'ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు రావడమంటే' బహుశా ఇదేనేమో! రాష్ట్రాన్ని విభజించాలంటూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, 'సమైక్యాంధ్ర ప్రదేశ్ పరిరక్షణ' కోసం కోస్తా ఆంధ్రలో సాగుతున్న ఉద్యమం తెలుగు సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తెలుగు చిత్ర సీమలో మునుపెన్నడూ లేని రీతిలో దాదాపు 60 కోట్ల దాకా వ్యాపారం చేసిన 'అత్తారింటికి దారేది', అలాగే రూ. 50 కోట్ల దాకా వ్యాపారం చేసిన 'ఎవడు' లాంటి పెద్ద సినిమాల విడుదల అనిశ్చితిలో పడింది. మరోపక్క చిన్న చిత్రాలు ఈ విరామాన్ని సైతం వినియోగించుకోలేని సంకట స్థితిలో ఇరుక్కున్నాయి. వెరసి, చిత్ర నిర్మాణానికని తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతూ నిర్మాత, ప్రదర్శనకు తగినన్ని సినిమాలు లేక - వసూళ్ళ రాక ఎగ్జిబిటర్ అస్తుబిస్తు అవుతున్నారు. వెరసి మొన్నటి దాకా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో, తాజాగా సమైక్య ఉద్యమంతో రెండిందాలా ఆర్థికంగా దెబ్బ తగిలింది - తెలుగు చిత్ర సీమకే!
దాదాపు మూడున్నరేళ్ళ పాటు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడూ తెలుగు సినీ పరిశ్రమకు వ్యాపారపరంగా నష్టం జరిగింది. ఇప్పుడు తాజా 'సమైక్య' ఉద్యమంతోనూ అదే పరిస్థితి! నిజానికి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆ సమయంలోనే విడుదలైన జూనియర్ ఎన్టీయార్ 'అదుర్స్', అల్లు అర్జున్ 'ఆర్య-2', పవన్‌కల్యాణ్ 'కెమేరామన్ గంగతో రాంబాబు' లాంటి కొన్ని ఎంపిక చేసిన హీరోల చిత్రాలకు ఉద్యమకారుల దెబ్బతో ఆర్థికంగా నష్టం వాటిల్లింది. అయితే, ఏకంగా భారీ చిత్రాల విడుదలలే వాయిదా పడడం లాంటివి జరగలేదు.
రిలీజ్‌కు రాజకీయాల దెబ్బ!
కానీ, ఈసారి 'సమైక్య' ఉద్యమ సెగ చిత్రాల రిలీజ్ తేదీలపై పడింది. ''అవును. అది నిజమే! అప్పట్లో నిరసనల వల్ల కొందరు హీరోల సినిమాల ఆదాయంపై దుష్ప్రభావం పడింది. ఇప్పుడేమో, కోస్తా ఆంధ్ర ప్రాంతంలోని పరిస్థితుల వల్ల భారీ చిత్రాలను విడుదల చేస్తే, బంద్‌ల నేపథ్యంలో అనుకున్నంత ఆదాయం రాదని నిర్మాతలు రిలీజ్‌ను పోస్ట్‌పోన్ చేసుకోవాల్సి వస్తోంది'' అని 'ఎవడు' చిత్ర నిర్మాత - నైజామ్ ప్రాంతంలో ప్రముఖ పంపిణీదారు అయిన 'దిల్' రాజు, 'ప్రజాశక్తి'తో అన్నారు.
సమైక్యాంధ్ర ఉద్యమానికి జై కొట్టి, మంత్రి పదవి రాజీనామా చేయాలన్న డిమాండ్‌కు కేంద్రమంత్రి - నటుడు చిరంజీవి తలొగ్గకపోవడంతో, ఆయన 'మెగా' కుటుంబంలోని వ్యక్తుల చిత్రాలను అడ్డుకుంటామంటూ సమైక్య ఉద్యమకారులు బాహాటంగా ప్రకటించారు. దాంతో, భారీ మొత్తాలకు బేరం కుదుర్చుకొని, సీమాంధ్రలో రామ్‌చరణ్ తేజ్ 'ఎవడు', పవన్‌కల్యాణ్ 'అత్తారింటికి దారేది' చిత్రాలను విడుదల చేయడానికి సిద్ధమైన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కలవరపడుతున్నారు. ఉద్యమం సెగ వల్ల తాము పెట్టే భారీ పెట్టుబడికి తగ్గట్లు వసూళ్ళు రావని అనుమానిస్తున్నారు. అందుకే, ఈ ఉద్యమ పరిస్థితుల్లో సినిమా విడుదల వద్దంటూ, వారిస్తున్నారు.
ఇవన్నీ కలసి పెద్ద సినిమాలతో పాటు, చిన్న సినిమాలనూ రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు ఇరకాటంలోకి నెట్టాయి. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలోని 'అంతకు ముందు - ఆ తరువాత', జె.కె. భారవి నిర్దేశకత్వంలోని 'జగద్గురు ఆది శంకర' లాంటి చిన్న చిత్రాలు అన్ని పనులూ పూర్తి చేసుకొని కూడా, ఈ పరిస్థితుల వల్ల ప్రస్తుతానికి రిలీజ్ డేట్ చెప్పలేక, విడుదలను ఆపుకొని కూర్చోక తప్పలేదు.
''సినిమాలను ఎవరో అడ్డుకుంటారనో, ఆపుతారనో రిలీజ్‌లను పోస్ట్‌పోన్ చేయడం లేదు. గోదావరి జిల్లాలు, నెల్లూరు, సీడెడ్ లాంటి చోట్ల బంద్‌లతో, కీలకమైన తొలి వారం వసూళ్ళు తగ్గిపోయే ప్రమాదం ఉండడంతో, సినిమా విడుదలల్ని వెనక్కి నెట్టాల్సి వస్తోంది'' అని 'దిల్' రాజు సైతం అంగీకరించారు.
ఇక, 'అత్తారింటికి...' చిత్రానికి దారి ఇస్తూ, వెనక్కి వెళ్ళిన 'ఎవడు' నిజానికి ఈ ఆగస్టు 21న జనం ముందుకు రావాలి. కానీ, ఆ తేదీకైనా ఆ సినిమా వస్తుందా అన్నది అనుమానమే. ''ఎవరైనా సరే పరిస్థితులు నియంత్రణలోకి వచ్చే వరకు సినిమాల రిలీజ్‌ను ఆపుకోక తప్పదు. రాష్ట్రంలో పరిస్థితులు అదుపులో ఉంటే, ఆగస్ట్ 21న 'ఎవడు' రిలీజ్ చేయాలనే ఇప్పటికీ అనుకుంటున్నాం. అఫ్‌కోర్స్! 'అత్తారింటికి...' వాళ్ళతో కూడా మాట్లాడి, ఓ తుది నిర్ణయం తీసుకుంటాం'' అని 'దిల్' రాజు వివరించారు.
అయితే, రేపు రాష్ట్రంలో పరిస్థితులు కొంత చక్కబడిన తరువాత కూడా తెలుగు సినీ పరిశ్రమకు మరో ఇబ్బంది తప్పదు.
అది ఏమిటంటే, అప్పటి దాకా రిలీజ్‌ను ఆపుకొని, వాయిదా వేసుకొని కూర్చొన్న సినిమాలన్నీ ఒక దాని వెంట మరొకటిగా, చకచకా వస్తాయి. దాంతో, అందుబాటులో ఉండే హాళ్ళ సంఖ్య, వచ్చే వసూళ్ళపై ప్రభావం పడుతుంది. ''ఆగస్ట్ తొలి వారాంతంలో రంజాన్, ఆ వెంటనే వస్తున్న స్వాతంత్య్ర దినోత్సవంతో వరుస సెలవులున్నాయి. సినిమా వసూళ్ళకు బాగా కలిసొచ్చే ఆ వారం కాస్తా ఇప్పుడు చిన్నా, పెద్దా తెలుగు సినిమాలేవీ లేకుండా వృథా అయిపోతోంది. ఇది సినీ పరిశ్రమకు నష్టమే'' అని 'దిల్' రాజు ఆవేదన వ్యక్తం చేశారు.
ఉన్న చిత్రాలే దిక్కు
రాష్ట్రంలోని పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయన్నది ఇప్పుడు బేతాళ ప్రశ్న. తెలంగాణ అనుకూల ప్రకటనతో ఇప్పుడు నైజామ్ ఏరియాలో ఆనందాతిరేకాలు వ్యక్తమవుతూ, సినిమాల విడుదలకు ఇబ్బంది లేని వాతావరణముంది. కానీ, మరోపక్క ఆంధ్రా, సీడెడ్ (దత్త మండలాలుగా పిలిచే రాయలసీమ) ఏరియాల్లో మాత్రం ఆవేదన, ఆగ్రహం పెల్లుబుకుతూ, సినిమాలు నడిచే పరిస్థితి లేదు. ఒకవేళ ఏదో ఒక ప్రాంతాన్ని బుజ్జగించేందుకు ఏ చిన్న ప్రకటన వెలువడినా, అది రెండో ప్రాంతంలో నిరసనల్ని పెంచే ప్రమాదముంది.
''అందుకే, ఇది చాలా సున్నితమైన పరిస్థితి. ఇదే ధోరణి కొనసాగితే, సరిగ్గా నెల తరువాత సెప్టెంబర్ 6న రావాల్సిన రామ్‌చరణ్ తేజ్ 'తుఫాన్' (హిందీ చిత్రం 'జంజీర్'కు తెలుగు వెర్షన్) మినహా ఇంకే పెద్ద చిత్రమూ రానున్న రోజుల్లో తెలుగులో విడుదల కాకపోవచ్చు. హిందీ చిత్ర నిర్మాతలు దాదాపు 6 నెలల ముందే డేట్లు, థియేటర్లతో సహా అన్ని నిర్ధారించుకొని ఉంటారు కాబట్టి, వాళ్ళు వెనక్కి వెళ్ళలేరు. కాబట్టి, రాష్ట్రంలో పరిస్థితులతో సంబంధం లేకుండా 'తుఫాన్' సెప్టెంబర్ 6నే వచ్చేయాలి. అప్పటికీ ఉద్యమ ప్రభావం ఉంటే, ఆ చిత్రాన్ని కొనుగోలు చేసినవారిపై ఆ దెబ్బ పడే ముప్పు పొంచి ఉంది'' అని దర్శకుడు వరప్రసాద్ భవిష్యత్ పరిణామాలను అంచనా వేశారు.
అయితే, రోజువారీ సమస్యల నుంచి విరామం కోసం వెండితెర కాల్పనికతను ఆశ్రయించే సగటు సినీ ప్రియులకూ, అలాగే ఆ యా హీరోల అభిమానులకూ మాత్రం ఈ మొత్తం పరిణామాలు నిరాశ కలిగిస్తున్నాయి.
''సినిమా చూసి సేద తీరదామంటే, వీలు లేకుండా పోయింది. ఫ్రెండ్స్ అందరం కలసి 'అత్తారింటికి...' చిత్రం చూద్దామని అనుకున్నాం. ఆ చిత్రం రిలీజ్ ఎప్పుడన్నది కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొనడం నిరాశ కలిగిస్తోంది'' అని ఇటీవలే ఇంజనీరింగ్ పూర్తయిన హైదరాబాద్ విద్యార్థిని మానస మోహన రవళి వ్యాఖ్యానించారు.
ఆమె లాంటి సినీ ప్రియులు ఇంకా చాలామందే ఉన్నారు. వారంతా ప్రస్తుతానికి షారుఖ్ ఖాన్ 'చెన్నై ఎక్స్‌ప్రెస్' లాంటి హిందీ చిత్రాలతో, ఇంగ్లీషు చిత్రాలతో, 'అన్న, 'బిర్యానీ' లాంటి తమిళ డబ్బింగ్‌లతో, రిస్క్ చేసి విడుదలయ్యే ఒకటీ అరా చిన్న చిత్రాలతో సరిపెట్టుకోవాల్సిందే! మరి, వారందరిలో మళ్ళీ ఉత్సాహం నింపే తెలుగు సినీస్టార్ల భారీ చిత్రాల రిలీజ్ ఎప్పుడు? అది కచ్చితంగా ఆ సినిమాలపై పెట్టిన కొన్ని పదుల కోట్ల రూపాయల విలువైన ప్రశ్న.
- రెంటాల జయదేవ
(ప్రజాశక్తి దినపత్రిక, 7 ఆగస్టు 2013, బుధవారం నాటి సంచిక, పేజీ నం.8లో ప్రచురితం)
........................................
2 వ్యాఖ్యలు:
ఉద్యమాల సందట్లో సడేమియా అంటూ పెద్దసినిమాలు రిలీజ్ చేస్తే వసూళ్లు మందగించి కొనుక్కున్నవాళ్ళు నెత్తుల మీద చెంగులు వేసుకుపోవాలి!చిన్న budget సినిమాలు రిలీజ్ చేసి తమ అదృష్టాలను పరీక్షించుకోవచ్చును!ఉత్తప్పుడు చిన్న సినిమాలకు థియేటర్ లు దొరకడమే గగనం కదా!
కూటికి గతిలేక ఎంతో మంది ప్రజలు బాధ పడుతూ వుంటే నాకు chicken బిర్యానీ లేదని ఒకడు ఏడ్చాడట.. అసలు అంత భారీ బడ్జెట్ ల తోటి ఈ చెత్త ముఖం నాయాళ్ళు సినిమాలు తీసి సమాజాన్ని మరింత పాడు చేస్తున్నారు..
Post a Comment