తెలుగు సినిమా వస్తే చాలు, ఏ మాత్రం వీలున్నా వదలకుండా చూడడం ఓ బలహీనత. అది నాకు మరీ ఎక్కువ. అందుకే, వంశీ దర్శకత్వం వహించిన 'సరదాగా కాసేపు...' సినిమా ఊళ్ళోకి వచ్చిందని తెలిసి,వెళ్ళకుండా ఉండలేకపోయా. తెలుగునాట విడుదలైన తరువాతఇన్నాళ్ళకు కానీ, ఈ చిత్రరాజం (!) మా ఊరికి రాలేదు.
ఆంధ్రదేశంతో పాటు ఏకకాలంలో మా ఊరికి రాలేదేమని విచారిస్తూ, మిత్రులతో కలసి కాసేపు నవ్వుకుందామని ఈ సినిమాకు వెళ్ళాను. అయితే, మాకు నవ్వు రావడం మాట అటుంచి, ఏడుపొచ్చిందంటే నమ్మండి. టికెట్ కు పెట్టిన ఖర్చుకు కనీసపు గిట్టుబాటు కూడా లేదు. బుద్ధీ బుర్రా ఉన్నాయని అనుకొనే వంశీ లాంటి దర్శకుడి నుంచి ఇంత అవకతవక సినిమా రావడం మరింత బాధ కలిగించింది.
అసలీ సినిమాకూ, ఆ పేరుకూ సంబంధం కళ్ళజోడు పెట్టుకొన్నా కనిపించదు. సినిమా నిండా శబ్దకాలుష్యం. సినిమా చూస్తున్నామా, లేక డ్రామాకు వచ్చామా, లేదంటే టీవీ సీరియల్ చూస్తున్నామా అని మనకే అనుమానం వచ్చేస్తుంది. ఈ సినిమాలో కెమేరా మొదలు ఎడిటింగ్, సంగీతం (రీ-రికార్డింగ్, మిక్సింగ్) - ఇలా అన్ని విభాగాల్లో బోలెడన్ని తప్పులు కనిపిస్తాయి.
ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహారావు అందించిన మూలకథకు విస్తరణ ఈ చిత్రం. వేమూరి సత్యనారాయణ స్ర్కిప్టు కో-ఆర్డినేటర్ గా పనిచేస్తే, పడాల శివ సుబ్రహ్మణ్యం మాటలు రాశారు. స్క్రీన్ ప్లే, దర్శకత్వం వంశీ కృత్యాలు.
అమెరికా నుంచి అమ్మానాన్నల దగ్గరకు వచ్చిన ఓ అబ్బాయి ('అష్టాచెమ్మా' చిత్ర ఫేమ్ అవసరాల శ్రీనివాస్) ఆంధ్రాలో పెళ్ళిచూపుల కోసం వెళతాడు. చేసుకొనే అమ్మాయి (మధురిమ) వాళ్ళ ఇంట్లో కొద్దిరోజులుండి, ఆమె ప్రవర్తన తెలుసుకోవాలనుకుంటాడు.
పెళ్ళికొడుకుగా వెళితే, అసలు విషయం రాబట్టలేమని, తన వెంట వచ్చే డ్రైవర్ (రంగబాబుగా - 'అల్లరి' నరేశ్)కు పెళ్ళికొడుకుగా, తాను డ్రైవర్ గా బయలుదేరతాడు. ఆ సంగతి పెళ్ళికూతురు వాళ్ళకు తెలిసిపోతుంది. అందుకని డ్రైవర్ గా వస్తున్నదే తమ కాబోయే అల్లుడని వాళ్ళు ఫిక్సయిపోతారు.
ఇంతలో దోవలో వచ్చిన ఇబ్బందులతో పెళ్ళికొడుకు, డ్రైవర్ తమ మారువేషాలు తీసేసి, మామూలుగా మారిపోతారు. ఆ సంగతి తెలియని పెళ్ళికూతురు తరఫు వాళ్ళు అసలు డ్రైవర్ ను పట్టుకొని, తమ కాబోయే అల్లుడనుకుంటారు. ఆ తరువాత జరిగే తమాషా సంఘటనలే మిగిలిన సినిమా.
ఈ సినిమాలో పాత్రలు, వాటి ప్రవర్తన - అంతా అతి. హీరోయిన్ గా వేసిన మరాఠీ అమ్మాయి మధురిమ అందం సంగతి దేవుడెరుగు, కనీసం ఆకర్షణీయంగా కూడా లేదు. హీరోయిన్ తొలిసారి తెరపై కనిపించినప్పుడు నేపథ్యంలో నుంచి ఓ కవితాత్మక గీత ఖండిక వస్తుంది. నిజం చెప్పాలంటే - హీరోయిన్ కన్నా ఆ కవితా ఖండికే బాగుంది.
వినోదభరిత చిత్రాలకు పేరున్న వంశీకి ఇప్పుడు ఆ ‘టచ్’ పోయిందేమో అనిపిస్తుంది - ఈ ‘సరదాగా కాసేపు’ కాసేపైనా చూస్తే! (చూడగలిగితే!!) సినిమాలో పేర్లు పడుతుండగానే సినిమా జాతకం అర్థమైపోతుంది. అప్పుడే విమానాశ్రయానికి చేరుకున్న అవసరాల శ్రీనివాస్ డైలాగులకు రీ-రికార్డింగు పరమ ఘోరం.
మాటలు, వగైరా ఒకదాని మీద మరొకటి పడిపోతుంటాయి. ఇదంతా ఎడిటింగ్ మహిమో, మిక్సింగ్ మహిమో వంశీకే తెలియాలి. సినిమా షూటింగులో లేని డైలాగులను కూడా డబ్బింగ్ దశలో కలిపి, అక్కడికక్కడ అనిపించారని సీను చూస్తే తెలిసిపోతుంటుంది.
అలాగే ఈ సినిమాకు ఏ రకమైన వెధవ కెమేరా యాంగిల్ వాడారో, ఏమో కానీ, దృశ్యాలన్నీ పూర్తిగా రూపురేఖలు మారిపోయి కనిపిస్తుంటాయి (కెమేరామన్- లోకి). తెరపై ఆ డిస్టార్టెడ్ ఇమేజెస్ బాగా లేకపోగా, చూసే ప్రేక్షకులకు చీకాకు తెప్పిస్తాయి.
సినిమాలో వచ్చే టైటిల్ సాంగ్ లో అసలు బాణీ కన్నా, పాఁవ్, పాఁవ్ అనే శబ్దాలే ఎక్కువగా ఉన్నాయి. '...ఊహలో నాయకా...' అనే పాట చూస్తే, ఇత్తడి - స్టీలు బిందెలు, వంటింటి సామాన్లను తెరపై నింపేసి, తాను మరో రాఘవేంద్రరావునని వంశీ అనిపించుకున్నారు. '...తెల్లనవ్వు, మల్లె పువ్వు...' పాట ఒకటీ కొంత బాగున్న అనుభూతిని కలిగిస్తుంది.
కథ ఉందని కాక, వినోదభరిత చిత్రాల విజయంతో జోరు మీదున్న అల్లరి నరేశ్ డేట్లున్నాయి కదా అని వంశీ - అల్లరి నరేశ్ ల కాంబినేషన్ల లెక్కలు చూసి ఈ సినిమా తీసినట్లుంది. వంశీ అలవాటుపడిపోయిన అక్రమ సంబంధాల కామెడీనీ, గుంపుల కొద్దీ పాత్రల మధ్య డైలాగు కామెడీనీ, ఒకే రకంగా వినిపించే బాణీల వరుసనూ వంశీ మార్చుకోకపోతే, కష్టమే. ఆయన కూడా గుంపు కవాతు నృత్యాల పాటలు తీయడం విచిత్రం. మొత్తం మీద ఈ సినిమా బాగుందని చెప్పాలంటే - అందుకు తగిన సన్నివేశాలు ఏవేమిటని ఏరుకోవడం ఎంత వంశీ అభిమానులకైనా కష్టమే!
2 వ్యాఖ్యలు:
వొక్క మాటలో వంసికి క్రియేటివిటీ అనే ఘటము డౌన్ అయ్యిన్దంటారు అంతేనా మిత్రమా?[the creative battery has downed]....
meeru cheppindi 100% correct
ee cinema chuste anvasaranga 2.30 hts time waste
Post a Comment