'ఇన్ని లెక్కలుంటే.. అది చేసుండేవాణ్ణి కాదు!' - దర్శకుడు యేలేటి చంద్రశేఖర్
ఆయన తొలి సినిమా వచ్చి ఇప్పటికి పదేళ్ళు. ఈ దశాబ్ద కాలంలో ఆయన రూపొందించినవి అయిదే సినిమాలు. కానీ, ప్రేక్షకుల్లో, పరిశ్రమలో మాత్రం ప్రతి సినిమా ముందు ఓ అంచనా పెంచగలిగారు. ఈ రోజు విడుదలవుతున్న సినిమాయే కాదు, ఆయన ప్రతి సినిమా ఏదో ఒక విభిన్నమైన ఆలోచనతో ఒక 'సాహసమే'. పదేళ్ళ క్రితం 'అన్ని సినిమాలూ ఒకేలా ఉండవు' అంటూ 'ఐతే..' చిత్రంతో అందరి దృష్టినీ తన వైపు తిప్పుకొన్న ఆ యువ దర్శకుడు యేలేటి చంద్రశేఖర్. నిధి అన్వేషణ చుట్టూ సాగే సరికొత్త అడ్వెంచరస్ యాక్షన్ చిత్రం 'సాహసం'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారీ ఈ నాలుగు పదుల సృజనశీలి. మాట తీరు, మనిషి తీరు కూడా సాదాసీదాగా ఉంటూ, 'అందరు దర్శకులూ ఒకేలా ఉండరు' అనిపించే ''చందు''తో ప్రజాశక్తి 'జీవన' సంభాషించింది. ముఖ్యాంశాలు:
అసలు సినిమాల్లోకి రావాలన్న ఆలోచన ఎలా వచ్చింది?
మాది తూర్పు గోదావరి జిల్లా తుని దగ్గరలోని రేకవాని పాలెం. నాకు ఓ అక్క, ఓ చెల్లి! విజయవాడ సమీపంలోని గన్నవరంలో సెయింట్ జాన్స్ స్కూల్లో పదో తరగతి దాకా చదివాను. ఆ తరువాత కాకినాడలో ప్రగతి కాలేజ్‌లో ఇంటర్ చేశాను. చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి కొత్తగా చేయాలని ప్రయత్నించడమనేది నాలో ఉంది. కానీ, సినిమాల్లోకి వస్తానని అనుకోలేదు. చదువుకొంటున్న రోజుల్లోనే నాలోని సృజనాత్మకతను గమనించింది - ఇవాళ్టి దర్శక, నిర్మాత గుణ్ణం గంగరాజు. ఇది 1990లలో సంగతి. ఆయన నాకు వరుసకు బావ అవుతారు. మా నాన్న గారి అక్కయ్య కొడుకు! అప్పటికే ఆయనకు 'ఫౌంటెన్ హెడ్ డిజైన్ స్టూడియో' అని ఉండేది. 'ఫాంట్ కార్డ్స్' అంటూ ఆయన సరికొత్త డిజైన్లతో గ్రీటింగ్ కార్డులు వేసి, అందరి దృష్టినీ ఆకర్షించారు. ఆయన నాలోని సృజనాత్మకత చూసి, ప్రోత్సహించారు. అప్పటికి నేను విశాఖపట్నంలో మెరైన్ రేడియో ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఆ కోర్సులో చేరిన ఏడాదికే అది నాకు బోర్ కొట్టి, ఇటు వచ్చేశాను. గంగరాజు గారి దగ్గర 'ఫాంట్ కార్డ్స్'కు కాపీ రైటింగ్ లాంటి పనులు చేయడంతో నా సినీ రంగ ప్రవేశానికి బీజం పడింది.
అది సినిమాల దిశగా ఎలా సాగింది?
గంగరాజు గారు ఆ తరువాత 1994 - '95 ప్రాంతంలో సొంత ప్రొడక్షన్లో 'లిటిల్ సోల్జర్స్' (1996) సినిమా చేస్తున్నప్పుడు, అక్కడే ప్రొడక్షన్ విభాగంలో చేశాను. అలాగే, ఆయన రూపొందించిన యాడ్ ఫిల్మ్ ్సకూ, ప్రైవేట్ పాటల ఆల్బమ్స్కూ దర్శకత్వ శాఖలో పనిచేశా. ఆ తరువాత దర్శకుడు కె. రాఘవేంద్రరావు గారి దగ్గర అప్పటి ప్రభుత్వ పక్షాన 'జన్మభూమి' యాడ్స్ చేయడం, ఆ క్రమంలోనే గంగరాజు గారి 'అమృతం' టీవీ సీరియల్ తొలి పది ఎపిసోడ్లకూ దర్శకత్వం వహించడం జరిగింది. అప్పుడు తయారుచేసుకున్న కథతో, 'ఐతే..' (2003) చిత్రం తీస్తూ దర్శకుడినయ్యా.
మీ నాన్న గారు ఉన్నత విద్యావంతులని విన్నాం. సినిమాల్లోకి వెళుతుంటే, ఇంట్లో ఏమీ అనలేదా?
