తెలుగు సినీ సంగీత రంగానికి స్వర్ణయుగ సమయంలో సంగీతం అందించినవారి జీవిత, సినీ విశేషాలతో రూపొందించిన అపురూప గ్రంథం 'స్వర్ణయుగ సంగీత దర్శకులు' అని పలువురు సినీ, సామాజిక ప్రముఖులు ప్రశంసించారు. ఈ పుస్తక రచన ఓ పరిశోధనాత్మక గ్రంథం స్థాయిలో సాగిందంటూ పుస్తక రచయిత - జర్నలిస్టు పులగం చిన్నారాయణను అభినందించారు. 'స్వర్ణయుగ సంగీత దర్శకులు' పుస్తకం ఆవిష్కరణ సోమవారం నాడు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగింది. రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లలో ఒకరైన పి. విజయబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి, భాషా - సాంస్కృతిక ప్రియులు మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రవాస భారతీయుడు కూచిభొట్ల ఆనంద్, ప్రముఖ సినీ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్, ఆర్.పి. పట్నాయక్, చక్రి, సినీ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి, 'సంతోషం' సినీ వారపత్రిక అధిపతి - సినీ నిర్మాత సురేష్ కొండేటి, 'జగద్గురు ఆదిశంకర' హీరో కౌశిక్‌బాబు తదితరులు వేదికపై ఆసీనులైన ఈ కార్యక్రమం ఆద్యంతం సభికులను ఆనందపరిచింది.
''తెలుగుసినీ సంగీతంలో నాగయ్యది తొలి తరమైతే, ఘంటసాలది రెండో తరమనీ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంది మూడో తరం'' అని పేర్కొంటూ, సినీ రంగంలో మూడు తరాలుగా తమ మాధవపెద్ది కుటుంబం భాగమంటూ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేశ్ గుర్తుచేశారు. కొన్నేళ్ళు ముందు పుట్టి ఉంటే, సినీ సంగీత స్వర్ణయుగంలో భాగస్థుణ్ణి అయ్యుండేవాడిననీ, అలా జరగకపోవడం తన జీవితంలో తీరని లోటని ఆర్పీ పట్నాయక్ అన్నారు. చరిత్ర సృష్టించిన సంగీత దర్శకుల జీవిత కథా రచన ద్వారా ఈ పుస్తక రచయిత, ప్రచురణకర్త కూడా చరిత్రలో భాగమయ్యారని చక్రి పేర్కొన్నారు. రచయితతో తమకున్న అనుబంధాన్ని రామజోగయ్య శాస్త్రి, సురేష్ కొండేటి ప్రస్తావించారు. ప్రచురణకర్తకు అండదండగా నిలిచిన గూడూరు సూర్యనారాయణ తదితరులు ఆనందం వ్యక్తం చేశారు.
వేదికపై ఉన్న సంగీత దర్శకులు ముగ్గురూ కలసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. పుస్తకం ధర కేవలం అయిదొందల రూపాయలే అయినా, తొలి ప్రతిని రూ. 10,001 మొత్తానికి సురేశ్ కొండేటి ఉదారంగా కొనుగోలు చేశారు. రెండో ప్రతిని సీనియర్ సినీ జర్నలిస్ట్ ఎల్. బాబూరావు రూ. 5,001 మెత్తానికి కొన్నారు. రెండున్నరేళ్ళ క్రితం వెలువరించిన తొలి ముద్రణ కన్నా మరింత ఎక్కువ సమాచారం, ఫోటోలతో, మరింత మంది సంగీత దర్శకుల పరిచయంతో ఈ మలి ప్రచురణను అందించినట్లు ప్రచురణకర్త - 'చిమటా మ్యూజిక్ డాట్‌కామ్' అధిపతి అయిన ప్రవాస భారతీయుడు చిమటా శ్రీనివాస్ వివరించారు.

ఈ పుస్తకం ప్రతి ఒక్కరూ కొని భద్రపరచుకోదగినదని విజయబాబు వ్యాఖ్యానించగా, దాదాపు 280 మందిలో ఈ రచనలోకి రాకుండా మిగిలిపోయిన ఇతర 260 మంది సంగీత దర్శకుల వివరాలతో మరిన్ని పుస్తకాలు రాయాలంటూ బుద్ధప్రసాద్, రచయితకు సూచించారు. ఈ పుస్తకాన్ని ఆన్‌లైన్‌లో సైతం చదువుకొనేందుకు వీలుగా అందించాలని కూచిభొట్ల ఆనంద్ సూచన చేశారు. కార్యక్రమంలో భాగంగా ఎస్పీబీ గౌరవార్థం 'అంకితం... నీకే అంకితం...' పేరిట నిర్వహించిన సినీ సంగీత కార్యక్రమంలో పలువురు ప్రముఖ గాయనీ గాయకులు ఆణిముత్యాల లాంటి పాటలు పాడారు. గాయని, నర్తకి శ్రుతకీర్తి స్పష్టమైన తెలుగు ఉచ్చారణతో, కార్యక్రమాన్ని నడిపించారు.
(Published in 'Praja Sakti' daily, 13th Aug 2013, Tuesday, Page no. 8)
.....................................................................................
0 వ్యాఖ్యలు:
Post a Comment