జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Monday, August 26, 2013

ముందు ఓ.కె! ఆ తరువాతే... ('అంతకుముందు... ఆ తరువాత' - సినిమా సమీక్ష)


ప్రేమ, పెళ్ళి - తెలుగు సినిమాకు ప్రధానమైన ముడిసరుకులు. వాటి చుట్టూ అల్లుకున్న కథలతో లెక్కలేనన్ని చిత్రాలు వచ్చాయి. ప్రేమకు పర్యవసానం పెళ్ళిగా చూపించిన దశ నుంచి పెళ్ళి తరువాత కూడా ప్రేమ ఉంటుందా, లేదా అని చర్చించే దశకు కథలు మారాయి. రేపు పెళ్ళయిన తరువాత కూడా అభిరుచులు కలుస్తాయా, లేదా అన్న సందేహంతో, పెళ్ళికి ముందే భార్యాభర్తలుగా ఇద్దరు ప్రేమికులు సహజీవనం చేస్తే? ఈ వినూత్న ఇతివృత్తంతో వచ్చిన చిత్రం - ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలోని 'అంతకు ముందు... ఆ తరువాత...' కాస్త అటూ ఇటూ బెసిగితే, అశ్లీలమైపోయే ప్రమాదమున్న కత్తి మీద సాము లాంటి కథను తీసుకొని, అసభ్యతకు తావు లేని రీతిలో ఆయన చేసిన ప్రయత్నం
నిదానంగా సాగే... ఈ చిత్రం. 
.......................................................
తారాగణం: సుమంత్‌ అశ్విన్‌, ఈషా, మధుబాల, రవిబాబు, రావు రమేశ్‌, రోహిణి, అవసరాల శ్రీనివాస్‌, సంగీతం: కల్యాణి కోడూరి, ఛాయాగ్రహణం: పి.జి. విందా, కూర్పు: మార్తాండ్‌ కె. వెంకటేశ్‌, నిర్మాత: కె.ఎల్‌. దామోదర ప్రసాద్‌, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఇంద్రగంటి మోహనకృష్ణ 
..............................................................................
ఆధునిక సమాజంలో పెరిగిన వేగం వ్యక్తుల మధ్య సంబంధాలు, అనుబంధాలలో కూడా గతంలో లేని అనూహ్యమైన మార్పులు తెచ్చింది, తెస్తోంది. కుటుంబ, వైవాహిక బంధాలు కూడా ఆ మేరకు గణనీయంగా ప్రభావితమయ్యాయి. ఆ పరిస్థితుల నేపథ్యంలో తీసిన సినిమా ఇది.
కథ: 
రాజమండ్రి దగ్గర పెద్దయెత్తున పువ్వుల ఎగుమతి చేసే వ్యాపారవేత్త (రావు రమేశ్‌), అతని భార్య సుజాత (రోహిణి)ల కుమారుడు అనిల్‌ (సుమంత్‌ అశ్విన్‌). హైదరాబాద్‌ వచ్చిన హీరో, అక్కడ చిత్రకారిణి అనన్య (ఈషా - తొలిపరిచయం)తో ప్రేమలో పడతాడు. టీవీ కార్యక్రమాల రూపకర్త శ్రీధర్‌ (రవిబాబు), యోగా క్లాసులు నిర్వహించే కల్పన (మధుబాల)ల కుమార్తె అయిన సదరు హీరోయిన్‌ను కూడా తన ప్రేమలో పడేస్తాడు.
డేటింగులకూ తిరిగిన ఈ జంటకు తమ తల్లితండ్రులు వారి వైవాహిక జీవితంలో పడుతున్న ఘర్షణను చూశాక, సందేహం వచ్చేస్తుంది. పెళ్ళయ్యాక కూడా తమ మధ్య ఇదే ప్రేమ ఉంటుందా, అసలు తమ ఇద్దరికీ పొంతన కుదిరిందా అన్నది తెలుసుకోవాలని ఈ యువ ప్రేమికుల జంట భావిస్తుంది. దాంతో, పెళ్ళి కాకుండానే, వైవాహిక జీవితానికి డెమో వెర్షన్‌ లాగా 'అమ్మా నాన్నల ఆట' ఆడాలని వారిద్దరూ నిర్ణయించుకుంటారు. అక్కడికి ఫస్టాఫ్‌ అవుతుంది. 
ఆ తరువాత వారి జీవితం ఏ మలుపులు తిరిగింది, వారి తల్లితండ్రుల జీవితాలు ఏమయ్యాయన్నది మిగతా సినిమా.


అభినయం: 
ప్రముఖ నిర్మాత ఎం.ఎస్‌. రాజు కుమారుడైన సుమంత్‌ అశ్విన్‌కు హీరోగా ఇది రెండో సినిమాయే! 'తూనీగా... తూనీగా...'లో కన్నా కొంత మెరుగైన ఈ యువ హీరో భావ వ్యక్తీకరణను ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక, తెలుగమ్మాయి ఈషా గతంలో మాడల్‌గా వ్యవహరించినా, వెండితెరపై కథానాయికగా ఇదే ఆమె తొలి సినిమా. తొలి యత్నంలో ఫరవాలేదనిపించినా, ముందు ముందు నటిగా తనను తాను ఎలా మలుచుకుంటారో చూడాలి. కొడుకుతో బాధను పంచుకొనే సన్నివేశాల లాంటి చోట్ల తేలిపోయినా, హీరో తండ్రిగా రావు రమేశ్‌ ఆ రకం పాత్రలకు భవిష్యత్‌ చిరునామాగా స్థిరపడ్డారనుకోవచ్చు.
'రోజా' ఫేమ్‌ మధుబాల చాలా కాలం తరువాత దక్షిణాది తెరపై మెరిసిన సినిమా ఇది. కానీ, ఆమె వల్ల పాత్రకు కానీ, పాత్ర వల్ల ఆమెకు కానీ వచ్చిన అదనపు ప్రయోజనం కనిపించదు. భర్తతో ఆమె ఘర్షణ పడి, నిలదీసే సన్నివేశం, సంభాషణలు బాగున్నాయి. హీరోయిన్‌ తండ్రి పాత్రలో రఘుబాబు, హీరో తల్లిగా రోహిణి లాంటి వారికి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి.
ప్రత్యేకంగా కామెడీ ట్రాక్‌లంటూ లేని ఈ చిత్రంలో హీరో మిత్రుడిగా అవసరాల శ్రీనివాస్‌ డైలాగులు, నటనే ఉన్నంతలో వినోదం పంచుతాయి. సరుకుల షాపులో బిల్లు చేసే వ్యక్తిగా 'తాగుబోతు' రమేశ్‌ చాలా రోజుల తరువాత మద్యం వాసన లేని పాత్రలో అలరించారు. పువ్వుల వ్యాపారంలా కాక, కార్పొరేట్‌ కంపెనీలా అనిపించే హీరో ఆఫీసు వాతావరణాన్ని కూడా వినోదానికి వినియోగించుకొనేందుకు దర్శకుడు ప్రయత్నించారు.
సాంకేతిక విభాగాలు: 
కల్యాణీ మాలిక్‌ కాస్తా కల్యాణి కోడూరిగా పేరు మార్చుకొని, సంగీతమిచ్చిన ఈ చిత్ర బాణీల్లో పాటల సాహిత్యం శుద్ధంగా వినిపిస్తుంటుంది. వింజమూరి సిస్టర్స్‌ ద్వారా పాపులరైన జానపద గీతాల ఫక్కీలో 'ఈ బంతి వడ్డించి పోవే...' లాంటి పెళ్ళి పాటను ప్రస్తావించి, ఆ బాణీలో 'ఏ ఇంటి అమ్మాయివే...' అంటూ పాట పెట్టడం దర్శక, సంగీత దర్శకుల అభిరుచికి నిదర్శనం. 'తేనె ముల్లులా...' పాట శ్రావ్యంగా, 'ఓయ్ కనిపెట్టెయ్ కొత్త ఫార్ములా...' వేగంగా ఆకట్టుకుంటాయి.  
కొద్దిమంది నటీనటులు, పరిమితమైన లొకేషన్లే అయినా పి.జి. విందా కెమేరా తెర మీది దృశ్యాలను రిచ్‌గా చూపెట్టింది. ఎడిటర్‌ మార్తాండ్‌ కె.వెంకటేశ్‌ మాత్రం తన కత్తెరకు మరికొంత పదును పెడితే, ద్వితీయార్ధం వేగంగా గడిచేది. 

సంభాషణలు: 

ఈ సినిమాలో ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది డైలాగులు.  కొన్ని డైలాగులు ఆకట్టుకుంటాయి. ''వేటాడడం ఎలాగని చిట్టెలుకని చిరుతపులి అడిగిందట'', ''ఆడదాని కోసం మగాడు పెళ్ళిని భరిస్తాడు. పెళ్ళి కోసం ఆడది మగాణ్ణి భరిస్తుంది'', ''గ్యారెంటీ రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడన్నీ వారెంటీ రోజులు'' (హీరోతో అతని స్నేహితుడు) లాంటివి థియేటర్లో నవ్వులు పూయిస్తాయి. 

''మగాడి వంట మరిగిన ఆడది, మనిషి రక్తం రుచి మరిగిన పులి లాంటిది'' లాంటి పురుషాధిక్య భావజాల సంభాషణలూ సరదా ముసుగు మాటున వినిపిస్తాయి. 

''అశాంతిగా ఇద్దరం కలిసి బతికే కన్నా ప్రశాంతంగా ఒంటరిగా ఉండడం బెస్ట్'' (హీరోయిన్ తల్లి పాత్రధారిణి మధుబాల), ''మన జీవితంలో ఎంతో ముఖ్యమైన, కావాల్సిన మనుషులు మనం ఏం చేసినా పడి ఉంటారనుకోకు. దెబ్బ తింటావు నా లాగా'' (హీరోయిన్ తో ఆమె తండ్రి) లాంటి వివాహ బంధాన్ని చర్చించే డైలాగుల్లో కొన్ని ఆలోచింపజేస్తాయి.
బలాబలాలు: 
ఇప్పుడు ప్రేమించుకున్నంత మాత్రాన పెళ్ళయిన తరువాత కూడా ఆ ప్రేమ కలకాలం నిలుస్తుందా అన్న సందేహం వచ్చిన ప్రేమికులుగా కథానాయికా, నాయకుల పాత్రలను దర్శకుడు సమర్థంగా తీర్చిదిద్దారు. వాళ్ళ మధ్య ప్రేమానుభూతుల సన్నివేశాలను కూడా శ్రుతి మించకుండా, సున్నితంగా తెరకెక్కించారు. సాధారణంగా ప్రేయసీ ప్రియుల మధ్య తలెత్తే సందేహాలనూ, 'ఇగో' తగాదాలనూ ఆ పాత్రల మధ్య చూపెట్టారు. 
ఇలాంటి ఇతివృత్తాలు దొరికితే చాలు, 'యూత్‌ ట్రెండ్‌' అంటూ సినిమాను బూతుల బుంగగా మార్చేస్తున్న కొంతమంది నవతరం దర్శక, నిర్మాతలకు భిన్నమైన పంథాలో పయనించినందుకు మోహనకృష్ణను అభినందించాలి. 'అలా మొదలైంది..'తో మళ్ళీ అభిరుచి గల చిత్రాలతో ఓ కొత్త ప్రస్థానం ప్రారంభించి, ఈ సినిమాతో దాన్ని కొనసాగించిన శ్రీరంజిత్‌ మూవీస్‌ అధినేత కె.ఎల్‌. దామోదర్‌ ప్రసాద్‌కు కూడా ఆ ప్రశంసల్లో వాటా ఇవ్వాలి.
 అయితే, సినిమాలో వాదనలను సిద్ధాంతీకరించే ప్రయత్నంలో పాత్రల మధ్య చర్చల నిడివి కొన్ని చోట్ల బాగా పెరిగింది. అలా రెండు పాత్రల మధ్య భావ సంఘర్షణ కాస్తా డైలాగ్‌ వార్‌ లాగా మారింది. దృశ్య మాధ్యమమైన సినిమా కాస్తా నవల, నాటకాల పద్ధతిలోకి వచ్చేసిందనిపిస్తుంది. వాటిని సినిమాకు తగ్గట్లు కొంత తగ్గించుకొని ఉంటే బాగుండేది.
తల్లితండ్రులకు తెలియకుండా, అనుమానం రాకుండా హీరోయిన్‌ రెండు నెలల పాటు అదే ఊళ్ళో ఇంటికి దూరంగా ఎలా ఉండగలిగిందన్నదీ తెలియదు. ఇక, మధుబాల పోషించిన హీరోయిన్‌ తల్లి పాత్ర అంత చటుక్కున విడాకుల నిర్ణయానికి రావడానికీ, ఆ పైన హీరో చెప్పగానే మనసు మార్చుకోవడానికీ బలమైన భూమిక లేదు. హీరో తల్లి పాత్ర త్యాగానిదీ అంతే! మొత్తం మీద కై ్లమాక్స్‌కు వచ్చేసరికి అన్ని పాత్రలనూ ఓ సానుకూల కోణంలో చూపి, కథను కంచికి చేర్చాలన్న దర్శకుడి ఆదుర్దా కనిపించింది.
ఇంటర్వెల్‌కు ముందు ఓ.కె. అనిపించినా, ఆ తరువాతి కథలో కనిపించే ఇలాంటి లోటుపాట్లు పంటి కింద రాళ్ళవుతాయి. వాటి సంగతి అటుంచితే, మొత్తం మీద మాత్రం సినిమా అసంతృప్తి కలిగించదు. చాలా కాలం తరువాత అసభ్యత లేకుండా వచ్చిన కుటుంబ కథగాఈ చిత్రం నిలుస్తుంది. ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న, చేసుకోలేకపోయిన చాలా జంటలకు తమ కుటుంబ జీవితపు తొలి రోజులను గుర్తు చేసి, వారి మనసులు గెలుస్తుంది. 
- రెంటాల జయదేవ
(Published in "Praja Sakthi" daily, 25th Aug 2013, Sunday)
......................................................................

0 వ్యాఖ్యలు: