జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Thursday, August 22, 2013

ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్‌ హఠాన్మరణం

- క్యాన్సర్ ఆపరేషన్ జరిగిన మరునాడే కన్నుమూత 
- పలువురు ప్రముఖుల సంతాపం
- చెన్నైలోని రామచంద్రా మెడికల్‌ కాలేజ్‌కు శరీరదానం

సుప్రసిద్ధ తెలుగు రచయిత్రి, కాలమిస్టు మాలతీ చందూర్‌ ఇక లేరు. తెలుగ్ను సాహిత్యాభిమానుల, పత్రికా ప్రియుల పఠనా జీవితంలో కొన్ని దశాబ్దాలుగా భాగమైన ఆమె ఆగస్టు 21వ తేదీ బుధవారం నాడు సాయంత్రం 4.30 గంటలకు చెన్నైలోని మైలాపూర్ లో ఇసబెల్లా ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆమె వయస్సు 83 సంవత్సరాలు. ఆమె భర్త స్వర్గీయ ఎన్‌.ఆర్‌. చందూర్‌ (పూర్తి పేరు చందూరి నాగేశ్వర రావు) కూడా ప్రముఖ జర్నలిస్టు - రచయిత.  

మొన్న మొన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న మాలతీ చందూర్‌ ఇటీవలే కొద్దిగా అస్వస్థతకు గురయ్యారు. పరీక్షల్లో ఆమెకు ఒవేరియన్ క్యాన్సర్ వ్యాధి వచ్చినట్లు కొద్ది రోజుల క్రితం డాక్టర్లు కనుగొన్నారు. చికిత్స కోసం ఆగస్టు 12వ తేదీన ఆమె ఆసుపత్రిలో చేరారు. అనేక పరీక్షలు చేసిన అనంతరం, వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయించుకున్నారు. ఆగస్టు 20వ తేదీ మంగళ వారం నాడు ఆమెకు శస్త్రచికిత్స జరగగా, బుధవారం నాడు సాయంత్రం కన్ను మూశారు. 

నిజానికి, మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శస్త్రచికిత్స జరిగిన తరువాత కూడా ఆమె స్పృహలోకి వచ్చి, రాత్రి 11 గంటల దాకా కూడా బంధువులతో మాట్లాడారు. కానీ, ఆ తరువాత పూర్తిగా స్పృహ కోల్పోయారు. ఆగస్టు 20 ఉదయం నుంచి ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. ఆమెను కాపాడాలని వైద్యులు శతవిధాల ప్రయత్నించినా, లాభం లేకపోయింది. చివరకు డయాలసిస్ వగైరా చేయడానికి ఉపక్రమిస్తూ, ఆసుపత్రిలోనే ఒక ఐ.సి.యు నుంచి మరో ఐ.సి.యు.కు తరలిస్తుండగా, మాలతీ చందూర్ తుదిశ్వాస విడిచారు.

‘జగతి’ మాసపత్రికతో ఎందరికో ఆప్తులైన ఎన్‌.ఆర్‌. చందూర్‌ మరణించిన రెండున్నరేళ్ళకే ఆయన భార్య, రచయిత్రి మాలతీ చందూర్ కూడా కన్నుమూయడంతో, చెన్నైలోని తెలుగు సాహితీ, సాంస్కృతిక ప్రియులు విచారంలో మునిగిపోయారు.మాలతీ చందూర్‌ భౌతిక కాయాన్ని ఆమె చివరి కోరిక మేరకు చెన్నైలోని పోరూర్ ప్రాంతంలో ఉన్న శ్రీరామచంద్రా మెడికల్‌ కాలేజ్‌కు దానం చేసినట్లు ఆమె కుటుంబానికి అత్యంత ఆత్మీయులూ, పొట్టి శ్రీరాములు మెమోరియల్‌ సొసైటీ కార్యదర్శి అయిన వై. రామకృష్ణ తెలిపారు.  















Add caption

ప్రముఖుల సంతాపం

బుధవారం సాయంత్రం ఆసుపత్రి నుంచి మాలతీ చందూర్ భౌతిక కాయాన్నిఅంబులెన్స్ల్ లోనే సమీపంలోని ఆమె స్వగృహానికి తెచ్చి, బంధు మిత్రుల సందర్శనార్థం కొద్ది సేపు ఉంచారు. ముంబయ్ తో సహా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సమీప బంధువులు, స్థానిక పత్రికా విలేఖరులు ఆమె భౌతిక కాయాన్ని దర్శించి, నివాళులు అర్పించారు. ఆ వెంటనే శరీర దానం నిబంధనల ప్రకారం మాలతి భౌతిక కాయాన్ని శ్రీరామచంద్రా మెడికల్ కాలేజ్ కు తరలించారు.

మాలతీ చందూర్‌ మృతికి తమిళ నాడు గవర్నర్ కె. రోశయ్య తీవ్ర సంతాపం తెలిపారు. రచయితలు కె. రామలక్ష్మీ ఆరుద్ర, గొల్లపూడి మారుతీరావు, భువనచంద్ర, వెన్నెలకంటి, సినీ నిర్మాత కె. మురారి, మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు - రచయిత మాడభూషి సంపత్‌ కుమార్‌, అభ్యుదయ రచయితల సంఘం మద్రాసు శాఖకు చెందిన ఆచార్య జి.వి.ఎస్‌.ఆర్‌. కృష్ణమూర్తి, కాసల నాగభూషణం, స్వప్న మాసపత్రిక సంపాదకులైన సీనియర్ జర్నలిస్టు ఎం.ఎల్. నరసింహం, ఇంకా పలువురు పత్రికా రచయితలు ఆమె మృతికి విచారం వ్యక్తం చేశారు. సంగీత విమర్శకుడు పప్పు వేణుగోపాలరావు తదితరులు మాలతీ చందూర్‌ భౌతిక కాయాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు. 

- రెంటాల జయదేవ 

(Published in 'Praja Sakti' Daily, 22 Aug 2013, Thursday, Page No. 1 & 4)
.......................................................

1 వ్యాఖ్యలు:

Unknown said...

ప్రముఖ రచయిత్రి మాలతీచందూర్ క్యాన్సర్ సోకి ఆలస్యంగా డిటెక్ట్ ఐ ఎక్కువ కాలం బాధపడకుండా పెన్ను మూశారు!మాలతి voratious reader!మంచి ఆంగ్లనవలలు ఇష్టపడి తెగ చదివేవారు!తాను చదవడమే కాకుండా తెలుగు పాటకులకు సవివరంగా పరిచయం చేసి ఇంగ్లీష్ ఒరిజినల్ చదవాలని ఆసక్తి రేకేత్తించేవారు!అంతేకాదు తెలుగు చదువరుల స్థాయిని అత్యున్నత శిఖరాలకు పెంచిపోషించినవారు మాలతీచందూర్!ఆమె హటాన్మరణాన్ని రెంటాల జయదేవ తనకు వీలైనన్ని వివరాలతో అందించినందుకు ఆయనకు నెనర్లు!