జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, October 16, 2010

ఇమేజ్ మార్పు కోసం చిన్న ఎన్టీయార్ విఫలయత్నం - 'బృందావనం'


(‘బృందావనం’: ఈ గోవిందుడు ‘ఎందరి’ వాడోలే...?! - పార్ట్ 2)

జగపతిబాబు 'శుభమస్తు' (నిజానికి అది ఓ తమిళ చిత్రానికి రీమేకట)మొదలు పతాక సన్నివేశంలో బాలకృష్ణతో నిర్మాత 'యువచిత్ర' కాట్రగడ్డ మురారి తీసిన 'నారీ నారీ నడుమ మురారి' చిత్రం దాకా అనేకానేక చిత్రాల ప్రభావం బృందావనం... గోవిందుడు అందరి వాడేలే... సినిమా మీద కనిపిస్తూనే ఉంటుంది.

చూపిన కథలే చూపితే....

పలు విజయవంతమైన చిత్రాల నుంచి వీలైనన్ని ముక్కలు ఏరుకొని తీసిన ఈ సినిమాకు కథ, కథనం, దర్శకత్వం - మూడూ వంశీ పైడిపల్లివే. ఈ సినిమా నిడివి పదహారు రీళ్ళే అయినా, కనీసం పదహారేళ్ళ కథను ఏకబిగిన చూపిస్తున్న భావన కలిగిస్తుంది. దర్శకుడి కథన మహిమ అది. ఇదే 'బృందావనం'చిత్ర నిర్మాత దిల్ రాజు హీరో ప్రభాస్ తో నిర్మించిన 'మున్నా' చిత్రం తీసిన దర్శకుడు ఈయనే.

నటులు సరే... నటన మాటేమిటి...

'బృందావనం...'లో నటీనటుల సంగతి చూస్తే - బాగా ట్రిమ్ చేసిన మీసం, గడ్డంతో క్రిష్ పాత్రలో చిన్న ఎన్టీయార్ బాగున్నారు. ప్రేమికుడిగా, రౌడీలను ఎదిరించే సాహసికుడిగా ఏక కాలంలో అటు కుటుంబ ప్రేక్షకులనూ, ఇటు సామాన్య జనాన్నీ ఆకట్టుకోవాలని ఆయన ప్రయత్నించారు. అయితే, నిజమైన భావోద్వేగాలకు అవకాశం లేని ఈ స్క్రిప్టులో ఆయన అద్భుతంగా చేసిన నటన ఏమిటంటే - ప్రశ్నార్థకమే.

పైపెచ్చు ఆ ప్రయత్నమేదో పూర్తిగా నిజాయతీతో చేసి ఉండాల్సింది. అదీ లేదు. సినిమా మరీ క్లాస్ అవుతుందన్న భయమో ఏమో, దర్శకుడు వీలైన చోటల్లా హీరోతో మానవమాత్రులకు సాధ్యం కాని ఫైట్లు చేయించారు. మాస్ ను మెప్పించాలని అతిగా శ్రమించారు. (ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్లు - రామ్ - లక్ష్మణ్ సోదరులు). కానీ,పల్లెటూరి ఎర్రబస్సులో పవర్ స్టీరింగ్, కత్తితో వందల అడుగుల చెట్టును కూల్చేయడం, ఎంత భారీ మనిషినైనా సరే అందులో సగమైనా లేని హీరో ఒంటిచేతితో గాలిలో గిరగిరా తిప్పేయడం లాంటి నమ్మశక్యం కాని ఆ ఫైట్లతో ఏ వర్గం ప్రేక్షకుడైనా మమేకం కావడం కష్టమే. దాంతో, ఈ నిమా అటూ, ఇటూ - ఎటూ చెందకుండా తయారైంది.

కథానాయికలుగా సమంత, కాజల్ - ఇద్దరూ ఉన్నా వారు కథలో అందమైన బొమ్మలే తప్ప, ప్రాణమున్న పాత్రలుగా కనిపించే ఘట్టాలు సినిమాలో అరుదు. ఆహుతి ప్రసాద్, రఘుబాబు, బ్రహ్మాజీ, సురేఖావాణి, తనికెళ్ళ భరణి, సితార - ఇలా సినిమా నిండా పేరున్న నటులు చాలా మందే ఉన్నారు. కానీ, మనసును తాకే పాత్రలే కరవు.

