జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Monday, August 19, 2013

ఆదిశంకర..అంతంత మాత్రమే - చిత్ర సమీక్ష


చరిత్రలో ప్రసిద్ధులైన వ్యక్తుల జీవితాలను వెండితెరకు ఎక్కించడం అంత సులభమైన పని కాదు. అందులోనూ ఆ సుప్రసిద్ధుడు కొన్ని శతాబ్దాల క్రితం వాడైనప్పుడు, కాలగతిలో ఆ వ్యక్తి జీవిత కథలో ఎన్నెన్నో కొత్త కథలు వచ్చి చేరిపోయినప్పుడు అది మరీ కష్టం. ఏది చరిత్ర, ఏది జనం నోట ప్రచారంలో ఉన్న కల్పితం అన్నది చెప్పలేం. వెరసి, తీసేది 'బయోగ్రఫికల్‌' సినిమానా, లేక పురాణాల ఆధారంగా చేస్తున్న 'భక్తి రస కథా చిత్రమా' అన్న సందేహం వచ్చేస్తుంది. 
భారతదేశంలోని ప్రసిద్ధ వైదిక ధర్మ తత్త్వవేత్తల్లో ఒకరైన క్రీస్తుశకం 8వ శతాబ్ది నాటి ఆది శంకరాచార్యుల జీవితాన్ని సినీ మాధ్యమం ద్వారా జన సామాన్యానికి చేరువ చేయాలనుకోవడం సరిగ్గా ఇలాంటి ప్రయత్నమే. రచయిత - దర్శకుడు జె.కె. భారవి ఆ సాహసానికి దిగారు. నిర్మాత నారా జయశ్రీదేవి అందుకు అండగా నిలిచారు. అలా 'అన్నమయ్య', 'శ్రీరామదాసు', 'పాండురంగడు', 'శిరిడిసాయి' చిత్రాల వరుసలో తాజాగా వచ్చింది 'జగద్గురు ఆదిశంకర'. 
అయితే, ఇలాంటి వెండితెర సాహసాలను చేసే క్రమంలో కథలో, కథనంలో, సంభాషణల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో మాత్రం దర్శకుడు ఆశించిన పరిణతి చూపించలేకపోవడమే పెద్ద లోపం.
తారాగణం: కౌశిక్‌బాబు, రోహిణి, నాగార్జున, మోహన్‌బాబు, శ్రీహరి, తనికెళ్ళ భరణి, సంగీతం: నాగ్‌ శ్రీవత్స, సాహిత్యం: ఆది శంకరాచార్య, శ్రీవేదవ్యాస, కెమేరా: పి.కె.హెచ్‌. దాస్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, కార్యనిర్వాహక దర్శకుడు: ఉదయభాస్కర్‌, కథ, కథనం, మాటలు, దర్శకత్వం: జె.కె. భారవి 
ఆది శంకరుల జీవిత కథ 'శంకర (దిగ్‌) విజయం'గా పలువురు ప్రసిద్ధుల పేర వేర్వేరు కథనాలతో ప్రచారంలో ఉంది.
తెలిసిన కథ: 
ఎనిమిదో శతాబ్ద కాలంలో జీవించిన ఆది శంకరాచార్య అప్పటికి దేశంలో ఉన్న అనేక మతాలనూ, ఆ మతాలను అవలంబించే వివిధ కులాలు, వర్గాల మధ్య నెలకొన్న సంఘర్షణనూ తన వాదనతో గట్టిగా ఎదుర్కొన్నారు. 'దేవుడు, జీవుడనేవి రెండూ వేరు కాదు. ఒకటే!' అంటూ అద్వైత సిద్ధాంతాన్ని ప్రవచించారు. 
కన్యాకుమారి నుంచి కాశ్మీరం దాకా దేశమంతటా నాలుగు సార్లు పాదయాత్ర చేసి, ఈ అద్వైత మత స్థాపకుడయ్యారు. దేశంలోని నాలుగు దిక్కులా (తూర్పున పూరీ, పశ్చిమాన ద్వారక, దక్షిణాన శృంగేరి, ఉత్తరాన బదరీనాథ్‌ సమీపంలోని జోషీమఠ్‌ వద్ద) నేటికీ నిలిచిన నాలుగు మఠాలను ఈ అద్వైత సిద్ధాంత ప్రచారానికి స్థాపించారు. 32 ఏళ్ళ జీవితకాలంలోనే ఇవన్నీ సాధించి, దేహాన్ని విడిచారు.
రాజకీయ నాయకుడిగా మారిన హీరో చిరంజీవి నేపథ్యంలో నుంచి కథను స్థూలంగా వివరిస్తుండగా, టైటిల్స్‌ పడుతూ 'జగద్గురు ఆదిశంకర' సినిమా మొదలవుతుంది. కేరళ ప్రాంతంలోని కాలడి గ్రామంలో శంకరుడు జన్మిస్తాడు. బాల్యంలోనే అతను శ్రీచక్రార్చన ఉపదేశం పొందడం, తండ్రిని పోగొట్టుకోవడం, నీళ్ళలో మొసలి పట్టుకొన్నప్పుడు 'ఆపత్‌ సన్న్యాసం' తీసుకోవడం, దేశాలూ తిరిగి గురు శుశ్రూషలో అద్వైత సిద్ధాంతాన్ని ఆకళింపు చేసుకోవడం, కాశీ వెళ్ళి సర్వమత మహాసభలో పాల్గొనడం, మండన మిశ్రుడితో వాదం, కాశ్మీర్‌లో 'సర్వజ్ఞ శారదా పీఠా'న్ని అధిరోహించడం, శిష్యులకు అద్వైత సిద్ధాంత ప్రచార బాధ్యతను అప్పగించి, దేహత్యాగం చేయడం లాంటి ఘట్టాలతో సినిమా సాగుతుంది.
దశాబ్దాల క్రితమే ఆత్రేయ రాసిన 'అన్నమయ్య' స్క్రిప్టు రోజుల నుంచి ఆయన దగ్గర సహాయకుడిగా సుశిక్షితుడై, ఆనక దర్శకత్వ శాఖలోకీ విస్తరించి, 'చిటికెల పందిరి' లాంటి సినిమాలు రూపొందించిన అనుభవం సుదర్శన భట్టాచార్య అలియాస్‌ జె.కె. భారవిది. దర్శకుడు కె. రాఘవేంద్రరావుతో 'అన్నమయ్య', 'శ్రీరామదాసు', 'పాండురంగడు' లాంటి చిత్రాలకు పనిచేసిన ఆయన అదే రకం చట్రంలో ఈ సినిమాను రూపొందించే ప్రయత్నం చేశారు.


తృప్తి కలిగించని కథనం: 
ఆరంభం కాసేపు బాగుందనిపించే ఈ చిత్రం ఆనక గ్రాఫిక్స్‌ జిమ్మిక్కులకూ, అడపాదడపా ఆకట్టుకొనే పాటలకే పరిమితమైంది. పట్టుగా నడిచే సన్నివేశాలూ, పాత్రలూ లేకపోవడంతో కుంటు కుంటూ సాగింది. నిజానికి, ఆది శంకరుల కథలో, ఆయన ప్రసిద్ధ శిష్యుల విశేషాలలో ఎన్నో ఆసక్తికర సన్నివేశాలను స్క్రిప్టుగా మలుచుకోవచ్చు.
కానీ, దర్శక, రచయిత ఎందుకనో ఆ పనికి పోలేదు. తెరకెక్కించిన సన్నివేశాలు కూడా అక్కడో ముక్క, అక్కడో ముక్క అన్నట్లు ఉండడంతో, సాఫీగా కథ సాగినట్లు అనిపించదు. అంతా కప్ప గెంతుల ఎడిటింగ్‌ అనిపిస్తుంది. పైగా, తెరపై కనిపిస్తున్న పాత్రల్లో ఎవరేమిటి, వారికి ఆది శంకరుడి కథతో ఉన్న బంధం ఏమిటన్నది ఓ పట్టాన అర్థం కాదు. మోహన్‌బాబు, నాగబాబు, తనికెళ్ళ భరణి, శ్రీహరి లాంటి ప్రసిద్ధ తారలు తెరపై ఉన్నా, వాళ్ళ పాత్రలతో వచ్చిన సమస్య ఇదే!
ఆ మాటకొస్తే ఆది శంకరుల కథ వెండితెరకు కొత్తేమీ కాదు. ఈ కథను ప్రసిద్ధ భారతీయ దర్శకుడైన కీర్తిశేషుడు జి.వి. అయ్యర్‌ 'ఆది శంకరాచార్య' (1983) పేరిట మూడు దశాబ్దాల క్రితం ఒక సారి తెరకెక్కించారు. మొట్టమొదటి సంస్కృత భాషా చిత్రమైన ఆ సినిమా అప్పట్లో ఉత్తమ చలనచిత్రం, సినిమాటోగ్రఫీతో సహా 4 జాతీయ అవార్డులు అందుకొంది. సర్వదమన్‌ బెనర్జీ (తరువాత కె. విశ్వనాథ్‌ 'సిరివెన్నెల' హీరో) ఆది శంకరుల వేషంలో పరమ శాంతంగా, ప్రశాంతంగా పాత్రోచితంగా కనిపిస్తారు. 
ఆ రోజుల్లో విశేష జనాదరణ పొందడమే కాక, పదే పదే దూరదర్శన్‌ జాతీయ చానల్‌లో ప్రసారమైన సినిమా అది. ఆ సినిమా చూడనివారి మాటేమో కానీ, అది చూసినవారికి మాత్రం సరిగ్గా 30 ఏళ్ళ తరువాత వచ్చిన ఈ ఆధునిక గ్రాఫిక్స్‌ మిళిత కథ అసంతృప్తినే మిగులుస్తుంది.
మెరుపులకే పరిమితమైన తారలు: 
గతంలో అయ్యప్ప స్వామి పాత్రలో తెలుగుతో పాటు మలయాళంలోనూ టీవీ కెమేరాల ముందు తరచూ మెరిసిన కౌశిక్‌బాబు ఈ తాజా చిత్రంలో ఆది శంకరుడిగా కథానాయకపాత్రలో తెరకు పరిచయమయ్యారు. మంచి ఒడ్డూ పొడుగూ, స్పష్టమైన ఉచ్చారణ, హావభావాలతో చూడడానికి బాగున్నారు. కానీ, చాలా సందర్భాల్లో ఈ పాత్రను కొంత స్వాతిశయం నిండినదేమో అన్నట్లు అప్రసన్న వదనంతో, ఆగ్రహంగా చూపడం పెద్ద లోపం.
శంకరుడిలోని తప్పును ఎత్తిచూపే కాటికాపరిగా నాగార్జున, ప్రతినాయక ఛాయలున్న కాపాలికుడిగా సుమన్‌ నటించారు. లక్ష్మిగా రోజా, పార్వతిగా మీనా, శారదామాతగా సన, నారసింహుడిగా సాయికిరణ్‌ కనిపిస్తారు. ఆఖరుకు గతంలో నటించిన 'శ్రీమంజునాథ' చిత్రం పుణ్యమా అని ఆ సన్నివేశాల చలవతో, ఇందులోనూ చిరంజీవి కొద్ది క్షణాలు శివుడిగా తాండవమాడుతూ తెరపై మెరుస్తారు.
కామశాస్త్ర రహస్యాలను తెలుసుకొనేందుకు శంకరుడు ప్రయత్నించే పరకాయ ప్రవేశ ఘట్టంలో వచ్చే అమరుక మహారాజు - అతని భార్య ('ఇండియన్‌ ఐడల్‌' ఫేమ్‌ శ్రీరామచంద్ర - కామ్నా జెఠ్మలానీ), మంత్రి (పోసాని), రాజ పురోహితుడు (విజయచందర్‌) కూడా గెటప్పులు, నటనల్లో కృత్రిమంగా ఉన్నారు. రెండు, మూడు సన్నివేశాల్లో ఓ ముసలి సాధువు లాగా దర్శక, రచయిత భారవి వచ్చి, ఆది శంకరుడితో మాట్లాడి వెళతాడు. వాటి అర్థం, ప్రయోజనం బోధపడవు.
అనవసర కామెడీ - ఆకట్టుకొనే సంగీతం
సినిమాలో వాణిజ్య అంశాలు లేవేమోనన్న భయంతో దర్శకుడు కొన్నిచోట్ల అనవసరపు కామెడీ వైపు మొగ్గారు. శంకరుల గురువు - గురుపత్ని (అశోక్‌కుమార్‌ - తులసి), అలాగే మండన మిశ్రుడు - వాద పరీక్షలో తీర్పరిగా నిలిచే అతని సతీమణి (సాయికుమార్‌ - కమలినీ ముఖర్జీ) మధ్య సన్నివేశాలు అందుకు ఉదాహరణ. దాంతో, కీలకమైన మండన మిశ్రుడితో శంకరుల వాదన ఘట్టం కాస్తా వట్టి వెర్రి కామెడీగా మారింది.
కొన్ని చోట్ల డైలాగులు బాగున్నా, మరికొన్నిసార్లు భారవి పరిణతి, పగ్గాలు లేని రచనకు దిగడం ఈ చిత్ర ఇతివృత్తానికి తగ్గట్లు లేదు. 'ఎగిరిపోతే ఎంత బాగుంటుంది' లాంటి పాటల ప్రస్తావన కామెడీ ఈ సినిమాలో ఔచిత్య భంగమే!
మహర్షి ధారపోయడంతో ప్రతిసారీ ఎనిమిదేళ్ళ వంతున ఆది శంకరుడి ఆయుష్షు పెరగడమనే కథ ఎక్కడ నుంచి వచ్చిన పురాణ కథో ఆది శంకరుల జీవితం చదివిన వారికీ తెలియదు. సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించేందుకు వెళ్ళమన్న కాపాలికుడే, ఆనక మళ్ళీ వచ్చి అక్కడ శంకరుడికి అడ్డుచెప్పడం, ఆఖరుకు అదంతా నాటకమనడం నప్ప లేదు. 
జీవిత కథా చిత్రంగా కాక, భక్తి రస పౌరాణిక గాథగా మార్చేసిన ఈ సినిమా మొత్తంలో ఆది శంకరుడి దేశాటన విశేషాలు కానీ, ఆయన చేసిన ఉపదేశాల సారం కానీ చూపలేకపోయారు. 'ఫర్‌ యూత్‌' అని ఈ చిత్రానికి ప్రచారం సాగించడంతో, సినిమా చివరలో ఆది శంకరుడు మాటల్లో ''పోరాడితే పోయేదేమీ లేదు అజ్ఞానపు సంకెళ్ళు తప్ప!'', ''యువతరాన్ని తక్కువగా అంచనా వేయకండి. వారు శక్తి క్షేత్రాలు'' లాంటి సందేశాలతో జస్టిఫై చేయడానికి ప్రయత్నించారు.
తెరపై రిచ్‌గా కనిపించే ఈ సినిమాలో కొన్ని చోట్ల ఛాయాగ్రహణం బాగుంది. నాగ్‌ శ్రీవత్స (ప్రముఖ వేణుగాన కళాకారుడు నాగరాజు) బాణీలు, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. శ్రీవేదవ్యాస రాసిన సాహిత్యం, ముఖ్యంగా కై ్లమాక్స్‌కు ముందు శంకర మహదేవన్‌ గొంతులో వినిపించే 'ఓంకారం...', సినిమా ఆరంభంలో వచ్చే భారవి రచన 'భ్రమ అని తెలుసు...' లాంటి పాటలు సన్నివేశాల్లోని పట్టు పెంచగలిగాయి.
ఏతావతా, లోటుపాట్లున్నా వీనుల విందైన పాటలతో, ఆది శంకరుడి జీవితాన్ని స్థూలంగా తెరపై చూడాలనుకొనే భక్తిరస ప్రధాన చిత్ర వర్గ ప్రేక్షకులకు ఈ 'జగద్గురు ఆదిశంకర' రెండు గంటల పైచిలుకు వెండితెర కథా కాలక్షేపం.
- రెంటాల జయదేవ
(Published in 'Praja Sakti' daily, 17th Aug 2013, Saturday, Page No.8)
........................................................................

0 వ్యాఖ్యలు: