అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం సినిమా విడుదల, శాటిలైట్, ఆడియో తదితర హక్కులన్నీ కలిపి 'అత్తారింటికి దారేది...' చిత్రంపై దాదాపు 60 కోట్ల మేర వ్యాపారం జరిగింది. తెలుగు చిత్ర సీమలో మునుపెన్నడూ కనీవినీ ఎరుగని భారీ వ్యాపారమిది.
గతంలో జూనియర్ ఎన్టీయార్ 'బాద్షా' చిత్రం దాదాపు రూ. 56 కోట్ల దాకా వ్యాపారంతో ఇప్పటి దాకా ప్రథమ స్థానంలో నిలిచింది. ఇప్పుడు దాన్ని 'అత్తారింటికి..' తిరగరాసింది.
కాగా, వాయిదా పడ్డ 'ఎవడు' చిత్రంపై కూడా రూ. 50 కోట్ల దాకా వ్యాపారం చేశారు.
ఇంత భారీ మొత్తాలకు కొనుగోళ్ళు సాగడంతో, అందుకు తగ్గట్లే వసూళ్ళు రాకపోతే బయ్యర్లు, వారితో చేతులు కలిపిన ఎగ్జిబిటర్ల పరిస్థితి కష్టమవుతుంది.
అందుకే, ''ముందుగా అనుకున్నట్లు ఆగస్టు 7న 'అత్తారింటికి...' రిలీజ్ చేద్దామంటే, ముఖ్యంగా రాయలసీమ, వైజాగ్ ఏరియాల కొనుగోలుదార్లు తీవ్రంగా ప్రతిఘటించారు.వరుసగా 72 గంటల బంద్‌కు పిలుపు లాంటి నిరసనలు సీమాంధ్రలో తరచూ జరుగుతున్నందు వల్ల ఏ రోజు, ఏ షో వేస్తారో, ఏది బంద్ వల్ల రద్దవుతుందో చెప్పలేని పరిస్థితి. అందుకే, ఈ ఉద్రిక్తతలు చల్లారే వరకు సినిమాల రిలీజ్‌ను వాయిదా వేసుకుంటున్నారు'' అని తెలుగు సినీ వ్యాపారంలో అనుభవమున్న కోస్తా జిల్లాల డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబిటర్ ఒకరు వివరించారు.
- రెంటాల జయదేవ
(ప్రజాశక్తి దినపత్రిక, 7 ఆగస్టు 2013, పేజీ నం.8లో ప్రచురితం)
............................................
0 వ్యాఖ్యలు:
Post a Comment