జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Thursday, October 7, 2010

చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది! త్రీ ఛీర్స్ టు త్రివిక్రమ్ ఖలేజా!!



గడచిన పదిహేను, ఇరవై రోజుల్లో టీవీలో రెండు హిట్ సినిమాలు కొద్దిగా, కొద్దిగా చూశా. యాదృచ్ఛికంగా రెండూ దర్శక - రచయిత ‘త్రివిక్రమ్’ శ్రీనివాస్ రూపకల్పనలే. ఒకటి - మహేశ్ బాబు నటించిన ‘అతడు’. రెండోది - పవన్ కల్యాణ్ నటించిన ‘జల్సా’. సెలవు రోజున మధ్యాహ్నం పూటో, రాత్రో ఇంటిలోనే ఉండి భోజనం చేస్తున్నప్పుడు టీవీ చానళ్ళు తిప్పడం నాకు అలవాటు. ఇంటిల్లపాదీ కూర్చొని, అన్నం తింటూ, ఆ కాసేపు టీవీ చానల్ ధర్మమా అని ఆ సినిమాలు చూశాము.

నిజానికి, ఆ రెండు సినిమాలూ నేను గతంలో థియేటర్లో చూసినవే, పత్రికల్లో రాసినవే. టీవీలో కూడా అడపా దడపా అదాటున కాసేపు కనిపించినవే. అయినా, సన్నివేశాల్లోని గాఢత నన్ను మరోసారి చూసేలా చేసింది. ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పటికి ఏ పదో సారో అయినా సరే, గుడ్లప్పగించి చూస్తూ, సినిమాలోని సెంటిమెంట్, హాస్యాలను ఆస్వాదించడం గమనించాను.

ఉన్నమాట చెప్పాలంటే, ‘అతడు’ కానీ, ‘జల్సా’ కానీ మొదటిసారి చూస్తున్నప్పుడు ఫరవాలేదు బాగానే ఉన్నాయని అనిపించాయే తప్ప, ‘ఆహా, ఓహో’ అనో, పదే పదే చూసి ఆనందించగలమనో అనిపించలేదు. కానీ, తీరా ఇప్పుడు అందుకు భిన్నమైన అనుభవం ఎదురవుతుండేసరికి, నేను గతుక్కుమన్నాను. నేనే కాదు, నా లాగానే మా ఇంట్లోనూ, బయట చాలా మంది ఆ సినిమాలనూ, అందులోని దృశ్యాలనూ పదే పదే చూసి ఆనందించడం నన్ను ఆలోచనలోకి నెట్టింది.

ఒక సృజనాత్మక కృషి పదే పదే ఆస్వాదయోగ్యం అవుతుండడానికి కారణం ఏమై ఉంటుంది? ఆ కృషిని ఆ స్థితికి తీసుకువెళ్ళడానికి రూపకర్త పాటించిన పద్ధతి ఏమిటి? దీనికీ ఏదైనా ఫార్ములా ఉందా? ఇలా ఎన్నో ప్రశ్నలు.

ఈ ప్రశ్నలకు నాకొచ్చిన సమాధానమేమిటంటే - ఒక సన్నివేశాన్ని ఎన్నో రకాలుగా తెరపై చూపవచ్చు. చూసిన తక్షణమే ప్రేక్షకుడి నరనరాల్లోకీ అది ఎక్కేసేలా, ఒక విధమైన కిక్ వచ్చేలా చిత్రీకరించడం ఒక పద్ధతి. దీని వల్ల ప్రేక్షకుల్ని, ప్రధానంగా మాస్ ను ఆకర్షించవచ్చు. చూడగానే అబ్బో అనిపించవచ్చు. సర్వసాధారణంగా మాస్ చిత్రాల దర్శకులు అనుసరించే పద్ధతి ఇది. కానీ, ఆ ప్రభావం, ఫలితం ఆ క్షణానికే, ఆ కొద్ది రోజులకే. ఆ తరువాత ఆ ఘట్టాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపించదు. చూసినా తొలి సందర్శన నాటి కిక్ రాదు.

అలా లౌడ్ గానో, క్రూడ్ గానో కాకుండా అదే ఘట్టాన్ని వివిధ పాత్రల మధ్య సంఘర్షణగా, సున్నితమైన పద్ధతిలో తెరకెక్కించవచ్చు. ఆ రకంగా ఒక సన్నివేశాన్ని సంస్కారవంతమైన ధోరణిలో వేర్వేరు స్తరాలుగా చూపితే కలిగే ప్రభావం దీర్ఘకాలికమైనది. ఆ ఒక్క క్షణానికే కాకుండా, చూసిన ఒక్కొక్కసారీ ఆ సన్నివేశంలోని ఒక్కొక్క పొర ప్రేక్షకుడికి తెలిసి వస్తుంటుంది.

ఆ లోతులు అర్థమవుతున్న కొద్దీ సన్నివేశంలోని గాఢత పెరుగుతుంది. అందుకే, ప్రేక్షకుడికి తెలిసిన ఘట్టమే అయినా, ఆ సన్నివేశాలు చూసినకొద్దీ చూడబుద్ధేస్తుంటాయి. త్రివిక్రమ్ తన చిత్రాల రచనలో, దర్శకత్వంలో ఉపయోగించే విధానం ఇదే. అందుకే, పాత్రలకూ, ప్రేక్షకులకూ మధ్య సమతూకపు డిగ్నిటీని కాపాడే ఆ చిత్రాల్లోని ఘట్టాలు చిరస్మరణీయం కాగలుగుతున్నాయి. అయితే, అలా తీయడానికి దర్శకుడికి అక్షరాలా ఖలేజా కావాలి. త్రివిక్రమ్ కు అది ఉంది.

అందుకే, మొదటి సారి కన్నా రెండోసారి, రెండోసారి కన్నా మూడోసారి - అతని చిత్రాలు బాగుంటాయి. ఒక్క ముక్కలో చెప్పమంటే, త్రివిక్రమ్ సినిమాలు మంచి వైన్ లాంటివి. పాత బడిన కొద్దీ రుచి, విలువ పెరగడం ఫ్రెంచ్ మద్యమైన వైన్ స్వభావం. ఆ లక్షణం త్రివిక్రమ్ రచన, దర్శకత్వాల్లో వచ్చిన అధిక భాగం సినిమాల్లో గమనించవచ్చు. అదే ఆయనను సమకాలీన రచయితలు, దర్శకుల్లో ప్రత్యేక స్థానంలో నిలిపింది.

కావాలంటే, 'అతడు', 'జల్సా' లాంటి సినిమాలు మరోసారి చూడండి. మీరూ నా మాటలతో ఏకీభవిస్తారు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించడం, చదివిన కొద్దీ చదవాలనిపించడం - ఇదే కదా కాలానికి అతీతంగా నిలిచే ఉత్తమ సృజనకు ప్రాథమిక లక్షణం. త్రీ ఛీర్స్ టు త్రివిక్రమ్.... ఆల్ ది బెస్ట్ టు ఖలేజా!

10 వ్యాఖ్యలు:

kiran said...

your writing style is good.

astrojoyd said...

trivikram[vaamanaavataraniki maro peru]"ఒక సంభాషణల మాంత్రికుడు"[a magician of dilogues nd also మాటల మర్మాన్ని బాగా ఎరిగినవాడు కూడా]..మనిషికి వ్రుద్హాప్యంలో కావలసింది ఆస్స్ట్టులుకాదు..అనుభవాలు అని చెప్పిన మంచి rachayuta.talupu enduku teruchukovadamledaa ani nuvvu choosttunnaavu...kaani nenu avi eppudu teruchukuntaayaa ani eduruchoosttuunnaanu...నిన్ను ప్రేమిస్త్తున్నాను అని చెప్పేందుకు "ఐ లవ్ యు" కన్నా శక్తివంతమైన పదాలున్నాయని త్రివిక్రమ్ ఈ dilogue ద్వారా ఎంత బాగా చెప్పాడో.

GKK said...

బాగా వ్రాశారు.

సవ్వడి said...

good analysis

Unknown said...

@ వెంకట్ గారూ, కిరణ్ గారూ, తెలుగు అభిమాని గారూ, సవ్వడి గారూ, నమస్తే. మీ వ్యాఖ్యలకు కృతజ్ఞతలు.
@ ఆస్ట్రో జాయిడ్ గారూ, నమస్తే. త్రివిక్రమ్ మీద మీరు చేసిన వ్యాఖ్య అక్షరాలా నిజం. సమకాలీన తెలుగు సినీ సంభాషణలను కొత్త మలుపు తిప్పిన వ్యక్తిగా ఆయనది ప్రత్యేక స్థానమే.

Kalpana Rentala said...

జయా,

అవును. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగుల్లోని గాఢత, లోతైన ఆలోచన వల్లానేమో ..ఎన్ని సార్లు విన్నా విసుగనిపించదు.

