జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Monday, July 1, 2013

ఆగిపోయిన స్వర రాఘవ ప్రస్థానం - జె.వి. రాఘవులుకు శ్రద్ధాంజలి.





 ప్రముఖ సంగీత దర్శకులు జె.వి. రాఘవులు శుక్రవారం (June 7) నాడు ఉదయం రాజమండ్రిలో కన్నుమూశారు. ఆయన వయస్సు 81 ఏళ్ళు. అభిమాన గాయకుడిగా తాను ఆరాధించిన ఘంటసాల అభిమానాన్ని సంపాదించి, ఆయన వద్దే సహాయకుడిగా పనిచేసి, ఆయనతో కలసి తానూ పాడి, ఆ పైన సంగీత దర్శకుడిగా ఆ గురువుతోనే తన బాణీలకు పాటలు పాడించుకొనే స్థాయికి ఎదిగిన వ్యక్తి - రాఘవులు. ఆయన మరణంతో ఆ తరంతో అనుబంధమున్న మరో స్వర తంత్రి తెగిపోయింది. 

జె.వి. రాఘవులుగా సుపరిచితులైన జెట్టి వీర రాఘవులు 1931 అక్టోబర్‌ 22న జన్మించారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం ఆయన జన్మస్థలం. ఆదిలక్ష్మి, వీరాస్వామి నాయుడు దంపతుల ఆరుగురి సంతానంలో మూడోవారు - రాఘవులు. ఆయనకు ఇద్దరు అన్నయ్యలు, ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్ళు. రాఘవులు అక్షరాల్లో చదివింది ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి. దాకానే అయినా, అక్షర లక్షల విలువైన సంగీతంలో మాత్రం దిట్టగా ఎదిగారు. 

సంగీతమంటే అమితమైన ఇష్టంతో భక్తి పాటలు బాగా పాడే తల్లి నుంచి స్వరజ్ఞానం అబ్బిన చిన్నారి రాఘవులుకు పొరుగింటిలోని రంగస్థల నటుడు వై. భద్రాచార్యులు ప్రోత్సాహం తోడైంది. ఆయనతో కలసి, చిన్నతనంలోనే రంగస్థలం పైకి ఎక్కారు. 'హరిశ్చంద్ర'లో లోహితాస్యుడు, 'కుచేలుడు'లో రాఘవుడు లాంటి బాల నటుడి పాత్రలు పోషించారు. నటన, పద్యాల ఆలాపన, ఆపైన శాస్త్రీయ సంగీతం ఆయన వద్దే నేర్చుకున్నారు బాల రాఘవులు. బడిలో తనకు అధ్యాపకులూ, భావ గీత రచయితలూ అయిన ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, వేదుల సత్యనారాయణ శాస్త్రుల ప్రోత్సాహంతో చాలా కచ్చేరీల్లో పాల్గొన్నారు. వారి పాటలు తీసుకొని, బాణీలు కట్టి, రేడియోలోని లలిత గీతాల కార్యక్రమంలో పాల్గొనేవారు. 

ఒకసారి విజయవాడ రైల్వే స్టేషన్‌లో రికార్డింగ్‌ కోసం వచ్చిన ప్రసిద్ధ సినీ, లలిత సంగీత గాయకుడు ఘంటసాల తన కన్నా ముందు జరుగుతున్న రికార్డింగ్‌లో పాడుతున్న రాఘవులు గొంతు విని, ఆ మాధుర్యాన్ని ప్రశంసించారు. మద్రాసు రావాలనుకుంటే, తన వద్దకు రమ్మంటూ ఆ రోజు ఘంటసాల ఇచ్చిన చిరునామా తరువాతి రోజుల్లో రాఘవులు సినీ సంగీత జీవితానికి పాస్‌పోర్టు అయింది. మద్రాసులో ఘంటసాల ఆశ్రయంలో సినీ సంగీతంలో మెలకువలు నేర్చున్నారాయన. సినీ రంగంలో సంగీత దర్శకుల వద్ద సహాయకుడిగా, అడపా దడపా నేపథ్య గాయకుడిగా, ఆనక పూర్తిస్థాయి సంగీత దర్శకుడిగా రాఘవులు ప్రస్థానం ఎన్నో మజిలీలు, మలుపులతో సాగింది. ఘంటసాలతో కలసి కచ్చేరీల్లోనూ, సినిమాల్లోనూ పాడారాయన. 'జగదేక వీరుని కథ'లోని క్లిష్టమైన 'శివశంకరీ శివానంద లహరి...' గీతం వారిద్దరూ కలసి పాడినదే. ఘంటసాల పాడిన 'భగవద్గీత' ఆల్బమ్‌కు కూడా రాఘవులు పనిచేశారు. 

వీణ నాది.. తీగ నీది 

ఘంటసాలతో పాటు ఎమ్మెస్‌ విశ్వనాథన్‌, కె.వి. మహదేవన్‌ లాంటి సుప్రసిద్ధ సంగీత దర్శకుల వద్ద సహాయకుడిగా పనిచేశారాయన. వారు బాణీలు కడుతుంటే, సహాయకుడిగా ఆ స్వరాలు తీసుకొని, వాద్య బృందంతో సాధన చేయించిన రాఘవులుకు ఆ అనుభవం తరువాతి కాలంలో స్వతంత్ర సంగీత దర్శకుడయ్యాక బాగా పనికొచ్చింది. సంగీత దర్శకుడిగా జె.వి. రాఘవులు తొలి చిత్రం - రామానాయుడు నిర్మించిన 'ద్రోహి' (1970). అప్పటి నుంచి ఆయన 172 దాకా చిత్రాలకు సంగీతం అందించారు. వాటిలో తమిళ చిత్రం ఒకటి, కన్నడ చిత్రం ఒకటి కూడా ఉన్నాయి. 

'వీణ నాది... తీగ నీది... తీగ చాటు రాగముంది..' (చిత్రం: 'కటకటాల రుద్రయ్య'), 'చినుకు చినుకుగా చిగురు మెత్తగా...' (చిత్రం: 'ముక్కుపుడక') లాంటి సుతిమెత్తని పాటలు అందించడం ఆయనకు తెలుసు. అలాగే, 'ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో...' (చిత్రం: 'జీవన తరంగాలు'), 'జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ...' (చిత్రం: 'బొబ్బిలి పులి'), 'తరంగిణీ... ఓ తరంగిణీ...' (చిత్రం: 'తరంగిణి') లాంటి ఆలోచనా స్ఫోరకమైన భావప్రధాన గీతాలకు బాణీ కట్టడమూ ఆయనకు కరతలామలకం. ఇలా ప్రాచుర్యం పొందిన పాటలెన్నో జె.వి. రాఘవులు సంగీత దర్శకత్వంలో వచ్చినవే. ఆర్‌. నారాయణ మూర్తి రూపొందించిన 'ఛలో అసెంబ్లీ' (2000)కి ఆయన ఆఖరు సారిగా సంగీతం అందించారు.

 చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, మహదేవన్‌ సంగీత సారథ్యంలో నిర్మాత డి. రామానాయుడు నిర్మించిన 'ప్రేమ్‌నగర్‌' చిత్రంలోని 'ఎవరి కోసం ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం...' అనే పతాక సన్నివేశపు శీర్షికా గీతానికీ, ప్రసిద్ధమైన 'మనసు గతి ఇంతే...' పాటకూ బాణీలు నిజానికి రాఘవులు సమకూర్చినవే! 'లవకుశ', 'నర్తనశాల', 'పాండవ వనవాసం' తదితర తెలుగు పౌరాణికాలు హిందీ, బెంగాలీ భాషల్లోకి అనువాదమైనప్పుడు ఆ యా భాషలకు తగినట్లు ట్యూన్లను మార్చి, మళ్ళీ ఆర్కెస్ట్రయిజేషన్‌ చేశారయన. 

బాణీకి అనుగుణంగా రాసే రచయితలకు స్వేచ్ఛ ఉండదని అభిప్రాయపడే రాఘవులు ముందుగా సాహిత్యం రాయించి, ఆ పైన బాణీ కట్టడానికే ఇష్టపడేవారు. ఆ అలవాటునే ఎక్కువ భాగం కొనసాగించారు. విజయ మాధవీ కంబైన్స్‌ పతాకంపై వడ్డే బ్రదర్స్‌ నిర్మించిన చిత్రాల్లో ఎక్కువ వాటికి రాఘవులే సంగీత దర్శకుడు. దర్శకనిర్మాతల అభిరుచి మేరకు వంద రూపాయలకు నెల జీతంతో ఘంటసాల వద్ద పని చేయడం మొదలు పెట్టి, సంగీత దర్శకుడిగా తొలి చిత్రానికి 15 వేలు, కెరీర్‌లో అత్యధిక పారితోషికంగా 'బొబ్బిలిపులి'కి రెండు లక్షల రూపాయలు అందుకున్న రాఘవులు జీవిత చరమాంకంలో అనారోగ్యంతో, దానితో వచ్చిపడ్డ ఆర్థిక బాధలతో కష్టపడ్డారు. చివరి రోజుల్లో ఆస్తులన్నీ అమ్ముకొని, రాజమండ్రిలో కొడుకు వద్ద స్థిరపడ్డారు. తన కాళ్ళ మీద తాను నడవలేని స్థితిలో సినీ సంగీత ప్రియులు, కొందరు పరిశ్రమ పెద్దలు చేసిన సహాయం ఆయనకు ఊతమైంది. కొంత కాలంగా అస్వస్థులై, ఆఖరికి శుక్రవారం తెల్లవారు జామున రాజమండ్రిలో జీవన పోరాటానికి చరమ గీతం పాడారు. 

ఆయన భార్య రమణమ్మ దాదాపు దశాబ్దం క్రితమే మరణించారు. వారికి నలుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి కాగా, నాలుగో అబ్బాయి రవి కుమార్‌ వయొలిన్‌ కళాకారుడిగా సినీ రంగంలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ప్రముఖ సంగీత దర్శకులైన ఇళయరాజా, ఏ.ఆర్‌. రెహమాన్‌, మణిశర్మలు సైతం ఒకప్పుడు రాఘవులు పనిచేసిన వారే! 

హీరోల్లో ఎన్టీయార్‌తో, రచయితల్లో ఆత్రేయతో, దర్శకుల్లో దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణలతో రాఘవులుకు అనుబంధం ఎక్కువ. ''సాహిత్యం బాగా అవగాహన చేసుకొని, దానికి తగ్గట్లుగా రాగాన్ని నిర్ణయించుకొని, దర్శక - నిర్మాతల అభిరుచి మేరకు బాణీ కట్టడం నేను అనుసరించే పద్ధతి'' అని ఆయన చెబుతూ ఉండేవారు. తెలుగులో ఘంటసాల, పి. సుశీల, హిందీలో మహమ్మద్‌ రఫీ, మన్నాడే, బెంగాలీలో హేమంత్‌ కుమార్‌లు ఆయన అభిమాన గాయనీ గాయకులు. ఘంటసాలతో పాటు పెండ్యాల, నౌషాద్‌, ఆర్‌.డి. బర్మన్‌ల సంగీతమంటే అభిమానించే రాఘవులుకు భీమ్‌పలాస్‌ రాగమంటే చాలా ఇష్టం. ఆ రాగంలోనే ఆయన ఎక్కువ పాటలు చేశారు. 82వ పడిలో కన్ను మూసే వరకు సినీ సంగీతం గురించి, అప్పటి సంగతుల గురించి తనను కలసినవారితో ముచ్చటించిన ఆ స్వరార్చకుడికి శ్రద్ధాంజలి.

- రెంటాల జయదేవ

(Published in PrajaSakti daily, 8th June 2013, Saturday, Page No.8)
...........................................................

0 వ్యాఖ్యలు: