జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Monday, August 5, 2013

ఇతివృత్తం సరే, కథనమే... ( 'అబ్బాయి క్లాస్‌ - అమ్మాయి మాస్‌' చిత్ర సమీక్ష)


మన దర్శక, నిర్మాతలు చిత్ర కథాంశం కోసం వివిధ భాషా చిత్రాలను ప్రేరణగా తీసుకోవడం చాలా సందర్భాల్లో జరిగేదే! అయితే, ఏ భాషలోని ఎంత హిట్‌ చిత్రాన్ని ప్రేరణగా తీసుకున్నప్పటికీ, ఆ అంశాన్ని మనదైన వాతావరణంలో ఎంత గొప్పగా చెప్పామన్నదే కీలకం. ఆ ముఖ్యమైన విషయంలో తప్పటడుగు వేస్తే, ఆసక్తికరమైన ఎంత హిట్‌ పాయింటైనా, చివరకు అనాసక్తికరమైన ఓ సాదాసీదా సినిమాగా మారిపోతుంది. హాలీవుడ్‌ హిట్‌ చిత్రం 'ప్రెట్టీ ఉమన్‌'లోని మూల కథాంశాన్ని ప్రేరణగా తీసుకొని, తెలుగులోకి వచ్చిన 'అబ్బాయి క్లాస్‌ - అమ్మాయి మాస్‌' సినిమా అందుకు తాజా ఉదాహరణ.



గతంలో 'మేం వయసుకు వచ్చాం' (2012) చిత్రాన్ని అందించిన నిర్మాతల్లో ఒకరైన లక్ష్మణ్‌ క్యాదారి తన ద్వితీయ ప్రయత్నంగా తీసిన సినిమా ఇది. ఈ చిత్రంతో కోనేటి శ్రీనును దర్శకుడిగా పరిచయం చేశారు. కథ తానే కూర్చుకున్న శ్రీను సహజంగానే ఇవాళ తెలుగు సినిమాకు రాజపోషకులైన యువతరాన్నే తన లక్ష్యంగా ఎంచుకున్నారు. అందుకనే, ఆడవాళ్ళంటే బిడియం, భయం కలగలిసిన హీరో పాత్రనూ, ఆ ఫోబియా నుంచి అతణ్ణి బయటకు తెచ్చే వేశ్య పాత్రనూ తీసుకొని కథను అల్లుకున్నారు. ఈ ప్రాథమికమైన కథాంశం హాలీవుడ్‌ హిట్‌ పాయింటే అయినా, దాన్ని తెలుగు వాతావరణంలోకి దిగుమతి చేసే క్రమంలో తడబడ్డారు.


కథ: 

తాత, తండ్రుల లాగానే మనుమడు శ్రీ (వరుణ్‌ సందేశ్‌) కూడా అమ్మాయిల పిచ్చిలో పడి, ఆస్తినీ, ఆరోగ్యాన్నీ పోగొట్టుకోకూడదన్నది బామ్మ (సీనియర్‌ హాస్య నటి శ్రీలక్ష్మి) భావన. అందుకని మనుమణ్ణి ఆడపిల్లలకు దూరంగా పెంచుతుంది. దాంతో, ఓ పెద్ద సంస్థకు అధిపతి అయినా సరే హీరోకు అమ్మాయిలంటే ఖంగారు, భయం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అతని సంస్థను గట్టెక్కించాలంటే, తన కుమార్తె అంజలిని పెళ్ళి చేసుకోవాలని పారిశ్రామికవేత్త కె.కె. ('ఆహుతి' ప్రసాద్‌) ప్రతిపాదిస్తాడు. ఆ ప్రయత్నంలో భాగంగా హీరో ఫోబియాను పోగొట్టడానికి నీరూ (హరిప్రియ) అనే వేశ్యతో అతను పది రోజుల పాటు కలసి మెలసి తిరిగేలా ప్లాన్‌ చేస్తాడు హీరో సహచరుడు (శ్రీనివాసరెడ్డి).
హీరోకూ, హీరోయిన్‌ వేశ్యకూ మధ్య జరిగిన సంఘటనలేమిటి? ఆఖరికి హీరో, ఎవరిని పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు? లాంటి అంశాలన్నీ మిగతా కథ. మరోపక్క కొరియర్లు అందించే హరిదాసు (దర్శక - నటుడు కాశీ విశ్వనాథ్‌) చేసే వరుస హత్యల వెనుక కథేమిటి? దానికీ ప్రధాన కథకూ లింకేమిటన్నది మరో ఉపకథ.
కథనం: 
దాదాపు రెండున్నర గంటలకు కొద్దిగా తక్కువ నిడివి ఉన్న ఈ చిత్రంలో హీరోకూ, అతనిలోని ఖంగారును పోగొట్టేందుకు ప్రయత్నించే హీరోయిన్‌ (వేశ్య) పాత్రల మధ్య సంఘటనలతో సో సోగా సాగిపోతుంది. ద్వితీయార్ధానికి వచ్చాక, హీరోలో మార్పు తరువాత సినిమా అయిపోతుందని అనుకుంటాం. కానీ, సినిమా అయిపోతుందని అనుకున్నప్పుడల్లా ఆ ఛాన్స్‌ ఇవ్వకుండా ఏదో ఒక కొత్త ఘట్టం (ట్యాక్సీలో ప్రయాణం, హీరో మిత్రుడి పెళ్ళి, విలన్ల ఛేజింగ్‌..వగైరా)తో సా...గదీశారు. దాంతో, ఎప్పటికీ అయిపోని కథగా సినిమా నడుస్తూ ఉంటుంది. చివరకు, 'మూడడుగులు నడిచిన వీరిద్దరూ (హీరో, హీరోయిన్లు) ఏడడుగులు నడుస్తారని ఆశిద్దాం' అని శుభం కార్డు తెరపై పడడంతో పెద్ద రిలీఫ్‌ అనిపిస్తుంది.
దర్శకుడు ఎక్కువ ఆలోచించే పని పెట్టుకోకుండా, ఇటీవలి హిందీ, తెలుగు హిట్‌ చిత్రాల నుంచి యథాతథంగా కొన్ని దృశ్యాలను అరువు తెచ్చేసుకున్నారు. కాశీ విశ్వనాథ్‌ పోషించిన షూటర్‌ హరిదాసు పాత్ర, దాని నడక, ముగింపు కూడా హిందీ హిట్‌ 'కహానీ' నుంచి నేరుగా నడిచొచ్చినదే! అలాగే, పెళ్ళికి వెళ్ళిన హీరో, హీరోయిన్లను చూశాక, బంధువులు ఏకంగా హీరోయిన్‌ను పెళ్ళికూతురిలా అలంకరించే ఘట్టమైతే నితిన్‌ 'ఇష్క్‌' చిత్రాన్ని గుర్తుకు తెస్తుంది.
సాంకేతికమైన లోటుపాట్లు కూడా సినిమాలో చాలానే ఉన్నాయి. 'వెన్నెల' కిశోర్‌ తన పాత్రకు చెప్పిన డబ్బింగ్‌ అధ్వాన్నం. తెర మీద పెదాల కదలికకూ, వినిపించే డైలాగుకూ పొంతన లేదు. చాలా సందర్భాల్లో చెబుతున్నదేమిటో అర్థం కూడా కాదు. భావోద్వేగపరమైన డైలాగులున్న సందర్భాల్లో హీరో వరుణ్‌సందేశ్‌ చెప్పిన డైలాగులు కూడా వినబడితే ఒట్టు! ఓ సన్నివేశంలో హీరో వరుణ్‌ సందేశ్‌ పాత్రకు మధ్యలో కొన్ని డైలాగులు మాత్రం వేరే గొంతులో వినపడిన విషయం హాలులో సామాన్య ప్రేక్షకుడు సైతం ఇట్టే కనిపెట్టేస్తాడు.
ఎలా ఉందంటే..: 
అభినయం విషయానికి వస్తే, హీరో వరుణ్‌ సందేశ్‌ ఇన్ని సినిమాల తరువాత కూడా నటన, డైలాగ్‌ డెలివరీ మెరుగుపరుచుకోవాల్సిన అత్యవసరం తెర మీద తెలిసిపోతుంటుంది. వేశ్య నీరూ పాత్రలో హరిప్రియ కొన్ని కోణాల్లో చూస్తే, నటి రోజాను తలపిస్తుంది. పాత్రలో ఆమె నటించడానికి అవకాశమున్న ఘట్టాలు హీరోను మార్చే సన్నివేశం, క్లైమాక్స్‌ లాంటి కొన్నే! వాటిలో ఫరవాలేదనిపిస్తుంది.
హీరో బామ్మ పాత్రలో సీనియర్‌ హాస్య నటి శ్రీలక్ష్మికి మరీ భక్త శబరి తరహా గెటప్‌లో కనిపిస్తారు. పైగా, ఈ మధ్య సీరియల్స్‌లో ఎక్కువగా నటించడం వల్లనో ఏమో, బుల్లితెరపై చూపే లౌడ్‌ తరహా యాక్టింగ్‌ చేశారు. అది పెద్ద తెరపై అసహజంగా కనిపిస్తూ, అసహనం రేపుతుంది. ఆ మాటకొస్తే, చాలా సందర్భాల్లో దర్శకుడు సీరియల్‌ ఫక్కీ సంభాషణలు, కథన శైలిని ఆశ్రయించడంతో సినిమా చూస్తున్నామా, సీరియల్‌ చూస్తున్నామా అనే సందేహం కలుగుతుంది. 'ఆహుతి' ప్రసాద్‌, బామ్మ పాత్రధారిణి శ్రీలక్ష్మి మధ్య చివరలో వచ్చే ఘట్టంలో కథను సరిగ్గా అర్థమయ్యేలా చెప్పించలేకపోయారు.
అయితే, పాత్ర పరంగా హీరోయిన్‌ వేశ్య అనే అంశాన్ని సాకుగా తీసుకొని, మరీ చవకబారు సంభాషణలకూ, సన్నివేశాలకూ దర్శక, నిర్మాతలు ప్రయత్నించకపోవడం అభినందనీయం. రోడ్డు మీద సర్కస్‌ చేస్తున్న చిన్నారులకు అండగా ఉండేందుకు హీరోయిన్‌ నర్తించే ఘట్టం, హీరోలోని నెర్వస్‌నెస్‌ను పోగొట్టేందుకు హీరోయిన్‌ ప్రయత్నించే ఘట్టం లాంటివి కొన్ని బాగున్నాయి. 'మగవాళ్ళ సైకాలజీ మాకే బాగా తెలుసు. ఎందుకంటే, మేము రోజుకో మనిషి జీవితం చదువుతాం' (హీరోతో వేశ్య పాత్రధారిణి అయిన హీరోయిన్‌) లాంటి కొన్ని సంభాషణలు మనసును తాకుతాయి.
కెమేరా పనితనం బాగున్న ఈ సినిమాలో సంగీతం, పాటల్లో ప్రత్యేకించి చెప్పుకోదగ్గవి ఏమీ లేవు. చాలా దృశ్యాలను చిత్రీకరించినా, ఆఖరుకు సినిమాలోకి వచ్చేసరికి ఎడిటింగ్‌ కత్తెరకు బలైపోయిన సంగతి, ముఖ్యంగా ద్వితీయార్ధంలో తెలిసిపోతూ ఉంటుంది. ఇలాంటి లోటుపాట్లు చాలా ఉండడంతో, సెక్స్‌, క్రైమ్‌, (శ్రీనివాసరెడ్డి పెళ్ళి ఘట్టంలో) కామెడీ, ఓ ఐటమ్‌ సాంగ్‌ - ఇలా బాక్సాఫీస్‌ లెక్కలన్నీ కలిపి, తెరపై వడ్డించినా ఈ సినిమా ప్రేక్షకుడికి తృప్తినివ్వదు. అటు క్లాస్‌ను కానీ, ఇటు మాస్‌ను కానీ పూర్తిగా మెప్పించ లేకపోతుంది.
కొసమెరుపు: 
బాలీవుడ్‌లో వేశ్య పాత్ర ప్రధానాంశంగా వచ్చిన 'చమేలీ', 'చాందినీ బార్‌' తరహా సినిమాలన్నీ చూసేసిన ఓ యువ ప్రేక్షకుడు హాలులో నుంచి బయటకొస్తూ వ్యాఖ్యానించినట్లు, ''ఇప్పటికీ మనవాళ్ళు మాత్రం వేశ్య పాత్ర అనగానే ఒక ప్రత్యేక తరహా కట్టూబొట్టూ, కింది పెదవిని మునిపంటితో బిగపట్టడం తరహా హావభావాలే చూపుతున్నారు. వీటి నుంచి ఎప్పుడు బయటపడతారో!''
రెంటాల జయదేవ   
(Published in 'Praja Sakti' daily, 4th Aug 2013, Sunday, Page No.8) 
....................................................................

0 వ్యాఖ్యలు: