గణాంకాల ప్రకారం చూస్తే, ఇవాళ తెలుగు సినిమాకు జరిగే వ్యాపారంలో నైజామ్ ప్రాంతానిది సాధారణంగా 30 నుంచి 35 శాతం వాటా. సీడెడ్ (రాయలసీమ) ప్రాంతానిది కాస్త అటూ ఇటూగా 20 శాతం వ్యాపారం ఉంటుంది. ఇక, మిగిలిన దాదాపు 50 శాతం వాటా ఆంధ్రా ఏరియాది!
దాంతో, ఆంధ్రా, రాయలసీమ కలిపి సుమారు 70 శాతం తెలుగు సినీ వ్యాపారానికి తాజా 'సమైక్య' ఉద్యమంతో గట్టి దెబ్బ తగులుతోంది.
పైగా, ''ఒకప్పటి లాగా సినిమాలు 50 రోజులు, వంద రోజులు ఆడడం, వాటి తుది ఆదాయ ఫలితం తెలియడానికి దాదాపు ఏడాది కాలం పట్టడం లాంటివి ఇప్పుడు లేవు. ఇవాళ తెలుగు నాట ఏ పెద్ద సినిమా విడుదలైనా, వాటి జీవితకాలంలో తొలి రెండు, మూడు వారాలే! అందులోనూ ఆ సినిమాలకు వచ్చే మొత్తం ఆదాయంలో 80 నుంచి 90 శాతం డబ్బు తొలి పది రోజుల్లోని వసూళ్ళే!'' అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా నిర్మాణంలో, ప్రదర్శన, పంపిణీ రంగాల్లో లోతైన అవగాహన ఉన్న కొమ్మినేని వెంకటేశ్వరరావు అని విశ్లేషించారు.
ప్రభుత్వం నిర్ణయించిన అసలు రేటు కన్నా ఎక్కువకు, ఫ్లాట్ రేటున టికెట్లను అమ్మే 'జంపింగ్ టికెట్ రేట్ల' పద్ధతిలో ఆ వసూళ్ళు వస్తుంటాయి. బంద్‌ల వల్ల ఆ పది రోజుల్లో రెండు రోజులు ప్రదర్శనలు ఆగినా, దాదాపు 30 శాతం దాకా ఆదాయం నష్టపోవాల్సి వస్తుంది. సినిమాల రిలీజ్‌లు ఆపుకొని, వాయిదా బాట పడుతున్నది అందుకే! పైపెచ్చు, ఇప్పుడు సినిమాకు రాజపోషకులైన యువతరం, విద్యార్థులు సీమాంధ్రలో ఉద్యమం పేరిట నిరసనల్లో ఉండడం కూడా సినీ వర్గాలను ఆలోచనలో పడేస్తోంది.
- రెంటాల జయదేవ
(ప్రజాశక్తి దినపత్రిక, 7 ఆగస్ట్ 2013, బుధవారం, పేజీ నం.8లో ప్రచురితం)
................................................
0 వ్యాఖ్యలు:
Post a Comment