నిజజీవిత గాథలను తీసుకొని, వాటిని తెర మీదకు ఎక్కించడం సినీ రంగంలో ఉన్నదే! కాకపోతే, ఆ కథల్లో కొత్తదనం ఏమిటి, దాన్ని ఏ రకంగా తెరపై చూపాలన్నది అవగాహన లేకపోతే మాత్రం తెర మీదకు వచ్చిన సినిమా అటు జీవిత కథకు కానీ, ఇటు సినీ కాల్పనిక కథకు కానీ న్యాయం జరగదు. తమిళ హీరో విజరుతో అక్కడి దర్శకుడు ఏ.ఎల్. విజరు రూపొందించిన అరవ సినిమా 'తలైవా'కు తెలుగు అనువాదం 'అన్న' ('బోర్న్ టు లీడ్' అనేది ఉపశీర్షిక) విషయంలో జరిగింది అదే! అటు నిజజీవిత కథకు కానీ, దానికి అనుబంధంగా అరువు తెచ్చుకున్న పాత హిట్ సినిమాల్లోని దృశ్యాల సమ్మేళనానికి కానీ దర్శకుడు న్యాయం చేయలేక పోయిన వెండితెరపై సినిమాస్కోప్‌లో వెక్కిరిస్తుంది.
సామాన్యులకు అండగా నిలిచే ఓ ప్రజా నాయకుడు, వ్యవస్థలోని కొందరితో పోరాడడం లాంటి కథ చాలా సార్లు తెరపై చూసినదే. ఆ మూసలో నుంచి వచ్చినదే ఈ 'అన్న' సినిమా కూడా!
................................................
తారాగణం: విజయ్, అమలాపాల్, సత్యరాజ్, సురేశ్, అభిమన్యుసింగ్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, సంగీతం: జి.వి. ప్రకాశ్ కుమార్, కెమేరా: నీరవ్ షా, కూర్పు: ఆంటొనీ, నిర్మాత: బి. కాశీవిశ్వనాథం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఏ.ఎల్. విజయ్
................................................
కథ ఏమిటంటే..
బొంబాయిలోని సామాన్య తెలుగు వారి సంక్షేమం కోసం, పోర్టు కార్మికుల బాగు కోసం కృషి చేస్తుంటాడు రామ్మూర్తి (సత్యరాజ్). రాజకీయ నేతలతో, వ్యాపారవేత్తలతో తగాదాల్లో కట్టుకున్న భార్యను కూడా పోగొట్టుకున్న ఆయన చిన్న పిల్లవాడైన తన కుమారుడు విశ్వను దూరంగా ఉంచి, పెంచుతాడు. చాలా ఏళ్ళ తరువాత... ఆ విశ్వ (హీరో విజరు) ఆస్ట్రేలియాలో తల్లి పేరిట 'గంగ' అంటూ మినరల్ వాటర్‌ను అందించే కంపెనీని నడుపుతుంటాడు. మరోపక్క 'తెలుగు బాయిస్' పేర డ్యాన్స్ గ్రూప్‌ను నిర్వహించే వ్యక్తిగా ఎదుగుతాడు. అక్కడ ఓ రెస్టారెంట్ నడుపుతున్న తండ్రీ, కూతుళ్ళు (సురేష్, హీరోయిన్ అమలాపాల్) అతనికి పరిచయమవుతారు. మీరా (అమలాపాల్)తో ప్రేమలో పడతాడు. తండ్రితో మాట్లాడి, పెళ్ళికి ఒప్పించడానికి బొంబాయి వస్తాడు. తీరా అక్కడ అనుకోని పరిస్థితుల్లో తండ్రి అరెస్టవుతాడు.ప్రత్యర్థుల బాంబు పేలుడులో మరణిస్తాడు.
హీరో ప్రేమించిన మీరా, అతని తండ్రి ఏం చేశారు? హీరో తండ్రిని చంపిందెవరు? అనాథలైపోయిన సామాన్యులకు అండగా ఉండేందుకు ఏం చేశాడు? తండ్రిని చంపిన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? మీరాతో అతని ప్రేమ ఏమైందన్నది మిగతా సినిమా.
వివాదాస్పదమైన నిజ జీవిత స్ఫూర్తి
ముంబరులోని ప్రసిద్ధమైన మురికివాడ 'ధారావి'లో స్థిరపడి, అక్కడ తమిళులకు అండగా నిలిచిన దళితుడు ఎస్.ఎస్. కందసామి జీవిత ఘట్టాల నుంచి ఈ చిత్ర కథ స్ఫూర్తి పొందింది. తమిళనాడులోని తిరునల్వేలి ప్రాంతం నుంచి దేశ స్వాతంత్య్రానికి ముందు రోజుల్లోనే ముంబరు వెళ్ళి, అక్కడ తోళ్ళ వ్యాపారంలో స్థిరపడి, నిరుపేదలైన తోటి తమిళులకు అండగా నిలిచిన వ్యక్తి కందసామి. అక్కడే 'సౌత్ ఇండియన్ ఆది ద్రావిడ మహాజన్ సంఫ్‌ు'కు ఉపాధ్యక్షుడిగానూ ఎదిగారు. ప్రత్యర్థుల చేతుల్లో హత్యకు గురయ్యారు. అతని కుమారుడు రామసామి సైతం తండ్రి బాటలో నడిచి, అక్కడ తమిళులకు వ్యతిరేకంగా ఉద్యమం జరిగినప్పుడు వాళ్ళ వెంట నిలిచారు. ఆ రెండు పాత్రలనూ ఆధారంగా చేసుకొనే 'అన్న' చిత్రంలో సత్యరాజ్, హీరో విజరులు పోషించిన పాత్రలను తీర్చిదిద్దారు దర్శకుడు ఏ.ఎల్. విజరు.
తమిళనాట కన్నా ముందే తెలుగులో!
కానీ, అదే ఈ చిత్రానికి తమిళనాట పెద్ద ఇబ్బందిగా కూడా మారింది. తన తాతనూ, తండ్రినీ అవాస్తవికంగా, అమర్యాదకరంగా చూపారంటూ మనుమడు కోర్టులో కేసు వేశారు. వాళ్ళ తెల్ల చొక్కా, అడ్డపంచె లాంటి వేషధారణతో సహా అన్నింటినీ ఈ చిత్రంలో అనుకరించారని ఆరోపణ. వాళ్ళను ముఠా నాయకుల లాగా, అక్రమ కార్యకలాపాలు చేసినవారిగా చూపించారని వివాదం. మరోపక్క మద్రాసుతో సహా వివిధ ప్రాంతాల్లో ఈ చిత్ర తమిళ మాతృకను ప్రదర్శించే సినిమా థియేటర్లకు బెదిరింపు లేఖలు కూడా వచ్చాయి. ఫలితంగా శుక్రవారమైన రంజాన్ పండుగ నాడు తెలుగు నాట ఈ సినిమా విడుదలైనా, తమిళ మాతృక మాత్రం విదేశాల్లో తప్ప, తమిళనాట, పాండిచ్చేరీలో జనం ముందుకు రానే లేదు.
తెలిసిపోయే పాత సినీ ప్రభావాలు
ఈ చిత్ర దర్శకుడు ఏ.ఎల్. విజరు గతంలో అజిత్‌తో 'కిరీడమ్' (మలయాళం 'స్ఫటికమ్'కు రీమేక్), ఆర్యతో 'మదరాస పట్టినమ్' (తెలుగులో '1947 - ఒక ప్రేమ కథ'), విక్రమ్‌తో 'దైవ తిరుమగళ్' (తెలుగులో 'నాన్న'), జగపతిబాబును తెరపై తొలిసారిగా విలన్‌గా చూపించిన 'తాండవం' (తెలుగులో 'శివతాండవం') లాంటి చిత్రాలు రూపొందించారు. వీటిలో మొదటిది రీమేక్ అయితే, మిగిలినవన్నీ 'ఫ్రీమేక్'లు. 'దైవ తిరుమగళ్' సినిమా హాలీవుడ్ చిత్రం 'అయామ్ శామ్'కూ, 'తాండవం' ఏమో 'డేర్ డెవిల్స్'కూ నాసిరకం కాపీలే!
తాజా 'అన్న'లో కూడా మణిరత్నం అప్పుడెప్పుడో ఇలాంటి (ముంబరులోని తమిళ డాన్ వరదరాజ ముదలియార్) కథతోనే తీసిన కమలహాసన్ 'నాయకుడు', రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన 'సర్కార్' చిత్రాల ప్రభావం కనిపించేస్తుంటుంది. అనేక ఇతర తెలుగు, తమిళ హిట్ చిత్రాల్లోని దృశ్యాలు, లొకేషన్లతో సహా తెలిసిపోతుంటాయి. మరి పదే పదే ఇలా కాపీ కథలతో, వరుస ఫ్లాపులిస్తూ కూడా పరిశ్రమలో ఆదరణ, నిర్మాతలు, హీరోల నుంచి పదే పదే అవకాశాలు పొందుతుండడం ఈ దర్శకుడి ప్రత్యేక ప్రతిభ.
నట, సాంకేతిక విభాగాలూ సో సో!
రజనీకాంత్ తరువాత దాదాపు అంత క్రేజున్న యువ హీరోగా విజరుకు తమిళ నాట పేరుంది. మాస్ చిత్రాలు ఎక్కువ చేయడంతో తమిళంలో 'ఇళయ దళపతి' (నవ యువ సేనాని) అని ఇమేజ్ పెట్టుకున్న విజరు ఈ సారీ డ్యాన్సులు, ఫైట్లు బాగా చేశారు. కానీ, ద్వితీయార్ధానికి వచ్చే సరికి, ఆర్తులకు 'అన్న'గా నటన అతి కృత్రిమంగా అనిపిస్తుంది. బిగుసుపోయి, కాలూ చేయీ కదపడాన్ని కూడా అతి కష్టం మీద చేసేలా ఆ పాత్రను తీర్చిదిద్దడం ఎందుకో దర్శకుడికే తెలియాలి. అలా ఉందేమిటని హీరో కూడా ఆయనను అడిగినట్లు లేరు. మునుపటి 'దైవతిరుమగళ్', 'తాండవం' చిత్రాల్లో లాగానే ఇందులోనూ తన అభిమాన నాయిక అమలా పాల్ నే ఈ సినిమాలోనూ పెట్టారు దర్శకుడు ఏ.ఎల్. విజరు. ఆమె అభినయించడానికి ఈ సినిమాలో ఏమీ లేదు. ప్రథమార్ధంలో కాసేపు కనిపించినా, ద్వితీయార్ధానికి వచ్చే సరికి తళుక్కున మెరిసి, మాయమైపోతుంటుందా పాత్ర. సత్యరాజ్ తన పరిధి మేరకు నటించారు.
ప్రథమార్ధం మొదట్లో కాసేపు సినిమా ఫరవాలేదనిపించినా, ఆ తరువాత నుంచి కథ జీడిపాకమే! ద్వితీయార్ధానికి వచ్చే సరికి, హీరో, విలన్ల మధ్య ఒక్క వీడియో క్యాసెట్ కోసం పావుగంటపైగా నడిచే ఘట్టం, హఠాత్తుగా వచ్చి జొరబడే పాటలు విసుగును మరీ పెంచేస్తాయి.
ఎంతకూ అవదేమిటి అనిపించే ఈ సినిమాలో కాస్తంత చెప్పుకోదగినవల్లా కెమేరామన్ నీరవ్ షా, ఎడిటర్ ఆంటోనీల పనితనం. ప్రస్తుతం తమిళనాట స్టార్ కమెడియన్ అయిన సంతానం హీరోకు స్నేహితుడిగా అందించిన వినోదం ఒక్కటే ఈ సినిమాలో అక్కడక్కడా కొద్దిగా రిలీఫ్. ''అవతలి వాడి ఆటోకు ఆయుధపూజ చేయకురా'' (హీరోతో) లాంటి అతని డైలాగులు కాస్తంత నవ్విస్తాయి.
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో హీరోకు బిల్డప్ పెంచడానికి తప్ప, ఈ చిత్రంలో గుర్తుంచుకోదగ్గ బాణీలేమీ లేవు. శశాంక్ వెన్నెలకంటి మాటలు కొన్ని చోట్ల నవ్వించినా, అవి ఈ సినిమాను కాపాడడం కష్టమే. వెరసి, ప్రస్తుతం తెలుగులో పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడంతో, కాలక్షేపానికి ఏదో ఒక సినిమాకు వెళదామని అనుకున్న వారి సహనానికి దాదాపు మూడు గంటల ఈ సా...గదీత సినిమా ఓ పరీక్ష!
- రెంటాల జయదేవ
(Published in Praja Sakti daily, 10th August 2013, Saturday, Page No. 8)
https://www.youtube.com/watch?feature=player_embedded&v=5pmpFXu-jxg
.....................................................................
https://www.youtube.com/watch?feature=player_embedded&v=5pmpFXu-jxg
.....................................................................
0 వ్యాఖ్యలు:
Post a Comment