(అపూర్వ
విజయానికి దారేది.... ఇదేనా.... (సినిమా సమీక్ష) - పార్ట్ 1కు ఇది కొనసాగింపు...)
దాదాపు
పదేళ్ళ క్రితం సిల్వెస్టర్ స్టాలిన్, ఆంథోనీ క్విన్ లాంటి ప్రసిద్ధ తారలు నటించగా
వచ్చిన హాలీవుడ్ చిత్రం ‘ఎవెంజింగ్ ఏంజెలో’. ఆ కథలోని ఓ పాయింట్ ను మాత్రం తీసుకొని,
దానితో ఎక్కడా పోలికే లేకుండా, పూర్తిగా మార్చేసి, మన నేటివిటికీ, సెంటిమెంట్ కూ
తగ్గట్లుగా అల్లుకున్న కథ ఈ ‘అత్తారింటికి
దారేది...’. ఇది హాలీవుడ్
చిత్రాలతో లోతైన పరిచయం ఉన్నకొందరు మిత్రులు చెబుతున్న మాట. మూలం ఎక్కడిదైనా, అసలు
మేనత్తను వెతుక్కుంటూ మేనల్లుడు వెళ్ళడం, రెండు కుటుంబాలను కలపడం లాంటి థీమ్ లు
తెలుగు సినిమాకు కొత్త కావు.
ఈ పాత చింతకాయ
పచ్చడి కథే దర్శక, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ చూపిన విధానంతో ఫస్టాఫ్ వరకు చకచకా బాగానే నడిచినట్లు అనిపిస్తుంది. కానీ, సెకండాఫ్ దగ్గరకు
వచ్చేసరికి, సినిమా ఆసక్తిగా నడవడం క్రమంగా మానేస్తుంది. అదే పనిగా ఏవేవో మలుపులు
తిరుగుతూ, కొత్త పాత్రలను కలుపుకొంటూ, ఇప్పటికే చాలా సినిమాల్లో వచ్చేసిన ఘట్టాలను
గుర్తు చేస్తూ, ఊహించగలిగే రీతిలోనే ముందుకు సా...గుతుంది. దాంతో, ఈ 2 గంటల యాభై
నిమిషాల నిడివి చిత్రాన్ని విసుగు తెలియకుండా నడపడానికి త్రివిక్రమ్, గడపడానికి
ప్రేక్షకులు శ్రమ పడ్డారు.
అయితే,
ఈ సినిమాకు పాత్రధారుల నటన, సాంకేతిక నిపుణుల శ్రమ బాగానే కలిసొచ్చిన అంశాలు.
ఇప్పటికే ‘గబ్బర్ సింగ్’ సూపర్ హిట్ తో జోరు మీదున్న పవన్ కల్యాణ్ ఇందులోని
పాత్రను చాలా చులాగ్గా, తనదైన శైలిలో నటించారు. వినోదాన్ని సహజంగా పండించారు. ఒంటి
మీద పైట సర్దుకుంటూ, అలవాటైన ఆడ వస్త్రధారణ కామెడీనీ మరోసారి యథాశక్తి పోషించారు.
సినిమాను తన భుజాల మీద మోశారు. కొన్ని సెంటిమెంట్ సన్నివేశాల్లో, సింపుల్ గా
ఉంటూనే ఎఫెక్టివ్ గా అనిపించే యాక్షన్ సన్నివేశాల్లో ప్రత్యేకంగా అలరిస్తారు.
ఇక,
నటి, సిద్ధార్థ్ ‘బావ’ సహా కొన్ని తెలుగు చిత్రాల్లో నటించిన అనుభవమున్న కన్నడ నటి ప్రణీత
చూడడానికి అందంగా ఉంది. కొన్ని సందర్భాల్లో ‘జల్సా’ లాంటి మునుపటి త్రివిక్రమ్ చిత్రాల్లో నటించిన
హీరోయిన్ పార్వతీ మెల్టన్ ను గుర్తుకు తెచ్చింది. పొట్టిగా ఉన్నా, నటనలో హుషారు
తగ్గని సమంత పాటల్లో మెరిసింది. ఇలాంటి పెద్ద కుటుంబ కథా చిత్రంలో నిండుగా ఉండే ఇతర
పాత్రధారులందరూ ఉన్న ఒకటీ అరా డైలాగులు, సీన్లతోనే తమ పరిధి మేరకు నటించారు.
ఈ
సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ బాణీలు, పాటలు హైలైట్. ‘ఆరడుగుల బుల్లెట్టూ...’, ‘కిర్రాకు ర్రాకు ర్రాకు
పుట్టిస్తావే...’, ‘బేట్రాయి సామిదేవుడా...’, ‘అమ్మో బాపు గారి బొమ్మో...’ లాంటి నాలుగైదు పాటలు ఇప్పటికే జనం నోట నాట్యమాడుతున్నాయి. కాబట్టి,
సినిమాకొచ్చిన ప్రేక్షకులనూ అవి అలరించే అంశాలే. ఇక, ఛాయాగ్రహణం మునుపటి
త్రివిక్రమ్ చిత్రాలతో పోలిస్తే తగ్గినా, లోటుగా అనిపించలేదు.
బయట స్టిల్స్ లో ఉన్న
చాలా దృశ్యాలు తీరా తెరపై సినిమాలో కనిపించవు. అంటే, తెరపై కనిపిస్తున్న 169
నిమిషాలలో కాకుండా, ఎడిటింగ్ కత్తెరకు బలై కనిపించకుండాపోయిన అనేకానేక నిమిషాల్లో
అలాంటి సన్నివేశాలన్నీ ఉన్నాయని ఊహించవచ్చు. దర్శకుణ్ణి
ఒప్పించి, కత్తెరకు మరింత పదును పెట్టి, ఇంకొంత నిడివి తగ్గిస్తే ప్రేక్షకులు
పెద్ద రిలీఫ్ ఫీలయ్యేవారు. యాక్షన్ పార్ట్, చిత్ర నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఓ
పాత తరహా కథనే తీసుకున్నా, దాన్ని క్రేజీ కాంబినేషన్ లో, వినోదాత్మకంగా, మాటల
బలంతో, హిట్ పాటలతో అందిస్తే ఎలా ఉంటుందనేది ‘అత్తారింటికి
దారేది...’ సినిమా చూసి,
అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాకు బలమూ, బలహీనత రెండూ అదే. కథాంశం పాతదే తీసుకున్నా,
దానికి సమకాలీన సరికొత్త నేపథ్యాన్ని సమకూర్చడం మీద త్రివిక్రమ్ తన పాళీతో కసరత్తు
చేశారు. హీరోను ఇటలీ నుంచి ఇండియాకు రప్పించి, కథకు ఫారెన్ బ్యాక్ డ్రాప్ కూడా జత
చేశారు. కానీ, సెకండాఫ్ కు వచ్చేసరికి, కథను ఎలా నడపాలో తెలియలేదు. హీరో పాత్రకు
కూడా ఒక నిర్ణీత గమనం లేక, రకరకాల పాత్రల వెంట ఎటుపడితే అటు కథ వెళుతుంటుంది.
అయితే, ఈ క్రమంలో తనదైన
రీతిలో సినిమాను సకుటుంబ కథా చిత్రంగా తీర్చిదిద్ది, పవన్ కల్యాణ్ కు మరింత
సమగ్రమైన ఇమేజ్ ను సంతరించేందుకు త్రివిక్రమ్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కొద్ది
కాలంగా తనను ఊరిస్తున్న భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడానికి హీరో ఇమేజ్
నూ, వినోదాన్నీ మేళవిస్తూ సినిమాలో ఎన్ని చేయాలో అన్నీ చేశారు. ‘గబ్బర్ సింగ్’ లోని పాపులర్ పాట ‘కెవ్వు కేక...’ వరుసలోనే ఓ సెటైరికల్ పాట పెట్టారు.
ఆఫ్రికా నుంచి
వచ్చిన వజ్రాల గనుల వ్యాపారి బద్దం భాస్కర్ అయిన బ్రహ్మానందం బ్యాచ్ తో ‘అహల్య అమాయకురాలు’ అంటూ (దాదాపు ప్రేక్షకులకు విసుగొచ్చేలా
నాలుగు సార్లు) ఓ రిపీట్ నాటక ఘట్టం పెట్టారు. సమకాలీన సమాజంలోని నిత్యానంద స్వామి
లాంటి దొంగ సాధువులు, బాబాల మీద ఓ సైటెర్ పెట్టారు. అబద్ధం చెబితే, ఆకులు రాలే
వృక్షమంటూ ఓ ఎపిసోడ్ చేశారు. ఇలా సెకండాఫ్ లో చేయనిదంటూ లేదు... ఒక్క సినిమా కథను
సాఫీగా ముందుకు నడపడం తప్ప.
మనదైన భాష,
సంస్కృతి, శాస్త్రీయ, జానపద గీతాల మీద ఎంతో అభిరుచి, కొంత అభినివేశం ఉన్న
త్రివిక్రమ్ ఈ సినిమాలో ‘దేవదేవం భజే
దివ్యప్రభావం...’ అంటూ అన్నమయ్య రాసిన సంస్కృత కీర్తన పల్లవితో మొదలై వచ్చే కొత్త పాటనూ, అలాగే ప్రసిద్ధ జానపద దశావతార గీతమైన ‘బేట్రాయి సామిదేవుడా...’నూ బాగా వాడారు. మొదటి శాస్త్రీయ కీర్తనకు
హీరోయిన్ ప్రణీతతో నర్తింపజేశారు కూడా. ఎన్నో ఏళ్ళ క్రితమే బి.ఎన్. రెడ్డి తీసిన వాహినీ వారి ‘సుమంగళి’ (1940)లో వచ్చినదే
అయినా, పవన్ కల్యాణ్ మరింత ఊపుతో స్వయంగా పాడించి ‘బేట్రాయి
సామిదేవుడా...’ పాటను పెట్టారు.
కానీ, తీరా దాన్ని ఓ హాస్య సన్నివేశం కోసం వాడిన తీరు పెద్దగా అతకలేదు. పైగా, అసలు
సినిమాలో కన్నా ఆ పాట పవన్ రికార్డింగ్ దృశ్యాలతో కూడిన టీజర్ లోనే బాగుందని
ప్రేక్షకులు భావిస్తే ఆశ్చర్యం లేదు.
ఇంటర్వెల్ కు ముందు
హీరో ఎవరన్నది నదియా హఠాత్తుగా కనిపెట్టడానికి కానీ, అలాగే సెకండాఫ్ లో రావు రమేశ్
అకస్మాత్తుగా హీరోను తన ఇంటి నుంచి వెళ్ళిపొమ్మనడానికి కానీ సరైన కారణాలు
కనిపించవు. కథ కోసం రచయిత తన పాత్రలతో అలా బలవంతాన ప్రవర్తింపజేశాడని
సరిపెట్టుకోవాల్సిందే.
ఇక, సినిమాలో
లాయరైన రావు రమేశ్ పోషించిన పాత్ర పేరు శేఖర్. ఫ్లాష్ బ్యాక్ లోనూ అతని భార్య
పాత్ర సునంద (నదియా) ఆ పేరే చెబుతుంది. కానీ, అతనికి బుల్లెట్ గాయమైన ఘట్టంలో
మాత్రం ....సిద్ధూ, సిద్ధూ... అంటూ వేరే పేరు పలవరిస్తుంది. నిజానికి, సిద్ధార్థ
అలియాస్ సిద్ధు అన్నది డ్రైవర్ వేషం కోసం సినిమాలో హీరో పెట్టుకొనే దొంగ పేరు. ఎడిటింగ్
లోనో, కనీసం విడుదలకు సిద్ధమైన ఆఖరు క్షణంలోనో అయినా ఈ పొరపాటును సులభంగానే
సరిదిద్దుకోవచ్చు. కానీ, యూనిట్ ఆ తప్పును గుర్తించినట్లే లేదు.
సినిమాలో అలీ
డాక్టరో, నర్సో, జీపు డ్రైవరో అర్థం కాదు. అలాగే, సిద్దప్పతో తొలి కొట్లాట కానీ,
చివరలో రైల్వే స్టేషన్ లో కొట్లాట కానీ, బలవంతాన కథ కోసం ఆగిపోయినవేనని అనిపిస్తాయి. హీరో
వెంట పడి అక్కడ దాకా వచ్చిన ఈ బడా ఫ్యాక్షనిస్టుల బ్యాచ్ న్యూస్ పేపర్ అడ్డం
పెట్టుకొని, తల దాచుకోవడం లాంటివి నప్పలేదు.
సుదీర్ఘంగా
నడిచినట్లు అనిపించే ఈ చిత్రంలో త్రివిక్రమ్ మార్కు కొత్తదనం కనిపించదు. కొన్ని
డైలాగులు సందర్భశుద్ధి లేకుండా హీరోయిజమ్ కోసం, హీరో నోట నాలుగు మంచి మాటలు
చెప్పించాలనే తపనతో వచ్చినట్లు అనిపిస్తాయి. అయితేనేం, మొత్తం మీద అనుప్రాసతో
కూడిన తన శైలి డైలాగులతో త్రివిక్రమ్ థియేటర్ లో మోత మోగించారు. ‘‘తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది...
విడిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తుంది’’ (రావు
రమేశ్), ‘‘ఎక్కడ నెగ్గాలో
కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు...’’ (ఎమ్మెస్
నారాయణ) లాంటి కొన్ని డైలాగులు బహుశా చాలా కాలం పాటు సినీ ప్రియులు చెప్పుకొనేవిగా
మిగిలిపోతాయి.
కానీ,
మాస్ మసాలా దర్శకులందరి చిత్రాలలో లాగానే హీరో ఇంట్రడక్షన్ ఫైటు, పంచ్ డైలాగులు,
క్లబ్బులో ప్రత్యేక నృత్యగీతం, బ్రహ్మానందం కామెడీ ట్రాక్, అబ్బాయిల కన్నా
అమ్మాయిలే స్పీడుగా ఉన్నారన్నట్లు వారి ప్రేమ, పెళ్ళి తొందరలను చూపే సన్నివేశాలు,
ఘాటైన చూపులు, మాటలు, చేష్టలు అన్నీ ఈ త్రివిక్రమ్ - పవన్
కల్యాణ్ సినిమాలోనూ ఉండడం విచిత్రం. కొన్ని చోట్ల, ముఖ్యంగా సెకండాఫ్ లో దర్శకుడు
శ్రీను వైట్ల చిత్రాల మార్కు స్క్రీన్ ప్లే అనుకరణలు కూడా కనిపిస్తాయి.
అయితే,
కేవలం యూత్ నే టార్గెట్ చేయకుండా, పిల్లా పెద్దా అందరితో కుటుంబంలోని ఆడా, మగా కలిసి
హాలుకు వచ్చేలా సినిమాను డిజైన్ చేసిన తెలివితేటలూ ఉన్నాయి. అందుకే, ‘అత్తారింటికి దారేది...’ని అస్సలు బాగా లేదనీ చెప్పలేం... అలాగని, ఆహా,
ఓహో, బ్రహ్మాండం అనీ అనలేం. ముచ్చటైన మూడు గంటల కుటుంబ కాలక్షేపంగా ఈ సినిమా పాసై
పోతుంది.
ఏతావతా,
ఇన్ని సక్సెస్ ఫార్ములాల కలబోతగా, వంట తెలిసిన దర్శక, హీరోల వడ్డింపుగా ఈ ‘అత్తారింటికి దారేది...’ సినిమా అపూర్వ విజయాన్ని
అందుకోవచ్చు. రికార్డులు సృష్టించనూ వచ్చు. రేపు పొద్దున ఏ
టీవీ చానల్ లోనో హాలులో కన్నా ఎక్కువ షోలు ఆడేసి, అక్కడా ప్రకటనల మధ్య కాసుల పంట
పండించవచ్చు. కానీ ఇలా అన్నీ ఉన్నా, అభిరుచి గల త్రివిక్రమ్
చిత్రాల అభిమాన ప్రేక్షకులకు మాత్రం ఈ చిత్రంతో ఏదో తెలియని అసంతృప్తే కలుగుతుంది.
చివరకు, ఆలోచనలో, రాతలో, తీతలో ఇంతకన్నా మెరుగైన చిత్రాలను గతంలోనే తీసేసిన
సృజనశీలిగా త్రివిక్రమ్ కు సైతం ఈ చిత్రం ఆత్మ తృప్తినిస్తుందా అన్నది అనుమానంగానే
మిగులుతుంది.
- రెంటాల జయదేవ
...................................................
5 వ్యాఖ్యలు:
జయదేవ గారు , ఈ సినిమా గురించి నేను నాలుగు మాటలు పంచుకోవాలనుకుంటున్నాను.
ఈ సినిమా చూసాక, త్రివిక్రం ని చూస్తే కోపం, పవన్ కల్యాణ్ ని చూసి పాపం అనిపించింది. త్రివిక్రం కి ప్రాస పిచ్చి బాగా పట్టుకుంది. ఏదో ఒక ప్రాస డైలాగ్ వాడటం కోసం, ఏదో ఒక పిచ్చి సీన్ అల్లేస్తున్నాడు. కొన్నిచోట్ల తెలివిగా అసభ్యతను కూడా చొప్పించాడు మాటల్లో. హీరోగారు కళ్ళజోడు కోసం అంత అవస్థ పడి ఫైట్ చేయటం అవసరమా? డైరెక్ట్ గా నాలుగు తన్నొచ్చు కదా. సమంతా ఫస్ట్ ఫ్లోర్ నుంచి పడిపొయ్యి, గతం మర్చిపోవడం ఏంటి? గబ్బర్ సింగ్ అంత్యాక్షరి టీం ని చివర్లో ఇరికించి మరింత చీప్ చేసాడు. హీరోగారి చేత, కామెడీ నటుల్ని(ఎమ్మెస్ నారాయణ, బ్రహ్మానందం)అన్ని సార్లు కొట్టించడం అవసరమా? ఇంకోరకంగా హాస్యం పుట్టించలేరా?
పవన్ కల్యాన్, నదియా, బొమన్ ఇరానీ, ఆలీ, ప్రణీత నటన బావుంది. దేవిశ్రీప్రసాద్ పాటలు, బాక్ గ్రౌండ్ స్కోర్ వలన బలహీనమయిన కథకు కొంత బలం వచ్చింది.
పవన్ కల్యాణ్ మూస దర్శకుల కబంధ హస్తాల్లో నుంచి బయట పడి, విభిన్న పాత్రలు పోషిస్తే బావుంటుంది.

Naamste!
Deva Devam Bhaje
Annamaacharya Keertana!
సుజాత గారూ, నమస్తే. హడావిడిలో అన్నమాచార్య కీర్తన అని రాయబోయి, త్యాగరాయ కీర్తన అని రాసేశాను. ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గారు పాడిన ఆ అన్నమాచార్య విరచిత సంస్కృత కీర్తన పల్లవిని మాత్రం తీసుకొని, మిగిలిన చరణాలు కొత్తగా రాయించుకొని, వాటిని కొత్తగా పాడించుకొని, ఈ అత్తారింటికి దారేది సినిమాలో దర్శకుడు త్రివిక్రమ్ వాడారు. మీ వ్యాఖ్యకు థ్యాంక్స్.
Post a Comment