అతడు..చిన్నూ కి ఇష్టమైన సినిమా.. ఏ రెండు మూడు నెలలకో ఒక సారి మళ్ళీ ఆ సినిమా చూస్తానంతాడు. వాడితో పాటు మేము కూడా మళ్ళీ కూర్చొని అదే మొదటి సారి అన్నట్లు చూస్తూ వుంటాము. ఏ డైలాగ్ తర్వాత ఎం వస్తుందో తెలిసినా సరే, మళ్ళీ అలా ఎలా చూస్తామా ? అనుకుంటాను. ఈ అనుమానం కేవలం త్రివిక్రమ్ సినిమాలకే కాదు..కొన్ని పాత సినిమాలకు కూడా...

సుజాత వేల్పూరి said...

అతడు బావుంటుంది! నాకు జల్సా అతుకుల బొంత కథే అసలు నచ్చలేదు. అందువల్ల సినిమా కూడా నచ్చలేదు.

అతడులో డైలాగ్స్ చాలా క్రిస్ప్ గా ఉంటాయి. త్రివిక్రమ్ స్టైలే అది కదా! మల్లీశ్వరి, మన్మధుడు,నువ్వు నాకు నచ్చావ్ చూడండి, కేవలం డైలాగ్స్ వల్లే హిట్స్ కొట్టిన సినిమాలవి అనిపిస్తుంది నాకైతే!

హాస్యమే కాదు, చక్కని డెప్త్ ఉన్న డైలాగ్స్ కూడా రాయగల దిట్ట త్రివిక్రమ్! నా మటుకు నేను త్రివిక్రం అభిమానిని! (సంభాషణల విషయంలో)

ఇంతకీ ఖలేజా ఎలా వుందో చెప్పనేలేదు మీరు?

కల్పనా,
మీకు మా టీవీ వస్తుందా అక్కడ? మా టీవీలో అతడు నెలకు మూడు సార్లు వేస్తారు. మా పాపకు అందులో మహేష్ బాబు తనికెళ్ల భరణి కి బుద్ధి చెప్పే పొలం సీనంటే చచ్చే ఇష్టం!

Kalpana Rentala said...

సుజాత,

అవును. నేను కూడా త్రివిక్రమ్ సంభాషణాలకు అలా అడ్డంగా, నిలువు గా ఫ్లాట్ అయిపోతూ వుంటాను.
నువ్వు నాకు నచ్చావు లో సుహాసిని డైలాగ్ వుంటుంది" ప్రేమ ఏ టైం లో పుడుతుందో తెలిస్తే ఏ ఆడపిల్లా ఆ టైం లో బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే వుంటుందని".ఎంత సెన్సిటివ్ గా ఆలోచిస్తాదో అని తెగ ఇష్టపడిపోతూవుంటాను.
మాకు మా టీవీ రాదు..తెలుగు టీవీ లేదు లెండి.పెట్టించుకుంటే ఇక ఇంటిల్లపాడీ దాని ముందే వుంటామని. ఆ కొరత నెట్ ఫ్లిక్స్ , బ్లాక్ బస్టర్ లతో తీరుస్తుంటాము.

అవునూ, మనమిద్దరమూ అటు మీ బ్లాగ్ లోనో, లేదా నా బ్లాగ్ లోనో కాకుండా మధ్యలో ఇష్టపది లో కబుర్లు చెప్పుకుంటున్నాము.

Unknown said...

@ సుజాతగారూ, @ కల్పనా, మీ వ్యాఖ్యలకు కృతజ్ఞతలు. బహుశా ఈ తరంలో త్రివిక్రమ్ రచనా శైలికి ఆనందించని వారు అరుదేమో. సుజాత గారు అన్నట్లు కొన్ని సినిమాలు ఆయన రచనా బలం వల్లనే ఆడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. జల్సాలో కథ కన్నా కొన్ని సన్నివేశాలను పట్టుగా నడిపిన తీరు, ముఖ్యంగా పవన్ కల్యాణ్ చేసే కామెడీ, పవన్ - బ్రహ్మానందం - ఇలియానాల మధ్య వచ్చే సన్నివేశాలు ఎన్ని సార్లు చూసినా విసుగనిపించవు. అందుకే, త్రివిక్రమ్ సినిమా అచ్చమైన వైన్ అన్నది.

Mauli said...

khaleza lo heroin undi unte bagundedi :)