తొలి పూర్తి తెలుగు టాకీ 'భక్త ప్రహ్లాద' 1932 ఫిబ్రవరి 6న విడుదలైనప్పటి నుంచి ఇప్పటి దాకా ఎనభై ఒక్కేళ్ళ పై చిలుకు కాలంలో 4 వేలకు పైగానే తెలుగు సినిమాలు వచ్చినట్లు ఓ అంచనా. ఈ చిత్రాల నిర్మాణం ద్వారా తెలుగు సినీ పరిశ్రమను అభివృద్ధి పథంలో నడిపించినవారు ఎందరో ఉన్నారు. తొలినాళ్ళ బొంబాయి, కలకత్తా నిర్మాతల నుంచి స్ఫూర్తిని అందుకొని, 'వేల్ పిక్చర్స్' (పి.వి. దాసు), 'రోహిణీ పిక్చర్స్' (హెచ్.ఎం. రెడ్డి), 'వాహినీ' పిక్చర్స్ (బి.ఎన్. రెడ్డి), సారథీ, భరణి (రామకృష్ణ - భానుమతి), 'విజయ' (నాగిరెడ్డి - చక్రపాణి) లాంటి తెలుగువారెందరో చిత్ర నిర్మాణంలోకి వచ్చారు. అయితే, చిత్ర పరిశ్రమలోని ప్రధాన విభాగాలైన చిత్ర నిర్మాణం, పంపిణీ, ప్రదర్శన, స్టూడియో నిర్వహణలు - నాలుగింటిలోనూ నాటి నుంచీ నేటి దాకా కొనసాగుతున్న సంస్థ తెలుగునాట 'ఎన్.ఏ.టి' ఒక్కటే! ఇది నటుడు, దర్శక - నిర్మాత కీర్తిశేషులు నందమూరి తారక రామారావు స్థాపించిన సంస్థ. 'నేషనల్ ఆర్ట్ ్స'గా మొదలై 'రామకృష్ణా హార్టీకల్చరల్ స్టూడియోస్'గా ఇవాళ్టికీ కొనసాగుతున్న ఈ ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థకు ఇవాళ్టితో 60 ఏళ్ళు నిండుతున్నాయి. ఆ సంస్థ పతాకంపై ఎన్టీయార్ నిర్మించిన తొలి చిత్రం 'పిచ్చి పుల్లయ్య' ఇప్పటికి సరిగ్గా ఆరు దశాబ్దాల క్రితం 1953 జూలై 17న విడుదలైంది. ఈ సందర్భంగా ఆ సంస్థ ఘనచరిత్రలోని వివరాలు, విశేషాల ప్రత్యేక కథనం...
కాలేజీ రోజుల నుంచే రంగస్థల పాత్రలు పోషిస్తూ వచ్చిన ఎన్టీయార్ తరువాతి రోజుల్లో మిత్రులతో కలసి 'నేషనల్ ఆర్ట్ థియేటర్' పేరు మీద నాటక సమాజం నెలకొల్పారు. 1945 ప్రాంతం నుంచి అప్పటి బెజవాడ (నేటి విజయవాడ) కేంద్రంగా రంగస్థల ప్రదర్శనలిచ్చేవారు. ఆ నేపథ్యమే ఆయనను 1947లో సినిమా రంగం వైపు నడిపించింది. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో ప్రణాళికా రచన దశలోనే ఆగిపోయిన 'శ్రీమతి' చిత్రానికి గాను 1947లో ఎన్టీయార్ తొలిసారిగా మేకప్ స్టిల్ దిగారు. ఆ పైన ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలోనే 'మనదేశం' (విడుదల: 1949 నవంబర్ 24)తో వెండితెర మీదకు వచ్చారు.
కళాభిరుచితో చిత్ర నిర్మాణంలోకి...
రంగస్థలం మీద నటుడిగా మొదలైన ఎన్టీయార్ సినీ రంగానికి వచ్చాక కేవలం నటనతో సరిపెట్టుకోలేదు. అక్కడ నుంచి నిర్మాణ, పంపిణీ, ప్రదర్శక, స్టూడియో విభాగాలకు ఎన్టీయార్ క్రమంగా విస్తరించారు. తాను ఏ రంగంలోకి వచ్చి, పేరు, డబ్బు సంపాదించారో, అదే రంగ పురోభివృద్ధికి తన వంతుగా తోడ్పడ్డారు. తొలిసారిగా తెరపై కనిపించిన సంవత్సరం మీద నాలుగు నెలలకే 'పాతాళభైరవి' (1951 మార్చి 15)తో 'స్టార్ హీరో'గా జనసామాన్యానికి చేరువైన ఎన్టీయార్‌ను ఆయనలోని కళారాధన ఊరుకోనివ్వ లేదు. కళాకారుడిగా అభిరుచిని నిలుపుకొని, కళాత్మక విలువలున్న చిత్రాల నిర్మాణంతో ఆత్మసంతృప్తిని పొందడం కోసం సినీ నటుడైన మూడేళ్ళకే ఆయన నిర్మాతగా మారారు. 'నేషనల్ ఆర్టు ్స' పతాకంపై 'పిచ్చి పుల్లయ్య' నిర్మించారు.
ఆ చిత్రానికి పేరొచ్చినా, డబ్బు రాలేదు. దాంతో, చిత్ర నిర్మాణ సంస్థ పేరును స్వల్పంగా మార్చి, తమ నాటక సమాజమైన 'నేషనల్ ఆర్ట్ థియేటర్' (ఎన్.ఏ.టి) పేరుతో 'తోడు దొంగలు' (1954 ఏప్రిల్ 15) నిర్మిస్తూ, నెగటివ్ టచ్ ఉన్న వయసు మళ్ళిన పాత్ర వేశారు. ఆ చిత్రానికీ ప్రశంసలే తప్ప, వసూళ్ళు రాలేదు. దాంతో, 'కేవలం సందేశాలతో కళాత్మక చిత్రాలు నిర్మించడం కాకుండా, కళనూ - వ్యాపారాన్నీ సమతూకంలో కలిపి, పంచదార పూతతో కూడిన మాత్రగా సందేశాన్ని అందించాలన్న అభిప్రాయానికి వచ్చా'రు ఎన్టీయార్. అలా ఆయన నిర్మాతగా తన మూడో చిత్రం 'జయసింహ' మొదలు చిత్ర నిర్మాణంలో విజయ పరంపరకు శ్రీకారం చుట్టారు.
అలా 1953లో ఆయన స్థాపించిన సంస్థ పెద్దబ్బాయి రామకృష్ణ మరణించాక 1966లో 'శ్రీకృష్ణ పాండవీయం'తో 'రామకృష్ణ - ఎన్.ఏ.టి' అయింది. స్టూడియో నిర్మాణం ప్రారంభించాక, 1974లో 'తాతమ్మ కల' నుంచి 'రామకృష్ణా సినీ స్టూడియోస్' అయింది. 1992లో 'సామ్రాట్ అశోక' నాటి నుంచి 'రామకృష్ణా హార్చీకల్చరల్ సినీ స్టూడియో'గా చిత్ర నిర్మాణం సాగిస్తోంది. కాలగతిలో రకరకాల పేర్లు మార్చుకుంటూ వచ్చినా ఇప్పటికి 60 ఏళ్ళుగా తెలుగు నాట చిత్ర నిర్మాణంలో ఉన్న ఏకైక సంస్థ ఇదే కావడం విశేషం. మధ్యలో 'ఎన్టీయార్ ఎస్టేట్ ప్రొడక్షన్' (200వ చిత్రం 'కోడలు దిద్దిన కాపురం' - 1970 అక్టోబర్ 21), 'తారకరామా ఫిల్మ్ యూనిట్' (చిత్రం 'డ్రైవర్ రాముడు' - 1979 ఫిబ్రవరి 2), 'ఎన్టీయార్ ట్రస్ట్' (క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు నిధుల కోసం 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' - 1991 ఏప్రిల్ 19) లాంటి వివిధ పతాకాలను నెలకొల్పారు ఎన్టీయార్. 996లో ఎన్టీయార్ మరణం తరువాత కూడా 'పెద్దన్నయ్య' (1997), 'శుభలేఖలు', 'గొప్పింటి అల్లుడు', 'యువరత్న', తాజాగా తారకరత్న హీరోగా 'వెంకటాద్రి' (2009) వరకు ఆయన వారసులు చిత్ర నిర్మాణ సంస్థను కొనసాగిస్తూ, సినిమాలు నిర్మిస్తూ వస్తున్నారు.
గణాంక వివరాల్లోకి వెళితే... ఈ ఆరు పదుల ప్రస్థానంలో మొత్తం 43 చిత్రాలను ఈ సంస్థ నిర్మించింది. అందులో తెలుగు చిత్రాలు 40 కాగా, తమిళం రెండు ('శ్రీకృష్ణ పాండవీయం' తమిళ వెర్షన్ 'రాజసూయం', శివాజీ గణేశన్‌తో ఎన్టీయార్ 'చండశాసనుడు' రీమేక్ 'చరిత్ర నాయకన్'), హిందీ ఒకటి ('బ్రహ్మర్షి విశ్వామిత్ర' హిందీ వెర్షన్). ఈ చిత్రాల్లో కొన్నింటికి ఎన్టీయారే నిర్మాతగానూ వ్యవహరిస్తే, మరికొన్నింటికి ఆయన తమ్ముడు నందమూరి త్రివిక్రమరావు, ఇంకొన్నిటికి కుమారులు హరికృష్ణ, రామకృష్ణ, మోహనకృష్ణల పేర్లు కనిపిస్తాయి. సాంఘికం, పౌరాణికం, చారిత్రక, జానపద కోవలు నాలుగింటిలోనూ చిత్రాలు తీసి, ఘనవిజయాలు సాధించిన తెలుగు సినీ సంస్థ ఇదొక్కటే కావడం మరో విశేషం. 'సీతారామ కల్యాణం' నుంచి 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' దాకా 10 పౌరాణికాలు, స్థల పురాణ కథ అయిన 'పాండురంగ మాహాత్మ్యం' నుంచి 'శ్రీనాథ కవిసార్వభౌమ' దాకా 7 చారిత్రకాలు తీసిన చిత్ర నిర్మాణ సంస్థగా చెరిగిపోని రికార్డు సృష్టించింది.
ప్రతిభావంతులకు అవకాశం
ఎన్టీయార్ తన చిత్రాల ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులను తెలుగు తెరకు తెచ్చారు. హీరోయిన్లుగా వహీదా రెహమాన్ ('జయసింహ'), బి. సరోజాదేవి ('పాండురంగ మాహాత్మ్యం'), గీతాంజలి ('సీతారామ కల్యాణం'), నాగరత్నం ('గులేబకావళి కథ'), కె.ఆర్. విజయ ('శ్రీకృష్ణ పాండవీయం'), మీనాక్షీ శేషాద్రి ('బ్రహ్మర్షి విశ్వామిత్ర')లను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. సంగీత దర్శకుల్లో జోసెఫ్ - కృష్ణమూర్తి (గులేబకావళి కథ), సుప్రసిద్ధ హిందీ సంగీత దర్శకులు సి. రామచంద్ర (అక్బర్ - సలీం - అనార్కలి), రవీంద్ర జైన్ (బ్రహ్మర్షి విశ్వామిత్ర), మాటల రచయితల్లో సముద్రాల జూనియర్ (తోడు దొంగలు), కొండవీటి వెంకట కవి (దానవీర శూర కర్ణ), నాగభైరవ కోటేశ్వరరావు (బ్రహ్మర్షి విశ్వామిత్ర), రతన్‌బాబు (సామ్రాట్ అశోక), జంట రచయితలుగా పరుచూరి బ్రదర్స్ (అనురాగ దేవత), సినీ గీత రచయితల్లో సి. నారాయణ రెడ్డి (గులేబకావళి కథ), ఛాయాగ్రాహకుల్లో రవికాంత్ నగాయిచ్ ('సీతారామ కల్యాణం'), కె.ఎస్. ప్రకాశ్ ('డ్రైవర్ రాముడు'), నందమూరి మోహనకృష్ణ ('అగ్గి రవ్వ') తదితరులు ఈ బ్యానర్ నుంచి తెలుగు చిత్రసీమలోకి ప్రవేశించినవారే!
ఏటికి ఎదురీదే ప్రయోగాలు
చిత్ర నిర్మాణంలో ప్రయోగాలకు కూడా ఎన్టీయార్ వెరవలేదు. కొంత ఆఫ్‌బీట్ దోవలో, డీ గ్లామర్ పాత్రలు వేసే ధోరణికి 'తోడు దొంగలు' శ్రీకారం చుట్టింది. నెగటివ్ పాత్ర వేస్తూ, కొత్త హీరో హీరోయిన్లతో 'సీతారామ కల్యాణం' తీశారు. హీరో, విలన్ పాత్రలు రెండూ తానే ధరించి, ఏకకాలంలో నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహించి 'శ్రీకృష్ణ పాండవీయం' తీయడం అప్పట్లో ఓ సంచలనం. అలాగే తెలుగులో త్రిపాత్రాభి నయానికీ (కులగౌరవం - 1972), దుర్యోధనుణ్ణి పాజిటివ్ కోణంతో చూపడానికీ (దాన వీర శూర కర్ణ - 1977), పంచపాత్రాభినయానికీ (శ్రీమద్విరాటపర్వం - 1979) తెర తీశారు.
నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఏటికి ఎదురీదే తత్వంతో సొంత సంస్థపై సినిమాలు తీయడానికీ ఎన్టీయార్ వెనుకాడలేదు. రాష్ట్ర విభజన ఉద్యమం జరుగుతున్నప్పుడు సమైక్యంగా ఉండాలంటే 'తెలుగు జాతి మనది... నిండుగ వెలుగు జాతి మనది...' అని పాట పెట్టి మరీ 'తల్లా? పెళ్ళామా?' (1970 జనవరి 8) తీశారు. అలాగే, దొంగ బాబాలను వ్యతిరేకంగా 'కోడలు దిద్దిన కాపురం' (1970 అక్టోబర్ 21) నిర్మించారు. ఊరందరికీ భిన్నంగా కేంద్ర ప్రభుత్వ కుటుంబ నియంత్రణ విధానాన్ని వ్యతిరేకిస్తూ, 'తాతమ్మ కల' (1974 ఆగస్టు 30) కన్నారు. కథాపరంగా వేమన చరిత్రలో వచ్చే నగ సన్నివేశాన్ని సెన్సార్ కట్ చేయడానికి ఒప్పుకోకుండా, మూడేళ్ళ పాటు సెన్సార్‌తో పోరాడి 'శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర' (1984 నవంబర్ 29) రూపొందించారు.
గమ్మత్తేమిటంటే, ఈ సంస్థపై వచ్చిన చిత్రాలు తొమ్మిందింటికి కేంద్ర ప్రభుత్వ ('తోడు దొంగలు', 'సీతారామ కల్యాణం', 'వరకట్నం'), రాష్ట్ర ప్రభుత్వాల (శ్రీకృష్ణ పాండవీయం, కోడలు దిద్దిన కాపురం, శ్రీకృష్ణసత్య, తల్లా పెళ్ళామా, తాతమ్మ కల) నుంచి అవార్డులు, గుర్తింపులు దక్కాయి. (1968లో రష్యాలో జరిగిన మాస్కో చలనచిత్రోత్సవానికి తెలుగు నుంచి కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన చిత్రం 'ఉమ్మడి కుటుంబం'). తెలుగు నాట ఇప్పటి దాకా ఏ ఒక్క నిర్మాణ సంస్థకూ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఇన్ని అవార్డులు, ఇంత గుర్తింపు రాకపోవడం విశేషం.
ఇప్పటికీ ప్రదర్శన, పంపిణీ, స్టూడియో విభాగాల్లో..
రాష్ట్రంలోనే మొట్టమొదటి 70 ఎం.ఎం. థియేటర్‌గా రాజధాని హైదరాబాద్‌లో 'రామకృష్ణా' థియేటర్ (1968 నవంబర్ 8)ను నిర్మించి, ప్రదర్శక రంగంలోకీ ఎన్టీయార్ చిత్ర నిర్మాణ సంస్థ విస్తరించింది. ఆపైన అక్కడే 'రామకృష్ణా 35 ఎం.ఎం', అటు తరువాత కాచిగూడలో 'తారకరామా' (1978) హాళ్ళు కట్టారు. ఇప్పటికీ ఈ మూడు సినిమా హాళ్ళూ ఎన్టీయార్ కుటుంబ సభ్యుల నిర్వహణలోనే ఉన్నాయి.
అలాగే, 'అగ్గి రవ్వ' (1981 ఆగస్టు 14) చిత్రాన్ని 'రామకృష్ణా మోషన్ పిక్చర్ డిస్ట్రిబ్యూషన్' పేర విడుదల చేసి, పంపిణీ రంగంలోకి వచ్చారు. అప్పటి నుంచి నైజామ్ ప్రాంతంలో ఈ పంపిణీ సంస్థ ద్వారా సినిమాల విడుదల సాగిస్తూ వచ్చారు. ఇవాళ్టికీ సికింద్రాబాద్‌లోని ఆర్పీ రోడ్‌లో ఈ పంపిణీ సంస్థ నడుస్తోంది.
రాష్ట్ర రాజధానిలో తెలుగు చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో 1974లో స్టూడియో నిర్మాణానికి కూడా ఎన్టీయార్ నడుం బిగించారు. ముషీరాబాద్‌లోని సుమారు 3 ఎకరాల సొంత స్థలంలో 'రామ కృష్ణా స్టూడియో' కట్టారు. 1976 జూన్ 7న అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు చేతుల మీదుగా దాన్ని ప్రారంభించారు. ఆ తరువాత 1980 మార్చిలో నాచారం ప్రాంతంలో పన్నెండెకరాల స్థలంలో 'రామకృష్ణా హార్టీకల్చరల్ సినీ స్టూడియో'ను నెలకొల్పారు. తరువాతి రోజుల్లో ముషీరాబాద్ నుంచి నాచారానికి స్టూడియోను పూర్తిగా తరలించారు. ఇప్పటికీ ఈ స్టూడియోలో షూటింగ్‌లు జరుగుతున్నాయి.
తొలి రోజుల్లో అభిరుచి గల కథా చిత్రాల నిర్మాణానికి మొగ్గు చూపిన ఎన్టీయార్ తీరా స్టూడియో నిర్మించాక, దానికి రోజువారీ పని కల్పించడం కోసం స్వీయ నిర్మాణ సంస్థపై 'అగ్గిరవ్వ', 'రౌడీ రాముడు - కొంటె కృష్ణుడు', 'సింహం నవ్వింది' లాంటి తక్కువ స్థాయి వాణిజ్య పంథా చిత్రాలనూ నిర్మించడం విషాదం.
ఏమైనా అరవై ఏళ్ళ క్రితం ఎన్టీయార్ నాటిన విత్తనం వటవృక్షమై, వివిధ శాఖలుగా విస్తరించి, ఇవాళ్టికీ చిత్ర పరిశ్రమలో తనదైన స్థానంలో కొనసాగడం విశేషం. ఇక, నిర్మాణ, పంపిణీ, ప్రదర్శక, స్టూడియో విభాగాల్లో ఎన్టీయార్ కుటుంబం తరువాత నిర్మాత డి. రామానాయుడి 'సురేష్ ప్రొడక్షన్స్', రామోజీరావు 'ఉషాకిరణ్ మూవీస్' లాంటివి తెలుగు వారి కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తున్నాయి. దక్షిణాది సినీసీమలో ఇంతటి ఘన చరిత్ర మన తెలుగు సినిమాకు ఉండడం సినీ ప్రియులకు గర్వకారణమే!
- రెంటాల జయదేవ
............................................................................
0 వ్యాఖ్యలు:
Post a Comment