మా నాన్న గారి పేరు యేలేటి సుబ్బారావు. ఆ రోజుల్లోనే ప్రతిష్ఠాత్మక ఐ.ఐ.టి - మద్రాసులో చదువుకున్నారు. అంత ఉన్నత విద్యాభ్యాసం చేసిన ఆయన కావాలంటే, అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడవచ్చు. కానీ, తన కాళ్ళ మీద తాను నిలబడాలనే లక్ష్యంతో, ఊరికి వచ్చేసి, అక్కడే పొలాలు చూసుకుంటూ గడిపారు. ఇవాళ ఆయన స్నేహితులందరూ ప్రభుత్వంలోనూ, బయటా ఎంతో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అంత స్వతంత్ర భావాలున్న మా నాన్న గారితో సహా మా ఇంట్లో అందరికీ మా బంధువు గంగరాజు గారంటే ఎంతో గౌరవం, గురి. ఆయన సినీ రంగంలోనే ఉన్నారు గనక, ఆయన నాలోని సృజనాత్మకతను గుర్తించి చెప్పారు గనక మా వాళ్ళు కూడా ఏమీ అభ్యంతరం చెప్పలేదు.
గంగరాజు గారి నుంచి మీరు నేర్చుకున్న పాఠాలు?
చాలానే ఉన్నాయి. ఆయన చాలా పర్ఫెక్షనిస్టు. గ్రీటింగ్ కార్డుల కోసం బెంగుళూరులోని అగ్రశ్రేణి ఫోటోగ్రాఫర్‌తో ఫోటోలు తీయించేవారు. కార్డు తయారీలో ఫోటోకు రెండు యాపిల్ పండ్లు కావాలంటే, ఊరంతా వెతికి, మచ్చలు లేని పండ్లు తెచ్చి, వాటిని బాగా తళతళా మెరిసేలా చేసేవారంటే, ఆయన ఏ పని అయినా ఎంత నిర్దుష్టంగా చేసేవారో అర్థం చేసుకోవచ్చు. ఏ పనినైనా అంత పర్ఫెక్షనిజమ్తో చేయడానికి ప్రయత్నించాలనీ, ఆ ప్రయత్నంలో మనకు సాధ్యమైనంత మేర అత్యుత్తమమైన ఫలితాన్ని అందించాలనీ ఆయన నుంచి నేర్చుకున్నా. అదే సమయంలో, చిత్ర నిర్మాణంలో పూర్తిగా పర్ఫెక్షనిజమ్తో వెళితే కుదరదు కాబట్టి, దాని కోసం ప్రయత్నిస్తూ, పరిస్థితిని బట్టి ఆచరణాత్మకంగా కొంత సర్దుకుపోవాలనీ తెలుసుకున్నా.
మీ మీద ఆయన ప్రభావం ఏ మేరకు ఉంది?
తొలి రోజుల్లో చాలానే ఉంది. 'కొత్తదనం ఉండేలా ఆలోచించాలి.ఆలోచించ డానికి బద్ధకించకూడదు' అన్న ఆయన అభిప్రాయాలు నాపై ప్రభావం చూపాయి. ఆ పద్ధతిలోనే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాను. పర్ఫెక్షని జమ్ కోసం తపిస్తూ, ఈ మార్గంలో వెళ్ళడం వల్ల కొన్ని లాభాలూ ఉన్నాయి, కొన్ని నష్టాలూ ఉన్నాయి. సరైన నిర్మాత, యూనిట్ దొరికితేనేమో ఈ పద్ధతి మంచి ఉత్పత్తిని బయటకు తీసుకురావడానికి ఉపకరిస్తుంది. లేకపోతే మాత్రం పర్ఫెక్షనిజమ్ కోసం మనం పడే తపన అవతలివాళ్ళకు నస అనిపించే ప్రమాదం ఉంది.
'ఐతే'తో దర్శకుడైన మీకు పదేళ్ళలో 'సాహసం' అయిదో సినిమాయే! తక్కువ అనిపించడం లేదా?
(నవ్వుతూ...) నన్ను అందరూ ఇలా అడుగుతుం టారు కానీ, ఈ మధ్య నేను చాలా మంది దర్శకుల చిత్రావళి చూస్తే, వాళ్ళూ ఈ కాల వ్యవధిలో తీసిన సినిమాలు ఇదే సంఖ్యలో ఉన్నాయి. కాకపోతే, ఒకటో, రెండో ఎక్కువ ఉండవచ్చు. 'ఐతే...' తరువాత ఉదయకిరణ్తో తీయబోయిన చిత్రం, ఈ 'సాహసం' ముందు దాదాపు ఏణ్ణర్ధం పాటు వర్క్ చేసిన ఇంకొక చిత్రం - ఆ రెండూ ఆగిపోయాయి. అవి గనక చేసి ఉంటే, నావీ ఏడు సినిమాలు అయ్యుండేవి.
'ఐతే...' దగ్గర నుంచి ఇప్పటి దాకా మీరు చేసిన 5 సినిమాలూ కథలోనో, కథనంలోనో ఏదో ఒక రకంగా సాహసాలే!
(నవ్వేస్తూ...) 'ఐతే..' చేసినప్పుడు మాత్రం అది సాహసం కాదు, అమాయకత్వం! అప్పట్లో సినిమా అంటే ఇలా ఉండాలి, ఈ ఈ కేంద్రాల్లో ఆడాలంటే ఇలాంటి అంశాలుండాలి లాంటి లెక్కలు నాకు లేవు. ఒక వేళ ఇన్ని లెక్కలు గనక ఉంటే, అసలు 'ఐతే..' చేసుండేవాణ్ణి కాదు. ఆ లెక్కలేవీ తెలియకపోవడం వల్ల నాకు నచ్చిన కథతో, నచ్చిన విధంగా తీశాను. ఆ తరువాత కూడా ఏదో ఒక కొత్తదనంతో జనం ముందుకు రావాలన్న ఆలోచనల వల్లే మిగిలిన సినిమాలు వచ్చాయి.
మీరు ఎక్కువగా థ్రిలర్లు, అడ్వెంచర్ తరహా కథలే తీస్తున్నట్లున్నారు. అవి మీకు ఇష్టమా?
దర్శకుడన్నాక అన్ని రకాల కోవలకు చెందిన చిత్రాలూ తీయాలని ఉటుంది. కానీ, అన్నీ కుదరాలి కదా! నేను తీసిన 'ప్రయాణం' (2009) థ్రిల్లర్ కాదుగా! పట్టాల మీదకు ఎక్కకుండానే ఆగిపోయిన రెండు చిత్రాలూ ప్రేమకథలు. కాబట్టి, అవి కూడా తీస్తాను. ఇంత విరామం రాకుండా, ఇప్పుడు ఒకేసారి మూడు కథల మీద పని చేస్తున్నా. అవి ప్రేమ కథలే!
'ఐతే...' విడుదల తర్వాత నుంచి మీ చిత్రాలంటే జనంలో ఆసక్తి ఉంది. కానీ, వాటి ఆర్థిక విజయం ఆశించినంత ఉన్నట్లు లేదే!
కొన్నిసార్లు మనం కాలాని కన్నా కొద్దిగా ముందుకు వెళ్ళి, సినిమా తీస్తాం. ఓ కామిక్ బుక్ లాగా సాగుతూ, జీవితంలోని క్షణాలను ఒడిసిపట్టే ప్రయత్నంగా చేసిన 'ప్రయాణం' సినిమా నేను అనుకున్నట్లే ఆడింది. కానీ, ఆ చిత్రం అప్పుడు కాకుండా రెండు, మూడేళ్ళ తరువాత వచ్చి ఉంటే, దాని వాణిజ్య విజయం ఇంకా ఎక్కువ ఉండేది. అలాగే, 'అనుకోకుండా ఒక రోజు' (2005) నాటికి ఇన్ని మల్టీప్లెక్సులు, ఇంత ఆదరణ లేదు. ఏమైనా, కొత్త తరహా కాన్సెప్టులకు జనం కొద్దిగా అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది.
మీ చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే ఎక్కువ భాగం మీవే! వాటి ఆలోచనలు ఎక్కడ నుంచి అందిపుచ్చుకుంటూ ఉంటారు?
నా కథల్లో చాలా వాటికి ప్రేరణ - కాల్పనిక సాహిత్యం కాదు, కాల్పనికేతర సాహిత్యమే! చిన్నప్పుడు ఎక్కువగా కథలు, నవలలు చదివేవాణ్ణి. కానీ, పెద్దయ్యాక, అందులోనూ దర్శకుడినయ్యాక ఎక్కువగా నాన్-ఫిక్షనే చదువుతున్నా. వార్తాపత్రికలు, మ్యాగజైన్లు ఎక్కువగా చదువుతా. చిన్న వార్త దగ్గర నుంచి, ఎక్కడో జరిగిన ఏదో సంఘటన దాకా అన్నీ నా కథలకు ప్రేరణే. అందుకే, నేను ఉద్దేశపూర్వకంగా ఇతర కథలు, రచనల నుంచి కానీ, చిత్రాల నుంచి కానీ అంశాలను కాపీ కొట్టలేదు. చదివిన, చూసిన వార్తలు, అంతరాంతరాళాల్లోని ఆలోచనలే కథలుగా రూపుదిద్దుకుంటున్నాయి.
కథ, స్క్రీన్‌ప్లే మీవే అయినా, సంభాషణలకు వేరేవాళ్ళను పెట్టుకుంటారే?
నేను చదువుకొనే రోజుల్లో ఇంగ్లీషు మీడియమ్‌లో చదువుకోవడం, ఇంగ్లీషులో మాట్లాడడం ఓ ఫ్యాషన్. అలా పెరగడం వల్ల నేను ఎక్కువగా ఇంగ్లీషు పుస్తకాలు చదువుతుంటాను. నా కథ, వగైరా కూడా ఇంగ్లీషులోనే రాస్తుంటాను. తెలుగులో కూడా కొద్దిగా గిలుకుతుంటాను. కానీ, సంభాషణలు రాయాలంటే, తెలుగు భాష మీద గట్టి పట్టున్న రచయిత నాకు తప్పకుండా కావాలి. మన భాషలో చిన్న చిన్న మాటలతో మొత్తం అర్థాలే మారిపోతుంటాయి. నా దగ్గర దాదాపు పదేళ్ళుగా పనిచేస్తున్న రాధాకృష్ణ గతంలో 'ప్రయాణం' చిత్రానికీ, ఇప్పుడు 'సాహసం' చిత్రానికీ మంచి డైలాగులు రాశారు. త్వరలోనే అతను దర్శకుడు కూడా కానున్నాడు.
'సాహసం' సినిమా ఇతివృత్తం?
ఇది ఒక యాక్షన్ ఎడ్వంచర్ చిత్రం. డబ్బు లేక సాధారణ జీవితం గడుపు తున్న ఓ మామూలు వ్యక్తి, తాను పెద్ద ఆస్తిపరుడిననీ, కానీ ఆ ఆస్తి వేరొక చోట ఎక్కడో నిధి రూపంలో ఉందనీ తెలుసుకున్నప్పుడు, దాన్ని సాధించుకోవడం కోసం చేసే సాహసమే ఈ చిత్ర కథ.
ఇలా నిధి కోసం సాగే అన్వేషణలు చాలా చిత్రాల్లో చూశాం. జనానికి నచ్చితే ఇలాంటి చిత్రాల్ని నెత్తిన పెట్టుకుంటారు. లేదంటే, ఏముందంటూ నాలుక చప్పరించేస్తారు! ఇలాంటి కథ సినిమాగా తీయడం కత్తి మీద సాము కదా!
ఆ మాటకొస్తే వినోదాత్మక చిత్రంతో సహా, ఏ సినిమా తీయడమైనా కత్తి మీద సామే! ప్రేక్షకుల అభిరుచిని కనిపెట్టడం చాలా కష్టం. వాళ్ళ అభిరుచి, మనం తెరపై చూపాలనుకొన్నది - సరిగ్గా సరి పోవడం చాలా కష్టం. సరిపోయేలా తీయగలిగితే ఆ సినిమా పెద్ద హిట్. లేదంటే, ఫ్లాప్. 'సాహసం' చిత్ర విషయానికి వస్తే, గోపీచంద్ లాంటి యాక్షన్ హీరోను పెట్టుకొన్నప్పుడు, అతని ఇమేజ్‌కు సరి పడేలా మాస్ మెచ్చే యాక్షన్ చిత్రమే చేయాలి. అంతేతప్ప, బుద్ధిబలంతో సాగే కథ తీయలేం. 'సాహసం'లో మొదటి నుంచి చివరి వరకు ఆసక్తికరమైన ఘట్టాలెన్నో ఉంటాయి. క్లైమాక్స్‌లో అరగంట పైగా వచ్చే దృశ్యాలు, అక్కడి కంప్యూటర్ గ్రాఫిక్స్ జనానికి నచ్చుతాయి. హైదరాబాద్, కర్నూలుతో పాటు, ఢిల్లీ, కర్ణాటకలోని బీదర్, భారత - పాక్ సరిహద్దుల్లోని లడఖ్ ప్రాంతాల్లో కూడా చిత్రీకరణ జరిపాం.
సరిహద్దుల్లో సినిమా తీయడం ఇబ్బంది కాలేదా?
లేదు. సామాన్య పౌరులను అనుమతించే ప్రాంతాల్లోనే సినిమా తీశాం. సరిగ్గా తీస్తే, అక్కడే మూడు, నాలుగు సినిమాలు తీయగలిగినన్ని అందమైన లొకేషన్లెన్నో ఆ ప్రాంతంలోనే ఉన్నాయి. కాకపోతే, లడఖ్ పరిసరాలు ఎంతో ఎత్తయిన ప్రాంతం కాబట్టి, ఆక్సిజన్ తక్కువ. మొదట రెండు, మూడు రోజులు శారీరకంగా శ్రమ అనిపిస్తుంది. కానీ, అలవాటయ్యాక ఆ తాజా గాలి, వాతావరణం ఎంతో బాగుంటుంది. అక్కడే 30 రోజులు షూటింగ్ చేశాం.
జనం అభిరుచి ఎవరికీ తెలియదన్నారు! తెలియదని తెలిశాక, ఇక ఎవరైనా సినిమా తీయడమే కష్టమేమో!
(వెంటనే అందుకుంటూ...) అలా కాదు. ప్రేక్షకుల అభిరుచి నూటికి నూరు పాళ్ళు ఎవరికీ తెలియదు. తెలిస్తే, ఇన్ని ఫ్లాపులే ఉండవు కదా! కానీ, తెలుసు అనుకొని ముందుకు వెళుతూ ఉంటాం. ప్రతి సినిమా హిట్ అవుతుందనే యూనిట్ అందరూ గట్టిగా నమ్మి, సినిమాకు పని చేస్తారు. ఆ మాట కొస్తే, యాడ్ చిత్రాల మొదలు నవలా సాహిత్యం దాకా అన్నింటికీ ఇది వర్తిస్తుంది. విడుదలై, జనం స్పందనతో కానీ, వారి అభిరుచికి సరిపోయామా, లేదా అన్నది తెలియదు. నా చిత్రాల్లో 'అనుకోకుండా ఒక రోజు' నేను అనుకున్న దానికీ, జనం ఆశించిన దానికీ ఏ మాత్రం సరిపోలేదు. అందుకే, ఆ చిత్రం కేవలం ఓ స్థాయి కలిగినవారికీ, విద్యావంతులకే నచ్చింది. ఆ సినిమా పతాక సన్నివేశాలను మాదక ద్రవ్యాల మీద కాక, పాతుకుపోయిన మూఢ విశ్వాసాల మీద చూపించడం సామాన్యులకు నిరాశ కలిగించింది. ఆ తరువాత నుంచి ఏదైనా సరే, మరీ చిక్కగా కాకుండా, సామాన్యులకు సులభంగా చేరేలా పలచన చేసి చెప్పాలని నా ఆలోచన తీరును చాలా మార్చుకున్నా.
నిజానికి మీ చిత్రాల్లో 'అనుకోకుండా ఒక రోజు' వినూత్నం గానే కాక, గుడ్డి నమ్మకాలపై ఆలోచనాత్మకంగా ఉంటుంది!
అవును. 'ఫలానా స్వామీజీ డ్రైనేజీ నీళ్ళిస్తే ఆరోగ్యం కుదుట పడుతుంది' లాంటి మూఢ విశ్వాసాలతో అమాయకుల్ని మోసం చేస్తున్న అనేక మంది మోసకారీ బాబాల గురించి అప్పట్లో అనేక వార్తా కథనాలు వచ్చాయి. మరో పక్క అప్పుడే హైదరాబాద్‌లో పబ్ కల్చర్, పార్టీలో డ్రగ్స్ తీసుకోవడం లాంటివి మొదల య్యాయి. అటు మూఢనమ్మకం, ఇటు మాదకద్రవ్యాలు - రెండూ మనిషి ఆలోచనను ప్రభావితం చేసేవే. కాబట్టి, ఆ రెంటికీ ముడిపెడుతూ, ఆలోచింపజేసేలా తీశాను. అలాగే, మత్తు ప్రభావం వల్ల కొద్ది గంటల పాటు ఏం జరిగిందో తెలి యని స్థితిలోకి కథానాయిక పాత్ర వెళితే ఎలా ఉంటుందనే పాయింట్ చూపెట్టాను. నేను చెబితే, గొప్పలు చెప్పుకుంటు న్నట్లు ఉంటుంది కానీ, ఆ తరువాత అదే పాయింట్‌తో 'హ్యాంగోవర్', ఈ మధ్యే తెలుగులో 'యాక్షన్' లాంటి చాలా చిత్రాలు వచ్చాయి. కానీ, దురదృష్టవశాత్తూ, ఆ సినిమా నేను ఆశించినంత ఎక్కువ మందికి చేరుకోలేకపోయింది. అయితేనేం, కథ, పాటలు, పాత్రధారుల నటన పరంగా నా చిత్రాల్లోకెల్లా నాకు వ్యక్తిగతంగా బాగా నచ్చిన సినిమా, నా బెస్ట్ సినిమా అది.
మీ మీద, మీ చిత్రాల మీద ప్రేక్షకులకు ప్రత్యేక అంచనా ఉంటోంది. దానికి మీరేమంటారు?
(నవ్వుతూ...) 'ఐతే' చిత్రంతో వచ్చిన ఆ అంచనాను ఆ తరువాత నేను తీసిన ఇతర చిత్రాలు ముందుకు తీసుకు వెళ్ళాయి. కానీ, ఎప్పటికప్పుడు వాళ్ళ అంచనాలను అందుకో గలమా అన్న బెరుకు ఉంటుంది. అందుకే, వీలైనంత వరకు ఏ సినిమాకూ నేను హైప్ చేయకూడదనుకుంటా. 'అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఆహా, ఓహౌ' అని చెప్పకుండా ఉంటే, ఏ రకమైన అంచనాలూ లేకుండా జనం వస్తారు. వారికి దానిలోని కొత్తదనం ఏ మాత్రం బాగున్నా, ఆనందంగా స్వాగతి స్తారు. అందుకే, ప్రేక్షకులకు నా చిత్రాల పట్ల అంచనా ఉండడం నాకు ఆనందంతో పాటు భయాన్ని కూడా కలిగిస్తోంది.
'సాహసం'కి కార్పొరేట్ సంస్థ రిలయన్స్ భాగ స్వామ్యం కూడా ఉంది. చిత్ర నిర్మాణంలో ఈ సంస్థల భాగస్వామ్యంతో పని పద్ధతుల్లో వచ్చే తేడా?
నాకు తెలిసి పని పద్ధతుల్లో పెద్దగా తేడా ఏమీ ఉండదు. కాకపోతే, ఇప్పటికీ సాంప్రదాయికంగా చిత్ర నిర్మాణానికి క్రమబద్ధమైన ఆర్థిక ఋణ వ్యవస్థ లేదు. బ్యాంకులు ఇవ్వవచ్చంటూ నియమ నిబంధనలున్నా, ఆ ఫైనాన్స్ అందరికీ అందుబాటులోకి రాలేదు. పైపెచ్చు, సినిమాలకు ఫైనాన్స్ చేయడానికి బ్యాంకులు అడిగే, కో-లేటరల్ ఆస్తులు ఎంత మంది దగ్గర ఉంటాయి. అందుకే, ఇప్పటికీ చిత్ర నిర్మాణంలో ఫైనాన్స్ వ్యవస్థలో పెద్ద వెలితి ఉంది. కార్పొరేట్ సంస్థల వద్ద భారీగా నిధులుండడం వల్ల, వాళ్ళు ఆ వెలితిని పూడ్చగలరు. వాళ్ళ భాగస్వామ్యం వల్ల నిర్మాతల మీద భారం తగ్గుతుంది. వడ్డీలు పెద్దగా పడవు. చిత్ర కథా సంగ్రహం, స్క్రిప్టు అన్నీ ముందుగానే ఇవ్వాల్సి ఉంటుంది. పైగా, చిత్ర నిర్మాణం కూడా మరింత క్రమశిక్షణాయుతంగా సాగుతుంది. ఇప్పటికే హిందీ, తమిళాల్లో కార్పొరేట్ సంస్థల వారి చిత్ర నిర్మాణం చాలా జోరుగా సాగుతోంది. తెలుగులో ఊపందుకోలేదు.
'ఐతే'లో పవన్ మల్హోత్రా, 'ఒక్కడున్నాడు'లో మహేశ్ మంజ్రేకర్, 'సాహసం'లో శక్తికపూర్, లక్కీ అలీ - ఇలా మీ విలన్లంతా ఉత్తరాది వాళ్ళే! ఎందుకలా?
ఆ కథల్లోని విలన్ పాత్రల స్వరూప స్వభావా లను బట్టే వాళ్ళను తీసుకున్నా. మనకు కోట శ్రీనివాసరావు లాంటి అద్భుతమైన యాక్టర్లున్నారు. కానీ, కథ ప్రకారం విలన్ పాత్ర ఉత్తరాదిది అయినప్పుడు, సహజత్వానికి దగ్గరగా ఉండేలా పాత్రధారుల్ని ఎంచుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే, ప్రేక్షకులు కూడా మునుపటిలా కాకుండా, ఇప్పుడు ఎక్కువగా వాస్తవికతనే చూస్తున్నారు, ఆదరిస్తు న్నారు. అయినా, ఇప్పుడు తెలుగులో మాత్రం ఎంచుకోవ డానికి అంత అద్భుతమైన విలన్లు ఎవరున్నారు చెప్పండి!
'ఐతే', 'ఆనంద్' లాంటి విభిన్న తరహా ప్రయత్నాలు తెలుగు తెరపై ఎక్కువగా రావడం లేదేం?
ఏ ఉత్పత్తి అయినా, దాన్ని ఉద్దేశించిన వినియోగదారుడి మద్దతు లేకుండా మనలేదు. సినిమా కూడా ఓ వినియోగ దారుల ఉత్పత్తి. ఇక్కడ వినియోగదారులైన ప్రేక్షకులకు ఏది కావాలో, దాన్నే ఇచ్చే పనిలో ఉంటారు. అలా ఇవ్వకపోతే, ఇక్కడ వ్యవహారం ముందుకు నడవదు. 'ఐతే', 'ఆనంద్' లాంటి చిత్రాలను పెద్ద ఇమేజ్ ఉన్న హీరోలతో తీయలేం. కొత్త కాన్సెప్ట్‌తో కూడిన అలాంటి చిత్రాలను కొత్తవాళ్ళతోనే తీయ గలం. వాళ్ళ చిత్రాలకు వాణిజ్య విస్తృతి ఉండదు. అందుకనే, కళ ఎప్పుడైతే కన్జ్యూమర్ ప్రొడక్ట్ అయిందో, అప్పుడే దానిలోని సృజనాత్మకత కొంత వెనుకపట్టున ఉండాల్సి వస్తుంది.
తెలుగులో తీసిన కథలే తీస్తూ, మన దర్శక, రచయితలు సృజనాత్మక, భావ దారిద్య్రంలో ఉన్నారని ఓ విమర్శ ఉంది!
(మధ్యలోనే అందుకుంటూ...) లేదు లేదు. మన దర్శక, రచయితల్లో ఎంతో పరిజ్ఞానం ఉంది. వాళ్ళ దగ్గర ఎన్నో వినూత్నమైన కాన్సెప్టులున్నాయి. అవి తెరకెక్కాలంటే, మార్కెట్ పరిస్థితులు కూడా అందుకు అనుకూలించాలి. ప్రస్తుతం ఎక్కువ శాతం ప్రేక్షకులు వినోదాన్నే కోరుకుంటున్నారు. వారి అభిరుచికి తగ్గట్లే, మనమూ సినిమాలు తీస్తున్నాం. అంతెందుకు! మీరు పత్రికలో వార్త, ఇంటర్వ్యూ రాసేటప్పుడు కూడా అందులో అందరినీ ఆకర్షించే అంశాన్ని శీర్షికగా పెట్టి, ఆ న్యూస్‌ను పాఠకుడికి నచ్చేలా చేస్తారు కదా! సినిమాతో సహా ఏ ఉత్పత్తి అయినా అంతే! ఏమైనా, మొత్తం మీద మీతో, నాతో సహా మన ప్రేక్షకులందరి అభిరుచిలో మార్పు రావాలి. దానికి తగ్గట్లే దర్శకుల, రచయితలూ మారాలి. ఈ మథనంలో మార్పులు వచ్చి, మళ్ళీ ఓ స్థిరత్వం వస్తుందని నా నమ్మకం.
ఇవాళ కథ చెప్పడం కాకుండా, ఫలానా హీరోతో సినిమా అంటూ కాంబినేషన్లు చెప్పే స్థాయికి పడి పోయిందనీ విమర్శ ఉంది. దీనికి మీ వ్యాఖ్య?
(ఆశ్చర్యపోతూ...) నాకు తెలిసినవారిలో కాంబి నేషన్ల పేరు చెప్పి, కథ నడిపే దర్శకులు ఎవరూ లేరు. నా మటుకు నాకెప్పుడూ అలాంటి అనుభవం, పరిస్థితి రాలేదు. నన్నడిగితే, సినిమాలో ఇప్పటికీ దర్శకుడిదే ప్రథమ స్థానం, ముఖ్యస్థానం. సెట్స్ మీదకు సినిమా వెళ్ళక ముందు నుంచి ఆ సినిమా మొత్తం మీద అవగాహన ఉన్న వ్యక్తి, మొత్తాన్నీ తన మనో నేత్రంతో దర్శించే వ్యక్తి దర్శకుడు ఒక్కడే! గాలిలోనే పెయింటింగ్ వేసే సృజనశీలి దర్శకుడు.
ఇవాళ నూతన దర్శకులకు అవకాశాల మాటేంటి?
కొత్తగా దర్శకత్వంలోకి వస్తున్నవారికి ఇప్పుడు మంచి మార్కెట్ ఉంది. మునుపటి కన్నా ఇప్పుడు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మల్టీప్లెక్సులు చాలా వచ్చాయి. కాబట్టి, చక్కటి కాన్సెప్టులతో, తక్కువ బడ్జెట్లో సినిమా తీస్తే ఆదరణ బాగుంటుంది. బడ్జెట్ మాత్రం పరిమితి మీరకూడదని గట్టిగా గుర్తుంచుకోవాలి.
సీరియల్‌గా మీకు తొలిసారి దర్శకుడి హౌదానిచ్చిన 'అమృతం' ఇప్పుడు గంగ రాజు దర్శకత్వంలో సినిమాగా వస్తోంది కదా! పాత జ్ఞాప కాలతో ఆ సినిమాకు సరదాగా మీరూ పని చేశారా?
(నవ్వుతూ..) చేస్తే బాగుండేది. కానీ, ఓ పక్క నా 'సాహసం' షూటింగ్, మరోపక్క గంగరాజు గారి షూటింగ్ ఒకేసారి జరిగాయి. దాంతో, ఆయనతో మాటామంతీ అయితే జరపగలిగాను కానీ, షూటింగ్‌కు వెళ్ళి పాల్గొనలేకపోయాను. ఆ సినిమాలోనూ కంప్యూటర్ గ్రాఫిక్స్ (సి.జి) చాలానే ఉన్నాయి.
కెరీర్లో ఏదైనా తడబాటు ఎదురైనప్పుడు, మీరు ఎవరి నుంచి మార్గ నిర్దేశం పొందుతుంటారు?
ప్రత్యేకించి నాకు గైడింగ్ ఫోర్స్ అంటూ ఎవరూ లేరు. కెరీర్ తొలి రోజుల్లో గంగరాజు గారి నుంచి సలహాలు పొందా. ఇప్పటికీ ఏదైనా సమస్యంటూ వస్తే గిస్తే, ఆయన ఎలాగూ ఉంటారు. అయితే, ఎక్కువ భాగం ఆత్మ పరిశీలన, స్వీయ విశ్లేషణ ద్వారా తప్పొప్పులు తెలుసుకుంటాను. సరిదిద్దు కుంటా. పైగా, నిజాయతీగా విశ్లేషించే విమర్శకులు ఉండనే ఉన్నారు. విమర్శకుల విశ్లేషణను సహృదయంతో స్వాగతిస్తా. అలాగే, చిత్ర నిర్మాణం చివరి దశకు వచ్చేసరికి సినిమా మీద ఒక నిర్దిష్టమైన అంచనా యూనిట్లో వాళ్ళకు వచ్చే స్తుంది. వాళ్ళు ఆ మాట నిర్మొహమాటంగా చెప్పే స్తారు. ఎందుకంటే, ఒక ఉత్పత్తిని రూపొందించి జనంలోకి వదిలిపెట్టాక, దాని మీద ఎలాంటి స్పందన వచ్చినా స్వీకరించాల్సిందే! తప్పదు!
'సాహసం' చూశాక, యూనిట్ చేసిన ఓ వ్యాఖ్య?
(ఒక్క క్షణం ఆగి...) 'చాలా బాగుంది' అని చెప్పారు. ఈ చిత్రం ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుందని నమ్ము తున్నాం. ఆ రకమైన సానుకూల ప్రకంపనలు వస్తున్నాయి.
మీ తరువాతి చిత్రాలు ఎలా ఉండబోతున్నాయి?
ఈ సారి ఇంత విరామం రాకుండా చకచకా సినిమాలు తీయాలనుకుంటున్నాను. అందుకే, ఇప్పుడు రెండు కథలు రాస్తున్నాను. మరో ప్రేమకథ సిద్ధంగా ఉంది. వీటిలో ముందుగా ఏది పట్టాల మీదకు ఎక్కుతుందో చూడాలి. వీటిలో ఒక ప్రేమ కథ కొత్తవాళ్ళతో తీయాల్సింది అయితే, మరో కథ పెద్ద హీరోలకు సరిపోయే కథ.
గతంలో ఉదయ కిరణ్‌తో అనుకున్న కథా ఇది?
(నవ్వుతూ...) కాదు! కొత్తది. ఎందుకనో, ఒకసారి రాసేసిన స్క్రిప్టు మీదకు మళ్ళీ నా మనసు వెళ్ళదు. ఏదైనా కొత్త పాయింట్ మరింత ప్రేరణనిచ్చేదిగా ఉన్నదాని మీద మనసు పోతుంది. అందుకని ఎప్పటికప్పుడు కొత్త కథలే చేస్తుంటాను.
మీ జీవితంలోని మర్చిపోలేని ఘట్టం ఏమిటి?
'ఐతే' విడుదలైన తరువాత నాకు లభించిన ప్రశంసలన్నీ ఇన్నీ కావు. అది ఎప్పటికీ మర్చిపోలేను. నిజానికి, ఆ చిత్రం అంతా పూర్తి అయిపోయాక కూడా, రిలీజుకు నోచుకోకుండా చాలా రోజులు అలా ఆఫీసులోనే బాక్సులో పడి ఉంది. ఆ పరిస్థితుల్లో రోజు రోజుకూ ఆత్మవిశ్వాసం క్షీణిస్తూ వచ్చింది. చివరకు ఎలాగైతేనేం, సినిమా విడుదలై, మా యూనిట్ అందరికీ పేరు తెచ్చి, జాతీయ స్థాయిలో అవార్డు సాధించడం ఎన్నటికీ మర్చిపోలేను. దర్శకుడిగా నాకు, కళా దర్శకుడిగా రవీందర్కూ, కెమేరా మన్‌గా సెంథిల్ కుమార్‌కూ - ఇలా ఎంతోమంది కొత్తవాళ్ళకు ఆ చిత్రం జీవితాన్నిచ్చింది. ఆ చిత్ర యూనిట్‌లోని అందరూ ఇవాళ పరిశ్రమలో పెద్ద స్థాయిలో ఉండడం ఎంతో సంతోషం కలిగిస్తోంది.
- రెంటాల జయదేవ
- రెంటాల జయదేవ
.........................................................................
1 వ్యాఖ్యలు:
యేలేటి చంద్రశేఖర్ ముఖాముఖి లో ఆయన ఇచ్చిన జవాబులు రాబట్టిన రెంటాలజయదేవ ప్రశ్నలు తెలివిగా బాగా ఉన్నాయి!ఐతే యేలేటిగానే నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను!అది అద్భుతః మళ్ళీ తియ్యాలనుకున్నా యేలేటి అలా ఇప్పుడు తియ్యలేడు తియ్యడు!ఆయన తలకు ఇంత ఆలోచనాశక్తి ఉందని ఇంతవరకు నాకు తెలియనే తెలియదు!అది నా అజ్ఞానం!అన్నిసినిమాలూ ఒకేలా గతానుగతికంగా తీయకూడదు!ఎప్పుడూ ఏదో ఒకటి సరికొత్తగా చేసి విరగదీయాలి!perfectionist గా ఆలోచించాలి కాని ఆలోచించడానికి బద్ధకించరాదు!కొత్త తరహా concepts తెలుగుజనానికి కొద్దికొద్దిగా అలవాటుచేయాలి!సృజనాత్మక దారిద్ర్యం,భావదారిద్ర్యం ససేమిరా ఉండకూడదు!ఆత్మపరిశీలన,స్వీయ విశ్లేషణ ఉండాలిగాక ఉండాలుండాలి!ఈ అంశాలన్నీ నేటి కొత్తతరం సినిమాదర్శకులు ఎంతత్వరగా నేర్చేసుకుంటే ప్రేక్షకులకు అంతమంచిది!
Post a Comment