జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, August 24, 2013

వాణిజ్య అంశాలతో వివాదాస్పద ఇతివృత్తం ('దళం' సినిమా సమీక్ష)



సమాజంలోని సమకాలీన అంశాలను తీసుకొని, వాటిని వాస్తవిక రీతిలో వెండితెరకు ఎక్కించి, ప్రేక్షకులను ఆలోచింపజేయడంలో సిసలైన సృజనశీలికి ఎవరికైనా ఓ సంతోషం, సంతృప్తి ఉంటాయి. కానీ, ఆ పని చేయడంలో ఎన్నో సంక్లిష్టతలున్నాయి. పైగా, చిత్ర నిర్మాణం కోట్ల రూపాయల్లోకి వెళ్ళిపోయాక వాణిజ్యపరంగా అది సాహసం కూడా అవుతోంది. ఇటీవలి కాలంలో అలాంటి ప్రయత్నాలు తగ్గిపోతున్నది అందుకే! చాలా రోజుల తరువాత తెరపైకి వచ్చిన అలాంటి ప్రయత్నం - 'దళం'. రామ్‌గోపాల్‌ వర్మ దగ్గర పని చేసిన జీవన్‌ రెడ్డి దర్శకుడిగా తొలి చిత్రంతోనే ఈ ధైర్యం చేశారు. వివాదాస్పదమైన నక్సలిజమనే అంశానికి ప్రేమ కథను జోడించి, వాణిజ్య ఫార్ములా పరిధిలో పరిభ్రమించేందుకు ప్రయత్నించారు.


ఆయుధంతో వ్యవస్థలో సమూలమైన మార్పు తీసుకురాగలమని నమ్ముతూ, జనం మధ్య కాకుండా అరణ్యంలో కాలం గడుపుతున్న నక్సలైట్లు గనక ఆయుధాలు వదిలేసి, జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి ప్రయత్నిస్తే వారికి ఎదురయ్యే పరిస్థితులేమిటి? ఎదుర్కొనే ఇబ్బందులేమిటి? ఇలా ప్రశ్నలు వేసుకొని, అసలు సమస్యల లోతుల్లోకి వెళ్ళకుండా, వాణిజ్య చట్రంలోనే దర్శకుడు ఇచ్చిన సమాధానం - 'దళం'.


కథ: 
శత్రు ('భీమిలి కబడ్డీ జట్టు'లో కోచ్‌ పాత్రధారి అయిన తమిళ నటుడు కిశోర్‌) నేతృత్వంలో మొత్తం 22 మంది నక్సలైట్లు ఆయుధాలను వదిలిపెట్టి, పోలీసుల ఎదుట లొంగిపోతారు. జనంలో కలసిపోయి, సామాన్య జీవితం గడపాలని ఆశిస్తారు. శత్రుకు కుడి భుజంగా వ్యవహరించే సహచరుడు అభి ('అందమైన రాక్షసి' ఫేమ్‌ నవీన్‌ చంద్ర). వీళ్ళందరూ సామాన్య జీవితం గడపాలని భావించినా, గతం వారిని నీడలా వెంటాడుతుంటుంది. జైలు జీవితం నుంచి సమాజంలో పోలీసులు, రాజకీయ నేతల ప్రమేయం దాకా ప్రతిదీ వారిని వేధిస్తుంటుంది.
దాంతో, బతకడం కోసం అరణ్యంలో లాగానే, జనారణ్యంలోనూ ఆయుధాలు పట్టాల్సి వస్తుంది. పోలీసుల పక్షాన ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తూ, వారికి కంటకంగా ఉన్నవాళ్ళను శాశ్వతంగా అడ్డు తొలగించే పనిలో కూరుకుపోవాల్సి వస్తుంది. ఆ క్రమంలో ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టయిన ఎస్‌.పి. లడ్డా (అభిమన్యు సింగ్‌) రంగంలోకి దిగుతాడు. మాజీ 'అన్న'లైన శత్రు ముఠాలోని ఒక్కొక్కరినీ చంపడం మొదలుపెడతాడు. ఈ క్రమంలోనే శ్రుతి (పియా బాజ్‌పారు) అనే అమ్మాయితో అభి ప్రేమలో పడతాడు. వారి ప్రేమ ఎటు దారి తీసింది? లడ్డాను శత్రు బృందం ఎలా ఎదుర్కొంది? జనజీవనంలో భాగమై పోదామని భావించిన ఈ మాజీ నక్సల్స్‌ కథ ఆఖరుకు ఏమైంది? లాంటివన్నీ వెండితెరపై వచ్చే మిగతా కథాఘట్టాలు.


