జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Monday, August 5, 2013

నిరవధికంగా వాయిదా పడ్డ పవన్ కల్యాణ్ ‘అత్తారింటికి దారేది’

- పవన్‌ కల్యాణ్‌ సినిమాకు ‘సమైక్యాంధ్ర’ ఉద్యమ సెగ

- రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల వల్లే వాయిదా: చిత్ర నిర్మాత భోగవల్లి ప్రసాద్ 


 

హీరో పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘అత్తారింటికి దారేది?’ చిత్రానికి కూడా ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమ సెగ తగిలింది. చిత్రం విడుదల నిరవధికంగా వాయిదా పడింది. ‘‘రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని ఈ చిత్ర  నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌ ప్రకటించారు. 

ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలంటూ కాంగ్రెస్‌ పార్టీ, కేంద్రంలోని అధికార ‘ఐక్య ప్రగతి శీల కూటమి’ (యు.పి.ఏ) భాగస్వామ్య పక్షాలు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో జూలై 30 నుంచి పెద్దయెత్తున ‘సమైక్యాంధ్ర పరిరక్షణ’కై ఉద్యమం నడుస్తున్న సంగతి తెలిసిందే! ఈ పరిస్థితులే సినిమా విడుదలకు బ్రేకులు వేస్తున్నాయి.

దాంతో, ఈ చిత్రం విడుదల వాయిదా పడడం వరుసగా ఇది రెండోసారి. నిజానికి, మొదట ఈ నెల ఏడున ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ, సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా 9వతేదీకి వాయిదా వేశారు. ఉద్యమ తీవ్రత కారణంగా ఇప్పుడు తదుపరి రిలీజ్‌ తేదీని ప్రకటించకుండా, చిత్రాన్ని నిరవధికంగా వాయిదా వేశారు. నిజానికి, గడచిన వారం రోజులుగా ఈ సినిమా అనుకున్నట్లుగా విడుదల అవుతుందా అనే అంశంపై పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతూనే ఉంది. 

ఆగస్ట్ 5వ తేదీ సోమవారం ఉదయం ఇది హాట్‌ టాపిక్‌ అయింది. ‘‘రాజకీయాలకూ, సినిమాకూ సంబంధం లేదు. పవన్‌ కల్యాణ్‌ సినిమాను అడ్డుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’’ అని కోస్తా ఆంధ్రలోని పవన్‌ కల్యాణ్‌ అభిమానుల పేరిట సోమవారం మధ్యాహ్నం ప్రకటనలు కూడా వచ్చాయి. 

అయితే, ఎట్టకేలకు సాయంత్రం చీకటి పడే వేళకల్లా సినిమా రిలీజ్‌ వాయిదా పడ్డట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లోని నిజానిజాలు తెలియలేదు. ఈ పరిస్థితుల్లో వాస్తవాలను కనుగొనేందుకు ‘ప్రజాశక్తి’ ప్రయత్నించింది. ‘‘అవును! సీమాంధ్రలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసు కదా! అందుకే, సినిమా రిలీజ్‌ పోస్ట్‌పోన్‌ చేశాం. ఆ విషయాన్ని ఇప్పుడే నిర్మాణ వర్గాలు నిర్ణయించాయి. తదుపరి విడుదల తేదీ ఏమిటన్నది నిర్ధారించుకోలేదు’’ అని ‘అత్తారింటికి...’ చిత్ర యూనిట్‌ సభ్యులు ఒకరు సోమవారం సాయంత్రం పొద్దుపోయాక, ‘ప్రజాశక్తి’కి వివరించారు.

రిలయన్స్‌ సంస్థ భాగస్వామిగా, భోగవల్లి ప్రసాద్‌ నిర్మాణ సారథ్యంలో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందిన ‘అత్తారింటికి దారేది?’ మీద ఇప్పటికే పరిశ్రమలో, అభిమానుల్లో చాలా అంచనాలున్నాయి. చిత్రం విడుదల వాయిదా పడడంతో, అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. 

కాగా, రాజకీయ నాయకుడిగా మారి, కేంద్రంలో మంత్రి పదవి చేపట్టిన హీరో చిరంజీవి సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమానికి మద్దతుగా రాజీనామా చేయాలంటూ ఇప్పటికే పలువురు డిమాండ్‌ చేశారు. ఆయన రాజీనామా చేయకపోవడంతో, చిరంజీవి కుటుంబ హీరోలు నటించిన సినిమాలను థియేటర్లలో ఆడనివ్వబోమంటూ ‘సమైక్యాంధ్ర పరిరక్షణ’ ఉద్యమంలోని కొందరు బాహాటంగా ప్రకటించారు. 



తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు దేవినేని ఉమతో సహా కొందరు రాజకీయ నేతలు ఈ చిత్రాల ప్రదర్శనను ఆపుచేస్తామంటూ, వివాదాస్పద వ్యాఖ్యలతో ఈ వేడిని మరింత పెంచారు. వెరసి, ఇప్పుడు రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు తెలుగు సినిమా పరిశ్రమకు తిప్పలు తెచ్చాయి. పవన్‌ కల్యాణ్‌ ‘అత్తారింటి...’ కోసం రామ్‌చరణ్‌తేజ్‌ ‘ఎవడు’ రిలీజ్‌ను వాయిదా వేసుకున్నా, ఆఖరుకు ఉద్యమాల సెగతో లాభం లేకుండా పోయింది. ఏమైనా, రాజకీయాల కారణంగా కళా రంగానికీ, వ్యాపారానికీ చిక్కులు రావడం పెనువిషాదం. 

(ప్రజాశక్తి దినపత్రిక, 6 ఆగస్ట్ 2013, మంగళవారం, పేజీ నం. 8)
......................................

0 వ్యాఖ్యలు: