్టి ఘాతాలకే చిత్ర కథ
పరిమితమైపోయింది. అది ఒక రకంగా మైనస్సే! సినిమా మొదలైన దగ్గర నుంచి చివరి
దాకా ఏదో జరిగిపోతోంది, దాన్ని హీరో అడ్డుకుంటున్నాడనే బిల్డప్‌లే ఎక్కువ.
అసలు కథ జరిగేది తక్కువ. అయితే, సినిమా ఎక్కడా నిదానమనిపించకుండా తెర మీద
దృశ్యాలు ఏవో ఒకటి చకచకా వెళ్ళిపోతుంటాయి. ఈ సినిమాకున్న బలం అదే! ఆ మేరకు
దర్శకత్వం, కూర్పు విభాగాలు విజయవంతమైనట్లే!
శశాంక్ వెన్నెలకంటి
మాటలు, సాహితి, రామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్‌ల పాటలు అనువాద
వాసనలకు సాధ్యమైనంత దూరంగా సాగాయి. సినిమాలో వేర్వేరు చోట్లు హీరో పోలీసు
హౌదాను వేర్వేరు రకాలుగా చూపించడం, రహమాన్ పోషించిన పాత్ర పేరును కూడా
రెండు వేర్వేరు రకాలుగా చెప్పడం, అక్కరలేని చోట తెలుగు సబ్ టైటిల్సూ,
అవసరమున్న సింహళీ యాస తమిళ డైలాగుల దగ్గర సబ్ టైటిల్సే లేకపోవడం లాంటి
లోపాలు సినిమాలు తెలిసిపోతుంటాయి.
''వయసులో ఫిగర్ రావడం, వయసు మళ్ళాక షుగర్ రావడం'' కామన్ లాంటి ఒకటి రెండు డైలాగులకు థియేటర్‌లో జనం ఆనందిస్తారు.
దేవిశ్రీ
ప్రసాద్ సంగీతంలో 'సింగం' అనే థీమ్ మ్యూజిక్‌తో పాటు ఒకటి రెండు పాటలు
అలరిస్తాయి. నృత్యాల్లో సూర్య చులాగ్గా ఒదిగాడు. కొన్ని స్టెప్పుల్లో
చిరంజీవి శైలిని గుర్తు తెచ్చాడు. యాక్షన్ సన్నివేశాల కోసం సూర్య సినిమా
అంతా హడావిడిగా పరిగెడుతూనే ఉంటాడు. గొంతు చించుకొని అరుస్తూనే ఉంటాడు.
శివాలెత్తుతూ
చెప్పే ఆ డైలాగులు, సింహపు పంజా విసురు శైలిలో హీరో కొట్టే దెబ్బల
శబ్దాలతో థియేటర్‌లో చెవులు దిమ్మెత్తిపోతాయి. మధ్య మధ్యలో పాటలు. సినిమా
ఆరంభమే మాస్ పాటతో! కథానాయిక అంజలి అందాలు ఆరబోస్తూ, ఐటమ్ గర్ల్‌గా
నర్తించడం ఈ తొలి పాట విశేషం. సూర్య, అనూష్కల మధ్య పాటల్లో క్లైమాక్స్‌కు
ముందు వచ్చే పాట ఆకట్టుకుంటుంది. కొన్నిసార్లు అతి అయినప్పటికీ, యాక్షన్
సన్నివేశాలు, హెలికాప్టర్ల షాట్ల చిత్రీకరణ దగ్గర సహజంగానే ఛాయాగ్రాహకుడు
ఎవరన్న ఆసక్తిని రేకెత్తిస్తుంది. మొత్తం మీద, రెండున్నర గంటల సమయాన్ని
ఎలాగోలా ఏ.సి. హాలులో గడిపేయాలను కోవడానికైతేనే, ఈ మాస్ కథా కథన చిత్రం
జోలికి పోవడం ఒంటికీ, జేబుకీ మంచిది.
కొసమెరుపు : అంతర్జాతీయ
విలన్‌ను హీరో పట్టి, కొట్టి జైలులో పెట్టడంతోనే సినిమాకు 'శుభం' కార్డు
వేసేశారు. కొంపదీసి, మళ్ళీ హీరో పెళ్ళి, ఈ కొత్త విలన్ తదుపరి కథతో 'సింగం
- యముడు 3' తీస్తారా ఏమిటి! బాబోరు! వెండితెర సింహం!!
- రెంటాల జయదేవ
(Published in Praja Sakti daily, 6th July 2013, Saturday, Page no.8)
.............................................
తోడుకునేవాళ్లకి తోడుకున్నంత
4 years ago
0 వ్యాఖ్యలు:
Post a Comment