జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, July 27, 2013

అసంతృప్తి మిగిల్చే నవలా చిత్రం (ఆకాశంలో సగం - సినిమా సమీక్ష)




సాహిత్యానికీ, సినిమాకూ ఉన్న పోలికల కన్నా తేడాలే ఎక్కువ. మాధ్యమాలు వేర్వేరు కావడంతో, ఏదైనా ప్రసిద్ధ సాహిత్య కృషిని వెండితెర మీదకు తీసుకురావడం కత్తి మీద సాము. పైగా, అప్పటికే ప్రాచుర్యం పొంది, పాఠకుల ఊహాలోకంలో గీసేసుకున్న చిత్రాన్ని వెండితెరపై మరోసారి చలనచిత్రంగా చూపించడానికి మామూలు సినిమా కన్నా పదింతలు కష్టపడాల్సి ఉంటుంది. అందుకే, ప్రసిద్ధమైన నవలలు తెర మీదకు వచ్చినప్పుడు జనం హర్షించడానికి ఎంత అవకాశం ఉందో, తమ ఊహల్లోని కథను తెరపై సరిగ్గా చూపలేదంటూ చప్పరించేసే ప్రమాదమూ పొంచి ఉంది. రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ పాపులర్‌ నవల 'అనైతికం' ఆధారంగా వచ్చిన 'ఆకాశంలో సగం' చిత్రం అలాంటి ప్రమాదాన్నే ఎదుర్కొంది.
కొంత విరామం తరువాత తెలుగులో వచ్చిన నవలా చిత్రం ఇది. చాలా ఏళ్ళ క్రితం వచ్చిన పాపులర్‌ నవల, కొంత చర్చ లేవనెత్తిన వివాదాస్పద రచన 'అనైతికం' కావడంతో, సహజంగానే ఆ కథను దర్శకుడు ప్రేమ్‌రాజ్‌ ఎలా తీశారా అని ఆసక్తిగా సినిమాకు వెళతాం.
.........................................................................................
చిత్రం: ఆకాశంలో సగం, తారాగణం: ఆశా సైనీ, చంద్రమహేశ్, అల్లరి రవిబాబు, శ్వేతాబసు ప్రసాద్, కథ:  యండమూరి వీరేంద్రనాథ్, మాటలు:  పరుచూరి బ్రదర్స్, సంగీతం:  యశోకృష్ణ, పాటలు:  సుద్దాల అశోక్ తేజ, నిర్మాత: మల్కాపురం శివకుమార్, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం:  ప్రేమ్ రాజ్
..........................................................................................
కథ: ముంబయిలో కుమార్తె (శ్వేతాబసు ప్రసాద్‌)తో కలసి జీవిస్తుంటుంది వసుంధర (మయూరి అలియాస్‌ ఆశాసైనీ). ఆమె ఓ సింగిల్‌ పేరెంట్‌. ''ఆమెకు భర్త లేడు, ఈ అమ్మాయికి తండ్రి లేడు'' అంటూ సూటిపోటి మాటలు వినాల్సి రావడంతో, తన తండ్రి ఎవరన్నది చెప్పమంటూ కూతురు, తల్లిని నిలదీస్తుంది. అప్పుడు తల్లి తన డైరీని కూతురికిస్తుంది.
ఆ డైరీలో తల్లి రాసుకున్న తన జీవితమే ఫ్లాష్‌బ్యాక్‌గా నడిచే ఈ సినిమా. వసుంధర ఓ మధ్యతరగతి అమ్మాయి. భర్త (దర్శకుడు చంద్రమహేశ్‌) ఓ మామూలు ఉద్యోగి. అందరు అమ్మాయిల లాగే వసుంధరకు కూడా జీవితం మీద కొన్ని ఆశలు, కోరికలు ఉంటాయి. కానీ, అన్నిటికీ నిరుత్సాహపరుస్తూ మాట్లాడే భర్త మనస్తత్త్వం, సంసారంలోని చిన్న చిన్న సంతోషాల పట్ల కూడా అతనికి ఉన్న అనాసక్తి ఆమెను కుంగదీస్తాయి. పైగా, అన్నిటికీ ఏదో ఒక అడ్డుపుల్ల వేసే ఛాదస్తపు అత్త గారు (కాకినాడ శ్యామల), తన పనిలో తాను మునిగిపోయే బావ గారు (దర్శక - నటుడు 'అల్లరి' రవిబాబు), పూజా పునస్కారాలతో గడిపే తోడి కోడలు, సినిమాలూ షికార్లకూ తిరిగే ఆడపడుచు... ఇలా ఎవరికి వారేగా ఉండే కుటుంబమది.

ఆ పరిస్థితుల్లో భర్తతో కలసి సరదాగా టూర్‌కు ప్లాన్‌ చేస్తుంది వసుంధర. తీరా ఊరెళుతున్న సమయంలోనే 'డిసెంబర్‌ 6' ఘర్షణలు తలెత్తుతాయి. ఆ సమయంలో వసుంధరను ఒంటరిగా వదిలేసి, భర్త పారిపోతాడు. ఒంటరిగా మిగిలిన ఆమె వెంట రౌడీలు పడతారు. అప్పటికి చిత్ర ప్రథమార్ధం ముగుస్తుంది. ఆ తరువాత ఆమె ఏమైంది, ఆమె జీవితం ఎలా అనుకోని మలుపు తిరిగిందన్నది చిత్ర ద్వితీయార్ధం.
నవలలో ఏముంది?
'ఏ స్త్రీ అయినా వివాహ బంధం నుంచి, భర్త నుంచి ఏం కోరుకుంటుంది? సామాజికంగా, మానసికంగా, బౌద్ధికంగా తోడు... కష్టనష్టాల్లో కాసింత ఓదార్పు! అది లేనప్పుడు ఆ ఓదార్పు హస్తం కోసం ఆమె అర్రులు చాస్తుండడాన్ని సాకుగా తీసుకొని, ఆమెను తమ అవసరాలకు వాడుకోవడం పురుషాధిక్య భావజాలంలోని వికృతి. అసలు స్త్రీ పురుషులు ఇండిపెండెంట్‌ కాదు... ఇంటర్‌ డిపెండెంట్‌' అన్న వాదనను 'అనైతికం'లో యండమూరి వినిపించే ప్రయత్నం చేశారు. దురదృష్టవశాత్తూ చాలామంది స్త్రీవాదులు ''పురుషుణ్ణి తమ శత్రువుగా పరిగణిస్తున్నారు. నిజానికి, సమాజం వేరు. పురుషుడు వేరు. సమాజంలో పురుషుడు ఒక భాగం మాత్రమే...'' అని నవలలో పాత్రలతో అనిపిస్తారు. కాబట్టి శత్రువుగా భావించాల్సింది సమాజంలోని ఈ భావజాలాన్నే తప్ప, అందులో ఓ చిన్న భాగం మాత్రమే అయిన పురుషుణ్ణి కాదంటారు.
నైతికం, సామాజిక, ఆర్థికం - అనే మూడు కట్టుబాట్లకు ప్రతీకలుగా అహల్య, ఆమె వదిన అచ్చమ్మ, అహల్య కూతురు శ్యామల అనే మూడు పాత్రలతో 'అనైతికం' నవల సాగుతుంది. ఆ పాత్రలు తమ కోణం నుంచి తమ కథలను తాము చెబుతూ వస్తాయి. ఈ పాత్రల జీవితాల్లో జరిగే సంఘటనల తాలూకు మానసిక సంఘర్షణే కథకు మూలం. దీన్ని సినిమాగా తీయాలన్న దర్శక, నిర్మాతల సాహసానికి అభినందనలు చెప్పాలి.
సినిమాలో ఏం చూపారు?
అయితే, పేరుకు ఇది యండమూరి 'అనైతికం' ఆధారంగా తీసినది అయినప్పటికీ, వెండితెర మీదకు ఎక్కిస్తుండే సరికి, పేరుతో పాటు, కథను చాలా మార్చారు. దర్శకుడు చాలా కన్వీనియంట్‌గా అహల్య కథను... అదీ చాలా కొద్ది ఘట్టాలు, కొన్ని సంభాషణలు మాత్రం తీసుకొని ఈ సినిమా తీశారు. ఆ క్రమంలో నవలలో ఉన్న విస్తృత చిత్రణ, సమస్య తాలూకు సమగ్ర స్వరూపం పూర్తిగా మిస్సయ్యాయి. తానేమి చెప్పదలుచుకున్నదీ దర్శకుడికే స్పష్టత లోపించింది.
సినిమా చూస్తుంటే, తెర మీద ఓ అసమగ్ర, అస్పష్ట వ్యక్తిత్వంతో పాత్రలు తిరుగుతున్నట్లనిపిస్తుంది. కథనే తప్ప, జీవితాన్ని చూస్తున్నట్లు అనిపించదు. ఫలితంగా, ప్రేక్షకుడు ఆ ఘట్టాలలో లీనం కాలేడు. పూర్వాశ్రమంలో పాత్రికేయుడిగా పనిచేసి, సినీ రచయితగా మారి, పరుచూరి బ్రదర్స్‌ వద్ద సహాయకుడిగా పనిచేసిన అనుభవం ఈ చిత్ర దర్శకుడు ప్రేమ్‌రాజ్‌ది. గతంలో 'నగరం నిద్రపోతున్న వేళ...' తీసిన ఆయనకు ఇది రెండో సినిమా. స్క్రీన్‌ప్లే కూడా ఆయనే రాసుకున్నారు. మాటల క్రెడిట్‌ తన గురువులు పరుచూరి బ్రదర్స్‌కు ఇచ్చారు. దురదృష్టవశాత్తూ, సినిమా స్క్రీన్‌ప్లేలో కానీ, దర్శకత్వ విధానంలో కానీ ప్రేమ్‌రాజ్‌ ఆసక్తిని రేకెత్తించ లేకపోయారు.
 నిజానికి కథ చాలా సంక్లిష్టమైంది. విమర్శనాత్మకమైంది. దీన్ని తెరకెక్కించడం అంత ఆషామాషీ విషయం కాదు. తీరా, తీసుకున్న కాన్సెప్ట్‌ మంచిదే అయినా, దాన్ని ఎగ్జిక్యూట్‌ చేయడంలో సవాలక్ష లోపాలతో, తడబడ్డారు.
కథలోని అసలు పాయింట్ ను వదిలేసి, ''మమ్మల్ని (స్తీలను) ఆకాశంలో సగం అనక్కర లేదు. ఆకాశం కింద నుంచి వెళ్ళే పాసింగ్‌ క్లౌడ్స్‌కు ఇచ్చే విలువైనా ఇవ్వండి'' అంటూ కథానాయిక వసుంధర పాత్ర దేబిరించిన పద్ధతిలో మాట్లాడేలా చూపించారు.  ఆ మాటకొస్తే, కథానాయిక వసుంధర పాత్ర అనే కాదు, సినిమాలోని ఏ పాత్రకూ సరైన వ్యక్తిత్వాన్ని కానీ, వాటి ప్రవర్తనకు తగిన ప్రాతిపదికను కానీ దర్శకుడు కల్పించలేకపోయారు. 
నిర్మాణ విలువల కోసం వెతుక్కోవడం అనవసరమనిపించే ఈ రెండు గంటల వ్యవధి చిత్రంలో ఇతర సాంకేతిక శాఖల పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉందని చెప్పాలి. పాటల్లో ఒకటీ, రెండూ..(యశోకృష్ణ సంగీతం, సుద్దాల అశోక్‌ తేజ సాహిత్యం) వినసొంపైన గళాల్లో ఆకర్షిస్తాయి. ఛాయాగ్రహణం, కూర్పు, రీరికార్డింగ్ ల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది.  ''18 మంది దర్శకులు నటించిన తొలి తెలుగు చిత్రం'' అంటూ ఈ చిత్రానికి చేసిన ప్రచారం కేవలం పబ్లిసిటీకే తప్ప, సినిమాకు ఉపకరించిన దాఖలా తెరపై కనిపించదు. పైగా, పోసాని కృష్ణమురళి పోషించిన ఇన్‌స్పెక్టర్‌ పాత్ర కనిపించేది మూడు, నాలుగు నిమిషాలే అయినా, దుస్సహమైన అనుభవంగా మిగిలింది.
ఏతావతా, నవల చదవకుండా మామూలుగా వెళ్ళినా ఈ చిత్రం నిరాశ పరుస్తుంది. ఇక, ఇప్పటికే నవలను చదివి, దాని మీద ఓ అభిప్రాయంతో ఈ సినిమాకు వెళితే, ఆ నిరాశ అంతకు పదింతలు పెరుగుతుంది. ఓ మంచి కాల్పనిక రచనను సినిమాగా ఎలా తీయకూడదో తెలుసుకోవడానికి ఈ చిత్రం ఓ రెండు గంటల వెండితెర పెద్ద బాలశిక్ష. 
కొసమెరుపు : 
చట్టబద్ధమైన హెచ్చరిక - వాల్‌పోస్టర్లలో 'యు/ఏ' సర్టిఫికెట్‌, ఆశాసైనీ అందాల ప్రదర్శనలు చూసి, ఏదేదో ఊహించుకొని సినిమాకు వెళ్ళి, ఆశాభంగానికి గురైతే, అందుకు దర్శక, నిర్మాతలు, నటీనటులెవ్వరూ బాధ్యులు కారు!

- రెంటాల జయదేవ 

(ప్రజాశక్తి దినపత్రిక, 27 జూలై 2013, శనివారం, పేజీ నం.8లో ప్రచురితమైన సినిమా సమీక్ష పూర్తి పాఠం ఇది)
.......................................................

1 వ్యాఖ్యలు:

Unknown said...

ఒక నవలను చలనచిత్రంగా తీయాలనుకున్నప్పుడు ఆ నవలాకారుడు దర్శకత్వం కూడా తెలిసినవాడయితే అతనికే అప్పగించడం మంచిది!కనుక దీని దర్శకత్వం కూడా దీని మూలనవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గారికే అప్పగించి ఉంటే ఈ సినిమా కథ,గతి మరోలా ఉండేదేమో!