జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Tuesday, August 13, 2013

గాడి తప్పిన 'బండి' - రవీంద్రభారతి నిర్వహణపై సమాచార కమిషనర్‌ ఘాటు విమర్శలు

  • రవీంద్రభారతి నిర్వహణపై సమాచార కమిషనర్‌ ఘాటు విమర్శలు 
  • నిధుల దుర్వినియోగమంటూ సాంస్కృతిక సంచాలకుడిపై ధ్వజం

  • ప్రత్యక్ష ఉద్యమానికి సిద్ధమంటూ హెచ్చరిక 
  • సమాచార హక్కు చట్టం కింద ఫిర్యాదు చేయమంటూ ప్రజలకు సూచన
రాష్ట్రంలో అనేక సుప్రసిద్ధ సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలకు వేదిక అయిన సమావేశ మందిరం రవీంద్రభారతి ఇవాళ కేవలం కొన్ని వర్గాలకే పరిమితమైపోయిందా? అక్కడ ప్రతిభావంతులైన తెలుగు కళాకారులకూ, అభిరుచి గల కార్యక్రమాల నిర్వాహక సంస్థలకూ సరైన అవకాశాలు లభించడం లేదా? సోమవారం ఉదయం రవీంద్రభారతి వేదికపైనే ఈ అనుమానాలు బలపడే పరిస్థితి వచ్చింది. సాక్షాత్తూ ఆంధ్రప్రదేశ్‌ సమాచార కమిషన్‌లోని కమిషనర్లలో ఒకరైన పి. విజయబాబు సభాముఖంగా ఆ సందేహాన్ని అందరిలో కలిగించారు. అది వట్టి అనుమానం కాదు నిజమని అనిపించేలా వేదికపై జరుగుతున్న ఓ పుస్తకావిష్కరణ - సినీ సంగీత కార్యక్రమానికి నిర్వాహకులు ఎదుర్కొన్న ఇబ్బందులను ఆయన బాహాటంగా ప్రస్తావించారు. ''రాష్ట్రంలో నాయకులు గాడి తప్పిన పరిస్థితి నెలకొంటే, అధికారులేమో గాడిదలలా వ్యవహరిస్తున్నారు'' అంటూ దుయ్యబట్టారు.

సమాచార హక్కు చట్టం అమలు తీరును పర్యవేక్షించే బాధ్యతాయుతమైన ప్రభుత్వ హౌదాలో నియమితుడైన వ్యక్తి ఇలా ప్రభుత్వ శాఖ పైన, అధికారుల పైన నిప్పులు చెరగడం విశేషం. సోమవారం ఉదయం రవీంద్రభారతి ప్రాంగణంలో సభ జరుగుతుంటే, వేదికపైన కుర్చీలను సర్దడానికి కూడా మనుషులు లేని పరిస్థితి అప్పుడే ప్రత్యక్షంగా తలెత్తడంతో, 'ఎక్కడెక్కడి నుంచో వచ్చి, ఈ వేదికపై కార్యక్రమాలు చేసుకొనే కళాకారులకూ, కళాప్రియులకూ మనమిచ్చే గౌరవం ఇదేనా?' అంటూ ఈ సమాచార హక్కు చట్టం రాష్ట్ర కమిషనర్‌ ఘాటుగా విమర్శనాస్త్రాలు సంధించారు.
''ఇవాళ రవీంద్రభారతిని ఒక ప్రైవేటు ఆస్తిగా మార్చేసి, అయినవారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో అన్నట్లు (రవీంద్రభారతిని నిర్వహిస్తున్న) ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్నారు. మౌన ప్రేక్షకుల లాగా మనం ఈ అరాచకాన్ని భరిస్తున్నాం'' అని గతంలో పాత్రికేయుడిగా సుదీర్ఘ అనుభవమున్న విజయబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు. బాధ్యతాయుతమైన పౌరులుగా దీన్ని అందరూ ప్రశ్నించాలని అన్నారు. ''అంగుష్ఠ మాత్రులైన వాళ్ళు సైతం ఇవాళ తామే చక్రవర్తుల లాగా వ్యవహరిస్తున్నారు. సాంస్కృతిక రంగంలో వీళ్ళు వట్టి పేరిగాళ్ళుగా తయారయ్యారు'' అని ఆయన విమర్శించారు. సాంస్కృతిక శాఖలో రవీంద్రభారతి నిర్వహణలో లక్షలాది రూపాయలను అధికారులు దుర్వినియోగం చేస్తున్నారని విజయబాబు ఆరోపించారు.

వేదికపై జరుగుతున్న కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ ఆయన, ''అసలు రవీంద్రభారతిలో కార్యక్రమం నిర్వహించుకోవాలంటే, ఇక్కడ ఎవరినో బ్రతిమలాడుకోవాల్సిన పరిస్థితి ఏమిటి? ఎక్కడో క్యాలిఫోర్నియాలో స్థిరపడిన చిమటా శ్రీనివాస్‌ లాంటి వారు తెలుగు సినిమా, సినీ సంగీతం మీద ప్రేమతో ఈ పెద్ద కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవాలంటే, నానా తంటాలు పడాల్సి వచ్చింది. అవన్నీ నేను ప్రత్యక్షంగా చూశాను. అందుకే, ఆవేదనతో ఈ మాట మాట్లాడుతున్నాను'' అని అన్నారు. అంతేకాక, రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ నూరు రోజుల సాంస్కృతికోత్సవాలుగా ఈ ఆగస్టు 2 నుంచి నవంబర్‌ 9 వరకు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'శతరూప - 2013' కార్యక్రమాన్ని సైతం విజయబాబు విమర్శించారు.
''ఇక్కడ 'శతరూప' కార్యక్రమాల పేరిట లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ, అధికారులు తమ వ్యక్తిగత ఇష్టాలకు అనుగుణంగా 'అవధాన' కార్యక్రమాల లాంటివి నిర్వహిస్తున్నారు'' అని ఆయన, సాంస్కృతిక శాఖ ప్రస్తుత సంచాలకుడు - అవధాని రాళ్ళబండి కవితా ప్రసాద్‌ను అన్యాపదేశంగా విమర్శించారు. అంతటితో ఆగకుకండా, ''ఇక్కడ కోట్లాది రూపాయలు దుర్వినియోగమవుతున్నాయి. సమాచార హక్కు చట్టం కింద మీరు (సభకు హాజరైన ప్రజలు) ఎవరైనా పది రూపాయలు కట్టి, సమాచారం కోరితే, నేను వీళ్ళను జనం ముందుకు లాగి, సమాచార కమిషన్‌లో విచారిస్తాను'' అని ఆయన చెప్పారు. కళాప్రియులైన తెలుగువాళ్ళు అనేక రకాలుగా అవమానపడుతుండడం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు.
సొంత శాఖను వదిలి, డిప్యుటేషన్‌పై ముందు ధర్మ ప్రచారపరిషత్తులో, ఆ పైన సాంస్కృతిక శాఖలో పనిచేస్తున్న ప్రస్తుత సంచాలకుడు కాలపరిమితి దాటిపోయినా, పొడిగింపులు తెచ్చుకొని ఆ హౌదాలో కొనసాగుతున్నారని దుయ్యబట్టారు. సభలో కొద్దిసేపు అన్యాపదేశంగా ఆయనపై ఆరోపణలు చేసిన విజయబాబు, ఆ పైన ''బండెనక బండి కట్టి... పదహారు బళ్ళు కట్టి... అంటూ దొరలనే తరిమికొట్టిన చరిత్ర మనది. ఈ 'రాళ్ళబండి' ఎంత?'' అంటూ నిప్పులు చెరిగారు. రవీంద్రభారతి మరమ్మత్తులకు కోటీ 70 లక్షల రూపాయల నిధులు కేటాయింపు జరిగితే, అవి ఏమైపోయాయో కూడా తెలియని పరిస్థితి నెలకొందనీ, రవీంద్రభారతి ప్రాంగణంలోనే ట్రాన్స్‌ఫార్మర్‌ కాలినా, వర్షం వచ్చి జనం తడిసిపోతున్నా దిక్కులేదనీ ఆరోపణలతో పాటు ఆవేదన వెలిబుచ్చారు. ఎంతో చరిత్ర ఉన్న ఈ హైదరాబాద్‌ నగరంలోని ఏకైక ప్రతిష్ఠాత్మక సభా వేదిక అయిన రవీంద్రభారతిని కాపాడుకోవాలనీ, సిసలైన కళాకారులకూ - కళాభిమానులకూ ఇక్కడ వేదిక దక్కేలా చూద్దామని అన్న విజయబాబు, సభా నిర్వాహకులకు హైదరాబాద్‌ కళాభిమానుల పక్షాన క్షమాపణలు తెలిపారు.

విజయబాబు ఆవేదనతో ఆవేశంగా చేసిన ప్రసంగాన్ని వేదికపై ఉన్న భాషా - సాంస్కృతిక ప్రియుడు, ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం అధ్యక్షుడు (సమైక్యాంధ్ర ఉద్యమంతో రాజీనామా చేసిన) మండలి బుద్ధప్రసాద్‌తో సహా సభికులందరూ నిశ్శబ్దంగా విన్నారు. ''ఈ పరిస్థితికి ప్రభుత్వం సిగ్గుపడాలి'' అంటూ కొందరు కళాభిమానులు బిగ్గరగా అరిచారు. మౌనంగా ఈ అరాచకాలను భరించవద్దనీ, నిద్ర నుంచి మేల్కొని, ఈ ''అనాగరక, ఆటవిక'' మూకలను అధికార స్థానాల నుంచి పారదోలాలంటూ విజయబాబు పిలుపునిచ్చారు. అంతేకాక, ''రానున్న నెల రోజుల్లో రాష్ట్ర సాంస్కృతిక శాఖను ప్రక్షాళన చేయాలి. అందుకోసం మీరు (ప్రజలు) ఉద్యమిస్తే , నేనూ మీతో కలసి పాల్గొంటాను'' అని ఆయన అన్నారు. ఈ ప్రక్షాళన కోసం ముఖ్యమంత్రితో సహా ఎవరినైనా కలుద్దామని అన్నారు. సంచలనం రేపిన ఈ ఘాటైన ప్రసంగం అక్కడి సభికులతో పాటు, ఉన్న కొద్దిమంది ప్రభుత్వ అధికారుల్లో చర్చకు దారితీసింది. 
(Published in 'Praja Sakti' daily, 13th Aug 2013, Tuesday, Page No. 10)   
......................................................................................................

2 వ్యాఖ్యలు:

జ్యోతి said...

ఎన్నో ఐమాక్స్ లు, స్టార్ హోటళ్లు కుప్పలు తెప్పలుగా ప్రారంభవుతున్న రోజుల్లో ఉన్న ఒక్క రవీంద్రభారతి నిర్వహణ గురించి విజయబాబుగారి మాటలు విన్నప్పుడు ఆవేశం కంటే బాధ కలిగింది. ప్రభుత్వం మీద ఆధారపడకుండా మనమందరం ఒక సినిమా ధియేటర్ బదులు ఒక సాంస్కృతిక కళాకేంద్రం కట్టించుకోలేనంత దుస్ధితిలో ఉన్నామా అని సిగ్గుపడ్డాను.

yrk said...

I thought i was only the victim. I am so glad that the Commissioner has opened the Pandora box of the Dept of Culture. Hope things will change.