ఇన్ని త్రీడీలు వస్తున్నా, త్రీడీ చిత్రీకరణకు తగిన సామగ్రిని ఎంచుకోవడానికి శ్రమించాల్సి వచ్చిందా?
అవును. భారత్‌లో తీసిన హార్రర్ చిత్రం 'హాంటెడ్ -3డి' ఎక్విప్‌మెంట్‌ను బొంబాయి వెళ్ళి చూశాం. కానీ, ఆ కెమేరా రిగ్ చాలా నిదానంగా కదులుతుంది. 3డి సినిమాల్లో చిత్రీకరణకు ఉపయోగించే, రెండు కెమేరాలూ, దాని తాలూకు సరంజామాను అంతా పట్టి ఉంచేదాన్ని 'రిగ్' అంటారు. అది చాలా కీలకం. కానీ, 'హాంటెడ్'కు వాడిన రిగ్ పరిమితమైనది. నియంత్రిత వాతావరణంలో, స్టడీ షాట్లే ఎక్కువగా వాడుతూ ఆ సినిమా తీశారు. కానీ, దానితో 'ఓం' లాంటి యాక్షన్ సినిమాలు తీయడం కుదరదు. దాంతో, ఏటా తమ చిత్రాల్లో అధిక శాతం వాటిని 3డిలో తీసే హాంకాంగ్, థాయిలాండ్, వియత్నాం లాంటి ఆసియా దేశాల వైపు వెళ్ళాం. హాంకాంగ్‌లో ప్రయోగాత్మకంగా షూటింగ్ చేసి, వేసుకొని చూశాం. బాగుందనుకున్నాం. కానీ, 3డి చిత్రీకరణలో కీలకమైన కన్వర్జెన్స్ పాయింట్ అనేది మాన్యువల్‌గా ఎప్పటికప్పుడు చూసుకోవడం ఆ కెమేరా రిగ్‌లోని సమస్య. అదీ కుదరదులెమ్మని భారత్‌కు తిరిగి వచ్చేశాక, అమెరికాలోని ఓ తెలిసిన ఆయన 'అవతార్' చిత్రీకరణకు తోడ్పడిన 'త్రీ యాలిటీ' అనే సంస్థ గురించి చెప్పారు. వారు అత్యుత్తమ టెక్నాలజీతో చేసిన అధునాతమైన సామగ్రి - 'టి.ఎస్5 రిగ్'. ఇప్పటికీ త్రీడీ చిత్రీకరణలో దాన్ని మించిన కెమేరా రిగ్ లేదు. పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నడిచే రిగ్ అది. రెండు కెమేరాలనూ ఆటోమేటిగ్గా అనుసంధానించుకొని, ఏకకాలంలో మొదలయ్యేలా చూసుకొంటూ, ఆటోమేటిగ్గా కన్వర్జెన్స్ కూడా చేసుకోవడం దాని ప్రత్యేకత. కానీ, అది చాలా ఖరీదైనది. క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని మా టీమ్‌లోని హరి (బావమరిది), అనిల్ - అందరూ పట్టుబట్టడంతో, చివరకు ఆ రిగ్‌ను పూర్తిగా అద్దెకు తెచ్చుకున్నాం. ఒక రిగ్ టెక్నీషియన్, ఈ వ్యవహారం మొత్తాన్నీ పర్యవేక్షించే ఒక స్టీరియోగ్రాఫర్, అలాగే 'డిజిటల్ ఇమేజ్ ట్రాన్స్‌ఫరింగ్' (డి.ఐ.టి) టెక్నీషియన్లు ఇద్దరు - ఇలా మొత్తం నలుగురు హాలీవుడ్ సాంకేతిక నిపుణుల్ని కూడా వెంట తెచ్చుకున్నాం.
'అవతార్'కి పనిచేసిన డేవిడ్ టేలర్ కూడా ఆ టీమ్‌లో ఉన్నారట! వాళ్ళతో పూర్తి చేశారన్న మాట!
అది అంత సులభమేమీ కాలేదు. వాళ్ళందరూ ఓ నెలరోజులు ఇక్కడ ఉండి పనిచేస్తుంటే, మొత్తం 3డి చిత్రీకరణ ప్రక్రియను మన టెక్నీషియన్ నేర్చుకోవాలని అనుకున్నాం. కానీ, అది మన వాళ్ళ వల్ల కాలేదు. దాదాపు ఎనిమిదేళ్ళ పాటు ఎవరెవరి దగ్గరో అసిస్టెంట్‌గా ఉండి తాను నేర్చుకుని, క్రమంగా స్టీరియోగ్రాఫర్‌గా ఎదిగిన పని మొత్తం నెల రోజుల్లో ఎవరికైనా ఎలా ఒంటబడుతుందని'అవతార్' స్టీరియోగ్రాఫర్ డేవిడ్ టేలర్ మాతో అన్నారు. పైగా, ఆ నెలరోజుల వ్యవధిలోనే ఒకసారి రిగ్‌లో ఏదో సమస్య వచ్చి, చిప్ పాడైతే రోజంతా శ్రమించి దాన్ని బాగు చేశారు రిగ్ టెక్నీషియన్. ఇవన్నీ చూశాక, తీరా వీళ్ళు వెళ్ళిపోయాక షూటింగ్‌లో ఏదైనా సమస్య వస్తే కష్టమని అర్థమైపోయింది. దాంతో, పదిహేను రోజుల పాటు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి, హాలీవుడ్ టెక్నీషియన్లే చిత్రం పూర్తయ్యే దాకా ఉండేలా ఒప్పందం కుదుర్చుకొని, సినిమా చేశాం.
త్రీడీలో షాట్లు తీయడం చాలా శ్రమతో, కాలవ్యయంతో కూడినవటగా!
అవును. త్రీడీలో చిత్ర నిర్మాణం మీద మన దగ్గర మునుపెవ్వరూ పుస్తకాలు రాయలేదు కదా! ఇప్పుడైతే, నా అనుభవం మొత్తంతో నేనే పుస్తకాలు రాయగలను. పైగా త్రీడీ సినిమా తీయడం మనకిక్కడ అలవాటు లేదు కాబట్టి, ఆ పని, ఆ పద్ధతులు ఒక్క కెమేరామన్‌కో, దర్శకుడికో కాదు... ఆఖరికి లైట్ బారు దాకా అందరికీ తెలియాలి. అప్పుడే అందరూ సమన్వయంతో, హాయిగా పనిచేయగలుగుతారు.
మామూలుగా సినిమా చిత్రీకరణకు, సాంకేతిక భాషలో చెప్పాలంటే 'ఒక స్టాప్' లైటింగ్ పెడతారు. కానీ, త్రీడీ చిత్రీకరణకు మాత్రం అంతకన్నా ఒకటిన్నర స్టాప్ ఎక్కువ లైటింగ్ పెట్టాలి. ఇలా త్రీడీ చిత్రీకరణ అంటే ఏమిటని యూనిట్‌లో అందరికీ అర్థం కావడానికే టైమ్ పడుతుంది. పట్టింది కూడా! ఇంత ఎక్విప్‌మెంట్, ఇంతమంది టెక్నీషియన్లు ఉన్నా మొదటి రోజున ఒక్క షాటే తీయగలిగాం. అయితే, అందరికీ పని అర్థమై, ఓ గాడిలో పడేసరికి రోజుకు సగటున 25 షాట్లు తీశాం! ఒక రోజునైతే ఏకంగా 30 షాట్లు తీశామంటే నమ్మండి! అలా త్రీడీ చిత్రీకరణకు ఎంతో శ్రమించాం. పోస్ట్ ప్రొడక్షన్‌లో కూడా ఎంతో శ్రద్ధ తీసుకొని, కొన్ని నెలలు కష్టపడ్డాం. అందుకే, హాలీవుడ్ చిత్రాల స్థాయికి దీటుగా 'ఓం -3డి' ఉంటుందని నేను ఢంకా బజాయించి చెబుతున్నా. సినిమా చూశాక, అందరూ నా మాటలతో ఏకీభవిస్తారు.
- రెంటాల జయదేవ
(ప్రజాశక్తి డైలీ, 15 జూలై 2013, సోమవారం, పేజీ నం. 8)
.........................................
0 వ్యాఖ్యలు:
Post a Comment