పాత్రచిత్రణలో లోటుపాట్లు

కాజల్ కు తాత పాత్రలో కోట శ్రీనివాసరావు, అతని పెద్ద కొడుకుగా ప్రకాశ్ రాజ్, చిన్న కొడుకుగా శ్రీహరి - వీరి మధ్య బంధాలనూ, అంతస్సంఘర్షణనూ బలంగా చెప్పగల అవకాశం స్క్రిప్టులో ఉంది. అయితే, ఆ పని చేయలేకపోయారు. భావోద్వేగ ప్రకటన అంటే గొంతు చించుకొని అరవడమని మన చిత్ర రూపకర్తలు అనుకున్నట్లు ఉన్నారు. అందుకే, సినిమాలో కొన్నిచోట్ల ప్రకాశ్ రాజ్, శ్రీహరి ఆంగికాన్ని వదిలి వాచికం మీద అతిగా పడ్డారు. ఫలితం - దృశ్యప్రాధాన్యం పోయి, శబ్ద కాలుష్యం మిగిలింది. అలాంటి సన్నివేశాల్లోని ఆ మితిమీరిన నాటకీయ ఫక్కీ ఏ తరం ప్రేక్షకులకైనా సహన పరీక్ష అని దర్శకుడు గుర్తించగలిగితే బాగుండేది.

ఈ సినిమాలో పాత్రల ప్రవర్తనకు క్రమానుగత పరిణామం కూడా లేదు. ‘‘ పాతికేళ్ళ వైరాన్ని పది నిమిషాల్లో పోగొట్టే మొనగాడివా’’ అని ఓ దశలో హీరోను ప్రకాశ్ రాజ్ ప్రశ్నిస్తాడు. పాత్ర ద్వారా తాను వేసుకున్న ప్రశ్నను తానే మర్చిపోయిన దర్శకుడు చివరకు సినిమాలో చూపించింది అదే. ప్రకాశ్ రాజ్, శ్రీహరి పాత్రలు ద్వేషం నుంచి ప్రేమకూ, ప్రేమ నుంచి ద్వేషానికీ ఎప్పటికప్పుడు మీట నొక్కినంత సులభంగా మారిపోయినట్లు కనిపిస్తుంది.

అలాగే, ‘‘మా అందరి మనసూ చూరగొని, మమ్మల్ని మార్చేశాడు. ఈ ఇంటిని బృందావనం చేశాడు’’ - అంటూ హీరో పట్ల ప్రకాశ్ రాజ్ కుటుంబం ప్రేమ చూపడానికీ, ఇంటిపెద్ద ప్రకాశ్ రాజ్ తోనే వాదించడానికీ కారణమైన సన్నివేశాలేవీ సినిమాలో లేవు. (ఒక్క ఆహుతి ప్రసాద్, రఘుబాబులను నాటకీయంగా మార్చేసిన సీన్ తప్ప). దాంతో, వాళ్ళ డైలాగులు తెచ్చి పెట్టుకొని చెప్పినట్లు ఉంటాయే తప్ప, కథనంలో అతకవు. హీరో తల్లి తండ్రుల పాత్రలు కూడా కథ కోసం రాసుకున్నట్లు కనబడేవే. పాత్రల్లోనూ, వాటి భావోద్వేగాల్లోనూ సహజత్వం కన్నా కృత్రిమత్వమే తాండవిస్తుంది.

కామెడీయే కొంత అండ

ఎటొచ్చీ మధ్య మధ్య వస్తూ పోయే వినోదమే ఈ సినిమాకు ఉన్నంతలో పెద్ద బలం. ప్రకాశ్ రాజ్ కుటుంబంలోని చిట్టి పాత్రలో వేణుమాధవ్ కాసేపు కామెడీకి ఉపకరించారు. 'రత్తాలు - రైసు మిల్లు' సి.డి. లాంటి సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అలాగే, 'బొమ్మరిల్లు' టైపు తండ్రినంటూ సెకండాఫ్ లో హీరోకు తండ్రిగా నాటకమాడడానికి వచ్చిన కాసేపు బ్రహ్మానందం - ప్రేక్షకులకు పెద్ద రిలీఫ్.

సాంకేతిక విభాగాల సంగతి

ఈ చిత్ర సాంకేతిక విభాగాల్లో కొట్టొచ్చినట్లు కనపడేది - ఛోటా కె. నాయుడి ఛాయాగ్రహణ శ్రమ. మార్తాండ్ కె. వెంకటేశ్ తన ఎడిటింగ్ కత్తెరకు మరింత పదును పెట్టి ఉంటే బాగుండేది. అఫ్ కోర్సు ఇప్పుడు కూడా వచ్చిన నష్టమేమీ లేదు. హాలులోని ప్రొజెక్టర్ ఆపరేటర్లే ఆ పని చేయడం ఖాయమని అర్థమవుతూనే ఉంది.

అలాగే, ఆ మధ్య కొన్ని మెరుపులు మెరిపించిన థమన్ ఎస్. ఈ చిత్రానికి అందించిన సంగీతం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. గతంలో మెలొడీ పాటలు కూడా కట్టిన ఈ యువ సంగీత దర్శకుడు పాటల్లోని బీజియమ్ ల మొదలు సినిమాలోని సన్నివేశాల వరకు బీట్ కే పెద్దపీట వేశారు. రీ-రికార్డింగులోనూ అదే వరస. సన్నివేశంలోని ఎఫెక్టును పెంచడానికి సంగీతంలో నిశ్శబ్దం కూడా ఓ భాగమేనని మర్చిపోయేసరికి, ప్రతి దృశ్యంలో రీ-రికార్డింగ్ శబ్దాలు చెవులకు హోరెత్తిస్తుంటాయి, మనసుకు ఠారెత్తిస్తుంటాయి.

పాటలు, డ్యాన్సులు


కొన్ని పాటలకు ఎంచుకున్న లొకేషన్లు (ముఖ్యంగా కాజల్, ఎన్టీయార్ల పల్లె సీమ పాట), వాటిని చూపిన తీరు కంటికి బాగున్నాయి. పాటల చిత్రీకరణ కోసం కూడా బాగానే ఖర్చు పెట్టారు. అయితే, ఈ చిత్రంలోని పాటలు గుర్తుంచుకోగలిగేలా లేవు. నాకైతే, ఈ డి.టి.ఎస్.ల హోరులో పాటల్లో మాటలు అక్కడక్కడే వినిపించాయి. రాజు సుందరం, ప్రేమ్ రక్షిత్, లలిత నృత్య దర్శకత్వం వహించిన ఈ పాటల్లో చిన్న ఎన్టీయార్ తన స్వతఃసిద్ధంగా చులాగ్గా నర్తించారు. (నర్తించలేక ఇబ్బంది పడ్డ పాట ఒకటి ఉంది. దాని గురించి చివరలో...)

ఇక, పిక్స్ లాయిడ్ సంస్థకు చెందిన యుగంధర్, నయీమ్ ల బృందం ఈ చిత్రానికి స్పెషల్ ఎఫెక్ట్ లు సమకూర్చారు. ప్రకాశ్ రాజ్ ఇల్లుగా సినిమాలో కనపడే నానక్ రామ్ గూడ రామానాయుడు స్టూడియోలోని ఇంటి సెట్టింగ్ చుట్టూరా అంత ఖాళీ స్థలం, ప్రకృతి దృశ్యాలు వగైరా మొత్తం కంప్యూటర్ లో విజువల్ ఎఫెక్ట్ ల క్రియేషనే.

వంశీ పైడిపల్లి రాసుకున్న ఈ చిత్ర కథకు ముగ్గురు రచనా సహకారం అందించారు. ఆ ముగ్గురిలో ఒకరైన కొరటాల శివ దీనికి సంభాషణలు సమకూర్చారు. కొన్ని చోట్ల పాటక జన ప్రశంసలందే డైలాగులూ రాశారు. ‘సిటీ నుంచి వచ్చాడు కదా - సాఫ్టుగా ఉన్నాడనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా. లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని రెచ్చగొట్టకు. రెచ్చగొడితే రచ్చ రచ్చే...’ (విలన్ తో హీరో)లాంటివి ఆ కోవ లోవే. ‘‘భయమా, వినయమా’’ అని హీరో అడిగితే, ‘భయంతో కూడిన
వినయంతో వచ్చిన....’ అంటూ వేణుమాధవ్ చెప్పే డైలాగు మహేశ్ బాబు ‘అతడు’లో త్రివిక్రమ్ రాసిన డైలాగుకు నకలు.

చిన్న ఎన్టీయార్ ఇమేజ్ పెంపు కోసం మళ్ళీ ‘యమదొంగ’ వగైరా చిత్రాల్లో లాగా పెద్ద ఎన్టీయార్ పాత్రను సినిమాలోకి రప్పించారు. దాన వీర శూర కర్ణ చిత్రంలోని గీతోపదేశం సన్నివేశంలోని విశ్వరూప కృష్ణుడి వేషంలో పెద్దాయన క్లైమాక్స్ లో కనిపిస్తారు. కానీ, అక్కడ రెండు మూడు డైలాగులకు మిమిక్రీ వాళ్ళతో చెప్పించిన పెద్ద ఎన్టీయార్ డబ్బింగ్ ఆ పాత సినిమాలను చూసి పెరిగిన తరానికి చీకాకు తెప్పిస్తుంది.

'ఢీ, రెఢీ, బిందాస్' - ఇలా ఈ మధ్య కాలంలో వినోదాత్మక పంథాలో నడిచిన మాస్ చిత్రాలు అందరికీ గుర్తే. నాలుగు డబ్బులు చేసుకున్న ఆ చిత్రాల తోవే ఈ కథకూ శ్రేయస్కరమని దర్శక, నిర్మాతలు భావించినట్లున్నారు. అందుకే, చాలా చోట్ల ఆ బాటలోనే నడిచారు. కానీ, 'బావగారూ బాగున్నారా', 'అల్లుడు గారు వచ్చారు' లాంటి పలు సినిమాలను గుర్తుకు తెచ్చేలా, అనేక అంశాల కిచిడీగా మార్చడంతో, ఓ దశ గడిచేసరికే హాలులోని ప్రేక్షకులకు విసుగు పుడుతుంది. ఎప్పటికప్పుడు అయిపోవచ్చిందని అనిపిస్తూనే అవకుండా సినిమా ఇంకా ముందుకు సా....గుతున్నట్లు కనిపిస్తుంది. అదే ఈ చిత్రంలోని పెద్ద బలహీనత. అందుకే, విశ్రాంతి దగ్గరే పతాక సన్నివేశం చూపించినంత భావన కలిగించే, ఈ గోవిందుడు - ప్రేక్షక జనులందరి వాడు కాలేకపోయాడు. ఇమేజ్ మార్పు ప్రయత్నంలో ఆశించినంత సఫలం కాలేకపోయాడు.

కొసమెరుపు -

సినిమా చివరలో వచ్చే ‘‘ రా.. ఎయ్ రా... ఏసేయ్ రా...’’ పాటలో ఎన్టీయార్ పదే పదే కింద కూర్చొని, పైకి లేచే ఓ స్టెప్పు వేయడానికి కష్టపడుతున్నట్లు తెరపై కనిపించేస్తుంది. ఇప్పటికే ఆర్య-2 లాంటి చిత్రాల్లో అల్లు అర్జున్ లాంటి వాళ్ళు వేసి మెప్పించిన అదే తరహా స్టెప్పును (యాక్సిడెంట్ అనంతరం కొంత ఇబ్బంది పడుతున్న)చిన్న ఎన్టీయార్ మీద ప్రయోగించాల్సిన పనేమిటి. ఆ స్టెప్పు వేయకపోయినా అతని నృత్య ప్రతిభకు వచ్చిన కొరతేమీ లేదు కదా. (అన్నట్లు కాళ్ళతో నేలను తుడిచినట్లుండే ఈ ఫ్లోర్ క్లీనింగ్ స్టెప్పు నృత్య దర్శకుడు ప్రేమ్ రక్షిత్ దేనా...)

2 వ్యాఖ్యలు:

ప్రేమిక said...

good review... i saw the movie... logic is missing in movie...

Tejaswi said...

తెలుగులో ఈమధ్యకాలంలో ఇంతటి నిశితమైన సినిమా రివ్యూ చదవలేదు. చాలా బాగుంది. నాన్ జడ్జిమెంటల్ గా, చాలా రెలెటివ్ గా ఉంది.