కథనం: 
ఇలాంటి సమకాలీన ఇతివృత్తాన్ని ఎన్నుకున్నప్పుడు దర్శక, రచయిత మరింత లోతుగా ఆ సమస్యను పరిశీలించాలి. దానికున్న అన్ని కోణాలనూ పరిశోధించాలి. వాస్తవాలను వీలైనంత సేకరించి, వాటిని సినీ మాధ్యమానికి అనువుగా సాధారణీకరించాలి. అయితే, ఈ చిత్ర కథలో ఆ పని చేసినట్లు అనిపించదు. దాంతో, సినిమాలో చాలా చోట్ల పాత్రలు, సన్నివేశాల మధ్య అల్లిక సరిగ్గా లేదనిపిస్తుంది.
ఉద్విగంగా ఆరంభమయ్యే ఈ చిత్ర ప్రథమార్ధం తరువాత కొద్దిగా పట్టు సడలిందని అనిపించినా, మొత్తం మీద బాగుందనే అభిప్రాయం కలిగిస్తుంది. కథలో రకరకాల పరిణామాలు చోటుచేసుకొనే ద్వితీయార్ధానికి వచ్చేసరికి క్రమంగా పట్టు సడలుతుంది. వాణిజ్యపరమైన అంశాల జోలికి వెళ్ళడం ఎంచుకున్న ఇతివృత్తాన్ని కాస్తంత పలచన చేసింది. అయితే, తరువాతి దృశ్యం, ఘట్టం ఏమై ఉంటుందా అన్న ఆసక్తిని నిలపడంలో మాత్రం దర్శకుడు సక్సెసయ్యారు.
అభినయం: 
మాజీ నక్సలైట్‌ నేతలుగా కిశోర్‌, నవీన్‌ చంద్రలిద్దరూ తక్కువ మాటలు, ఎక్కువ భావప్రకటనలతో నటించారు. జైలర్‌గా హర్షవర్ధన్‌ నటన బాగుంది. పియా బాజ్‌పారు ఫరవాలేదనిపిస్తుంది. యాదవ్‌గా 'తాగుబోతు' రమేశ్‌', మరో సహచరుడిగా ధన్‌రాజ్‌లు కామెడీని పండించారు. మాజీ నక్సల్‌ భద్రంగా కృష్ణుడు, మేక వన్నె పులి లాంటి రాజకీయ నాయకుడు జె.కె.గా నాజర్‌, ఎమ్మెల్యేగా సుబ్బరాజు, గంజాయి పండించే వ్యక్తిగా అజరు కనిపిస్తారు.
సాంకేతిక నైపుణ్యం: 
సినిమాలో కొన్ని చోట్ల వచ్చే ''అడవిలో జంతువుల మధ్య ఉన్నప్పుడు కూడా భయం కలగలేదు కానీ, ఇక్కడ మనుషుల మధ్య భయమేస్తోంది'' (ధన్‌రాజ్‌) లాంటి డైలాగులు చురకలు వేస్తూ, ఆలోచింపజేస్తాయి. అదే సమయంలో జైలర్‌ మాటల్లో నేరుగా అశ్లీలపదాలే ఆడియో కట్‌లు లేకుండా తెరపై వినిపిస్తాయి. కొన్ని చోట్ల సరైన యాక్షన్‌, టైమింగ్‌ కుదరకపోవడంతో, కవిత్వం పాలు ఎక్కువై, అతిగా మారిన అతకని డైలాగులూ ఉన్నాయి. 'ఎటెళ్ళినా అరణ్యమే... స్థితీగతీ అగమ్యమే...' పాట సన్నివేశంలోని గాఢతను పెంచే, నేపథ్య గీతంగా ఉపకరించింది. జేమ్స్‌ వసంతన్‌ సంగీతం ఫరవాలేదు. ఛాయాగ్రహణం ఈ చిత్రానికి వెన్నెముకగా నిలిచింది.
లోటుపాట్లు: ఎస్పీపై హత్యాయత్నం, షాలిమార్‌ ఎమ్మెల్యే హత్య, హోమ్‌ మంత్రిగా మహిళ లాంటివన్నీ మన రాష్ట్రంలో జరిగిన ఘటనల్ని గుర్తు చేస్తుంటాయి. అయితే, ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టయిన ఎస్పీ లడ్డా (అభిమన్యు సింగ్‌) పోలీసుల పక్షానే సెటిల్మెంట్లు నడుపుతున్న ముఠా నేతలనూ కాల్చిపారేస్తుంటాడు. కానీ, అదే నగరంలో ఎమ్మెల్యే హత్య జరిగినా, జర్నలిస్టును ప్రత్యర్థులు చంపి పారేసినా, రాజకీయ నేతలు నాటకాలు ఆడుతున్నా అవేవీ అతనికి పట్టవెందుకో?
శత్రు గ్యాంగ్‌లో సభ్యులిద్దరినీ (కృష్ణుడు, ధన్‌రాజ్‌) ఎస్పీ క్రూరంగా ఎన్‌కౌంటర్‌ చేయడానికి తక్షణ కారణం కనిపించదు. పైపెచ్చు, ఆ వెంటనే అతను ఆ జోరును కొనసాగించకుండా ఆగడంలోని తర్కమూ లేదు. అలాగే, శత్రు గ్యాంగ్‌, ఎస్పీ లడ్డా ఒకే ఊళ్ళో ఉంటున్నా, వాళ్ళెక్కడ ఉన్నారన్నది తెలియదన్నట్లుగా ఎస్పీ ప్రవర్తించడం ప్రేక్షకులకు మింగుడు పడదు. ఇక, కథానాయిక పాత్ర శ్రుతికీ, మాజీ నక్సలైట్‌ అభికీ మధ్య ప్రేమ చిగురించడం, వారి మధ్య బంధం బలపడడం లాంటివి కన్విన్సింగ్‌గా దర్శకుడు చెప్పలేకపోయాడు. అలాగే, పత్రికా రచయిత అనగానే ఇంకా పాత సినిమాల స్థాయిలోనే లాల్చీ, భుజానికి సంచీతో కనిపించేలా, ప్రవర్తించేలా సాయి కుమార్‌ పాత్రను తీర్చిదిద్దడం నప్పలేదు. .
మొత్తం మీద, ''జనం కోసం గన్ను పట్టుకున్న మేము, చివరకు జనం మధ్యన బతకడానికి మళ్ళీ గన్ను పట్టుకోవాల్సి వచ్చింది'' అన్న వివాదాస్పద ఇతివృత్తాన్ని తెరపై చెబుదామన్న ఉద్దేశంతో బయలుదేరిన దర్శకుడికి కథను కాసేపు నడిపాక, సినిమాలో వాణిజ్య విలువలు లేవేమోనన్న శంక పీడించడం మొదలుపెట్టినట్లుంది. అందుకని, ఈ సీరియస్‌ కథలోనే కామెడీ, కథాగమనానికి అవసరం లేని పాటలు, చివరలో ఓ ప్రత్యేక నృత్య గీతం - ఇలా అన్ని మసాలాలూ కలిపేశారు. ఆ కలగాపులగం చేయకుండా, నేపథ్యంతో పాటు సమస్యను కూడా లోతుగా చర్చించి ఉంటే, 'దళం' మరికొంత నిజాయతీతో కూడిన ప్రయత్నంగా అనిపించేది. అలాంటి లోపాలున్నా, రొటీన్‌ సినిమాలతో విసిగిపోయిన ప్రేక్షకులకు మాత్రం ఇది కాస్తంత విభిన్నమైన కాలక్షేపంగా తోస్తే, అది సమకాలీన రొడ్డకొట్టుడు తెలుగు సినిమాల చలవే!
- రెంటాల జయదేవ 

(ప్రజాశక్తి దినపత్రిక, 22 ఆగస్టు 2013, గురువారం, పేజీ నం. 8లో ప్రచురితం)
..................................................

0 వ్యాఖ్యలు: