నిన్నటి తరం దక్షిణాది సినీ నాయిక, నటి మంజుల మంగళవారం నాడు (జూలై 23వ తేదీ) చెన్నైలో మరణించారు. ఆమె వయస్సు 59 సంవత్సరాలు.
ఆమె భర్త విజయకుమార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు తమిళ, తెలుగు చిత్రాల్లో తరచూ కనిపించే పాపులర్ నటుడు. వారం రోజుల క్రితం ఇంటిలో కిందపడి తీవ్రంగా గాయపడ్డ మంజుల గత బుధవారం నుంచి చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంతలో కామెర్లు వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. కడుపులో తీవ్రమైన నొప్పి, రక్తం గడ్డకట్టడం లాంటి సమస్యలు ఆమెను బాధించాయి. చికిత్స జరుగు తుండగానే చివరకు, మంగళవారం ఉదయం శ్రీరామచంద్ర మెడికల్ కాలేజ్ (ఎస్. ఆర్.ఎం.సి) హాస్పిటల్‌లో కన్నుమూశారు. 'సింగం' (తెలుగులో 'యముడు') తదితర చిత్రాల దర్శకుడు హరి ఆమెకు అల్లుడు.
''మంగళవారం ఉదయం ఆమె పూర్తిగా స్పృహ కోల్పోయారు. ఆమె ఆఖరి క్షణాల్లో కుటుంబమంతా దగ్గరే ఉంది. మూత్రపిండాల వ్యవస్థ వైఫల్యంతో ఆమె మరణించినట్లు, డాక్టర్లు ప్రకటించారు'' అని మంజుల సవతి కుమారుడు, నటుడు అరుణ్ విజరు తెలిపారు. తమిళ, తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు పలువురు మంజుల భౌతిక కాయాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు. బుధవారం నాడు చెన్నైలో మంజుల భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి.
70వ దశకం.. కలల నాయిక
దాదాపు మూడు దశాబ్దాల కాలం పాటు దక్షిణాది భాషల్లో నటిగా వెలిగిన మంజుల 1953 సెప్టెంబర్ 9న జన్మించారు. బాల నటిగా మొదలై, ఆనక కథానాయికగా ఎదిగిన తారల్లో మంజుల ఒకరు. నిజానికి, బాల నటిగా నటించిన హీరో సరసనే పెద్దయ్యాక కథానాయిక పాత్రలు కూడా పోషించిన ఘనత శ్రీదేవి కన్నా ముందే 1970లలోనే మంజుల సాధించారు. అప్పట్లో తమిళ అగ్రహీరో శివాజీ గణేశన్‌తో తెరపై బాలనటిగా కనిపించిన ఆమె ఆ తరువాత ఆయనతోనే కథానాయికగా ప్రేక్షకులను అలరించారు. తమిళ చిత్రం'శాంతి నిలయం' (1969)లో జెమినీ గణేశన్ కుమార్తెగా సహాయ పాత్రలో ఆమె నటించారు. తెలుగులో కూడా ఎస్వీ రంగారావు నటించిన 'కత్తుల రత్తయ్య' (1972), 'ఆస్తి మూరెడు ఆశ బారెడు...' లాంటి హిట్ పాటలున్న కె. బాలచందర్ 'భలే కోడళ్ళు' (1968) లాంటి చిత్రాల్లో బాల నటిగా మెరిసిన మంజుల హీరోయిన్ అయ్యాక తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లోనూ నాయికగా పెద్ద హీరోలతో కనువిందు చేశారు.
1970ల తొలి రోజుల్లో ఆమె తమిళ చిత్ర సీమలో అగ్రశ్రేణి కథానాయికగా వెలిగిపోయారు. అగ్ర హీరో ఎం.జి.ఆర్.తో కలసి 'రిక్షాకారన్' (1971), విదేశాల్లో ఎం.జి.ఆర్. చిత్రీకరించిన సంచలనాత్మక భారీ చిత్రం 'ఉలగమ్ సుట్రుమ్ వాలిబన్' (1973-తెలుగులో 'లోకం చుట్టిన వీరుడు'గా అనువాదమైంది) లాంటి హిట్స్‌తో సినీలోకంలో పేరు తెచ్చుకున్నారు. తమిళంలో జెమినీ గణేశన్, ఎస్.పి. ముత్తురామన్, తెలుగులో ఎన్టీయార్, ఏయన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, కన్నడంలో విష్ణువర్ధన్, అలాగే తరువాతి తరంలో తమిళ హీరోలైన కమలహాసన్, రజనీకాంత్‌లతో ఆమె నటించారు.
అందం, అభినయం తోడయ్యాయి..
1970లలో అందాల తారగా ఆమె ఎంతో మంది సినీ ప్రియులకు కలల రాణి. ఎన్టీయార్‌తో 'మనుషులంతా ఒక్కటే!' (1976), 'మగాడు' (హిందీ 'దీవార్'కు రీమేక్ - 1976), 'మా ఇద్దరి కథ' (1977) తదితర చిత్రాల్లో ఆమె నటించారు. ఇక, ఏయన్నార్ సరసన 'దొరబాబు' (1974), 'మహాకవి క్షేత్రయ్య' (1976), జగపతి వారి 'బంగారు బొమ్మలు' (1977) తదితర చిత్రాల్లో అలరించారు. కృష్ణ, శోభన్‌బాబుల సరసన ఆమె పలు హిట్ చిత్రాల్లో మెరిశారు. కృష్ణతో 'మాయదారి మల్లిగాడు' (1973), 'దేవుడు లాంటి మనిషి' (1975), 'మనుషులు చేసిన దొంగలు' (1977) తదితర చిత్రాల్లో అలరించారు. అల్లూరి సీతారామరాజు' (1974)లో కూడా కథలో కీలకమైన సహాయ పాత్ర పోషించారు.
ఇక, 'జగపతి పిక్చర్స్' అధినేత, దర్శక - నిర్మాత వి.బి. రాజేంద్ర ప్రసాద్ అప్పట్లో నిర్మించిన చిత్రాల్లో ఆస్థాన నాయికగా వెలిగారామె. ఓ హిందీ హిట్ చిత్రం ఆధారంగా రాజేంద్రప్రసాద్ రూపొందించిన 'మంచి మనుషులు' (1974) చిత్రంలో శోభన్‌బాబు, మంజులపై వచ్చే స్కేటింగ్ బరిలో వచ్చే పాట 'పడకు పడకు వెంట పడకు...' పాట ఆల్‌టైమ్ హిట్ అయింది. లైలా, మజ్ను తదితర చారిత్రక పాత్రలతో అంతర్నాటకాలుగా వచ్చే ఆ పాట, అందులోని గెటప్‌లు రంగుల్లో అలరించాయి. 'నీవు లేక నేను లేను...', 'నిన్ను మరచిపోవాలని అన్ని విడిచి వెళ్ళాలని ఎన్నిసార్లో అనుకున్నా...' లాంటి పాపులర్ పాటలు ఆ చిత్రాన్ని పెద్ద హిట్‌గా నిలిపాయి. అదే చిత్రం తరువాత తమిళంలో శివాజీ గణేశన్‌తో 'ఉత్తమన్' (1977)గా రీమేక్ అయితే, అందులోనూ మంజులే హీరోయిన్. శోభన్‌బాబుకు జంటగా 'ఇద్దరూ ఇద్దరే' (1976), 'మొనగాడు' (1976), 'పిచ్చి మారాజు' (1976) తదితర చిత్రాల్లోనూ మంజుల నటించారు. 'నా పేరే భగవాన్' (1976) లాంటి హిట్ చిత్రాలకూ ఆమె అందం, అభినయం తోడయ్యాయి.
ఆధునిక వస్త్రాల్లో అందాల హీరోయిన్
బి. సరోజాదేవి, వాణిశ్రీల తరువాతి తరం నాయికగా మంజుల తన గ్లామర్‌తో 1970లలో సామాన్య ప్రేక్షకుల్ని ఉర్రూతలూపారు. అప్పటి దాకా కథానాయికలు ఒద్దికైన కట్టూ బొట్టుతో, అభినయ ప్రధాన పాత్రలతోనే ఆకట్టుకోవడం ఆనవాయితీ. అప్పుడప్పుడే రంగుల చిత్రాల యుగం ఆరంభమవుతున్న దశలో ఆధునిక వస్త్రధారణతో అమితంగా ఆకర్షించారు. తన ట్రేడ్‌మార్క్ కింది పెదవి బిగింపుతో, ముద్దుగా, బొద్దుగా కనిపించే మంజులకు తమిళ, తెలుగు సినీ మాస్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
గ్లామరస్‌గా కనిపించడానికి వెనుకాడని నాయిక పాత్రతో సినిమా ఎంత పెద్ద హిట్టవుతుందన్న దానికి మంజుల నటించిన చిత్రాలు ఉదాహరణగా నిలిచాయి. అలా తరువాతి రోజుల్లో శ్రీదేవి, జీనత్ తమన్ తరహా హీరోయిన్ల శకానికి ఆమె పునాది వేశారని చెప్పుకోవచ్చు. అప్పట్లో కుర్రకారులో ఆమెకు ఎంత క్రేజంటే, తెలుగులో హీరో కృష్ణ సొంతంగా 'దేవుడు చేసిన మనుషులు' (1973) సినిమా నిర్మిస్తూ, అందులో వచ్చే 'తొలిసారి నిన్ను ...' అంటూ వచ్చే పాటలో అతిథి తారలుగా జమున, మంజులను ఎంచుకోవడం గమనార్హం. కృష్ణ - మంజుల జంటగా వచ్చిన 'మాయదారి మల్లిగాడు'లోని 'వస్తా.. వెళ్ళొస్తా... మళ్ళెప్పుడొస్తా... రేపు సందేళకొస్తా...' కూడా అప్పట్లో తరచూ రేడియోలో మారుమోగిన గీతమే. తెలుగు, తమిళం, కన్నడం - ఇలా ఏ భాషలో నటించినా ఆ భాషలో ముద్దుగా మాట్లాడుతూ, తానే డబ్బింగ్ చెప్పుకోవడం మంజులలోని మరో ప్రత్యేకత.
సహాయ పాత్రల్లో...
ఇక, 1980లకు వచ్చాక మంజుల క్రమంగా తల్లి, చెల్లి లాంటి సహాయ పాత్రల్లో కనిపించసాగారు. 1990లలో ఆమె కొద్ది చిత్రాల్లో మాత్రమే కనిపించారు. ఆ సమయంలో దర్శకుడు రవిరాజా పినిశెట్టి, ఆమెతో కొన్ని చిత్రాల్లో నటింపజేశారు. హీరో వెంకటేశ్ నటించిన 'చంటి' (1992)లో, అహంకారి అత్త పాత్ర పోషించిన 'సరదా బుల్లోడు' (1996) ఆమెకు అలా వచ్చినవే! వెంకటేశే నటించిన 'వాసు' (2002) ఆమె తెలుగులో కనిపించిన చివరి చిత్రాల్లో ఒకటి. ''మంజుల అభిమానిని'' అని పేర్కొనే తమిళ దర్శకుడు కె.ఎస్. రవికుమార్ సైతం ఆమెను అయిదు త్రాల్లో నటింపజేశారు. మొత్తం మీద దాదాపు 100కు పైగా సినిమాల్లో మంజుల నటించినట్లు పరిశ్రమ వర్గాల అంచనా.
హీరోయిన్‌గా నటిస్తున్న రోజుల్లో తమిళ చిత్రం 'ఉన్నిడమ్ మయంగుహిరేన్'లో పాత్రపోషణ చేసిన మంజుల ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే సహ నటుడు విజయకుమార్‌ను ఇష్టపడి వివాహమాడారు. వారి కుమార్తెలు ప్రీత, వనిత, శ్రీదేవి ముగ్గురూ కూడా తెరపై తారలుగా కనిపించడం విశేషం. విజయకుమార్‌కు మునుపటి వివాహం ద్వారా కలిగిన అరుణ్ విజరు, అనిత, కవిత కూడా సినీ సీమతో సంబంధమున్న వారే! తగాదాల కారణంగా సొంత కుమార్తె వనిత ఆ మధ్య రచ్చకెక్కి, మీడియాలో తీవ్రమైన ఆరోపణలు చేసినప్పటి నుంచి కుటుంబంలో ఉద్రిక్తతలు పెరిగి, మంజుల అనారోగ్యం పాలబడ్డారు.
స్నేహ సంబంధాలు
తమిళ చిత్ర సీమలో తన తరువాతి తరం నాయికలు చాలామందితో మంజులకు స్నేహ సంబంధాలు ఉండేవి. వారితో విందు, వినోదాల్లో ఆమె సరదాగా పాల్గొనేవారు. మంజుల ఆకస్మిక మరణం పట్ల నటీమణులు రాధిక, ఖుష్బు, రజనీ కాంత్ కుమార్తె ఐశ్వర్యా ధనుష్ తదితరులు దిగ్భ్రాంతి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ''ఎంతో ఆప్యాయంగా ఉండే మంజులా విజయకుమార్ చాలా సరదా మనిషి. ఇవాళ ఆమెను ఇలా చూస్తుంటే, మధురమైన ఆ పాత సంగతులన్నీ గుర్తుకొస్తున్నాయి. ఆమె చూపిన ప్రేమ, ఆప్యాయత మరువలేనివి'' అని సినీ, టీవీ నటి, నిర్మాత రాధికా శరత్‌కుమార్ అన్నారు.
''నా దృష్టిలో మంజులా ఆంటీ ఎంతో అందమైన మహిళ. ఆమె చూపిన ప్రేమాభిమానాలు మర్చిపోలేనివి'' అని మంజుల మరణ సమయంలో పక్కనే ఉన్న నటి ఖుష్బూ పేర్కొన్నారు. ''దర్శకుడు సి.సుందర్‌తో నా వివాహం జరగడానికి కారణం ఆమే! ఆమె ఇంట జరిగిన న్యూ ఇయర్ పార్టీకి వెళ్ళినప్పుడు, ఆమె నా నుదుట కుంకుమ దిద్ది, మూడు నెలల్లో పెళ్ళవుతుంది అన్నారు. అప్పటికి సుందర్, నా ప్రేమ వ్యవహారం బెడిసికొట్టి ఉంది. అయినా, చివరకు అంతా సర్దుకొని మార్చి కల్లా మా వివాహం జరిగింది. నా జీవితంలోని కీలక వ్యక్తుల్లో ఆమె ఒకరు'' అని ఖుష్బూ అన్నారు. బహుశా, అందం, ఆత్మవిశ్వాసం, ఆప్యాయత కలగలిసిన నటిగా, మంచి మనిషిగా మంజుల చాలా కాలం పాటు సన్నిహితులకు గుర్తుండిపోతారు.
- రెంటాల జయదేవ
(ప్రజాశక్తి దినపత్రిక, 24 జూలై 2013, బుధవారం సంచికలో ప్రచురితం)
........................................................
1 వ్యాఖ్యలు:
రెంటాల జయదేవ అరవై ఏళ్ళుకూడా నిండకుండా కన్నుమూసిన అలనాటి అందాల నాయిక మంజులమీద సవివరమైన టపా సమగ్రంగా వెలయించారు!మంజుల పేరెప్పుడు తలచుకున్నా ఎందుకో మాయదారి మల్లిగాడు టక్కున గుర్తొస్తుంది!
Post a Comment